నన్ను దోచుకోని తాజ్ మహల్ – 2/3

ఈ ఐదు గంటల ప్రయాణంలో రాజు ఆసక్తికరమైన కబుర్లు చెప్పాడు. ముఖ్యంగా ట్యాక్సీవాళ్లు, రిక్షావాళ్లు నాబోటి టూరిస్టుల ముఖాలు చూడగానే వాళ్లదే ప్రాంతమో ఎలా పట్టేస్తారో సోదాహరణంగా వివరించాడు. ‘మీరు చాలా సంవత్సరాలనుండి ఇండియాలో ఉండటం లేదు సాబ్’ అని చెప్పాడు దానికి ఋజువుగా. ‘అదెలా కనుక్కున్నావు?’ అంటే ‘చాలా తేలిక సాబ్. ఎన్నారైలు చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు. వాళ్లు నోరు తెరిచి మాట్లాడకపోయినా ఆ సంగతి పట్టేయొచ్చు’ అన్నాడు. ‘అబ్బో, మనవి అంత సాఫ్ట్ లుక్సా?’ అని ఆనందపడ్డాను కాసేపు.

సరే. మొత్తానికి బండి ఆగ్రా కోట దగ్గరాగింది. దాన్ని కూడా ఎర్ర కోట అనే పిలుస్తారని అప్పుడే తెలిసింది నాకు. మన గోల్కొండ కోట లాగా ఇదీ చాలావరకూ పడిపోయి ఉంటుందనుకున్నా కానీ నా అంచనా తప్పని లోపలికెళ్లాక తెలిసింది. నిర్వహణ బాగుంది. కోటలో కొంత భాగం పునర్నిర్మాణ పనుల వల్ల మూసి వేసి ఉంది. పదవీచ్యుతుడయ్యాక షాజహానుని ఖైదు చేసిన గది చూశాను. చరిత్ర పుస్తకాల్లో చదివినప్పుడు షాజహాన్నుంచిన జైలంటే ఇరుకుగా ఉండే చిన్న గది అనుకున్నా కానీ నిజానికదో సౌధం. పుస్తకాల్లో ‘షాజహాను జైలు పాలయ్యాడు’ అనేకన్నా ‘గృహ నిర్బంధానికి గురయ్యాడు’ అంటే సరిగా ఉండేదేమో.

‘గదిలోనుండి నా ముంతాజ్ మహల్ నాకు కనిపించే విధంగా ఏర్పాటు చెయ్యి’ అని షాజహాను కొడుకుని వేడుకున్నట్లు, ఔరంగజేబు అలాగే ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చదివినప్పుడు నా మనసు కరుణరసంతో పొంగి పొర్లేది. కానీ ఆయన్నుంచిన జైలనబడే సౌధాన్ని చూసినప్పుడు ‘హార్నీ. ఈ కవులు ఎంత బాగా డ్రమటైజ్ చేస్తారు ప్రతి విషయాన్నీ’ అనిపించింది. ఆయన ‘జైలు’ లో దాదాపు ప్రతి చోటినుండీ వద్దన్నా తాజ్ మహల్ కనిపిస్తుంది. ఇక ప్రత్యేక ఏర్పాట్లు చేయటానికేముంది?

యమునా నదికి ఇవతలి ఒడ్డున ఎర్ర కోట, అవతలి ఒడ్డున తాజ్ మహల్ ఉన్నాయి. మామూలుగానయితే కోట నుండి నుండి తాజ్ కాంప్లెక్స్ మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆ రోజు బాగా మబ్బులు పట్టి ఉండటం, దానికి తోడు మంచు తెరలు కమ్మేసి ఉండటంతో తాజ్ లీలగా మాత్రమే కనిపించింది. ‘ఇదీ ఒకందుకు మంచిదేలే, మొదటి సారి తాజ్ ని ఇంతదూరం నుండి చూడటం కన్నా దగ్గరి నుండి చూస్తే వచ్చే అనుభూతి మరింత గొప్పగా ఉంటుంది’ అనుకున్నా.

ఎర్ర కోట లో మరీ ఎక్కువసేపు ఉండలేదు నేను. అప్పటికే సాయంత్రమవుతుండటంతో ‘తాజ్ మూసేస్తారు. త్వరగా వచ్చేయండి’ అన్న రాజు మాటలు గుర్తొచ్చి గంటలోపే కోట చూడటం ముగించేశా. అక్కడి నుండి మూడు కిమీ లోపే ఉంటుంది తాజ్. అయితే ఆగ్రా గొందుల్లోనుండి వెళ్లటానికి ఆ కాస్త దూరానికే అరగంట పట్టింది.

తాజ్ కి కిలోమీటరు ముందు నుండే మోటారు వాహనాలని నిలిపేస్తారు – వాటి కాలుష్యం వల్ల తాజ్ మసకబారిపోకుండానట. పార్కింగ్ స్థలంలో రాజు ఆగిపోయాడు, ‘మీరు వెళ్లండి సాబ్. నేనిక్కడే ఉంటా’ అని చెప్పి. నా బిచాణా (కెమేరా మూట, ట్రైపాడ్) అందుకుని కారు దిగగానే గుప్పున ముక్కులు బద్దలు కొట్టే దుర్వాసన! అది పక్కన పారుతున్న డ్రైనేజి వారి సమర్పణ. తాజ్ లాంటి ప్రపంచ ప్రసిద్ధ కట్టడాన్ని చూడటానికొచ్చినవారికి చందనపు అగరొత్తుల వాసనలు స్వాగతం పలుకుతాయని నేనేమీ ఆశపడలేదు కానీ మరీ ఇంత ఘోరంగా ఉంటుందనీ అనుకోలేదు.

అంతలో బిలబిలా పదిమంది రిక్షావాళ్లు చుట్టుముట్టారు. ఆ కిలోమీటరూ నడిచి వెళదామనుకున్నాను కానీ అప్పటికే ఆరు కావటంతో త్వరగా వెళ్లటానికి రిక్షా ఎక్కక తప్పలేదు. ఎక్కాక తెలిసింది నేనెంత తప్పు చేశానో.

రిక్షావాలా సగం దూరం తీసుకెళ్లి ఆగిపోయాడు. పక్కనున్న ప్రభుత్వ హ్యాండ్ లూమ్స్ ఎంపోరియం లోకెళ్లి ఏదన్నా కొనమని గోల మొదలెట్టాడు. వచ్చీ రాని హిందీలో ‘వచ్చేటప్పుడు కొంటాలే బాబూ. ముందు తాజ్ కి వెళ్లిరానీ’ అని ఎంత మొత్తుకున్నా వినలేదు. పైగా, ‘మీరు వెళ్లకపోతే నా రిక్షా లైసెన్స్ రద్దు చేస్తారు సాబ్’ అని దీనంగా మొహం పెట్టాడు. నేను షాపింగ్ చేయటానికీ అతని రిక్షా లైసెన్స్ కీ సంబంధమేమిటో నాకర్ధం కాలేదు. ఒక వంక సూర్యుడు దిగిపోయేలా ఉన్నాడు, మరోవంక మేఘాల వల్ల ఉన్న ఆ కాస్త వెలుతురు కూడా సరిగా లేదు. ఫొటోలు సరిగా రావేమో అని నా బాధ. ఆ షాపులోకెళితే వాళ్లెంత సేపు పట్టుకుంటారో, అప్పుడు ఉన్న వెలుతురు కూడా పోతుంది అని భయం. నానా తిప్పలూ పడి అదే విషయం రిక్షావాలాకి హిందీలో చెబితే ‘షాపు తలుపు దాకా వెళ్లి వచ్చేయండి. లోపలకి అవసరం లేదు’ అన్నాడు కన్సెషన్ ఇస్తూ.

చేసేది లేక రిక్షా దిగి ఎంపోరియం దాకా నడిచి గుమ్మం దగ్గరనుండి వెనక్కొచ్చా. అప్పుడు నాకెంత ఎంబర్రాస్మెంట్ కలిగుంటుందో ఊహించుకోండి. తీరా వెనక్కొచ్చాక అతను మళ్లీ పేచీ పెట్టాడు. ఎటూ షాపు తలుపుదాకా వెళ్లిన వాడిని లోపలికీ ఓ అడుగేస్తాననుకున్నాడేమో మరి, నేను సిగ్గు లేకుండా అక్కడినుండే వెనక్కొచ్చేసరికి అతనికి కోపమొచ్చింది. నేను లోపలికెళ్లొస్తే కానీ రిక్షా కదలదని మొండికేశాడు.

నా సహనం ఆవిరైపోయింది. ఇప్పటిదాకా వృధా అయిన సమయం చాలు, నడిచి వెళితే ఇప్పటికే తాజ్ కి వెళ్లిపోయుండేవాడిని అనుకుంటూ అతనికివ్వాల్సిన డబ్బు అతని చేతిలో పెట్టి మిగిలిన సగం దూరమూ నడిచే వెళ్లాను. ‘హమ్మయ్య. వచ్చేశాను. ఇక లోపలికెళ్లటమే’ అనుకోబోతుండగా ఎదురుగా పెద్ద లైను కనబడింది. తాజ్ కాంప్లెక్స్ లోపలికెళ్లటానికి సెక్యూరిటీ చెకప్ కోసం వేచి ఉన్నవాళ్ల లైనది. నేనూ ఓ టికెట్ తెచ్చుకుని లైను చివర్లో నిలబడ్డాను. వానపాములాగా కదులుతుందది. నేను లోపలికెళ్లేసరికి పూర్తిగా చీకటిపడేటట్లుంది.

నిక్కుతూ నీలుగుతూ లైనుతో పాటు సాగి ఎట్టకేలకు సెక్యూరిటీ పాయింట్ దగ్గరకొచ్చాను, నా బిచాణాని ఈడ్చుకుంటూ. మెటల్ డిటెక్టర్ టెస్టు పాసై ముందుకెళ్లాను. ఇక్కడ బ్యాగులు, పర్సులు వగైరా చెక్ చేస్తున్నారు. అదీ అయిపోతే ఇక లోపలికెళటమే. ఇక్కడ తెలిసింది నాకో బ్రహ్మాండమైన రహస్యం – క్యాలిఫోర్నియా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అమెరికా పౌరసత్వం ఉన్నట్లే అని! (చదువరీ, ఈ సంగతి ఏళ్ల తరబడి గ్రీన్ కార్డుల కోసం పడిగాపులు పడుతున్న భారతీయ సోదర సోదరీమణులకు చెప్పి బోలెడు పుణ్యం మూటగట్టుకొమ్ము)

సెక్యూరిటీ ఆఫీసర్ – కాస్త చాదస్తపు ముసలాయన లాగున్నాడు – నా పర్సు తీసి చూయించమన్నాడు. చూపించాను. తిరిగి నాకిచ్చేయబోతూ ఉండగా ఆయన దృష్టి నా డ్రైవింగ్ లైసెన్స్ మీద పడింది. క్యాలిఫోర్నియా లైసెన్సది. ఇక చూడండి ఆయన వీరంగం. ‘నువ్వు అమెరికన్ సిటిజెన్ వి. ఎంచక్కా ఇరవై రూపాయలెట్టి ఎంట్రన్స్ టికెట్ కొని లోపలకి దూరిపోతావేం? ఠాట్, కుదర్దంటే కుదర్దు. వెనక్కెళ్లి ఐదొందల రూపాయలెట్టి ఫారినర్లకిచ్చే టికెట్ కొనుక్కుని మళ్లీ లైన్ చివరాకర్న నిలబడు ఫో’ అని హూంకరించాడు అందరికీ వినపడేలా. లైన్లో వెనకున్నోళ్లెవరో పళ్లు బయటపెట్టినట్లనిపించింది. ఆ రోజుకి రెండో ఎంబర్రాసింగ్ మూమెంట్ ఇది.

లేని ఓపిక తెచ్చుకుని ‘నేను భారతీయుడేనండీ బాబూ. నా మొహం చూస్తే తెలీటంలా? క్యాలిఫోర్నియా లైసెన్స్ ఉన్నంత మాత్రాన అమెరికన్ పౌరుడినెలా అయిపోతాను?’ అని ఆంగ్లంలో లా పాయింటు తీశాను – ఇంగ్లీషు మాట్లాడితే ఆయన కాస్త తగ్గుతాడేమోనని. నా ఇంగ్లీషు ఆయనకి కాస్త కూడా అర్ధమయినట్లు లేదు. ‘హిందీ మే బోల్’ అని గద్దించాడు కోపంగా మొహం పెట్టి.

‘చచ్చాం. ఇప్పుడు హిందీలో ఇంత పెద్ద వాక్యం ఎలా అఘోరించాలి నేను?’ అనుకున్నాను. కానీ తప్పదుగా. రెండు నిమిషాలపాటు తిప్పలు పడి పది హైఁలు, పాతిక హుఁలతో ఎలాగో దాన్ని హిందీలోకి తర్జుమా చేసి చెప్పాను. ‘ఐతే నీ పాస్ పోర్టు చూపించు మరి’ అన్నాడాయన ‘చూశారా నా తెలివి’ అన్నట్లు తోటి ఆఫీసర్లకేసి ఓరచూపులు చూస్తూ.

‘మళ్లీ చచ్చాం. మనదేశంలో తిరగటానికి మనకి పాస్ పోర్ట్ ఎందుకు,  ఎక్కడన్నా పోయిందంటే తలనొప్పవుతుందని ఇంట్లోనే భద్రంగా పెట్టొచ్చా. ఇప్పుడెలా? నా దేశంలోనే నా పౌరసత్వాన్ని ఋజువు చేసుకోవాల్సిన ఖర్మ పట్టటమేమిటి’ అనుకుంటూ ముఖం వేలాడేశాను. ఈ భావాలన్నీ మళ్లీ హిందీలోకి తర్జుమా చేయటం మొదలెడితే తెల్లారిపోయేటట్లుంది. గొడవ ఆపేసి ఆయన చెప్పినట్లు ఐదొందల రూపాయల టికెట్ తెచ్చుకుందామంటే మళ్లీ లైన్ చివరినుండీ మొదలు పెట్టాలి. అప్పుడు నిజంగానే తెల్లారిపోతుంది. ‘అసలు భారతీయులకి ఇరవై రూపాయలు, విదేశీయులకి ఐదొందల రూపాయలేమిటి? అతిధి దేవోభవ అని గప్పాలు కొట్టుకుంటూ విదేశీయులని ప్రభుత్వమే దోపిడీ చేయటమేమిటి’ అనుకున్నాను.

నా ముఖాన్ని చదివినట్లున్నాడు పక్కనున్న కుర్ర ఆఫీసరొకతను. ‘నే చూసుకుంటా ఇతని సంగతి’ అని ఆ పెద్దాయన్ని పక్కకి పంపించి నా దగ్గరికొచ్చాడు. ‘ఆయనంతేలెండి. మీరెళ్లండి త్వరగా. మళ్లీ ఆయనొచ్చేస్తాడు’ అంటూ లోపలకి దారి చూపించాడు. పెద్దాయన చూడకుండా కుర్రాఫీసరు కవర్ చేస్తుండగా బతుకుజీవుడా అనుకుంటూ నా ముల్లెతో సహా పిల్లిలా లోపలకు జారుకున్నాను. ఎడమ వైపు తలతిప్పితే తాజ్ కనిపిస్తుందనుకుంటా; అందరూ అటే వెళుతున్నారు. నేనూ అటు తిరగబోయాను. ఇంతలో ఓ ఫొటోగ్రాఫర్ తగులుకున్నాడు నన్ను – మరో ఎంబర్రాసింగ్ మూమెంట్ కి తెర తీస్తూ.

(సశేషం)

ఫొటోలు (కనిపించే క్రమంలో)
1. ఆగ్రా ఎర్ర కోటలో ఓ కుఢ్య విలాసం
2. ఆగ్రా కోటపైనుండి తాజ్ వీక్షణం – పొగమంచులో
3. ఆగ్రా కోట సందర్శకులు
4. ఆగ్రాలో ఓ వీధి దుకాణం
5. తాజ్ మహల్ ప్రవేశ ద్వారం

10 స్పందనలు to “నన్ను దోచుకోని తాజ్ మహల్ – 2/3”


  1. 1 సుజాత 6:07 సా. వద్ద జూన్ 17, 2008

    భలే రాస్తున్నారండీ! ఈ ఎస్సెల్లార్ కెమెరా మూట ట్రైపాడ్ గోల మాక్కూడా ఉంది. (మా కంటే మా వారికని) ఇంతవరకూ అయితే తాజ్ మహల్ గురించి మీరు ఫీలైనట్టే నేనూ ఫీలయ్యాను. తర్వాత ఎపిసోడ్ ఎలా రాస్తారో చూడాలి!

    నాకో అభ్యంతరం ఏమిటంటే, విదేశీ మారక ద్రవ్యం కోసం మన దేశాన్ని, సంస్కృతిని చూడ్డానికి వచ్చే ఫారినర్ల దగ్గర వందల కొద్దీ రూపాయల టికెట్ వసూలు చేయడం న్యాయం కాదని! దేశంలో ఎక్కడికెళ్ళినా ఇదే పరిస్థితి!

    లోకల్ ప్రభుత్వ ఎంపోరియాల్లో షాపింగ్ కి బలవంతంగా తీసుకెళ్లడం కూడా ఇలాంటిదే! జైపూర్, మైసూర్,కేరళ అన్నిచోట్లా టాక్సీల వాళ్ళు,లేదా ఆటోల వాళ్ళు చేసే పని.

  2. 2 చక్రవర్తి 10:24 సా. వద్ద జూన్ 17, 2008

    అనుభవాలు అందరికీ దాదాపుగా అటూ ఇటూగా ఇలాగే ఉన్నట్లున్నాయి. బాగుందండీ మీ ప్రవసం. కానీయ్యండి.

    అలాగే, పనిలో పనిగా మీరు తీసిన ఫొటోలు కూడా మాతో పంచుకోగలరు

  3. 3 ప్రవీణ్ గార్లపాటి 5:12 ఉద. వద్ద జూన్ 18, 2008

    హహ… అచ్చం మీకు లాగానే నాకూ అనిపించింది మొన్న తాజ్‌మహల్ చూడటానికి వెళ్ళినప్పుడు.
    ఏ మాత్రం ఆకట్టుకోలేదు ఆ పరిసరాలు, తాజ్ కూడాను.

  4. 4 కొత్తపాళీ 5:53 ఉద. వద్ద జూన్ 18, 2008

    “రెండు నిమిషాలపాటు తిప్పలు పడి పది హైఁలు, పాతిక హుఁలతో ”
    భలే భలే. కాన్పూరులో ఉండగా సిటీలో మన తెలుగు వీరుల హిందీ ప్రతాపం జగద్విదితం! మావోడొకడు చెప్పులు బేరం చేస్తూ మన్నుతాయా అనడిగాడు. షాపు వాడు ధీమాగా life time guarantee అన్నాడు. మావోడు యమా సీరియస్సుగా .. హంకో నమ్మక్ నహీహై అన్నాడు. ఉప్పుకీ చెప్పులకీ సంబంధమేంటో అర్ధం కాక షాపు వాడు ..

  5. 5 Ravi Kiran 6:36 ఉద. వద్ద జూన్ 18, 2008

    నాకు కూడా తాజ్ నచ్చలా.. అనుభవాలు ఇలాంటివే ఎదురయ్యాయి. మేము ఇంకా ఓ డైలీ ట్రిప్ బస్సు లో వెళ్ళాము. 2 గంటలు టైంలో చూసి వచ్చైమన్నాడు. తాజ్ దగ్గరకు వెళ్ళేసరికి పెద్ద క్యూలు 2 ఉన్నాయి. ఒకటి టికెట్ కి ఒకటి లోపలికి వెళ్ళటానికి. టికెట్ తీసుకొచ్చేసరికే గంట పట్టింది.
    అప్పుడు సీ-డాట్ లో పని చేసేవాళ్ళం. సీరియస్ గా గేట్ దగ్గరకు వెళ్ళి “మేము టెలీకాం డిపార్టుమెంటు నుంచి వచ్చాం” అని చెప్పాం మా ఇడీకార్డు చూపించి. ఓ సింగుగారు “తొహ్ క్యా అందర్ జానాహై క్య? జావొ” అన్నాడు. అంతే, పరిగెట్టాం లొపలికి.
    సెంట్రల్ గవర్నమెంటులో పనిచేస్తే ఇలాంటి ఉపయోగాలు కూడా ఉంటాయని అప్పుడే తెలిసింది.

  6. 6 నాగమురళి 7:16 ఉద. వద్ద జూన్ 18, 2008

    అచ్చంగా నావీ ఇవే అనుభవాలు. 2005 డిసెంబరులో ఇండియా వెళ్ళినప్పుడు ఢిల్లీ మీదుగా ప్రయాణం పెట్టుకున్నాను – అసలు బొత్తిగా ఢిల్లీ, తాజ మహల్ చూడకుండా పరాయి దేశంలో భారతీయుణ్ణి అని చెప్పుకుంటున్నందుకు సిగ్గుగా అనిపించి. మేమూ మొదట మథుర వెళ్ళాము. ఆ ఊరు చూస్తే ఏడుపు వచ్చింది. ఆగ్రాలో ఎర్రకోట చూడకుండా డైరక్టుగా తాజ మహల్ కి వెళ్ళిపోయాము. అక్కడ సంత మార్కెట్ కన్నా అర్ధాన్నంగా జనాలు. ఆ క్యూలో జనాల బిహేవియర్ చూస్తే పిచ్చెక్కిపోయింది. భారత దేశానికి ఒక సింబల్ లాగా చూపిస్తూ ఉంటారు తాజ్ మహల్ ని బయట దేశాల్లో. అక్కడ మనవాళ్ళ బిహేవియర్ చూస్తే అర్ధమౌతుంది మన దేశం పరువు ప్రపంచంలో ఏ స్థాయిలో ఉంటుందో.

    సరిగ్గా నాక్కూడా అలాగే సెక్యూరిటీ ఆఫీసర్ తో అదే అనుభవం. వాడు నేను పర్సులో టికెట్ తీసి ఇస్తుంటే, పర్సులో మేము యూ కే నుంచి ఇండియాకి కాల్ చేసే టెలిఫోన్ కార్డు చూశాడు. గొడవ మొదలెట్టాడు. అప్పటికే లోపలికెళ్ళిన మా కజిన్ వెనక్కి వచ్చి వాణ్ణి హిందీలో దబాయించేసరికి నోరు మూశాడు. నాకెంత చిరాకేసిందో.

    మీకు లాగే బహాయ్ లోటస్ టెంపుల్ కూడా నన్ను నిరాశ పరిచింది. తాజ మహల్ కన్నా అక్షర్ ధామ్ మాత్రం కన్నుల పండుగ చేసింది. దాని ముందు తాజ మహల్ దిగదుడుపు అని మేము గట్టిగా పైకే అనుకున్నాము.

    అలాగే ఢిల్లీ లో పార్లమెంటు సెషన్ ఒకటి విజటర్ గేలరీ లోంచి చూశాము. మన పార్లమెంటు దగ్గర సెక్యూరిటీ చూస్తే పిచ్చెక్కిపోయింది. ఏదో వార్ జోన్ లోకి పోతున్నట్టు అనిపించింది. లండన్ లో వెస్ట్ మినిస్టర్ భవనం దగ్గర అందులో వందో వంతు సెక్యూరిటీ కూడా బయటకి కనిపించదు. లోపల చాలా దిట్టమైన ఏర్పాట్లే ఉంటాయి, కానీ మనవాళ్ళలా బయటకి ఎక్కువ హడావిడి ఉండదు.

    మొత్తానికి ఢిల్లీ లో అన్నిటికన్నా నచ్చినవి అక్షర్ ధామ్, తరవాత మెట్రో రైలు. మెట్రో రైలు అంతర్జాతీయ ప్రమాణాలకి ఏమాత్రం తీసిపోదు – ఇప్పుడెలా ఉందో తెలియదు కానీ.

  7. 7 అబ్రకదబ్ర 1:33 సా. వద్ద జూన్ 18, 2008

    @సుజాత

    విదేశీయులనుండి ఎక్కువ వసూలు చేయటం విషయంలో నాదీ మీ అభిప్రాయమే. తమని దోచేస్తున్నారని కనుక్కోలేకపోవటానికి వాళ్లేమీ పిచ్చివాళ్లు కాదు కదా. ఈ దోపిడీ దెబ్బకి ఒక సారి వచ్చినవాడు మళ్లీ తిరిగి రాకపోవటమే కాకుండా, తన కధంతా చెప్పి మరో నలుగురిని రాకుండా ఆపుతాడు. పది డాలర్ల కోసం చూసుకుంటే ప్రభుత్వానికి వెయ్యి డాలర్ల నష్టం! సింగపూర్ లో చూడండి. ఎయిర్ పోర్టు నుండి బస్సులో టూరిజం వాళ్లు ఉచితంగా ఊరంతా తిప్పి చూపిస్తారు. మనకి మళ్లీ వెళ్లి వారమో పదిరోజులో సింగపూర్ లో ఉండాలనిపించేటట్లు ఉంటుంది వాళ్ల పద్ధతి. అప్పుడు వాళ్ల టూరిజం పరిశ్రమకి ఎంత లాభం! మన టూరిజం వాళ్లది ఆలోచన లేని కక్కుర్తి బేరంలా అనిపిస్తుంది.

    @చక్రవర్తి

    వ్యాసాలకు కొన్ని ఫొటోలు ఇప్పటికే జత చేశాను.

    @ప్రవీణ్
    @రవి కిరణ్
    @నాగ మురళి

    ఈ చిరాకుల వల్ల మనం అనుభూతి పొందలేకపోయామే కానీ తాజ్ గొప్పదనం తరిగేది కాదు. దాని గురించి మరిన్ని వివరాలు తరువాతి/చివరి భాగంలో.

    @కొత్తపాళీ

    మీరు చెప్పినటువంటిదే నా అమెరికన్ మితృడికెదురయింది ఓ సారి. ఆ మధ్య అతనో నెల రోజుల పాటు ఇండియా ట్రిప్పేశాడు. జైపూర్ దగ్గరనుకుంటా, ఆకలేస్తే రోడ్డుపక్కనున్న హోటల్ కెళ్లి ‘something to eat’ అని సైగల్తో చూపించాడట. వాళ్లు ఇతనివంక వింతగా చూసి ప్లేట్లో ఓ ఇటుక రాయి పెట్టుకొచ్చి ఇచ్చారు. దాన్నెలా తినాలో ఇతనికర్ధం కాలేదు. వాళ్లేమో ఇతను ఇటుక రాయినెలా తింటాడో అని చుట్టూ నిలబడి ఆసక్తిగా చూస్తున్నారు. ‘ఈట్’ అంటే హిందీలో brick అని తెలిశాక అతని నవ్వాగలేదు.

    @నాగ మురళి

    మెట్రో రైలు ఇప్పటికీ బాగానే ఉంది (కనీసం ఆరు నెలల కిందటి వరకూ). బాగా మెయింటైన్ చేస్తున్నారు. నా చేతిలో ఉన్న పల్లీల పొట్లం ట్రాష్ క్యాన్ లో పడేస్తే కానీ సెక్యూరిటీ వాళ్లు నన్ను స్టేషన్ లోకి అడుగుపెట్టనీయలేదు 😉

  8. 9 Wanderer 4:46 సా. వద్ద సెప్టెంబర్ 12, 2012

    I have been to Taj Mahal so many times (used to live in Delhi.. ఢిల్లికి చుట్టాలెవరొచ్చినా తాజ్ మహల్ చూపించటం నా డ్యూటీ ఐపోయింది) that I became impervious to its beauty. The first time was with my school friends and I don’t even remember what I felt then. It was just another monument.


  1. 1 పొద్దు » Blog Archive » జూన్ నెల బ్లాగుల విహంగ వీక్షణం 12:10 ఉద. వద్ద జూలై 2, 2008 పై ట్రాక్ బ్యాకు

వ్యాఖ్యానించండి




ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 304,024

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.