Posts Tagged 'హాస్యం'

కర్ణపిశాచి

మూడేళ్ల నాటి ముచ్చటిది. బే ఏరియాలో ఫలానా ప్రసిద్ధ షాపింగ్ మాల్‌లో ఫలానా ఫలానా వస్తువులు కొనే పని మీదెళ్లాను. అది డిస్కౌంట్ సేల్స్ వెల్లువెత్తే ఒకానొక బారెడు వారాంతం కావటం మూలాన ఆ మహా మాల్ కొనుగోలుదార్లతో కళకళలాడిపోతుంది. అరగంట వెదుకులాట తర్వాత అతి కష్టమ్మీద ఓ మూలెక్కడో పార్కింగ్ సంపాదించి కారు దిగి బయటికొచ్చి, నాకన్నా ముందొచ్చీ పార్కింగ్ దొరక్క అసహనంగా చక్కర్లు కొడుతున్న నిర్భాగ్య  చోదకులకేసి బోర విరుచుకుని సగర్వంగా చూస్తూ అడుగులేస్తూ, ఆ క్రమంలో ఓ పెను ప్రమాదాన్ని తృటిలో తప్పించుకుని, దెబ్బకి మత్తొదిలి కళ్లు నెత్తి మీంచి దించి ఒళ్లు దగ్గర పెట్టుకు నడిచి …. మొత్తమ్మీద మాల్‌లో అడుగు పెట్టాను.  పెట్టీ పెట్టగానే ఎదురయ్యాడు వాడు – రెండు చేతుల్లోనూ రెండు పెద్ద సంచులు మోసుకొస్తూ – రెండేళ్లుగా ఐపు లేని స్నేహితుడు. చూడబోతే కొనుగోళ్లు కుమ్మేసినట్లున్నాడు. నేనెదురవగానే ముప్పై రెండు పళ్లూ బయటేసి ముఖం చాటంత చేసుకుని నవ్వుతూ ‘మొన్న ఫోన్ చేస్తే ఊర్లో లేవని మెసేజొచ్చింది. ఎప్పుడొస్తున్నావు?’ అన్నాడు.

నేనో క్షణం తెల్లబోయి, వెంటనే తేరుకున్నాను. తర్వాత చెయ్యి ముందుకు చాస్తూ ‘అదేం ప్రశ్న? ఎదురుగానే ఉంటే ఎప్పుడొస్తున్నావంటావేంటి?’ అన్నాను వింతగా చూస్తూ, మొన్నటి వాడి ఫోన్ ఎలా మిస్సయ్యానా అని థింకుతూ. పైగా ఆ రోజు ఊళ్లోనే ఉన్నాను కూడా!

వాడు ‘ఓహ్. ఇంకా వారమా? పెద్ద ట్రిప్పే వేసినట్లున్నావే’ అని పగలబడి నవ్వుతూ నన్ను దాటి వెళ్లిపోయాడు.

ముందు నాకు తల తిరిగింది – వాడి ఎదురు ప్రశ్నకి. తర్వాత తలకొట్టేసినట్లనిపించింది.  ‘గాలితో నా కరచాలనాన్నెవరూ గమనించలేదు కదా’ అని దొంగ చూపులతో స్కాన్ చేస్తే ఫలితం పరువు నిలిపేదిగానే వచ్చింది. ‘హమ్మయ్య.  బతికిపోయా …  ఎవరూ చూడలేదు’ అనుకుంటుండగా …. ఓ అనుమానం మదిలో మెదిలింది. క్షణం గడిచేలోపది పెనుభూతమయ్యింది.

నేనెవరికీ కనపడటం లేదా? యామై ఇన్విజిబుల్??

లిప్తపాటులో నా ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్లిపోయాయి. ‘ఇందాకటి యాక్సిడెంట్ .. కొంపదీసి .. అదిగానీ జరగలేదు కదా. నేను నేనే కదా, నా ఆత్మని కాను కదా’. గుండె గుభేలుమంది. ఘోస్ట్ నుండి సిక్స్త్‌సెన్స్ దాకా ఎన్ని సినిమాల్లో చూడలేదు – హీరో ఏదో ప్రమాదంలో చిక్కుకోటం, అందులోంచి క్షేమంగా బయటపడటం, తీరాచూస్తే అతను దెయ్యమని తేలటం.

భయంతో వళ్లంతా వణుకుతుండగా అప్రయత్నంగా ఇందాక యాక్సిడెంట్ తప్పిన చోటుకేసి చూశాను. అక్కడేదో కలకలం. జనం గుంపుగా నిలబడున్నారు. నాలో ఏ మూలో మిణుక్కుమంటున్న ఆశ అడుగంటిపోయింది. ‘సందేహం లేదు. నేను పోయాను .. పిశాచాన్నై పోయాను’ అనుకుంటూ ఆ నిజాన్ని కన్‌ఫర్మ్ చేసుకోటానికి పాదాలకేసి చూసుకున్నాను. ఆశ్చర్యం! అవి వెనక్కి తిరిగిలేవు, గాల్లో తేలుతూనూ లేవు. పైగా నా నీడ కూడా శుభ్రంగా నేలమీద పడుతుంది.

ఆశ తిరిగి చిగురేస్తుండగా చటుక్కున మళ్లీ అటు చూశాను. అప్పుడే గుంపు చెదిరిపోతుంది. నేనూహించుకున్న దృశ్యం లేదక్కడ. అంతలో ఎవరో షాపరుడు ‘కాస్త పక్కకు జరుగుతారా, ప్లీజ్’ అని నన్ను నెట్టుకుంటూ వెళ్లిపోయాడు. అతను నాలోంచి దూరి పోకపోవటంతో పెనుభూతం దూదిపింజలా తేలిపోయింది. ఈ సారి అసలు నిజం కరాఖండిగా కన్‌ఫర్మ్ అయింది. నాలో ఆనందం వెల్లువెత్తింది.

‘హమ్మయ్య. మనం బాగానే ఉన్నాం. మరి వాడికేమయింది, అలా పిచ్చోడిలా తనలో తనే మాట్లాడుకుంటూ వెళ్లాడు?’ అనుకుని హాశ్చర్యపోయాను. 

ఆ తరహా హాశ్చర్యానికి అదే మొదలు. అదే ఆఖరు మాత్రం కాదు.

అలాంటి ఆశ్చర్యాలు ఆ తర్వాతా మరిన్నిసార్లు పోయేశాక ఓ శుభముహూర్తాన తత్వం బోధపడింది. అదెప్పుడు అనేది అంత ముఖ్యం కాదు కాబట్టి ఆ విషయం వదిలేద్దాం. అదెలా అనే విషయం మాత్రం చూద్దాం.

షాపింగ్ మాల్ సంఘటన ఆదిగా .. అలాంటి అనుభవాలు వారానికోటన్నా ఎదురవటం మొదలయ్యాయి. రాన్రానూ నా మిత్రమారాజు బాపతు కేసులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. వీధుల్లో, షాపుల్లో, సినిమా హాళ్లలో – అందుగలరిందులేరని సందేహంబు లేకుండా – ఎక్కడబడితే అక్కడ విరివిగా దర్శన మివ్వసాగారు వాళ్లు. ఆడా మగా తేడాల్లేకుండా శూన్యంలోకి చూస్తూ మాట్లాడే ఈ జనాలని చూస్తూ మొదట్లో విస్తుపోయినా, తర్వాత్తర్వాత అలవాటైపోయి అడ్జస్టైపోయాను. కనపడని దేన్నో చూస్తూ రేగు చెట్టు కింద గుడ్డివాడిలా నవ్వేవారు కొందరు, పూనకమొచ్చినట్లు ఊగిపోతూ రంకెలేసేవారు ఇంకొందరు, ఊరికూరికే ‘ఊఁ’ కొడుతుండేవారు మరి కొందరు. ఇంకా – వినపడీ పడకుండా గొణుక్కునేవాళ్లూ, కనపడని వాళ్లని కటువుగా విసుక్కునేవాళ్లూ, తమలో తామే మాట్లాడేసుకునేవాళ్లూ … అబ్బో ఒక రకం కాదు. వీళ్ల ధాటికి – కొన్నాళ్లకి వీధుల్లో ఎదురైన పరిచయస్తులు నన్ను పలకరిస్తున్నారో, లేక వాళ్ల వాళ్ల వెర్రి లోకాల్లో విహరిస్తున్నారో అర్ధం కాకుండా పోయింది. వాళ్లతో మాట్లాడబోయి నేను వెధవనవ్వటం దేనికని పట్టించుకోకుండా వెళ్లిపోతే అదో సమస్య. ఒకరిద్దరు మరుసటి రోజు ఫోన్ చేసి మరీ తిట్టారు – ’ఏరా, నిన్న రోడ్డు మీదెదురై పలకరిస్తే నన్ను చూసీ గుర్తు పట్టనట్లు వెళ్లిపోతావా?’ అంటూ. దాంతో నాకెటూ పాలుపోని పరిస్థితి. ఎవరు నాతో మాట్లాడుతున్నారో, ఎవరు వాళ్లతో వాళ్లే మాట్లాడుకుంటున్నారో కనిపెట్టటం ఎలా? ఎవరినన్నా పలకరించబోయి భంగపడితే నాకు మొఖం కొట్టేసినట్లుంటుంది. ఎవరికుండదు? పైగా ఆ విషయం వేరేవాళ్లు గమనిస్తే ఎంత కామెడీగా ఉంటుంది? ఈ పిచ్చి మాలోకాల దెబ్బకి నాకు పగటి పూట వీధిలోకెళ్లాలన్నా మా చెడ్డ చికాకైపోయింది. ఎక్కడెవడెదురై పలకరిస్తాడో,  వాడికి బదులీయాలో లేదో అని బిక్కుబిక్కుమంటూ తిరగాల్సిన ఖర్మ!

కొన్నాళ్లు ఆ బాధలు పడ్డాక ఇక లాభం లేదు, దీనికి ఏదో ఓ విరుగుడు కనిపెట్టాల్సిందేనని తీర్మానించాను. అంతకన్నా ముందు వాళ్ల పిచ్చికి కారణాలేంటో వెదకాలనుకున్నాను. లేస్తే నేను మనిషినే కాను కాబట్టి, ఆ తర్వాత అసలు రహస్యం అంతు చూట్టానికి ఆట్టే కాలం పట్టలేదు. రహస్య ఛేదనలో భాగంగా సదరు పిచ్చోళ్లకేసి కాస్త పరిశీలనగా చూస్తే నాకర్ధమైన విషయం – వాళ్లంతా బ్లూ టూత్ డివైసెస్ అనబడే కర్ణ పిశాచులని చెవికి తగిలించుకుని సెల్ ఫోన్ లలో సంభాషిస్తున్న హైటెక్కు జీవులని.

ఆ సంగతి తెలిశాక నేనో నిర్ణయం తీసుకున్నాను – ఇకనుండీ రోడ్లమీద తెలిసిన వాళ్లెదురై పలకరిస్తే ముందు వాళ్ల రెండు చెవుల్నీ పరీక్షగా చూసిగానీ బదులీయగూడదని. అప్పట్నుండీ పగటి వేళల్లో ధైర్యంగా బయటికెళ్లగలుగుతున్నాను – నీలదంతం పిచ్చోళ్లంటే నిర్భయంగా.

(రమారమి రెండేళ్ల కిందట – తెలుగు బ్లాగింగ్ మొదలు పెట్టిన కొత్తలో – నేను రాసిన నీలదంతం పిచ్చోళ్లు అనే బుల్లి టపాకి ఇది రీ-మేక్. ఈ రెండేళ్లలో నా శైలిలో వచ్చిన మార్పు తెలుసుకోటానికి ఇటువంటి ప్రయోగం చేయాలని కొన్నాళ్లుగా అనుకుంటున్నాను. ఒకే అంశాన్ని అప్పుడెలా రాశానో, ఇప్పుడెలా రాస్తానో పోల్చిచూసుకునే ప్రయత్నం ఇది. ఈలోగా బే ఏరియా తెలుగు సంఘం వారు తమ ఉగాది ప్రత్యేక ‘తెలుగు వెలుగు’ సంచిక కోసం ఏదైనా రాసిపెట్టమని అడగటం, అదే అదనుగా నా ఆలోచనని అమల్లో పెట్టి ఫలితాన్ని వాళ్ల చేతిలో పెట్టటం జరిగింది)


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.