Posts Tagged 'హాలీవుడ్'

మన సినిమా – 1/2

ఇతర బ్లాగుల్లో జరిగే చర్చలు హైజాక్ చెయ్యటం నా పద్ధతి కాదు. మొదటిసారిగా, ఇప్పుడు చెయ్యాల్సొచ్చింది. ఎన్నాళ్లుగానో మన సినిమాలపై వ్యాసమొకటి రాయాలనుకుంటుండగా మహేష్, రేరాజ్ దాదాపు అవే అంశాలపై సాగిస్తున్న ఆసక్తికరమైన చర్చ గమనించాక నా వ్యాసానికి ఇదే సరైన సమయమనిపించింది. అక్కడి చర్చతో పరిచయం లేనివారి కోసం చిన్నపాటి ఉపోద్ఘాతం. ‘హాలీవుడ్ సినిమాల స్థాయికి వెళ్లటం అన్న ఆలోచనే అనవసరం. మనదైన స్థాయి ఒకటి తయారు చేసుకోవాలి’ అన్నది మహేష్, రేరాజ్ తేల్చిన మాట. ‘ముందు హాలీవుడ్‌ని కాపీ కొట్టటమన్నా సరిగా నేర్చుకోమనండి. సొంత క్రియేటివిటీ సంగతి తర్వాత ఆలోచించొచ్చు’ అన్నది దానికి నా వ్యాఖ్య. ఆ వ్యాఖ్యకి వివరణ ఈ టపా.

నా దృష్టిలో –  ప్రపంచంలో ఏ ఇతర సినీ రంగమైనా హాలీవుడ్‌తో పోటీ పడాల్సింది రెండు విషయాల్లో: విభిన్న కథాంశాలు, సాంకేతిక హంగులు. పై రెండు విషయాల్లో హాలీవుడ్ సినిమాలు మిగతావాటికన్నాఎక్కువ స్థాయిలో ఉన్నాయన్నది కాదనలేని సత్యం. హాలీవుడేతర సినిమాల్లో మంచివి, గొప్పవి రావటం లేదా – అంటే వస్తున్నాయి (కాన్వర్స్: హాలీవుడ్ చెత్త సినిమాలు తీయటం లేదా? మహరాజులా తీస్తుంది. ఐతే ఏ విషయంలోనైనా పోలికలెప్పుడూ మెరుగైన విషయాల గురించే ఉండటం ఎదుగుదలకి ముఖ్యం). ఇరాన్ కూడా మంచి సినిమాలు తీస్తుంది. కానీ వాటిలో వైవిధ్యం ఏది? ఇరాన్‌ది చిన్న పరిశ్రమ. వాళ్లకుండే పరిమితులెక్కువ. అక్కడ ఎక్కువ వైవిధ్యం ఆశించటం అనవసరం. మనవాళ్లకేమయింది? సంఖ్యలో మనవాళ్లు ఏటా జనాల మీదకొదిలే సినిమాలు – కేవలం తెలుగు, తమిళ రంగాలనే లెక్కలోకి తీసుకున్నా – హాలీవుడ్ మేజర్ స్టూడియోలన్నీ కలిపి తీసే సినిమాలకన్నా ఎక్కువ. వాటిలో ఎన్ని వైవిధ్యభరితమైన కథాంశాలతో వస్తాయంటే వేళ్ల మీద కూడా లెక్కించటానికుండదు. తొంభై శాతం అవే రొడ్డకొట్టుడు కథలు. కుర్ర హీరోలకైతే ప్రేమ కథలు, ముదురు హీరోలకైతే ప్రతీకారం కథలు. హిందీవాళ్లు ఎంతో కొంత మెరుగీ విషయంలో.

సాంకేతిక హంగులు – హాలీవుడ్ ఈ విషయంలో చేసినన్ని ప్రయోగాలు మనమెప్పటికన్నా చెయ్యగలమా? బర్బాంక్ స్టూడియోలు అవసరాన్ని బట్టి కొత్త రకం కెమెరాల నుండి యానిమేషన్ సాఫ్ట్‌వేర్ దాకా సృష్టించుకోగలిగుతాయి. స్టెడీకామ్, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, త్రీ-డీ టెక్నాలజీ .. ఒకటేమిటి, సినిమాల్లో వచ్చిన, వస్తున్న సాంకేతిక ప్రగతి మొత్తం హాలీవుడ్ సృష్టే కదా. మనవాళ్లు ఆ రకంగా చెయ్యగలుగుతారా ఎప్పటికైనా? లేరు. ఎందుకు? బడ్జెట్ పరిమితులు. అంత డబ్బు ఖర్చు పెట్టటం మనకి వర్కవుట్ కాదు. నిజంగా కాదా అంటే నిజానికి అవుతుంది. కానీ ఇప్పుడు మన సినీరంగం నడపబడుతున్న పరిస్థితుల్లో కాదు. మరెలా అవుతుంది? తర్వాత చూద్దాం. ప్రస్తుతానికైతే వేరేవాళ్ల ఇన్నోవేషన్లు అందిపుచ్చుకోటమే మనం చెయ్యగలిగేది. అయితే ఆ అందిపుచ్చుకోవటం ఎప్పటికి? హాలీవుడ్లో ఒక టెక్నాలజీ వచ్చిన ఐదారేళ్లకి. ఆలోగా ఆ టెక్నాలజీని ఎన్ని రకాలుగా ఎక్స్‌ప్లాయిట్ చెయ్యాలో అన్నిరకాలుగానూ హాలీవుడ్ దర్శకులు చేసేస్తారు. ఐదేళ్ల తర్వాత మనవాళ్లు అలాంటి షాట్లు ఎన్ని తీసినా అవన్నీ ఎప్పుడో ఎక్కడో చూసేసినట్లే ఉంటాయి. అయితే సమస్య అది కాదు. మనవాళ్లు ఆ పనీ సరిగా చెయ్యలేకపోవటమే అసలు సమస్య. అందుకే అన్నాను – ముందు కాపీ కొట్టటమన్నా సరిగా నేర్చుకోమనండి, తర్వాత సొంత క్రియేటివిటీ సంగతి చూడొచ్చు అని.

‘అనుకరించటమన్నా సరిగా చెయ్యటం నేర్చుకోమనండి’ అనటానికి చాలా కారణాలున్నాయి. అవన్నీ విడమర్చనవసరం లేదు. మచ్చుకొక్క ఉదాహరణ చాలు. ‘మాట్రిక్స్’ సినిమా విడుదలై పదేళ్లయింది. ఈ పదేళ్లలో, మన వివిధ ‘వుడ్’లలో మాట్రిక్స్ తరహా ఫ్రీజ్ ఫ్రేమ్ ఎఫెక్ట్ సాధించటానికి ప్రయత్నించిన దర్శకులు డజన్లలో ఉన్నారు. ఒక్కరూ అందులో విజయం సాధించలేకపోయారు. హాలీవుడ్‌లో వచ్చిన కొత్త తరహా ఎఫెక్ట్స్ వచ్చినట్లు కాపీ కొట్టేసే దక్షిణాది ‘క్రియేటివ్ జీనియస్’ శంకర్ ఆరేడేళ్ల క్రితం ‘బాయ్స్’ సినిమాలో ఓ పాటలో ఆ ప్రయోగం చేసి దారుణంగా విఫలమయ్యాడు (అది దర్శకుల చేతకానితనం కాదు – కెమెరా మరియు పోస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ల చేతకానితనం అన్నాడో మితృడు. ఆయా నిపుణులతో అవసరమైనట్లు పని చేయించుకోలేకపోవటం మాత్రం దర్శకుడి చేతగానితనమే కదా). ‘బాయ్స్’ విడుదలకన్నా ముందే ఔత్సాహిక మూవీ బఫ్స్ కొందరు కేవలం నాలుగైదు సాధారణ వీడియో కెమెరాలు వాడి శంకర్‌కన్నా మెరుగ్గా ఫ్రీజ్ ఫ్రేమ్ ఎఫెక్ట్ సాధించటం నేను గమనించాను (ఇంటర్నెట్‌లో వెదికితే అలాంటివి బోలెడు దొరుకుతాయి). షూ-స్ట్రింగ్ బడ్జెట్‌తో ఆ కుర్రాళ్లు సాధించిన ఫలితాలు మన దర్శకనిర్మాతలు కోట్లకు కోట్లు వెచ్చించి సైతం సాధించలేకపోవటం నాకెప్పుడూ అర్ధం కాదు. లోపం ఎక్కడ?

ఇక గ్రాఫిక్స్ విషయం. అవసరం లేకున్నా విచ్చలవిడి గ్రాఫిక్స్ వాడకం ఈ మధ్య విరివిగా దర్శనమిస్తుంది మన సినిమాల్లో – ముఖ్యంగా తెలుగు సినిమాల్లో. సినిమా పేరు తెరమీద కనపడ్డప్పుడు ఆ బాంబు పేలుళ్లు, టైటిల్ బద్దలై అందులోంచి గొడ్డళ్లూ విచ్చుకత్తులూ దూసుకురావటం – ఇంత హంగామా ఎందుకు? పోనీ అవన్నా నవ్యంగా ఉంటాయా అంటే అదీ లేదు. అన్నీ ఒకే రకం. సినిమా అనేది టైటిల్స్ దగ్గర్నుండే ప్రేక్షకుడ్ని కథలోకి లాక్కెళ్లాలి. మన దగ్గర మాత్రం (ముఖ్యంగా డీవీడిలో చూసేటప్పుడు) శుభ్రంగా టైటిల్స్ స్కిప్ చేసేసి చూసెయ్యొచ్చు. సరే. టైటిల్స్ గొడవొదిలేసి మళ్లీ గ్రాఫిక్స్ దగ్గరికొద్దాం.

మనవాళ్ల గ్రాఫిక్స్ ఎంత ఘోరంగా అఘోరిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవసరం లేకున్నా ఏవో ఫైట్ సీన్లలోనో, పాటల్లోనో గ్రాఫిక్స్ కుమ్మేస్తారు. (‘అరుంధతి’ లాంటి ఒకట్రెండు సినిమాల్లో అవసరం మేరా వాడుకున్నారనుకోండి, కానీ అలాంటి సినిమాలెన్ని? అలాంటి నిర్మాతలెందరు?) అవసరముందా లేదా అనేది అవతలుంచితే, ఆ తీసేదేదో సరిగా తీయటమూ ఉండదు. కోట్లు ఖర్చు పెట్టాం అని డబ్బాలు కొట్టుకోటమే కానీ, ఆ కోట్లకి వాళ్లు రాబట్టిన ఫలితం తెరపై చూస్తే ఆశ్చర్యమేస్తుంది. కొందరనొచ్చు, ‘మనకున్న మార్కెట్‌కీ, మనం గ్రాఫిక్స్‌కి ఖర్చు పెట్టేదానికీ అంతకన్నా గొప్పగా చెయ్యటం కుదరదు’ అని. నేనొప్పుకోను. అంతకన్నా తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఎఫెక్ట్ సాధించొచ్చు. ఊరికే నా మాట నమ్మనవసరం లేదు. తిరుగులేని ఉదాహరణొకటిస్తాను. కింది మూడు నిమిషాల షార్ట్ ఫిల్మ్ చూడండి.

ఇద్దరు ఔత్సాహికులు కలిసి కేవలం నూట యాభై డాలర్ల ఖర్చుతో ఒక సాధారణ వీడియో కెమెరా, ల్యాప్‌టాప్, లైట్‌వేవ్ యానిమేషన్ సాఫ్ట్‌వేర్, మూడు నెలల శ్రమశక్తితో రూపొందించినదీ బుల్లి సినిమా. ఆ ఖాళీ ఫ్రీవే, విమానం, గ్రాండ్ చెరోకీ జీప్ ఏవీ నిజం కావు – కంప్యూటర్ గ్రాఫిక్స్. వాళ్లు పెట్టిన ఖర్చుకి వందల రెట్లు తుది ఫలితంలో కనిపించటంలేదూ? ఇప్పుడు చెప్పండి. తెలుగు సినిమాల్లో గ్రాఫిక్స్‌కోసం పెట్టామని దర్శక నిర్మాతలు చెప్పుకునే ఖర్చుకీ, వాళ్లు సాధించే ఎఫెక్ట్‌కీ ఏమన్నా పొంతనుందా! ఆలోచిస్తే మళ్లీ అదే ప్రశ్న – లోపం ఎక్కడ?

(మిగతా రెండో భాగంలో)


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,298

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.