Posts Tagged 'స్వైన్ ఫ్లూ'

పందిరాజము రిటర్న్స్

వరాహాల విశిష్టత గురించి, అనాదిగా వాటికి జరుగుతున్న అన్యాయం గురించి అప్పుడెప్పుడో పందిరాజములో ముచ్చటించుకున్నాం. ఈ భూమ్మీదినుండి పంది జాతిని తుడిచిపెట్టటమే ఏకైక అజెండాగా సహస్రాబ్దుల క్రితమే ఏర్పాటు చెయ్యబడ్డ అజ్ఞాత బ్రదర్‌హుడ్ ఉనికి కేవలం నా ఊహ కాదని నిరూపించే సంఘటనలు గతవారంలో జరిగాయి. డాన్ బ్రౌన్ వంటివారు పూనుకుంటే – ఏంజెల్స్ & డీమన్స్, డావించీ కోడ్‌లని మించిన సస్పెన్స్ థ్రిల్లర్ నవలలకి సరిపడా సరుకున్న సంఘటనల సమాహారమిది.

పందులపై తాజా ముట్టడి పది రోజుల క్రితం మెక్సికోలో మొదలయింది. మెక్సికోసిటీలో ప్రబలిన కొత్త రకం ఫ్లూ బారిన పడి నూట అరవై మంది దాకా మరణించారన్న వార్తలు గుప్పుమనటం, ఆ వ్యాధికి ‘స్వైన్ ఫ్లూ’ అని పేరు పెట్టటం వెంటవెంటనే జరిగిపోయాయి.పందుల్లో ఫ్లూకి కారణమయ్యే ఒకానొక రకం వైరస్ మనుషులకీ పాకుతుందని ఏదో వైద్య బృందం హడావిడిగా ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ వ్యాధికి స్వైన్ ఫ్లూ అనే పేరు ఏకపక్షంగా నిర్ణయించేశారు. రెండు రోజులు తిరిగేలోపు ఈ వార్తలు పక్కనున్న అమెరికాలో దావానలంలా వ్యాపించాయి. ఇంకేముంది, ఏదో వంకతో కూలిపోటానికి సదా సిద్ధంగా ఉండే అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పలు తెప్పలుగా కూలిపోయాయి. స్వైన్ ఫ్లూకి, స్టాక్ మార్కెట్లకి సంబంధమేమిటని నన్నడక్కండి – అదంతే. మహా మహా కొమ్ములు తిరిగిన వారెన్ బఫెట్‌కే అంతుపట్టని సంగతది.

తెల్లారేసరికి – అమెరికా తుమ్మింది కాబట్టి ప్రపంచమంతా అలవాటుగా ఫ్లూ తెచ్చేసుకుంది. ఎక్కడ చూసినా ఈ కొత్త రకం ఫ్లూ గురించిన వార్తలే. ఎవరు తుమ్మినా, దగ్గినా ఉలికిపాటే. అమెరికాలోనైతే, అర్జెంటుగా సరిహద్దులు మూసేయాలనే దేశభక్తులు బయల్దేరారు. సందట్లో సడేమియా అనుకుంటూ మెక్సికో వంటి మూడో ప్రపంచ దేశాల ప్రజల శుభ్రత గురించి వాగే వాగుడుకాయలూ, వారికి దీటుగా ‘కెనడా వంటి దేశంలో మొదలైతే స్వైన్ ఫ్లూ గురించి ఇంత రాద్ధాంతం చేసుండేవారా’ అనే గడుగ్గాయలూ కూడా పుట్టుకొచ్చారు.ఇంతా చేసి – ఇంతవరకూ అమెరికాలో బయటపడ్డ స్వైన్ ఫ్లూ కేసులు నూట పరక, అందులో ప్రాణాలు తీసిన కేసు ఒకే ఒకటి; అది కూడా ఓ రెండేళ్ల బాలుడు. మెక్సికో వంటి ‘మూడో ప్రపంచ’ దేశంతో పోలిస్తే రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే అమెరికా దేశస్థులు ఈ వైరస్‌ని ఎలా తట్టుకోగలుగుతున్నారో అంతుబట్టని వైద్యులు! విశేషమేమిటంటే, తరచూ వచ్చే సాధారణ ఫ్లూ బారిన పడి అమెరికాలో ఏటా హరీమనేవారి సంఖ్యే ముప్పయ్యారు వేలు. దానితో పోలిస్తే స్వైన్ ఫ్లూ నిజంగానే అంత భయంకరమైనదా, లేక ఇదంతా ఉత్తుత్తి హంగామాయేనా అన్న అనుమానాలు.

స్వైన్ ఫ్లూ మనుషులకి అపాయకరమైనదో లేదో కానీ ప్రపంచమంతా పందులకి మాత్రం ప్రాణాంతకంగా పరిణమించింది. అసలే పందులంటే చీదరించుకునే వాళ్లకి వాటిని మట్టుబెట్టటానికి ఇదో మహదవకాశంగా లభించింది. ప్రజారోగ్యం దైవాధీనం సర్వీసైన మనవంటి దేశాల్లో సర్కార్లు నిబ్బరంగానే ఉన్నా, అధిక దేశాల్లో గంగవెర్రులెత్తిన ప్రభుత్వాలు. ఈజిప్టులోనైతే ఏకంగా దేశంలోని మూడు లక్షల పైచిలుకు పందుల్ని వధించెయ్యమని ప్రభుత్వాజ్ఞలు – ఆ దేశంలో ఒక్క స్వైన్ ఫ్లూ కేసూ బయటపడకుండానే! ప్రపంచమంతా పందులంటే ప్రబలిన ఏహ్యభావం. దొరికిన పందులని దొరికినట్టుగా నరికేయాలనే ఆవేశం. ఏమిటవి చేసిన పాపం? ఈమూగజీవులనాదుకునే నాధులే లేరా?

లేకేం, ఉన్నారు. అపాయంలో ఉన్నవారికి సహాయం ఎటునుండి అందుతుందో కొన్నిసార్లు ఊహకందదు. ఇప్పుడదే జరిగింది. పందుల ప్రాణాలు తీసి సొమ్ము చేసుకునే వర్గమొకటి మీకోసం మేమున్నామంటూ ముందుకొచ్చింది. ప్రపంచంలో పందులంటే ఏహ్యభావం ఎందరిలో ఉన్నా, వాటి మాంసం రుచి మరిగిన వారి సంఖ్యా తక్కువేమీ లేదు. అటువంటివారి జిహ్వ చాపల్యం తీర్చే వ్యాపారుల ఉనికే స్వైన్ ఫ్లూ దరిమిలా ప్రశ్నార్ధకమైన నేపధ్యంలో వారంతా కలిసికట్టుగా కదిలారు. పెట్టుబడిదారీ లాబీ తలచుకుంటే దెబ్బలకు కొదవేముంది? దెబ్బకి – స్వైన్ ఫ్లూ అనేదానికీ పందులకీ ఎటువంటి సంబంధం లేదనే నివేదికలు, ల్యాబ్ రిపోర్టులూ పుట్టుకొచ్చాయి. అసలా వైరస్ పందుల్లో కనిపించదని కూడా తేల్చి చెప్పబడింది. పంది మాంసం తినటం క్షేమమేనని సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థే వివరణ జారీ చేసింది.ఈ కధంతా మొదలైన మెక్సికోలో స్వైన్ ఫ్లూతో మరణించిన వారి అసలు సంఖ్య నూట అరవై కాదనీ, పన్నెండు మాత్రమేననీ సవరణ సైతం విడుదలయింది. ఇంకా భయం పోని పిరికివారి కోసం ఎకాఎకీ స్వైన్ ఫ్లూ అనే పేరునే మార్చి పారేసి H1N1 ఫ్లూ అనే కొత్త పేరు పెట్టేయబడింది. (హెచ్-1 బి వీసాలపై అమెరికా ఆంక్షలు కఠినతరం చేసిన తరుణంలో స్వైన్ ఫ్లూ పేరుని ఈ విధంగా మార్చటం వెనక మరేదన్నా కుట్రకోణముందేమో కాలమే చెప్పాలి).మొత్తానికి, ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తిన పందిద్వేషం ప్రస్తుతానికి ఉపశమించే సూచనలు మొదలయ్యాయి.అండర్‌గ్రౌండ్ బ్రదర్‌హుడ్ నుండి మరో దాడి మొదలయ్యేదాకా వరాహజాతి ఊపిరి పీల్చుకోవచ్చు.

కొసమెరుపు: యాంటీ క్లైమాక్స్ దిశలో కదులుతున్న స్వైన్ ఫ్లూ కధలో కొత్త మలుపు – మెక్సికోలో మనుషుల ద్వారా పందులకి ఈ వ్యాధి సోకుతుందని వినవచ్చిన తాజా వార్త. ఈ కధ మొత్తంలో బాధితులు మనుషులా, పందులా?


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,298

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.