Posts Tagged 'స్లమ్‌డాగ్'

స్లామ్‌డాగ్

మొత్తానికి భారతీయ సినీ ప్రియుల దశాబ్దాల కల నెరవేరింది – స్లమ్‌డాగ్ మిలియనైర్ చిత్రానికి గానూ ఇద్దరు భారతీయులకి మూడు ఆస్కార్ అవార్డుల రూపంలో. ఎనభయ్యో దశకం మొదట్లో ‘గాంధీ’కి గానూ భానూ అత్తయ, తొంభైల మొదట్లో సినీ రంగంలో జీవిత కాల సేవలకి గానూ సత్యజిత్ రే – వీళ్లిద్దరినీ తీసేస్తే నూరేళ్ల ఘన చరిత్ర గల మన సినీ పరిశ్రమలో ఆస్కార్ ప్రతిమని ఒడిసి పట్టిన వాళ్లు మరొక లేరు – నిన్నటి దాకా. ఇరాన్, స్వీడన్ వంటి ఉన్నాయా లేవా అనిపించే సినీ పరిశ్రమలతో పోలిస్తే ఏటా వందలాది సినిమాలు నిర్మించే మన చలన చిత్ర రంగం ఆస్కార్ల విషయంలో ఎంతో వెనకబడుంది.’ఆఁ, బోడి ఆస్కార్ ఎవడిక్కావాలి .. అది రానంత మాత్రాన మన సినిమాల గొప్పదనం తక్కువైనట్లా’, ‘అసలా అవార్డులు మన సినిమాల కోసం కాదు, అవొస్తే ఎంత రాకపోతే ఎంత’ తరహా వ్యాఖ్యానాలు, వెటకారాలు ఎన్నున్నా, ఆస్కార్ అందుకోటంలో ఉన్న మజాయే వేరు. పూర్తిగా మనవాళ్లే తీసిన సినిమాకి ఈ స్థాయిలో గుర్తింపొస్తే మరింత బాగుండేది. ఏది ఏమైనా ఇద్దరు భారతీయుల ప్రతిభకి ప్రపంచవ్యాప్త గుర్తింపు. అందరమూ కాసేపు అభిప్రాయ భేదాలు అవతల పెట్టి ‘జై హో’ అంటే పోయేదేమీ లేదు.

ఇంత ఘనత సాధించిన ఈ సినిమా గురించీ, దాని వెనకున్న వివాదాల గురించీ కొత్తగా ఎవరికీ చెప్పక్కర్లేదు. అయితే చాలామందికి తెలియని విషయం – విడుదల కోసం ఈ సినిమా పడ్డ పురిటి నొప్పులు. నిర్మాణానికి పెట్టుబడి పెట్టిన ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ వారి ‘వార్నర్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్’ విభాగం సినిమా పూర్తయే నాటికి మూతబడటంతో, ధియేటర్లకి పంపిణీ చేసేవారు కరువై స్లమ్‌డాగ్ మిలియనైర్ ఎకాఎకీ డివిడి రూపంలో విడుదలవటానికి సిద్ధమైపోయింది. చివరి నిమిషంలో మరో ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ట్వెంటీయెత్ సించరీ ఫాక్స్ వారి ‘ఫాక్స్ సెర్చ్ లైట్’ విభాగం ఆదుకోవటంతో బ్రతుకు జీవుడా అంటూ బయట పడి విడుదలయింది. అదే జరగక పోతే ఈ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇందరి నోళ్లలో నానేదీ కాదు, ఆస్కార్లు కొల్లగొట్టేదీ కాదు (మెయిన్ స్ట్రీమ్ విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లు పొందటానికి అమెరికాలో ధియేటర్లలో తప్పకుండా విడుదలవాలనే నియమముంది)

ఇక, రెండు ఆస్కార్లతో అందరినీ మురిపించిన అల్లా రఖా రహమాన్‌కి ఆ రెండో ప్రతిమ దక్కటం వెనక కొద్దిపాటి అదృష్టముంది. అవార్డు సాధించిన ‘జై హో’ పాటని అనుకోకుండా ఆఖరి నిమిషంలో సినిమాలో చేర్చటం ఒక రకమైన అదృష్టమైతే (ఎంత హడావిడిగా చేర్చారంటే, ఆ పాటకి నృత్య రీతులు సమకూర్చిన లాంగినెస్ పేరు ఎండ్ క్రెడిట్స్‌లో చేర్చటం కూడా మర్చిపోయారు. ఆస్కార్ వేదికపై ఆ పొరపాటుకి క్షమాపణలు చెప్పటం ద్వారా దర్శకుడు డానీ బోయెల్ ఆ తప్పు దిద్దుకున్నాడు), అసలా పాట సుభాష్ ఘాయ్ ‘యువరాజ్’ సినిమా కోసం రికార్డు చేసినా, ఘాయ్ తన సినిమాలో ఆ పాట వద్దనుకోవటం, దాన్ని ఈ సినిమాలో వాడుకునేందుకు అనుమతివ్వటం మరో రకమైన అదృష్టం. మొత్తమ్మీద – ప్రతిభ ఒక్కటే సరిపోదు, ఎన్నో విషయాలు కలిసి రావాలి అనేదానికి ఇదో మంచి ఉదాహరణ (‘జై హో’ లేకపోయినా ‘ఓ సాయా’ కి అతనికే అవార్డొచ్చుండేది బహుశా). ఒకసారి నామినేషన్లంటూ వచ్చాక – ఆ రెండు విభాగాల్లోనూ తానే విజేతనని రహమాన్ ఎనలేని ధీమాతో ఉన్నాడనుకుంటాను. అవార్డులందుకున్న క్షణంలో ఇతరుల మాదిరిగా ఉద్విగ్నతకి లోనవకపోవటం, తొణక్కుండా మాట్లాడటం ఆ విషయాన్ని స్పష్టం చేసింది.

అవార్డు తధ్యం అనుకున్న కొన్ని విభాగాల్లోనే కాక, సినిమాటోగ్రఫీ వంటి ఊహించని విభాగాల్లోనూ ఈ సినిమా అవార్డు సాధించి సినీ పండితులని విస్మయానికి గురి చేసింది. మొత్తమ్మీద నామినేషన్లు పొందిన తొమ్మిది విభాగాల్లో ఒకే ఒకటి (సౌండ్ ఎడిటింగ్) చేజార్చుకుని తక్కిన ఎనిమిది విభాగాల్లోనూ పోటీదార్లను తోసి రాజని గతంలో ఇలా ఎనిమిది అవార్డులు కొల్లగొట్టిన ‘గాంధీ’, ‘గాన్ విత్ ది విండ్’, ‘మై ఫెయిర్ లేడీ’, ‘ఆన్ ది వాటర్ ఫ్రంట్’, ‘కాబరే’ (Cabaret), ‘అమడేయస్’ (Amadaus) వంటి కళాఖండాల సరసన సగర్వంగా చేరింది. ఎనభై ఒక్క సంవత్సరాల అకాడెమీ అవార్డుల చరిత్రలో ఇంతకన్నా ఎక్కువ అవార్డులు పొందిన చిత్రాలు మరో ఏడు మాత్రమే ఉన్నాయి. అవి – తొమ్మిది అవార్దులతో ‘జీజీ’ (Gigi), ‘ది లాస్ట్ ఎంపరర్’, ‘ది ఇంగ్లిష్ పేషెంట్’; పది అవార్డులతో ‘వెస్ట్ సైడ్ స్టోరీ’; పదకొండు అవార్డులతో అగ్ర పీఠాన ‘బెన్-హర్’, ‘టైటానిక్’, ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్: రిటర్న్ ఆఫ్ ది కింగ్’.

చివరగా – ఆ మధ్య ‘కౌముది’లో గొల్లపూడి మారుతీరావు గారు ఈ సినిమాలో బుల్లి జమాలుడు ఒకానొక గుంటలోకి దూకే దృశ్యాన్ని గురించి ఎవరో చెప్పగా విని చీదరించుకుని ఈ సినిమా చూడనే చూడనని ఒట్టేసుకున్నానని రాశారు. ఒకవేళ ఆయన గనక ఒట్టు తీసి గట్టు మీద పెట్టాలనుకుని, అందుకు అనువైన సాకుల కోసం వెతుకుతుంటే నే రాసే తదుపరి వాక్యం ఉపయోగ పడొచ్చు. ఆ గుంటడు దూకిన గుంటలోని ఫలానా రొచ్చు పీనట్ బటర్ మరియు చాకొలెట్ మిశ్రమంతో తయారు చేయబడినది. అందువల్ల – అందులోకి దూకటానికి బాల జమాల పాత్రధారి ఏ మాత్రం మొహమాట పడి ఉండడనిన్నీ, దర్శకుడు టేకుల మీద టేకులు తీసినా ఆనందంగానే దూకి ఉండేవాడనిన్నీ, ఈ విషయం తెలీకనే గొల్లపూడి వారు ఈ సినిమాపై అలిగారనిన్నీ నేను గంట గణగణ బజాయించి మరీ చెప్పగలను.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,298

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.