Posts Tagged 'ష్రెక్'

డబల్ పోజ్

ఫలానా సినిమాలో ఎన్టీవోడో కిట్టిగాడో డబల్ పోజ్ పెట్టాడని చాలా చిన్నప్పుడు వినేవాడ్ని. అప్పట్లో అదేంటో అర్ధమయ్యేది కాదు కానీ కొంత ఊహ తెలిశాక తెలిసిందేంటంటే, ఆ సినిమాలో ఎన్టీవోడో కిట్టిగాడో రెండు వేషాలేశాడని. సాధారణంగా ఇవి కవల సోదరుల పాత్రలయ్యుండేవి. అంతకన్నా సాధారణంగా వాళ్లు చిన్నప్పుడెప్పుడో విడిపోయి తలా ఒక చోట పెరిగి ఒకరికొకరు పూర్తి విరుద్ధంగా తయారైనోళ్లయ్యుంటారు – ఒకడు పోలీస్ అయితే రెండోవాడు దొంగ, ఒకడు అమాయకుడైతే రెండోవాడు ఘటికుడు .. ఇలాగన్న మాట. కథలో కాన్‌ఫ్లిక్ట్ చొప్పించటానికి రచయితలు పడే తిప్పలివన్నీ. ఒకే రూపంలో ఉన్న ఇద్దరు తప్పనిసరిగా కవలలే అయ్యుండాలనే నియమం ఎవరు పెట్టారో కానీ, దానికి భిన్నంగా ఉండే తెలుగు సినిమాలు వేళ్ల మీద లెక్కించదగ్గన్ని మాత్రమే ఉంటాయి (నాకు గుర్తున్నవి యుగంధర్, పోలీస్-లాకప్, విక్రమార్కుడు మాత్రమే). మొత్తమ్మీద, ఎన్టీవోడో కిట్టిగాడో డబల్ పోజ్ పెట్టాడంటే ఆ రెండు పోజులూ పుట్టగానే విడిపోయిన కవల సోదరులని ప్రేక్షకులు ముందే ఫిక్సైపోయి మరీ ఆ ఫలానా సినిమాకెళ్లేవాళ్లు.

అయితే – కవలలైనంత మాత్రాన ఒకరికొకరు జెరాక్స్ కాపీల్లాగుండాలా? అందరూ ఐడెంటికల్ ట్విన్స్ కానవసరం లేదు కదా. భిన్నంగా కనపడే కవలల పాత్రలతో ఏ తెలుగు సినిమా కూడా వచ్చిన గుర్తు లేదు. అచ్చు గుద్దినట్లు ఒకటే పోలికలుండే రెండు (లేదా మూడు) పాత్రల వల్ల కలిగే ఆసక్తి అన్ఐడింటికల్ ట్విన్స్ వల్ల కలగదని సినీ రచయితల నమ్మకం కాబోలు. సరే, ఆ సంగతొదిలేద్దాం. ముందు ప్రశ్నకి కాన్వర్స్ అడుగుదాం: పోలికలు కలిసినంత మాత్రాన కవలలే అయ్యుండాలా?

పై ప్రశ్నకి సమాధానం ‘లేదు’. దానికి సినీ తారల్లోంచే కావలసినన్ని ఉదాహరణలు చెప్పొచ్చు. అప్పట్లో హాస్య నటుడు చలం ‘ఆంధ్రా దిలీప్’గా ప్రసిద్ధుడని అందరికీ తెలిసిందే. వాళ్లిద్దరూ విధి విడదీసిన కవలలైతే కాదు. అలాగే హేమమాలినిని పోలినామె ఒకామె పద్మా హేమమాలిని అనే పేరుతో డెబ్భైల ఆఖరినాళ్లలో నాలుగైదు తెలుగు సినిమాల్లో నటించి కనుమరుగైపోయింది. తాళ్లూరి రామేశ్వరి జయబాధురిని పోలి ఉండేది. టీవీ భీష్ముడు ముకేష్ ఖన్నా తొలినాళ్లలో – కాస్త సన్నగా ఉన్నప్పుడు – అమితాబ్ బచ్చన్‌లా ఉండేవాడు (‘కూలీ’ సినిమాలో అమితాబ్‌కి డూప్ గా కూడా నటించాడతను). తమిళ నటుడు ప్రశాంత్ అదాటున చూస్తే మాజీ క్రికెటర్ అజయ్ జడేజాలా అనిపిస్తాడు. ఈ మధ్య బాణం సినిమాలో నటించిన వేదిక అనే అమ్మాయి నగ్మా పోలికలతో ఉంటుంది. ఇప్పుడు లేవు కానీ, తొలినాళ్లలో ఛార్మిలో సౌందర్య పోలికలు తొంగిచూసేవి.  దివ్యభారతికి, టాబుకి శ్రీదేవి పోలికలు; రంభకి దివ్యభారతి పోలికలున్నాయని వాదించేవాళ్లు కొందరున్నారు (లా ఆఫ్ అసోసియేషన్ ప్రకారం రంభకి శ్రీదేవి పోలికలు ఉన్నాయన్నోళ్లు మాత్రం ఒక్కరూ లేరు). స్నేహా ఉల్లాల్ అనే చిన్నదానిలో ఐశ్వర్యా రాయ్‌ని చూసుకుని సల్మాన్ ఖాన్‌తో సహా అనేకులు మురిసిపోతారు. సి.నారాయణరెడ్డిని పోలిన హేమసుందర్ అనే నటుడు అనేకానేక తెలుగు సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు ధరించాడు, ఇప్పటికీ అడపాదడపా ధరిస్తున్నాడు. పదకొండేళ్ల కిందట ఒకట్రెండు తెలుగు సినిమాల్లో తళుక్కున మెరిసి మాయమై తిరిగి ఇప్పుడు మరో రెండు మూడు తెలుగు సినిమాల్లో ప్రత్యక్షమైన పూనమ్ సింగార్ పేరుగల నటి – ఇప్పుడు లావెక్కబట్టి అంతగా అనిపించటంలేదు కానీ – మొదటి ఇన్నింగ్స్‌లో సుస్మితా సేన్ నకల్లా కనిపించేది. సుభాష్ ఘయ్ ‘సౌదాగర్’తో పరిచయమైన వివేక్ ముష్రాన్ యువ దేవానంద్‌ని తలపించేవాడు. ‘వాట్స్ యువర్ రాశి’లో నటించిన హర్మన్ బవేజాలో హృతిక్ రోషన్ పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. సల్మాన్ ఖాన్ చిన్న తమ్ముడు అర్బాజ్ ఖాన్‌లో టెన్నిస్ వీరుడు రోజర్ ఫెదరర్ పోలికలుంటాయి. హాలీవుడ్ దర్శక దిగ్గజం క్వెంటిన్ టరంటినో కూడా  ఫెదరర్ రూపుతో ఉండటం విశేషం. రాసుకుంటూ పోతే ఈ జాబితా ఇలా సాగుతూనే ఉంటుంది.

ఈ పోలికలు మనుషులతోనే ఆగలేదు. కొన్ని సంస్థల వ్యాపార చిహ్నాలు కూడా అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉండటం గమనించొచ్చు. రామోజీ గారి మయూరి సంస్థ లోగో ప్రఖ్యాత అమెరికన్ మీడియా సంస్థ ఎన్‌బిసి లోగోని పోలి ఉంటుంది. సన్ మైక్రో సిస్టమ్స్ లోగో కొలంబియా స్పోర్ట్స్‌వేర్ కంపెనీ లోగోలా ఉంటుంది. భారత జాతీయ జెండా నిలబెట్టిన ఇటాలియన్ జాతీయ పతాకాన్ని పోలి ఉంటుంది (ఇటాలియన్ జెండా పడుకోబెట్టిన భారత జెండాలా ఉందనీ అనుకోవచ్చు). మెక్సికన్ జెండాదీ అదే తీరు. వాటిలో ఏవి ముందు, ఏవి తర్వాత వచ్చాయనే వివరాల్లోకెళ్లొద్దు కానీ, ఆయా జెండాలు/లోగోలు తయారు చేసిన వాళ్లు అప్పటికే ఉన్నవాటిని చూసి ప్రేరణ పొంది ఉంటారనుకోవచ్చు.

చివరగా మన రోశయ్యామాత్యుల వారి గురించీ చెప్పుకుని ఈ టపాని ముగిద్దాం. రోశయ్య గారిని చూస్తే మీకేమనిపిస్తుందో కానీ, నాకు మాత్రం ష్రెక్ గుర్తొస్తాడు. అదే గుండ్రటి ముఖం, అదే నున్నటి గుండు, పెద్ద ముక్కు, గుబురు కనుబొమలు, నవ్వితే ఇద్దరికీ బుగ్గలపై ఒకే రకం సొట్టలు. తేడా అల్లా చెవుల దగ్గర మాత్రమే. ఇంకా అనుమానంగా ఉంటే కింది బొమ్మ చూడండి, నాతో ఏకీభవించి తీరతారు.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 302,465

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.