Posts Tagged 'శ్రీరంగనీతులు'

భారతీయం

నాకో స్నేహితుడున్నాడు. అంటే – ఉన్నదే ఒకడు కాదు; ఉన్నోళ్లలో ఒకడు. బాగా ఉన్నోడే. అంతున్నా, ఇంకా కావాలనే యావున్నోడు. వాడికో బ్రహ్మాండమైన జీతమిచ్చే ఉద్యోగముంది. ఉద్యోగంలో పరిచయాలను తన తతిమ్మా వ్యాపారాలకు వాడుకునే నేర్పూ ఉంది. అసలు వాడు ఉద్యోగం చెయ్యటం ఆ పరిచయాలకోసమే తప్ప, వాడికొచ్చే జీతం ఇతర సంపాదన ముందు పల్లీపప్పులు. నాకు వీడిలో అన్నీ నచ్చుతాయి – ఒకటి తప్ప. భారతీయత అంటే ప్రాణం వీడికి. మంచిదే కదా, అదా నచ్చనిది? కాదు. మరి? సదరు భారతీయతకి వాడి స్వీయ డెఫినిషనుందే, నా సమస్య దానితో. మన సంస్కృతి ప్రస్తావనొచ్చినప్పుడల్లా ‘పాశ్చాత్యులు పేద్ద మెటీరియలిస్టులు’ అంటూ ముక్తాయించిగానీ శాంతించడీ మితృడు. నా ఎరికలో వీడికన్నా పెద్ద మెటీరియలిస్టుల్లేరు. ఆ మాటే అంటే తొణక్కుండా ‘భారతీయులు ప్రపంచానికి ఆధ్యాత్మికతని ఎగుమతి చేస్తే, ప్రపంచం మనకి మెటీరియలిజాన్ని ఎగుమతి చేసింది’ అనేస్తాడు. తస్సదియ్యా, తప్పంతా మిగతా ప్రపంచానిదేనన్నమాట. వాళ్లు కోరుకుంది వాళ్లూ, మనం కోరుకుంది మనమూ దిగుమతి చేసుకుంటున్నామన్న పెడార్ధాలు తీస్తే మాడు పగులుద్ది – జాగ్రత్త.

ఆ మధ్యనో తెలుగు సాహితీ సదస్సులో ఓ నడివయస్కుడు – తెల్లటి ధోవతీ, కండువాలో హుందాగా విచ్చేసిన పెద్దాయన – వేదికెక్కి ‘ఆంధ్రదేశంలో మిణుకు మిణుకుమంటున్న తెలుగు వెలుగుల్ని మళ్లీ మెరిపించటమెలా’ అనే అంశమ్మీద అరగంటసేపు ఆంగ్లంలో అనర్ఘళంగా ఉపన్యాసం దంచిపారేశాడు. పన్లో పనిగా తెలుగువారి ఆహార్యమ్మీదా, కనుమరుగైపోతున్న పంచెకట్టుమీదా నాలుగు చెణుకులు కూడా విసిరాడు. ధోవతీ తొడుక్కోవటమే తెలుగుదనమనేది ఆయన నిశ్చితాభిప్రాయం – మాట్లాడే భాషతో పని లేకుండా!

తెలుగుదనానికి పై కండువా పెద్దమనిషి ఇచ్చుకున్న స్వీయార్ధమంత సొంపైనదే ఇంచుమించు భారతీయతకి నా యాంటీ-మెటీరియలిస్టు స్నేహితుడిచ్చుకున్నదీనూ. ఈ బాపతు వాళ్లు మరీ అరుదేమీ కాదు. అంటే, భారతీయత అనే మాటకి ఎవరికి తోచిన అర్ధాలు వాళ్లు చెప్పేసుకుని ‘నేను మాత్రమే నిఖార్సైన భారతీయుణ్ని, తక్కినోళ్లంతా చవటాయలు’ అనుకునేవాళ్లన్నమాట. మావాడి సంగతే చూస్తే – వాడి దృష్టిలో వాడు, కొడిగడుతున్న భారతీయ సంస్కృతీ సంప్రదాయ జ్యోతులకు అరచేతులడ్డుపెట్టి ఓ కాపుకాయటానికై అరుదెంచిన అవతార పురుషుడు. ‘జాతీయతా వాది’ అనేది వాడికి వాడేసుకున్న వీరతాడు.

వీడి దృష్టిలో భారతీయత అంటే ఏమిటో చూద్దాం. భారతీయులనబడేవాళ్లు విధిగా హిందువులై ఉండాలనేది మొదటి నియమం. దేశంలోని ఇతర మతస్థులందర్నీ కట్టగట్టి హిందూ మహాసముద్రంలో విసిరేయాలని ఇతని అభిప్రాయం; ముఖ్యంగా ముస్లిముల్ని. హిందూ మహాసముద్రంలో హిందూయేతరుల్ని విసరొచ్చా అనేది వెర్రి ప్రశ్న. పాకిస్తానుని ద్వేషించటం భారతీయుల ప్రధమ కర్తవ్యమనేది ద్వితీయ భారతీయతా నియమం. ‘మేడిన్ పాకిస్తాన్’ లేదా ‘మేడిన్ బాంగ్లాదేశ్’ అనున్న ఉత్పత్తులు – ముఖ్యంగా దుస్తులు – వీడు కొననే కొనడు. ఆ రకంగా వాళ్లకొచ్చే డబ్బు మనదేశంలో తీవ్రవాద కార్యకలాపాలకి వాడతారని గురువుగారి నమ్మకం. ఆ మాత్రం దేశభక్తుండాల్సిందే. ఐతే మనోడు కన్వర్షన్లో రెండ్రూపాయలెక్కువొస్తాయని ఎప్పుడూ హవాలా దారుల్లో మాత్రమే హమారా భారత్‌కి డబ్బు పంపుతాడు. ఆ డాలర్లూ, పౌండ్లూ ఎక్కడికెళ్తాయో తెలీని అమాయకుడులెండి. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడైనందుకు వాడు తెగ బాధపడిపోయాడు. ఆయన సగం నల్లోడవటం ఒక కారణం కాగా, ఆయన్లో ముస్లిం మూలాలుండటం అసలు కారణం. ఇంతా చేసి – మావాడికి ప్రతి శుక్రవారమూ డిన్నర్‌కి దగ్గర్లో ఉన్న ఫలానా పాకిస్తానీ రెస్టారెంటుకెళ్లి ఆవురావురుమంటూ గొఱ్ఱె బిరియానీ పొట్లమొకటి లాగించకపోతే నిద్ర పట్టదు. దేశభక్తి దేశభక్తే, బిరియానీ బిరియానీయే – దేన్దోవ దాన్దే.

సరే, దేశభక్తి అనే మాటొచ్చింది కదా. ఆ విషయంలోనూ మావాడికి కొన్ని స్థిరాభిప్రాయాలున్నాయి. మొదటిది, ముఖ్యమైనది: పురాణములను గౌరవించవలెను. వాటిగురించి పిచ్చి పిచ్చి ప్రశ్నలేయరాదు. మంచిదే కదా. ఇందులో తప్పేముంది? పాపం వ్యాసుడూ వాల్మీకీ ఇప్పుడు లేరు కదా అన్జెప్పి వాళ్ల గ్రంధాలని ఇష్టమొచ్చినట్లు ఏకిపారేయటం న్యాయమా? ‘వాళ్లేదో వాళ్ల కాలానికి తగ్గట్లు కధలో కాకరగాయలో రాసుకుంటే వాటిని ఇప్పటి సామాజిక దృష్టితో చూసి పురాణ పురుషుల వ్యక్తిత్వాలకి వంకలు పెట్టటం తప్పు’ అనేది మావాడి స్థిరాభిప్రాయం. పురాణాలనుండి మంచినే గ్రహించాలి కానీ విమర్శనాత్మక దృష్టితో చూడకూడదనేది వాడి నమ్మకం. మన్లోమాట – వాడే చెప్పినట్లు అవి ఏ కాలానికో సంబంధించిన కధలు, ఇప్పటి పరిస్థితులకి పనికొచ్చేవి కాకపోతే ఇక అందులోనుండి నేర్చుకునేదేముంది? అయినా అలాంటి ప్రశ్నలడగటం దేశద్రోహం కాబట్టి మనం అడగరాదు. ‘మానవ నాగరికత మొదలయింది ప్రశ్నతోనే కానీ పనిముట్లతో కాదు’ లాంటి పిచ్చి ప్రేలాపనలు వాడిదగ్గర చేయరాదు.

దేశభక్తికి సంబంధించిన ఇతర నియమాలు: ఎల్లవేళలా భరతమాతని ప్రస్తుతించాలేగానీ పొరపాటున కూడా ఇక్కడి చెడు గురించి మాట్లాడకూడదు. వేలాది ఏళ్ల క్రితం భరతఖండం ఎలా విరాజిల్లిందో డప్పులు కొట్టుకుంటూ బ్రతకాలే కానీ వర్తమానం గురించి బాధపడటం, భవిష్యత్ గురించి బెంగటిల్లటం అవివేకం. దేశంలో చెడంటూ ఏదన్నా ఉంటే గింటే అదంతా రెండొందలేళ్ల బ్రిటిష్ వలస పాలన చలవేనని గ్రహించాలి. అప్పటికీ, ఇప్పటికీ ప్రతిదాని వెనుకా మనల్ని తొక్కేసే కుట్రలే. మనం వెనకబడిపోయాం అని బాధపడకుండా అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష అని ఇతర భారతీయ మితృలకి చాటింపేయాలి (విదేశీయులకి, ముఖ్యంగా పాశ్చాత్యులకి, వేయనవసరం లేదు – వేదాలు కాజేసి వాటి గుట్టు వాళ్లే విప్పారు కాబట్టి). అన్నట్లు – పాశ్చాత్యుల మాటొచ్చింది గనుక – ఆర్యుల దండయాత్ర అనీ, మరోటనీ వాళ్లు తిక్క తిక్క ప్రచారాలు చేస్తుంటారు. అలాంటివన్నీ మనం నమ్మకూడదు. వాటిలో మనకి నచ్చినవి మాత్రమే నమ్మాలి. ఉదాహరణకి, రామేశ్వరం దగ్గరి ఆడమ్స్ బ్రిడ్జి రాముడే కట్టాడని నాసావాళ్లు చెప్పినట్లు వార్తలో, వదంతులో వస్తే చచ్చినట్లు నమ్మాలి, మరో పదిమందికి చెప్పి నమ్మించాలి. ‘మేమా మాటెప్పుడూ అన్లేదు బాబో’ అంటూ నాసా ఇచ్చిన వివరణ నమ్మకూడదు.

ఇంగ్లాండులో స్థిరపడిన నా ఈ స్నేహితుడి దగ్గర ఇటువంటి భారతీయతా చిట్కాలు, జాతీయతా సూత్రాలు మరిన్ని తెలుసుకోవాలనే కుతూహలమున్నవారు అడిగితే అతనితో పరిచయభాగ్యం కల్పించగలను. అయితే మీరు తన వ్యాపారానికి ఉపయోగపడగలరు అనుకుంటే మాత్రమే అతను మీతో పరిచయానికి ఆసక్తి చూపిస్తాడు. ఒకవేళ మీరు మెటీరియలిస్టులైతే ఆ విషయం అతనిదగ్గర బయటపడకుండా జాగ్రత్తపడగలరు. చిత్తగించవలెను.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,298

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.