Posts Tagged 'వైఎస్'

ఆత్రగాడు

‘ఎప్పటికైనా నేనే సిఎమ్. ముఖ్యమంత్రి కాకుండా నన్నెవ్వరూ ఆపలేరు’. ఇది మొన్న జగన్మోహనుల వారు కడప జిల్లాలో (కొత్త పేర్లెన్నొచ్చినా నాకు మాత్రం అది కడప జిల్లానే) వందిమాగధుల సమక్షంలో ప్రకటించిన తన మనోభీష్టం. అతని అంతరంగంలో అది కాక వేరేదేదో ఉంటుందని రాష్ట్ర ప్రజానీకం ఎటూ అనుకోలేదు కాబట్టి ఈ ప్రకటన విస్తుగొలిపేదేమీ కాదు. ఆ మాటకొస్తే చంద్రబాబుకీ చిరంజీవికీ సైతం మనసులో మాట అదే కదా. ఐనప్పటికీ, ‘ఈ సారి మా పార్టీదే అధికారం’ అని గంభీరంగా ప్రకటనలివ్వటం తప్ప తమ అసలు కోరిక వాళ్లెప్పుడన్నా ఇలా బట్టబయలు చేశారా? జగన్‌ది ముంత దాచే బదులు కుండ బద్దలు కొట్టయినా కుంభస్థలం పగలగొట్టాలనే స్వభావం కాబోలు. కానీ ఇలా మనసులో ఉన్నవన్నీ బయటేసేస్తే రాజకీయాల్లో ఎదగటం సాధ్యమేనా?

రెండు నెలలుగా జగన్ వెళ్లగక్కుతున్న ఆక్రోశం ఆటబొమ్మని లాక్కున్న సావాసగాడిపై చిన్నపిల్లాడు చూపించే ఉక్రోషాన్ని తలపిస్తుంది. అతనితో సహా మనమంతా ఆంధ్రప్రదేశ్‌లో కాక ఏదో నలుపు-తెలుపు జానపద చిత్రంలోనో, ఏ చందమామ కథలోనో ఉన్నామన్న భ్రమలో జగన్ ఉన్నట్లున్నాడు. నీతిమంతుడైన మహారాజు అకాల మరణం పొందితే గోతికాడ నక్కలా పొంచి ఉన్న దుష్ట సేనాని రాజుగారి ఏకైక కుమారుడిని కాకులు దూరని కారడవులకి పారదోలి సింహాసనం చేజిక్కించుకున్నప్పుడు – ఆ దెబ్బ తిన్న రాకుమారుడు చేసే శపథాన్ని పోలి లేదూ జగన్మోహనుడి పొలి కేక? ఇప్పుడవునో కాదో కానీ ఒకప్పుడు బాలకృష్ణకి వీరాభిమాని కదా, ఆయన ఫ్యాక్షన్ సినిమాలు ఒకటికి పదిసార్లు చూసి తనున్నదీ ఓ ఫ్యాక్షన్ కథలోనేనన్న భ్రాంతిలోకి జారుకున్నాడేమో. లేకపోతే ఈ తొడగొట్టటాలు, సెకండాఫ్‌లో వచ్చి భరతం పడతానంటూ మంగమ్మ శపథాలూ ఏమిటి!

అయితే అదృష్టవశాత్తూ మనం ఆంధ్రప్రదేశ్ వాసులమే కానీ ఏ కథలోనూ పాత్రలం కాము. జగన్ తండ్రి నీతిమంతుడైన మహరాజూ కాదు, రోశయ్యామాత్యుడు దుష్ట సేనానీ కాడు. అంతకు మించి – రాష్ట్రం వారెవ్వరి గుత్తసొత్తూ, వారసత్వ సంపదా కాదు. అలా అని జగన్ అనుకుంటే అది అతని అమాయకత్వం. వైఎస్ గతించిన వారంలోపే జరిగిన టెక్కలి ఉప ఎన్నికలో సానుభూతి ప్రభంజనమేమీ వీచలేదన్న సత్యాన్ని గ్రహించకుండా, తండ్రి ఇమేజ్‌పై లేనిపోని అపోహలతో రెచ్చిపోయి వీరంగం వేసి తన రాజకీయ భవితకి ఇప్పటికే చేసుకోగలిగినంత చేటు చేసుకున్నా రాజకీయవేత్తగా తన తాహతేమిటో జగన్‌కి ఇంకా అర్ధమయినట్లు లేదు. కాబట్టే ఒకదాని వెంబడి ఒకటిగా ఈ తప్పటడుగులు. మొన్నటి శపథం తనకి చేసే మేలేమిటో అతనికే ఎరుక. జగన్ పై అధిష్టానానికి ఇప్పటికే ఓ అంచనా వచ్చేసిన నేపధ్యంలో ఈ వాచాలత సాధించేదేమన్నా ఉంటే అది అతని బాటలో మరిన్ని ముళ్లు పరవటమే. బోనస్‌గా, ఇలా బయటపడి మాట్లాడటం వల్ల ప్రజల్లో అతని పదవీకాంక్షపై అనుమానాలు మొదలవటం; ఆల్రెడీ అనుమానాలున్నవారికి నమ్మకాలు బలపడటం. అతనికది ఏ రకంగానూ మేలు చేసే పరిణామం కాదు. పార్టీలకి అతీతంగా రాహుల్ గాంధీని ఎక్కువమంది ప్రజలు ఇష్టపడటానికి ప్రధాని పదవిపై అతను మోజు లేనట్లు కనిపించటమూ ఒక కారణం. ఉదాహరణలు చూసీ నేర్చుకోలేకపోవటం జగన్ అమాయకత్వం కాదు, అవివేకం.

‘ప్రజలు కోరుకుంటున్నారు’ అనేది కూడా మొన్న జగన్ అన్నమాట. ప్రజలంతా తనవెనకే ఉన్నారని అతనంటే నమ్మేసే వెంగళప్పలు మరీ ఎక్కువ మంది లేరు. మన ఇక్ష్వాకులనాటి ఎన్నికల పద్ధతి దయవల్ల, రాష్ట్రంలో కాంగ్రెస్సయినా, తెదేపా అయినా అధికారంలోకొచ్చేది సగం కన్నా తక్కువ వోటర్ల మద్దతుతోనే. అలా అధికారంలోకొచ్చిన ప్రభుత్వాలూ, ముఖ్యమంత్రులూ చేసే పనులన్నిటికీ ప్రజామోదం ఉందని చెప్పుకోవటం స్వోత్కర్షే తప్ప మరోటి కాదు. వైఎస్ ఐదేళ్లపాటు చెలరేగిపోయింది అధికారబలంతోనూ, అధిష్టానం అనుగ్రహంతోనే తప్ప ప్రజాబలంతో కాదు. ఇప్పుడదే అధికారమూ, అనుగ్రహమూ అండగా ఉండగా రోశయ్యని తానేమీ చెయ్యలేనని జగన్ గ్రహించలేకపోవటం వింత. జగన్ చర్యల్నీ, చేష్టల్నీ రోశయ్య వంటి ఘటికుడు ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు. నోరెత్తి మాట్లాడకున్నా తను చెయ్యాలనుకున్నవి చేసేస్తాడు. ఇప్పటికే రోశయ్య ఆ పనిలో ఉన్నట్లు రెండు మూడు వారాలుగా జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. తాజాగా రేగుతున్న గాలి దుమారం వెనక స్వపక్షంలో జగన్ వ్యతిరేకుల హస్తం లేదనుకోగలమా?

తల్లిదండ్రుల పరపతిపై ఆధారపడకుండా కష్టపడి స్వశక్తితో పైకిరావటానికి ఇష్టపడే యువతరం అద్భుతాలు సాధిస్తున్న కాలమిది. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకోవాలనుకుంటున్న జగన్ రేపు ముఖ్యమంత్రయినా రాష్ట్రాన్ని ఉద్ధరించేదేమిటి? ఈ రకంగా కాయలమ్ముకోవటం రాష్ట్రంలో కొత్తేమీ కాదు. అయితే తండ్రి పోగా ఖాళీ అయిన ముఖ్యమంత్రి పీఠమ్మీద కొడుక్కే హక్కున్నట్లు వితండవాదన చెయ్యటం మాత్రం కొత్తే. అసలు – లేచిందే లేడికి పరుగన్నట్లు, రాజకీయాల్లోకొచ్చి ఆర్నెల్లయిందో లేదో అప్పుడే ఎకాఎకీ ముఖ్యమంత్రై పోవాలనే ఆత్రం అతనికెందుకు? ఉట్టికెగరగలడని రుజువవ్వక ముందే ఆకాశానికెగరాలనే తొందరెందుకు? సమాధానం అందరికీ తెలిసిందే. తండ్రి జమానాలో తమ కుటుంబమూ తమ భజన బృందమూ యధేచ్చగా సాగించిన దోపిడీ ఇకముందూ కొనసాగాలన్నా, అంతకన్నా ముఖ్యంగా ఆ అక్రమాల చిట్టా చీకట్లోనే చిరకాలం మిగిలిపోవాలన్నా తనకి అధికారం దఖలు పడటమే ఏకైక మార్గం. పైకెన్ని కబుర్లు వల్లె వేసినా, ‘మా నాన్న ఆశయ సాధన కోసం నేను ముఖ్యమంత్రిని కావటం అవశ్యం’ అన్న మాటకి అసలర్ధం వైఎస్ సగంలో వదిలి పోయిన స్వకార్యాలు పూర్తిగా చక్కబెట్టుకోవటం. సరే – ఆశయం ఏదైనా దాన్ని సాధించటానికి పట్టు విడుపులుండాలి, ఓపికుండాలి. కుందేలై గెంతువారు కుదేలయే తీరుతారని సినీకవి ఉవాచ. తండ్రిలా ఆవేశంతోనే అన్నీ సాధించొచ్చనుకుంటే అతనికి ఇక ఎవరూ చెప్పగలిగేదేమీ లేదు. ఆ ఆవేశమే తండ్రిని పాతికేళ్లు పదవీభాగ్యానికి దూరం చేసిందని జగన్ గుర్తెరగటం మంచిది. లేకపోతే – చరిత్ర చర్విత చర్వణమే.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 302,465

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.