Posts Tagged 'వైఎస్సార్'

కాకి లెక్కలు

మూడ్నాలుగు నెలల్లో ఎన్నికలనగానే రాష్ట్రంలో చిటికెల పందిళ్లేసేవాళ్లూ, చిలక జోస్యగాళ్లూ ఎక్కువైపోయారు. రాజకీయులంతా – వచ్చే ఎలచ్చన్లలో ఏ పార్టీకెన్ని స్థానాలొస్తాయనేదాని గురించి ఎవరి లెక్కలు వాళ్లేసుకుంటూ, అప్పుడప్పుడూ వాటిని మన చెవినా వేస్తూ బోలెడు సందడి చేస్తున్నారు. ఎవరికీ రెండొందల స్థానాలకి తగ్గవట. ఎవరికి వారు ‘ఎదుటోడి నంబర్రాంగు, నాదే కరెష్టు’ అని యమ ధీమాగా చెప్పేస్తున్నారు. ఎవరి ధీమా వారిది.

ఈ విషయంలో ముఖ్యమంత్రిగారు అందరికన్నా ముందున్నారు. ‘వచ్చే సారి మా సంఖ్య రెండొందలకి తగ్గదు’ అని ఆయనెప్పుడో ఆర్నెల్ల క్రితమే ప్రకటించేశారు. వీరి హయాంలో రాష్ట్రంలో పొలాల, స్థలాల రిజిస్ట్రేషన్ ధర ఆర్నెల్లకోసారి పెంచి పారేస్తున్నారు. ఆ స్ఫూర్తితోనో ఏమో, వచ్చే ఎన్నికల్లో తమకొచ్చే స్థానాలను కూడా ము.మ.గారు మూడ్నెల్లకోమారు పెంచుకుంటూ పోతున్నారు. అప్పుడెప్పుడో రెండొందల దగ్గర మొదలైన ఆయన పాట ప్రస్తుతం రెండొందల నలభై దగ్గరుంది. ఇది మున్ముందు మరింత పెరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేము.

నంబర్లు ప్రకటించే విషయంలో డాక్టరుగారి లాగానే మెగా యాక్టరుగారికీ తనదంటూ ఓ పద్ధతుంది. పాతికేళ్లుగా అలవాటైన పాత పద్ధతది. ఈయన తరహా అంతా కొత్త సినిమా విడుదల ముందు దర్శక నిర్మాతలు చేసే ప్రచారాన్ని పోలి ఉంటుంది – ‘మా బొమ్మ రెండొందలేభై కేంద్రాల్లో రజతోత్సవం చేసుకుంటది’, ఇలాగన్న మాట. కొన్ని సార్లు ఓ చిత్రానికి దర్శకుడు ఒక సంఖ్య, నిర్మాత మరో సంఖ్య చెప్పేసి ప్రేక్షకులని గందరగోళ పెట్టినట్లే ప్రరాపా తీరు కూడా ఉంది. ఆ మధ్య అరవింద్ బాయ్యా ‘మా సినిమా విడులైన ప్రతి కేంద్రం లోనూ నూర్రోజుల ఫంక్షన్ చేసుకోటం ఖాయం’ అని గీతా ఆర్ట్స్ చిత్రాల విడులకి ముందు అలవాటుగా వేసే రికార్డునే కాస్త మార్చి ‘ప్రజారాజ్యం ఉన్న రెండొందల తొంభై నాలుగు స్థానాల్లోనూ విజయం సాధిస్తుంది’ అనేశారు. ఆయన మాటలు విని నమ్మినోళ్లు కొందరే, నవ్వుకున్నోళ్లెందరో. రెండ్రోజుల క్రితం మాత్రం పార్టీ అధ్యక్ష చిరంజీవుల వారు ఢిల్లీలో విలేకర్లతో కాస్త నవ్వుకోని నంబరే చెప్పారు. వీరి సంఖ్య రెండొందల పాతిక-ట.

వీళ్లందరి హడావిడి చూసి, తొందరపడకపోతే లాభం లేదనుకున్నారో ఏమో, జనం మర్చిపోయిన బీజేపీ లక్షణుడొకాయన నిన్న హడావిడిగా విలేకర్లని పిలిచి ‘మాకూ రెండొందల స్థానాలొస్తాయి’ అంటూ ఢంకా బజాయించారు. ఈ మధ్యనే జ&కా రాష్ట్రంలో తమ బలం రెండు నుండి పదకొండుకి పెరిగింది కాబట్టి ఆం.ప్ర.లో కూడా అదే విధంగా రెండొందలకి పెరుగుతుందని ఓ భీభత్సకరమైన లాజిక్ కూడా చెప్పారీయన. ఆ లాజిక్ తల మరియు తోకలను వెదుకుతూ నిన్ననగా బయల్దేరిన ఇద్దరు విలేకర్లు ఇంతవరకూ పత్తా లేరు. వాళ్లు తిరిగొచ్చేదాకా ఆయన లాజిక్ సరైనదేననుకున్నా, రాష్ట్రంలో బీజేపీకి ఇప్పుడున్న ఒకట్రెండు సీట్లు రెండొందలకి పెరిగితే, మరి కాంగిరేసు, తెదెపాలకి ఏ మొత్తంలో పెరగాలి? మరీ ముఖ్యంగా, ఈ లాజిక్ సశాస్త్రీయమైనదేనైతే మాత్రం చిరంజీవుల వారి పార్టీ మూసేస్కోక తప్పదు. ఆయనకి ఇప్పుడు సీట్లేమీ లేవుగనక, ఇక ముందు వచ్చే అవకాశమూ లేదన్నమాటేగా.

ఇందరు ఇన్ని రకాలుగా హడావిడి చేస్తున్నా చాణక్య చంద్రబాబుగారు మాత్రం ఇంకా తమ సంఖ్యని అధికారికంగా ప్రకటించినట్లు లేరు. వీరిదంతా హైటెక్ యవ్వారం కాబట్టి, ప్రస్తుతం ఏదో అంతర్జాతీయ కన్సల్టెన్సీ ద్వారా ఆ విషయంలో సర్వేలూ గట్రా చేయించే పన్లో ఉండుంటారు. లేదా, ప్రత్యర్ధుల ఫైనల్ నంబర్లొచ్చేదాకా ఆగి అంతకన్నా మెరుగైన నంబర్ చెప్పే ఉద్దేశంతో ప్రస్తుతం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారేమో. ఈయన కూడా ఏదో ఒకటి చెప్పేస్తే ఓటర్లూ ఓ నంబరనేసుకుని ఎలచ్చన్లకి రెడీ ఐపోతారు కదా.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,010

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.