Posts Tagged 'వినాయక చవితి'

పలకల గణపతి

నా ఒకానొక కలా పోసన మీలో కొందరు ఎరుగుదురు. దానికి సంబంధించిన జ్ఞాపకమొకటి వినాయక చవితి పండగతో ముడిపడుంది. నేను హైస్కూల్లో ఉన్న ఐదేళ్లూ, ఏటేటా వినాయక చవితి సందర్భంగా నా చేతికి యమా గిరాకీ ఉండేది. నా సహాధ్యాయిల్లో ఎక్కువ మంది హాస్టల్ వాసులు. వినాయక చవితి పూజకి గణేశుడి బొమ్మ కోసమని ఇళ్లలో డబ్బులు తెచ్చుకునేవాళ్లు. అప్పట్లో రూపాయికో రెండ్రూపాయలకో ఏడెనిమిది అంగుళాల ఒండ్రు మట్టి విగ్రహమొకటి లభించేది. నా క్లాస్‌మేట్స్‌లో కొందరు ఆ రెండ్రూపాయల్ని పది నిమిషాల పూజానంతరం చెరువులో నిమజ్జనం చేసే బుద్బుధప్రాయమైన విఘ్నేశుడి కోసం వాడే బదులు ఆదివారం మధ్యాహ్నం హాస్టల్ గోడ దూకి సాహసోపేతంగా వెళ్లొచ్చే మ్యాటినీ షో వంటి విలువైన పరమార్ధం కోసం వాడుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుందనే విచక్షణ కలిగినవాళ్లు. కానైతే, వీళ్లకి పురుషార్ధంతో పాటు పుణ్యమూ కావాలి. దాని కోసం పూజ చెయ్యాలి. పూజకి వినాయకుడు కావాలి. విగ్రహమే అవసరం లేదు, ఏదో ఓ బొమ్ముంటే చాలు. అక్కడే నా అవసరం పడేది వీళ్లకి. పండక్కి వారం ముందే నాకు గణేశుడి బొమ్మల కోసం పాతిక దాకా ఆర్డర్లొచ్చేవి. ఇక నా పని – ఆ వారం రోజులూ ఖాళీ సమయంలో తెల్ల కాగితాలూ, స్కెచ్ పెన్నులూ ముందేసుకుని బొజ్జ గణపతి బొమ్మలు గీయటమే (ఇదంతా ఉచిత సర్వీసేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు). చవితి రోజున నా పాతిక వినాయకులూ దర్జాగా పూజలందుకునే వాళ్లు. ఆ తర్వాత ముక్కలుగా చింపబడి సమీపంలో ఉన్న బావిలోనో, చెరువులోనో నిమజ్జనం చెయ్యబడేవాళ్లు.

ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో వినాయకుడికి వాడిన ‘థీమ్’ గురించి స్టార్ న్యూస్‌లో చూస్తుంటే ఎందుకో నా హైస్కూలు వినాయకులు గుర్తొచ్చారు. అలా కాగితం వినాయకులకి పూజలు చెయ్యటం శాస్త్రం ప్రకారం సరైనదో కాదో తెలీని చిన్నతనమది. స్నేహితులకో రూపాయి ఆదా చెయ్యాలనే సదుద్దేశమే తప్ప శాస్త్రాలని పట్టించుకునే వయసు కాదది. పెరిగి పెద్దయ్యాక, వినాయక చవితి పేరుతో జరుగుతున్న తంతు గమనిస్తుంటే ఆవేశం తన్నుకొస్తుంది. ఎక్కడో చదివాను – నిమజ్జనం కోసం వాడే వినాయకుడి ఎత్తు ఎనిమిదంగుళాకన్నా ఉండ కూడదని, బంక మన్నుతో మాత్రమే దాన్ని తయారు చెయ్యాలనీ, నిమజ్జనం నిజోద్దేశం ఆ పత్రిలో ఉండే ఔషధ విలువలు బావుల్లోనూ చెరువుల్లోనూ జలాలని శుద్ధి చెయ్యటమనీ .. ఇలాంటి విశేషాలు. మరి ఇప్పుడు జరుగుతున్నదేంటి?

మన మహా నగరాలు కొన్నిట్లో గణేశ్ చతుర్ధి అంటే గుర్తొచ్చేది పండగ వాతావరణం కాదు, రణ వాతావరణం. వినాయకుడు కొలువై ఉన్న ప్రాంతాల్లో వారం పదిరోజులపాటు లౌడ్ స్పీకర్ల హోరు, నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ జామ్‌లు, శాంతి భద్రతలపై భయాందోళనలు, నిమజ్జనాల దెబ్బకి కాలుష్యంతో నిండిపోయే చెరువులు. కనపడేదంతా ఆర్భాటమే, ఎవరితోనో పోటీ పడాలనే ఆరాటమే. ఆ పోటీ పరాయి మతస్థులతో కావచ్చు, పక్క వీధి వినాయకుడి పొడుగుతో కావచ్చు. కన్ను పొడుచుకున్నా కనపడనిది భక్తి ప్రపత్తులు. కనుమరుగైపోయింది చవితి అసలు స్ఫూర్తి. (ఇళ్లలో పద్ధతిగా పూజలు చేసుకునే వాళ్లు కోకొల్లలు. నా బాధంతా హైదరాబాద్, బొంబాయి వంటి నగరాల్లో చవితి పేరుతో జరిగే బహిరంగ జాతరలు, చందాల వంకతో సాగే దందాల గురించి మాత్రమే)

ఉన్న విపరీతాలు చాలనట్లు, కొన్నేళ్లుగా చవితి గణేశుడు కొత్త పుంతలు తొక్కుతున్నాడు. ఆ ఏడాది ప్రాచుర్యంలో ఉన్న వార్తనో, విశేషాన్నో బట్టి కూరగాయల వినాయకుడు, కంప్యూటర్ వినాయకుడు, క్రికెటర్ వినాయకుడు .. ఇలా రకరకాల గణపతులు కనిపిస్తున్నారు. ఈ ఏటి ప్రత్యేకత సిక్స్ ప్యాక్ వినాయకుడట! వినాయకుడికి ట్రేడ్ మార్క్ ఆయన బొజ్జ. అసలా బొజ్జ కారణంగానే కదా వినాయక చవితి పుట్టుకొచ్చింది. అలాంటిది సిక్స్ ప్యాక్ పేరుతో వినాయకుడ్ని బక్క చిక్కిస్తే నాకు చివుక్కుమనిపించింది. వినాయకుడు విదూషకుడైపోయాడా? ఈ వరసలో బ్లాగర్ వినాయకుడు, బాక్సర్ వినాయకుడు కూడా రావచ్చు త్వరలో. రాముడికో, కృష్ణుడికో ఇలాంటి ఆకారాలు కల్పించే ధైర్యముందా ఎవరికన్నా? వినాయకుడి విషయంలో ఆ తెగింపెక్కడి నుండొచ్చిందో అర్ధం కాదు.

అర్ధం కానిది మరోటీ ఉంది – తెలిసో తెలీకో ఇలాంటి పనులు ఏ బర్గర్ కింగో, కోకా కోలా వంటి విదేశీ కంపెనీవాడో చేస్తే విరుచుకు పడే దేశోద్ధారకులు, తెలిసీ వినాయకుడితో ఆటాడుకుంటున్న మనవాళ్లని ఏమీ అనకపోవటం! మన కంపు మనకి ఇంపు అంటే ఇదే కాబోలు. అయితే ఇందులో మరో కోణమూ ఉంది. ఇలాంటి విచిత్రాకారాల వినాయకులు, భారీ విగ్రహాల తయారీతో ఏడాదిలో కొన్నాళ్లైనా పొట్టపోసుకునే బడుగు జీవుల బతుకులు ఈ వేలంవెర్రి పైనే ఆధారపడి ఉన్నాయి. భక్తి ముఖ్యమా, బతుకు తెరువా అంటే నా ఓటు నిస్సందేహంగా రెండోదానికే. కానీ అదే సూత్రం బర్గర్ కింగుకీ వర్తించాలి కదా. పేరుకి బహుళజాతి సంస్థైనా, దానిపై ఆధార పడ్డ బ్రతుకులూ బడుగు జీవులవే. వాళ్లు చేస్తే అపచారం, మనం చేస్తే ఉపచారం! ద్వంద్వనీతి దొంగ భక్తుల నీడలో మనుగడ సాగించాల్సి రావటం మాత్రం మతం చేసుకున్న గ్రహచారం.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,298

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.