Posts Tagged 'వార్త'

కూచిపూడిలో ప్రపంచ రికార్డు

అమెరికాలోని తెలుగు సంఘాలలో సిలికానాంధ్రకి ఓ విశిష్టత ఉంది. ఎక్కువ సంఘాలు ఏడాదికి రెండు మూడు సార్లు నేపధ్య గాయకుల సంగీత విభావరులు, సినిమా నాట్య ప్రదర్శనలు, క్రికెట్ పోటీల వంటి వాటితో తూతూ మంత్రం కార్యక్రమాలు నిర్వహించి తమ ఉనికిని గుర్తుచేస్తుంటే, సిలికానాంధ్ర దానికి భిన్నంగా ఎప్పటికప్పుడు తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలతో ముందుకొస్తుంటుంది. ఇవే కాకుండా వీరు ‘మనబడి’ వంటి వాటితో తెలుగు భాషా సేవ కూడా చేస్తుంటారు.

అయితే, ఈ మధ్య సిలికానాంధ్ర దారి తప్పుతుందా అనిపిస్తుంది వారి కొన్ని కార్యక్రమాలు చూస్తుంటే. క్యాలిఫోర్నియాలోని కుపర్టినో నగరంలో ఇటీవల సిలికానాంధ్ర వారు మూడు రోజుల పాటు అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనం నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో కూచిపూడి నాట్యకారులు ప్రదర్శనలో పాల్గొనటం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పి తద్వారా గిన్నెస్ బుక్ లోకెక్కటం దీని లక్ష్యమట. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ కూడా పాలుపంచుకోవటం విశేషం.  దేశ దేశాలనుండి వచ్చిన మూడు వందల ఎనభై మంది కూచిపూడి కళాకారులు కలసికట్టుగా ఎనిమిది నిమిషాల పైచిలుకు గిన్నెస్ బుక్ వారి సమక్షంలో నాట్యమాడి రికార్డు నెలకొల్పారు. వారందరికీ పేరు పేరునా గిన్నెస్ పుస్తకం వారు సర్టిఫికెట్ అందజేస్తారట.

ఈ వార్త మరునాడు స్థానికంగా అత్యధిక సర్క్యులేషన్ గల San Jose Mercury News దిన పత్రికలో ఇలా ప్రచురితమయింది:

Dancers in Cupertino will be memorialized in a book that honors loud burps, long fingernails and large groups of breast-feeding mothers. (పూర్తి వార్త ఇక్కడ)

ఈ వాక్యం ఒకటి చాలు గిన్నెస్ బుక్ రికార్డులకి ఎంత విలువుందో చెప్పటానికి. ఇటువంటి ఫీట్లవల్ల ఆయా కళాకారులకి పేరు దుగ్ధ తీరటమే కానీ కూచిపూడి నాట్య కళకి ఒరిగేదేమిటి? ఈ రికార్డు సాధించటానికి సిలికానాంధ్ర వారు చేసిన కృషి మెచ్చుకుని తీరవలసిందే. దీనికి ఎంత శ్రమ, డబ్బు ఖర్చయ్యాయో తెలియదు. ఈ సమ్మేళనంలో కూచిపూడి నాట్యాన్ని వృద్ధిచేసే దిశగా ఏమన్నా ప్రయత్నాలు జరిగాయేమో తెలియదు. వార్తలో ప్రపంచ రికార్డు గురించి మాత్రమే ప్రస్తావించటం వల్ల అటువంటి ప్రయత్నాలేమీ జరగలేదనుకోవాలేమో. సాంస్కృతిక సంఘాల దృష్టి రికార్డులవంటి వాటిపై కేంద్రీకృతం కావటం అంత మంచి పరిణామం కాదు. ఈ ఒక్క సారితో వదిలేస్తారేమో దీన్ని అనుకుంటే అదీ జరిగేలా లేదు. ‘వేరే ఎవరైనా మా రికార్డుని ఛేదించవచ్చు, కానీ రెండేళ్ల తరువాత భారత దేశంలో జరగబోయే సమ్మేళనంలో మేము రికార్డులని తిరగరాస్తాం’ అని ఈ కార్యక్రమ నిర్వాహకులు ప్రకటించటం దానికి సూచన. సిలికానాంధ్రలాంటి ప్రజాదరణ కలిగిన సంఘాలు తమ శక్తియుక్తులని రికార్డులని మించిన లక్ష్యాలపై కేంద్రీకరిస్తే బాగుంటుంది.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,298

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.