Posts Tagged 'లాతే'

స్టార్‌బక్స్

కాఫీ షాపు గురించీ వ్యాసం! పంది మీద ఒకటికి రెండు రాసినప్పుడు దీని మీదెందుకు రాయకూడదు? అందునా నా అభిమాన కాఫీ అంగడి. నావరకూ స్టార్‌బక్స్ అమ్మేది కాఫీ మాత్రమే కాదు, అంతకన్నా విలువైన ఎక్స్‌పీరియెన్స్. అందుకే కప్పు కాఫీ విలువ గ్యాలను పెట్రోలుకన్నా ఎక్కువున్నా ఫర్వా ఉందనిపించదు. కాఫీ తాగటం, తాగకపోవటం అనేది వేరే విషయం – కేవలం అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించటానికన్నా నేను తరచూ వెళుతుంటాను. స్పీకర్లనుండి మంద్రమైన సంగీతం వినిపిస్తుండగా – ఓ చేత కాఫీ కప్పు, ఒళ్లో ల్యాప్‌టాపుతో ఆఫీసు పనితో కుస్తీలు పట్టే డిజిటల్ నోమాడ్స్ దగ్గర్నుండి నెత్తిన ఫెల్ట్ హ్యాట్, చేతిలో వార్తా పత్రికతో తాజా రాజకీయాలు ముచ్చటించే సీనియర్ సిటిజెన్స్ దాకా; ఓ మూల టేబుల్ దగ్గర దీక్షగా పరీక్షలకి తయారవుతున్న కుర్రాడి నుండి మరో మూల సోఫాలో బిజీ బిజీగా ఉద్యోగార్ధినెవరినో ఇంటర్వ్యూ చేసేస్తున్న హెచ్ఆర్ ఉద్యోగి దాకా .. ఇన్ని రకాల మనుషుల్ని అంత దగ్గరగా గమనించే అవకాశం మరెక్కడా ఉండకపోవచ్చు. అతిధులని సాదరంగా పలకరించటంలో మెక్‌డొనాల్డ్స్ వంటి ఫాస్ట్‌ఫుడ్ చైన్లలో పనిచేసే వారికీ, స్టార్‌బక్స్ బరిస్టాలకీ కొట్టొచ్చినట్లు కనిపించే తేడా నన్నా షాపుకి మరింత కట్టిపడేసింది. ఒకట్రెండు పీట్స్ కాఫీ ప్రదేశాలు కూడా నాకు నచ్చుతాయి కానీ, మొత్తమ్మీద స్టార్‌బక్స్‌దే ప్రధమ స్థానం.

స్టార్‌బక్స్‌తో నా పరిచయం అమెరికా వచ్చిన మర్నాడే జరిగింది. కాఫీ అమ్మటానికి అంత పెద్ద గొలుసు దుకాణం ఉంటుందనేది అంతకు ముందు నా ఊహకందని విషయం. గొలుసులు, చైన్లే కాక – అసలు కాఫీలో అన్ని రకాలుంటాయనేదీ ఊహకందని విషయమే. అప్పటికి – అంటే పది, పదకొండేళ్ల కిందన్న మాట – నాకు తెలిసి కాఫీ అంటే కాఫీయే. అందుకే, నా మేనేజరయ్య తొలిసారిగా నన్ను స్టార్‌బక్స్‌కి తీసుకెళ్లి ‘ఏం కాఫీ తాగుతావు?’ అంటే ముందు తెల్లమొహమేశా. తర్వాత మొహం చిట్లించా, ఆ తర్వాత అతికించా. చివరాఖరికి నోరెలాగో పెగల్చి సిల్లీగా ‘కాఫీ’ అన్నా – అంతకన్నా ఏమనాలో అంతు పట్టక, ‘ఏం కాఫీ ఏంటి? కాఫీలో రకాలు కూడా ఉంటాయా’ అని లోలోన గొణుక్కుంటూ.

కౌంటర్ వెనక దవడలు నొప్పెట్టేలా ఆ చెవి నుండి ఈ చెవి దాకా నోరు సాగదీసి నవ్వుతున్న సర్వర్ సుందరమ్మతో ‘కాఫీ ఆఫ్ ద డే’ అన్జెబుతూ ‘ఇది ఓకేనా’ అన్నట్టు నాకేసి చూశాడు మదీయ మేనేజరయ్య. సుందరమ్మ కూడా నాకేసే తేరిపార చూస్తుండగా, బుర్ర బరబరా బరుక్కుందామన్న కోరిక బలవంతాన తొక్కిపడుతూ ‘ఓకోకే’ అన్నట్టు ఆంధ్రా స్టయిల్లో అడ్డదిడ్డంగా తలాడించేశా. ఆ విధంగా సుందరమ్మనీ, మేనేజరయ్యనీ ఏక కాలంలో కన్‌ఫ్యూజ్ చేసిపారేశాక తప్పు తెలుసుకుని నాలుక్కరుచుకుని ‘ఇట్రా’ అన్నట్టు తల నిట్ట నిలువుగా ఊపి అంగీకారం వ్యక్తం చేశాను – కాఫీ ఆఫ్ ద డే అంటే ఈ రోజు తాజాగా కాచిన కాఫీ కాబోలు, ఆ ముక్క ముందే చెప్పకపోతే నిన్నా మొన్నటి పాచి కాఫీ నా మొహాన కొడతారేమో అనుకుంటూ. ‘అందుకే మేనేజరయ్య ఏం కాఫీ అనడిగుంటాడు’ అని మరుక్షణంలో వెలిగింది. అవ్విధంబున జ్ఞానోదయంబైన వెన్వెంటనే, మేనేజరయ్యింకా సుందరమ్మతో మాట్లాడుతుండటం గమనించి రహస్యంగా భుజాలు కూడా తట్టేసుకున్నా – నా తెలివితేటలకి మురిసిపోతూ. పనిలో పనిగా, పాచి కాఫీ బారి నుండి కాచి కాపాడిన మేనేజరయ్యని అభిమానంగా మనసులోనే ఆశీర్వదించేశా, కృతజ్ఞతా భావం గుండెలో నిండి పొంగి పొర్లి వరదలై పారుతుండగా.

రెండే నిమిషాల్లో చేతిలో వచ్చి వాలింది – నా తొట్టతొలి స్టార్‌బక్స్ కాఫీ కప్పు. పింగాణి కప్పు కాదు, ముందెన్నడూ చూసెరగని పేపర్ కాగితక్కప్పు …. దాని మూతిని మూసేస్తూ తెలతెల్లటి ప్లాస్టిక్ లిడ్‌తో సహా. లోపల్నుండి లీకవుతున్న వెచ్చటి ఆవిర్లు, అవి మోసుకొస్తున్న కమ్మని కాఫీ సువాసనలు. రెండ్రోజుల నుండీ కాఫీ కోసం మొహం ఫుట్‌బాల్ సైజులో (కొబ్బరికాయ షేపు అమెరికన్ ఫుట్‌బాల్ కాదు, పుచ్చకాయ టైపు సాకర్ ఫుట్‌బాల్) వాచిపోయుండటంతో, కప్పు చేతికందటం ఆలస్యం ఆబగా ఓ గుక్క గొంతులో ఒంపేసుకుని మరుక్షణం బిక్క మొహమేశాన్నేను. యాక్క్.. ఛ్ఛేదు, వ్విషం! కాఫీ ఇమ్మంటే డికాషనిస్తారా.. దారుణాతిదారుణం, దగదగా, మోసం, కుట్ర, విదేశీ హస్తం, ఎట్‌సెటరా, ఎట్‌సెటరా, ఎట్‌సెటరా.

అదీ, అమెరికాలో నా తొలి కాఫే సేవనానుభవం. అప్పటికి కాఫీ అంటే నాక్కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. చక్కటి కాఫీ అంటే – తాజాగా పితికిన, చిక్కటి జలరహిత పాలతోనే కలపాలి; నిన్నటిదో మొన్నటిదో డికాషన్ వేడిచేసి కలపకూడదు; అటు మరీ చేదుగానూ ఇటు మరీ తీపిగానూ ఉండరాదు .. ఇలాంటివి. ఇన్స్టంట్ కాఫీ అనేది అసలు కాఫీయే కాదు; ఎవరన్నా గెస్టులకి ఇన్స్టంట్ కాఫీ ఇచ్చారంటే వాళ్ల రాక సదరు హోస్టుకి ఇష్టం లేదు – వగైరా అభిప్రాయాలూ ఉండేవి (టీయో, మజ్జిగో, మంచినీరో ఇచ్చారంటే పరిస్థితి మరీ దారుణం అన్నమాట. ‘మీ మొహానికిది చాలు. పుచ్చుకుని వెంటనే దయచెయ్యండి’ అని దానర్ధం). ‘టీ పీనా ఉత్తరాది ఆర్య లక్షణం హై, కాఫీ పీనా దక్షిణాది ద్రవిడ గుణం హై’ తరహా నమ్మకాలూ కొన్నున్నాయి కానీ వాటి జోలికి లోతుగా వెళ్లటం మంచిది కాదు కాబట్టి వదిలేద్దాం. మొత్తమ్మీద, ఇవన్నీ ఎప్పటి అభిప్రాయాలో. ఇప్పుడు వాటిలో కొన్ని లేవనుకోండి. అప్పటికీ ఇప్పటికీ ఉన్న బలహీనత మాత్రం ఒకటుంది – ఎవరు కాఫీ ఆఫర్ చేసినా కాదనలేకపోవటం. అంతకు మించిన బలహీనతా ఒకటుంది. వాళ్లిచ్చిన కాఫీ ఏ మాత్రం నచ్చకపోయినా మొహమ్మీదనే చెప్పేయటం. అలా బద్దలు కొట్టిన కుండలెన్నో, చిన్నబుచ్చుకున్న స్నేహితులెందరో. తమ కాఫీని విమర్శించేటప్పుడు నా కళ్లలో పైశాచిక ఆనందమేదో తాండవిస్తుందనీ, అసలు కాఫీ ఎలా ఉన్నా విమర్శించి తీరాలన్న ముందస్తు నిర్ణయంతోనే వాళ్ల వాళ్ల ఇళ్లకొస్తాననీ .. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు నా చెవిన పడకపోలేదు. దేవుడంటూ ఉంటే గింటే కాఫీ గింజల్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఇథియోపియన్ మేకల రూపంలోనే ఉంటాడన్నది నా ప్రగాఢ విశ్వాసం – కాబట్టి కాఫీ అంటే నాకెంతిష్టమో మీరు ఈజీగా ఊహించేసుకోవచ్చు. అందుకే, ఎవరేమనుకున్నా దాని రుచి దగ్గర రాజీ పడే ప్రసక్తే లేదు.

కాఫీ విషయంలో అంత కఠినాత్ముడినైన నన్ను మెప్పించటానికి స్టార్‌బక్స్‌కి రమారమి రెండేళ్లు పట్టింది. ఆ డికాషన్ అనుభవం తర్వాత ఎవరేం చెప్పినా అందులో అడుగు పెట్టటానికి ససేమిరా అంటూ మొండికేశాన్నేను. ఆ తొలి అనుభవంతో అసలు అమెరికన్లకి కాఫీ పెట్టటమే రాదన్న నమ్మకమూ నాలో ప్రబలింది. చెత్త కాఫీ తాగటం కన్నా తాగకుండా ఉండటం మేలన్న ఉద్దేశంతో రెండేళ్ల పాటు కాఫీకి దూరంగా ఉండిపోయాను. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఒకసారి శాన్ ఫ్రాన్సిస్కో డౌన్‌టౌన్లో స్టార్‌బక్స్‌లోకి అడుగు పెట్టాల్సి రావటం, కాఫీలో నా ఇష్టాయిష్టాలెరిగిన ఓ మితృడి సలహాతో ఓ కాఫీ లాతే ప్రయత్నించటం, అది నచ్చటం, ‘ఫర్వాలేదే, వీళ్లకీ కాఫీ కాచటం వచ్చు’ అనుకుని అడపాదడపా స్టార్‌బక్స్‌లో అదే రకం కాఫీ తాగటం మొదలెట్టటం, మెల్లిగా ఇతర రకాలూ ప్రయత్నించటం .. కొన్నేళ్లు గడిచేసరికి కాఫీ అంటే స్టార్‌బక్సే అనుకునే స్థితికి రావటం .. ఇలా వరసగా జరిగిపోయాయి. ఆ క్రమంలో కాఫీలో ఎన్నొందల రకాలుంటాయో, వాటి చరిత్రలేమిటో, ప్రపంచంలో ఏటా ఎంత పెద్ద మొత్తంలో కాఫీ అమ్మకాలు సాగుతాయో, ఏఏ దేశాల కాఫీల్లో తేడాలేంటో .. ఇత్యాది వివరాలూ తెలుసుకున్నాను. అయితే ఇప్పటికీ కోల్డ్ కాఫీ కాన్సెప్ట్ ఏమిటో నాకర్ధం అవదనుకోండి. ఫ్రపూచినో లాంటివి కాఫీల్లో చెడబుట్టాయన్న అభిప్రాయం నాలో నరనరానా నిండిపోయింది. వాటి గురించి తర్వాతెప్పుడన్నా మాట్లాడుకుందాం.

ఇన్నేళ్ల తర్వాత, దారి పక్కన కనబడే ఏ స్టార్‌బక్స్ షాపు చూసినా నాటి నా డికాషన్ అనుభవం మదిలో మెదిలి నవ్వొస్తుంది. వెంటనే – ముప్పై ఎనిమిదేళ్ల క్రితం సియాటిల్‌లో కాఫీ గింజలమ్మే చిన్న షాపుగా ప్రారంభించి ప్రస్తుతం యాభై దాకా దేశాల్లో పదహారు వేలకి పైగా షాపులతో విస్తరించి ఐదు బిలియన్ డాలర్ల వ్యాపారంతో కాఫీ సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజులా వెలుగుతున్న స్టార్‌బక్స్ ప్రస్థానం గుర్తొచ్చి ‘వీళ్లకా కాఫీ కలపటం రాదనుకుంది’ అనిపించి ఆ నవ్వు పది రెట్లవుతుంది. నాటి పొరపాటుకి ప్రాయశ్చిత్తంగానో ఏమో, నా ప్రమేయం లేకుండానే కాళ్లా స్టార్‌బక్స్‌కేసి దారి తీస్తాయి. కాసేపటి తర్వాత కౌంటర్ ముందు నా గొంతు ధ్వనిస్తుంది:  ‘డబల్ టాల్ నో ఫాట్ ఎక్స్‌ట్రా హాట్ లాతే, ప్లీజ్’.

కొసమెరుపు: మీలో ఉన్న స్టార్‌బక్స్ అభిమానుల మెదళ్లకు కాస్త మేత. స్టార్‌బక్స్‌లో లభించే కప్పుల సైజులు ఎన్ని? వాటి పేర్లేమిటి? (తొందరపడకండి. మెనూలో కనపడని సైజూ ఒకటుంది)


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,298

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.