Posts Tagged 'రోశయ్య'

ఆరేళ్ల తర్వాత

వివిధ సంక్షేమ పధకాలకు చెల్లుచీటీ రాసే విషయం రాష్ట్రప్రభుత్వం తీక్షణంగా, తీవ్రాతితీవ్రంగా పరిశీలిస్తున్నట్లు కొన్నాళ్లుగా సమాచార సాధనాలు ఇల్లిల్లూ ఎక్కి కోళ్లై కూస్తున్నాయి. నాలుగైదు రోజులుగా ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల వ్యాఖ్యలు దాన్ని ధృవపరుస్తున్నాయి. ఇలాంటి పధకాల వల్ల కొందరు పేదలకి తాత్కాలికంగా ఒరిగేదేమన్నా ఉంటే ఉండెచ్చేమో కానీ, దీర్ఘకాలంలో అవి వాళ్లని బిచ్చగాళ్లుగా మార్చటం తప్ప నిజంగా ఉద్ధరించేదేమీ ఉండదని గ్రహించటానికి మేధావులై ఉండనవసరం లేదు. ఉచిత పధకాల ముసుగులో అస్మదీయులకు అడ్డూఅదుపూ లేకుండా దోచిపెట్టి అవసరం తీరిపోయాక ఆర్ధిక భారం పేరుతో వాటికి పాతరేస్తారన్న అంచనాలు ముందునుండీ ఉన్నవే కాబట్టి సర్కారువారి తాజా కప్పగంతుకి ఆశ్చర్యం తన్నుకురాలేదు, ఆవేశం పెల్లుబుకనూ లేదు. అంతో ఇంతో ఆనందమే వేసింది – కనకపు సింహాసనాన ఎవర్నిబడితే వారిని కూర్చోబెడితే ఏం మూడుతుందో హస్తం గుర్తుకి ముద్ర గుద్దిన ఓటరుదేవుళ్లకి ఇప్పటికన్నా అర్ధమౌతుందేమోనన్న ఆశతో. ఐతే ఆ ఆశా, ఆనందమూ వెంటనే ఆవిరైపోయాయి – ‘ఫలానా ఆయన పదవిలో ఉండబట్టే వర్షాలు విస్తారంగా కురిశాయి’ అనుకుంటూ ఈవీఎమ్ మీటనొక్కే ఓటరు మారాజులున్నంతకాలం అలాంటి ఫలానాల పంటలు పండుతూనే ఉంటాయన్న సత్యం గుర్తొచ్చి.

ఖజానాని కరువుదీరా కొల్లగొట్టి, అయినవారికి అందినమేరా దోచిపెట్టి, రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసి తీరా పప్పులుడికే సమయానికి తప్పుకుపోయాడో అదృష్టవంతుడు. ఆర్ధికమంత్రిగా ఆ అపర భగీరధుడి విచ్చలవిడితనాన్ని విధిలేకో, నిలదీసే దమ్ములేకో వెనకేసుకొచ్చిన రోశయ్యామాత్యులకి ముఖ్యమంత్రి పీఠమెక్కాక ముద్ద తిరిగి గొంతులోకి రావటానికీ, తత్వం తలకెక్కటానికీ ఎన్నాళ్లో పట్టలేదు. కానీ ఏం చేద్దామన్నా కాలూ చెయ్యీ ఆడని పరిస్థితి ఆయనది. ముందు నుయ్యి, వెనకా నుయ్యే ఆయనకి. ‘మా నాన్న వరాలు రద్దు చేస్తే తాట తీస్తా’ అంటూ కుర్చీ కోసం గోతికాడ నక్కలా పొంచుక్కూర్చున్న యువరాజావారి హుంకరింపులో పక్క, ఖాళీ చిప్పలా వెక్కిరిస్తున్న ఖజానా మరో పక్క – వెరసి రోశయ్య తిప్పలు వర్ణనాతీతం. ఈ వయసులో ఆయనకు రావాల్సిన కష్టాలు కావవి.

‘అర్హత లేనివాళ్లే లబ్దిదారుల్లో అధికులు’, ‘అవసరానికి మించిన రేషన్ కార్డుల జారీ జరిగిన మాట నిజం’, ‘సంక్షేమ పధకాల్లో అవకతవకలు సత్యం’, ‘మరో నలభయ్యేళ్లైనా జలయజ్ఞం పూర్తి కాదు’ .. ఇవన్నీ ప్రతిపక్షాలు రువ్వుతున్న విమర్శలు కావు. సాక్షాత్తూ ప్రభుత్వ పెద్దలూ, అధికార పక్ష నాయకులూ వెల్లడిస్తున్న వాస్తవాలు. ఎన్నికల్లో విజయాలే ఏకైక లక్ష్యంగా కాంగిరేసు కామందులు ఐదేళ్లుగా ప్రజల నెత్తిన పద్ధతిగా పెట్టిన కుచ్చు టోపీల  బొచ్చు ఊడగొడుతున్న ఊసులివి. సంక్షేమ పధకాలు అటకెక్కితే సంక్షోభంలో పడిపోతామన్న భయంతో కొందరు కేతిగాళ్లు మరో అడుగు ముందుకేసి ‘మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పధకాల్లో కోతలు పార్టీకి నష్టం’ అంటూ రోశయ్యామాత్యులు తమ కొంపలు ముంచేలోపే వారించే ఆత్రంలో ముందూవెనకా చూసుకోకుండా కుండ బద్దలు కొట్టేశారు. అనుకోకుండానైనా అసలు రహస్యం బట్టబయలు చేసినందుకు వీళ్లని అభినందిద్దాం.

చిన్నా చితకా నాయకుల నోళ్లనుండి రాలిపడుతున్న ఆణిముత్యాలో ఎత్తు, రోశయ్యగారు రాల్చిన రత్నం ఒకటీ ఒకెత్తు: ‘పధకాల అమలు పునఃసమీక్షించాలన్న నిర్ణయం వైఎస్‌దే’. రెండోసారి అధికారంలోకొచ్చిన కొన్నాళ్లకే వైఎస్‌కి ఆ మాదిరి జ్ఞానోదయమయిందంటే ఏమిటి దానర్ధం?  ఓట్లు దండుకోటానికి ఎడాపెడా రేషన్ కార్డుల మంజూరీకి జెండా ఊపిందెవరు? అర్హత ఊసులేకుండా ఉచితానుచితాలు మరిచి వరాలు గుప్పించిందెవరు? ఉచిత విద్యుత్తంటూ విద్యుత్ రంగాన్ని ఛిన్నాభిన్నం చేసిందెవరు? అడిగినవారినీ అడగనివారినీ అడ్డదారుల్లో లబ్దిదారుల్లో చేర్చిందెవరు, చేర్చమందెవరు? ఎన్నికలవ్వగానే ఓటు మల్లన్నలు బోడి మల్లన్నలైపోయారా? అంతకు ముందు అగుపించని అవకతవకలు అయ్యవారికి అర్జెంటుగా కనిపించేశాయా?

పావలా రుణాలు, ఇందిరమ్మ పధకాలు, ఆరోగ్యశ్రీలు, సెజ్‌ల పంపిణీలు, ప్రభుత్వ భూముల విక్రయాలు .. వైఎస్ విరచిత వర ప్రసాదాల్లో లొసుగులూ, లోగుట్లూ లేనిది ఒక్కటన్నా ఉందా? ప్రభుత్వ పధకాల అమల్లో కుంభకోణాలు చోటుచేసుకోవటం పాత విషయం. కుంభకోణాల అమలు కోసమే పధకాలు రూపొందించటం వైఎస్ నేర్పి పోయిన ఉపాయం. ఆరేళ్ల కాంగిరేసు జమానాలో రాష్ట్రానికి కొత్తగా వచ్చి పడ్డ పరిశ్రమల్లేవు – ఉన్నవీ పీక్కుపోవటం తప్ప. ఉచిత విద్యుత్ అంటూ విద్యుత్ రంగం ఉసురు తీసేశారు. ఇప్పుడు డబ్బు కడతామన్నా కరెంట్ ఇవ్వలేని దౌర్భాగ్యం. జల యజ్ఞం పేరుతో వేలకోట్లు ఎగిరిపోయాయి, ప్రాజెక్టులు మాత్రం మొదట్లోనే ఉన్నాయి! రైతుల ఆత్మహత్యలు పెరిగాయే తప్ప తగ్గలేదు. కర్నూలు లాంటి కరువు ప్రాంతాల్లో వరదలొచ్చే విచిత్ర పరిస్థితి! ఇవి చాలనట్లు అదనంగా అంతులేని అవినీతి, ప్రభుత్వాధికారుల్లో అలవిమాలిన అలసత్వం. ఐదేళ్ల వైఎస్ జమానా చేసిపోయిన చేటది. కూలీ నాలీ జనాలకి పూటుగా మందు తాపీ, ప్రజల భూముల్ని వచ్చినకాడికి తెగనమ్మీ సంపాదించే సొమ్మే ప్రభుత్వ బొక్కసానికి కొండంత ఆసరా అంటే అదెంత దిక్కుమాలిన ప్రభుత్వమో అర్ధమైపోతుంది. రాష్ట్రంలో ఈ ఆరేళ్లలో ప్రభుత్వం విదిల్చే ముష్టి మెతుకుల కోసం ఎదురు చూసే ఓట్ బ్యాంకొకటి పుట్టుకు రావటమే కానీ వేరే నిర్మాణాత్మక మార్పేదీ రాలేదు – ఆరేళ్ల కిందట అడ్రస్ లేని యువకుడొకడు అమాంతం అంబానీలని తలదన్నే స్థాయి పారిశ్రామికవేత్తగా అవతరించటం తప్ప.

సరే. ఎప్పుడూ ప్రతిపక్షాల మీద చిర్రుబుర్రులాడుతూ నిష్టూరపడిపోయే రోశయ్యగారు ఎట్టకేలకో నిష్టూరమైన నిజం ఒప్పుకున్నారు: ఆంధ్రప్రదేశ్ నిండా అప్పుల్లో ఉందనీ, ఏ పధకం అమలు చెయ్యటానికీ సొమ్ముల్లేవనీ. ప్రభుత్వోద్యోగుల జీతాలు చెల్లించటానికన్నా ఉన్నాయో లేవో మరి. మొత్తానికి నిజం బయటికొచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు కింకర్తవ్యం? రోశయ్యగారి నాయకత్వమ్మీద ఆయనకే నమ్మకమున్న దాఖలాల్లేవు. రాజధానిలో మతకలహాలు, రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు, ఉత్తుత్తి దీక్షకి ఉలికి పడి అతిగా స్పందించి రాష్ట్రాన్ని చీలిక అంచులదాకా తీసుకుపోయిన నిర్వాకాలు .. ఒకటా రెండా ఆయన వైఫల్యాలు? అయినదానికీ కానిదానికీ అధిష్టానాధిదేవత అనుగ్రహం కోసం చేతులు నులుముకుంటూ నిరీక్షించటం తప్ప మరేమీ చెయ్యలేని అముఖ్యమంత్రిగా ఆయనకి ఆల్రెడీ పేరొచ్చేసింది. మరి అలవాటుగా ఇప్పుడూ ‘నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి సారూ, నాకేం తెలీదు’ అంటూ ఈ సమస్యలు సైతం ఢిల్లీ దేవత ఒడిలోకి నెట్టి గమ్మున కూర్చుంటారా, ఇప్పటికన్నా జూలు విదిల్చి (తెలుసు – వారిది తళతళలాడే నున్నటి గుండే) పదిహేనేళ్ల పైగా ఆంధ్రప్రదేశ్‌కి ఆర్ధికమంత్రిత్వం వెలగబెట్టిన అనుభవంతో రాష్ట్రాన్ని ఒడ్డుకి చేరుస్తారా? రాజకీయ జీవిత చరమాంకంలో అనుకోని అదృష్టం తలుపుతడితే అందలమెక్కిన అలనాటి మరో తెలుగు పెద్దాయన దివాలా అంచులనుండి దేశాన్ని బయటికిలాక్కొచ్చిన వైనం నిన్నా మొన్నటిదే. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో అగ్రసింహాసనమెక్కిన రోశయ్యామాత్యులు పీవీ స్ఫూర్తితో చిరకాలం చరిత్రలో నిలిచిపోయే పనులేవన్నా చేస్తారా? ఆ సత్తా ఆయనకుందా?

చేతులు కట్టుకు చోద్యం చూద్దాం. అంతకన్నా మనం చెయ్యగలిగేదేముంది గనక.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 302,465

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.