Posts Tagged 'రాజకీయాలు'నామహరణం

నారా చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి మరియు జేసీ దివాకర రెడ్డి. రాజకీయ నాయకుల పేర్లు కావివి, యాభయ్యేళ్ల తర్వాత రాయలసీమలో నాలుగు జిల్లాల పేర్లు. ఇప్పటికే రంగారెడ్డి, పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం ఉన్నాయి. వాటికి తోడు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి చేరింది. భవిష్యత్తు తరం ఆంధ్రాలో కోడెల శివప్రసాద రావు, బొత్స సత్యనారాయణ జిల్లాలు, తెలంగాణలో సలావుద్దీన్ ఒవైసీ, జైపాల్ రెడ్డి తదితర జిల్లాలూ చూడొచ్చు.

నిక్షేపంగా ఉన్న జిల్లాల పేర్లు నేతల పేరిట ఖరాబు చెయ్యాల్సిన అవసరం ఇప్పుడంత అర్జెంటుగా ఏమొచ్చిపడిందో అర్ధం కాని సంగతి. ఓ పక్క కనీవినీ ఎరుగని వరదల్లో మునిగి రాష్ట్రం కల్లోలంగా ఉంటే, కొంపలు మునిగిపోయినట్లు కడప జిల్లాకి వైఎస్ పేరు పెడుతూ రాత్రికి రాత్రే శాసనం జారీ చెయ్యటంలో ఔచిత్యమెంత? పుత్ర రత్నం ఫ్యాక్టరీల కోసం నిబంధనలు తుంగలో తొక్కి శ్రీశైలం రిజర్వాయర్ సామర్ధ్యం పెంచే శాసనం జారీ చేసి నేడు కర్నూలు నిండా మునగటానికి ప్రత్యక్షంగా కారణమైన మహానుభావుడి పేరు పొరుగు జిల్లాకి పెట్టేందుకు ఎంచుకునే సమయం – ఇదా? ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు అన్ని జిల్లాలకీ ఉన్నట్లే కడపకీ ఆ పేరు వెనక తరాల చరిత్ర దాగుంది. దాని పేరు మార్చటమంటే ఆ చరిత్రని చెరపటమే. పుక్కిటి పురాణాలకీ, ఉందో లేదో తెలీని వేదకాలపు ప్రాభవానికీ ఇచ్చేపాటి విలువలో వీసమెత్తైనా చరిత్రకి ఇవ్వకపోవటం భారతీయుల బలహీనత. దానికి దర్పణమే పర్యాటక ప్రదేశాల్లో ప్రాచీన శిల్ప సంపదని ముందూ వెనకా చూడకుండా పిచ్చిరాతలతో నింపటం, దొరికిన కాడికి దోచుకుపోవటం. ఈ మధ్య, ప్రజలకి బుద్ధి నేర్పాల్సిన ప్రభుత్వాలూ ఆ పనిలో ఓ చెయ్యేస్తున్నాయి.

నాయకుల జ్ఞాపకార్ధం ప్రభుత్వ పధకాలకో, భారీ భవనాలకో, మహా కట్టడాలకో, రహదారులకో వాళ్ల పేర్లు పెట్టటం అన్ని దేశాల్లోనూ ఉన్న ఆచారమే. అయితే దానికీ ఓ పద్ధతుంది. అప్పటికే ఉన్నవాటిని అలాగే ఉంచి కొత్తగా వచ్చిన వాటికి నాయకుల పేర్లతో నామకరణం చెయ్యటం అందరికీ ఆమోదయోగ్యం. ఈ విషయంలో లోకమంతటిదీ ఓ దారయితే, మన ఉలిపికట్టె ప్రభుత్వాలది మాత్రం మరో దారి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రముఖ పధకాల, ప్రదేశాల పేర్లు మారిపోవటం ఇక్కడ అలవాటైపోయిన వింత. సదా అధిష్టానం కరుణా కటాక్షాల కోసం అలమటించే కాంగిరేసు కామందుల ఏలుబడిలోనయితే ఈ నామహరణాల భాగోతానికి అంతే లేదు. ఒకడు కేపీహెచ్‌బీ కాలనీ పేరు మారుస్తానంటాడు, మరొకడేమో ఏకంగా రాష్ట్రం పేరే ఇందిరా ప్రదేశ్ చెయ్యాలంటాడు! ఉన్నది చాలనట్లు – ఈ మధ్య ఊళ్లకీ, జిల్లాలకీ సైతం తమవారి పేర్లు పెట్టేసే పైత్యం మన రాష్ట్రంలో మొదలయింది. స్వయానా రాహుల్ గాంధీకే వెగటు పుట్టించే స్థాయి రాజీవ జపంలో తరించిపోయిన వైయెస్ శకం అంతమై రోశయ్య జమానా మొదలైనా, పాత వాసనలు మాత్రం పోయిన దాఖలాల్లేవు. జగన్ వర్గాన్ని బుజ్జగించటానికే పెట్టాడో, వైఎస్‌పై నిజంగానే భక్తి ప్రపత్తులెక్కువై పెట్టాడో కానీ – రోశయ్య చేసింది మాత్రం గర్హనీయం. ఆర్ధికంగా కుదేలైన భారత దేశాన్ని ఒడ్డుకు చేర్చిన రాజనీతిజ్ఞుడు పీవీ నరసింహారావు పేరిట తెలుగునాట ఏ ప్రముఖ జ్ఞాపకార్ధమూ లేదు. తెలుగువాడు వేరు, మదరాసీ వేరని మిగతా భారతావనికి తెలియనేర్పిన ఎన్టీరామారావుకీ ఏ మాత్రం గౌరవం దక్కలేదు. అప్పుడూ తెలుగోడు పట్టించుకోలేదు. ఆ మధ్య దాకా రాయలసీమకే పరిమితమైన పాలెగాళ్ల పంధాని, ఫ్యాక్షనిస్టుల దందాని ఐదేళ్లలో రాష్ట్ర రాజధానికి పాకించిన ముఠానేత పేరు కడప జిల్లాకి పెట్టటం విడ్డూరాల్లో విడ్డూరం. అయినా ఇప్పుడూ తెలుగోడు అలవాటుగా పట్టించుకోడు.

ఈ సందర్భంగా నాకో తెలుగు సినిమా జోక్ గుర్తొస్తుంది. ఆ సినిమాలో హాస్య నటుడు సునీల్ పాత్ర పేరు ఎర్రబ్బాయి. ‘నల్లగా ఉన్నావుగా. అదేం పేరు’ అన్న మరో పాత్రకి అతనిచ్చే బదులు: ‘అందుకే ఆ పేరెట్టుకున్నా. ఇప్పుడు చచ్చినట్లు నన్ను ఎర్రబ్బాయనాల్సిందే’!

అదీ సంగతి. అదీ – తెలుగోడు పట్టించుకోని కారణం.  జనం గుండెల్లో నిలిచిపోయిన నేతలకి మరణం లేదు. తరాలు మారినా జన హృదయాల నుండి వాళ్ల జ్ఞాపకాలు చెరిగిపోవు. వాళ్ల పేర్లు దేనికి పెట్టినా పెట్టకున్నా వాళ్ల గౌరవానికొచ్చిన లోటు లేదు. ఆ అవసరం రెండో రకం నేతలకే. ఆ అవసరం నకిలీ ఎర్రబ్బాయిలకే.

(ఇటువంటి అంశాల మీదనే చదువరి రాసిన పాత టపా ఇక్కడ, మరియు రేరాజ్ రాసిన తాజా టపా ఇక్కడ)


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,298

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.