Posts Tagged 'రాజకీయాలు'

ఏం పిల్లడో జైలుకొస్తవా

“రండి కదలి రండి నిదుర లెండి కలసి రండి
ఉప్పెనలా ఉరికి రండి ఉద్యమమై ఉబికి రండి
గనుల నుండి పనుల నుండి కణకణాగ్ని శిఖల నుండి
గత చరిత్ర పుటల నుండి మృతవీరుల చితుల నుండి
నివురుదీసి నిదుర లేచె ఈ నాటికి నిప్పురవ్వ ..”

“ఆగాగు. ఎవరా నిదుర లేచిన నిప్పురవ్వ?”

“ఇంకెవరు? తెలంగాణ గట్టుమీది సందమామయ్య .. మన కేసీయారన్న. కన్నాపరేషనయ్యాక ఉదయం ఐదింటికే లేస్తున్నాడు, మనల్నీ లెమ్మంటున్నాడు”

“అంత పొద్దున్నే లేచేం చేస్తాడు?”

“గాండ్రిస్తాడు, అచ్చు బెబ్బులిలా”

“సరే. మరి మనమెందుకు తోడుగా లేవటం?”

“జైలు కెళ్లటానికి”

“అదేంటి?”

“గాంధీజీ జనాలతో జైలుకెళ్లి స్వరాజ్యం తెచ్చినట్లు, మనల్ని జైలుకి తోలితే తెలంగాణ వస్తదని అన్నకి కలొచ్చిందట”

“!!”

* * * * 

‘ఐదారు నెలలుగా ఐపు లేడు. చప్పుడన్నా చెయ్యకుండా ఎక్కడ దాగున్నాడో’ అని దిగులు పెట్టుకున్న అఖిలాంధ్ర ప్రజానీకం ముఖారవిందాల్లో మందహాసాలు విరబూయిస్తూ వారం క్రితం రాష్ట్ర రాజకీయ యవనిక మీదకి పునరంగేట్రం చేశాడు కెప్టెన్ కేసీయార్. వారం రోజులుగా ఇందుగలడందులేడనకుండా ఎక్కడబడితే అక్కడ తానే అగుపిస్తూ తెగ సందడి చేస్తున్నాడు. అమ్మ కడుపు చల్లగా, రోజుకో కొత్త జోకు పేలుస్తూ రాష్ట్రం పొట్ట చెక్కలు చేస్తున్నాడు. నాగలి పట్టి నవ్వుల సాగు చేస్తున్నాడు. హాస్యం విరగ పండిస్తున్నాడు (నవ్వటమే ఎరగని మరో చందురుడు నిన్న పగలబడి నవ్విన అసలు కారణం – అదీ)

సదరు హాస్యవల్లరిలో భాగంగా, ‘కంటి ఆపరేషన్ తర్వాత ఆరోగ్యం బాగుపడింది, పొద్దున్నే ఐదుగంటలకే లేచి పని చేస్తున్నా. తెలంగాణ ద్రోహులారా, కాచుకోండి. బస్తీ మే సవాల్’ అంటూ హూంకరించాడు దొరబాబు నిన్న విలేకరుల సమావేశంలో. ‘లేస్తే నే మనిషినే కాను’ అన్నాట్ట వెనకటికో లేజీ ఫెలో. లేచినా లేవకపోయినా కేసీయారుడి తడాఖా ఏమిటో ఆంధ్రులకి ఆల్రెడీ తెలుసు కాబట్టి శ్రీవారు ప్రాతఃకాలానే పడక దిగినా, మధ్యాహ్నం దాకా ముసుగు తన్నినా పెద్దగా ఫరకుండదు. అయినా, అయ్యవారు ఐదింటికే లేచిపోవాలని ముచ్చట పడుతున్నారు కాబట్టి అలాగే కానీమందాం. ఓ పక్క వరదలు, మరోపక్క కుర్చీ కోసం తన్నులాటల మధ్యలో చికాకుగా రోజుల్లాగిస్తున్న జనాభాకి దొరవారు అదనపు గంటలు పనిచేసి మరీ కామిక్ రిలీఫ్ కలిగిస్తానంటే వద్దనటమేల?

కంటికి చికిత్స చేస్తే ఒంటికి నయమవటమేంటని తెల్లమొహాలేసిన అజ్ఞానులకి సారువారి గురించి తెలిసింది సున్నా అనుకోవాలి. మన్లో మాట .. చిన్నప్పుడెవరో ఆయన తుంటిమీద తంతే మూతిపళ్లు రాలాయట. కాబట్టి ఆయనకి కన్నాపరేషన్ చేస్తే ఒళ్లూ బాగుపడుతుంది, బుర్రా డామేజవుతుంది (కేసీఆర్ బుర్ర కొత్తగా డామేజవటమేంటంటే నాదగ్గర సమాధానం లేదు). ఇప్పుడదే జరిగింది. అందుకే ఈ వింత పలవరింతలు. నిన్నటిదాకా వద్దన్న తెలుగు తల్లి నేడు ముద్దయ్యింది, పెంపుడు తల్లేమో ఉన్న పళాన పిన్నై చిన్నబోయింది. ‘కేసీయార్ సమైక్యబాట పట్టాడహో‘ అని కోడై కూసిన దుష్టాంధ్రా వలస దుర్మార్గుల ఆ రెండో పత్రిక రాతల్లో సద్విమర్శే దర్శనమిచ్చింది. అందుకే మొన్నామధ్య పడతిట్టిన పత్రికనే నిన్న పొగిడేశారు – కొత్తగా కొనుక్కున్న చలువ కళ్లద్దాలోనుండి చలచల్లగా చూస్తూ.

‘మార్పు మంచిదేగా’ అనుకుంటున్నారా? ఆగండాగండి. అయ్యవారికి మరో కొత్త ముఖం జతపడిందంతే. వారు మారిందేమీ లేదు. ఆ తిట్లూ, పిట్టలదొర ప్రగల్భాలూ ఎక్కడికీ పోలేదు. ‘జైల్ భరో చేస్తాం, ఢిల్లీ దద్దరిల్లజేస్తాం’ అన్న కోతలూ ఆ సమావేశంలోనే కోశారు వారు. ‘బెబ్బులిలా గర్జిస్తా, కాస్కోండి, మగతనం చాటండి’ వగైరా కారుకూతలు షరా మామూలే. ‘ఇచ్చుడో చచ్చుడో’ ఐపోయింది, ‘పంచుడో దంచుడో’ కూడా ఐపోయింది. పాడె కట్టటం, బొంద పెట్టటం ఐపోయాయి. ముష్టెత్తటాలూ, కూలీ పని చెయ్యటాలూ ఐపోయాయి. యజ్ఞ యాగాదులు సైతం రానూ వచ్చాయి, పోనూ పోయాయి. ఇప్పుడు జైళ్లు నింపితేనూ, పులి అరుపులు అరిస్తేనూ పన్లవుతాయన్న మహత్తర అవిడియా వచ్చింది కన్నాపరేషనైన మన్నుబుర్రకి. ఢిల్లీ దద్దరిల్ల చేస్తాడట, కేంద్రాన్ని గడగడలాడిస్తాడట – లింగులింగుమంటూ ఉన్న ఇద్దరు ఎంపీలతోనే! ఆ ఇద్దర్లోనూ ఒకావిడ ఏడు గుళ్ల పూజారిణి; అంటే అంత బిజీ పర్సన్ అని కాదు – ఎప్పుడెక్కడుంటుందో ఎవరికీ తెలీదని. అసలు ఇప్పుడామె ఏ పార్టీలో ఉందో ఆమెకే తెలీదు. ఆవిడ తప్పిపోయిందని మెదక్ ఓటర్లు పోలీసులకి ఫిర్యాదిచ్చి ఐదు నెలలయింది, ఇంకా పత్తా తెలీదు. ఇక మిగిలిన ఏక్ నిరంజనుడు ఢిల్లీని ఎంత జోరుగా ఊపుతాడో చూడాలి.

ఇంతకీ – అయ్యవారు అయిదింటికే లేచి పని చేస్తున్నాడని విని ఆంధ్రా, సీమ వాసులు ఆనందభరితులవగా, ఆయన అనుయాయులు మాత్రం అదిరిపడ్డారు. ఈ ఊహించని ఉత్పాతానికి ప్రత్యేకవాదుల గుండెల్లో రాళ్లూ రప్పలూ పడ్డాయనీ, రైళ్లూ బస్సులూ పరిగెత్తాయనీ, ‘గురుడు పార్ట్ టైమ్ పని చేస్తేనే ఉద్యమానికి గుండు గొరిగించాడు. ఇప్పుడు ఎగేసుకుని ఓవర్ టైమ్ ఎగస్ట్రాలేస్తే తొందర్లో తెలంగాణ భవన్‌కి తాళాలే’ అంటూ వాళ్లు గొణుక్కుంటున్నారనీ అభిజ్ఞవర్గాల భోగట్టా. అసలు, రాష్ట్రంలో కేసీయార్ని మించిన సమైక్యవాది లేడని నాకెప్పట్నుండో అనుమానం. అదిప్పుడు బలపడింది. మొత్తానికి దొరబాబులో వరద కృష్ణమ్మని మించిన స్థాయిలో పరవళ్లు తొక్కుతున్న నవనవోత్సాహం చూస్తుంటే ఈ తడవ ప్రత్యేకవాదాన్ని ఎలాగైనా ఫినిష్ చెయ్యటానికి పూర్తి ప్రిపరేషన్‌తోనే వచ్చినట్లనిపిస్తుంది. విజయోస్తు.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 302,731

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.