Posts Tagged 'రాజకీయం'

పత్తిత్తులు

వారం రోజులుగా ఆంధ్రదేశంలో తెడేపాయేతర నాయకులందరి నోటా మోత మోగుతున్న మాట: రాజకీయం. బాబ్లీ గొడవలో చంద్రబాబునాయుడు రాజకీయం చేస్తున్నాడట. చూడబోతే, రాజకీయం అనేదో పరమ ఛండాలమైన పనని వాళ్ల ఉద్దేశంలాగుంది. అఫ్‌కోర్స్, మన ఉద్దేశమూ అదే అనుకోండి. కానీ ఆ మాట స్వయానా రాజకీయులే చెప్పుకోటం విడ్డూరం. ఇప్పుడూ – నాకు నా సహోద్యోగంటే పీకల్దాకా మంట. అది వెళ్లగక్కాలంటే ఆ వ్యక్తిని తిడతానే కానీ అతని వృత్తిని కాదు కదా. అలా చేస్తే నన్ను నేను తక్కువ చేసుకున్నట్లే. ఓ గాడిద మరో గాడిదని ‘అడ్డ గాడిదా’ అన్నట్లుంది వీళ్ల వరస. మరీ అంత తల లేనోళ్లా మన లీడర్లు! సరే, వాళ్ల తెలివితేటల సంగతి మనకెందుగ్గానీ, అయ్యవార్ల అమాయకత్వం మాత్రం చూడ ముచ్చటేస్తుంది. అదేంటో – చంద్రబాబో రాజకీయ నాయకుడన్న విషయం ఇప్పుడే కనుక్కున్నంత హాశ్చర్యం వాళ్ల ముఖాల్లో!

రాష్ట్రానికి సంబంధించినంతవరకూ – రాజకీయమనే ముడిపదార్ధమ్మీద సర్వహక్కులూ తమవి మాత్రమేనన్నదే యదార్ధమనీ, తక్కినవన్నీ మిధ్యనీ ఈ లీడర్ బాబుల నమ్మకం. ఉప ఎన్నికల సందర్భంగానే బాబ్లీ సమస్య బాబుకి గుర్తొచ్చిందా అని వాళ్ల సూటి ప్రశ్న. ఆ సమస్యపై ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నదీ, తన్నులు తింటున్నదీ (అవును – ఇంతకు ముందూ ఓ సారి తిన్నారు ఇదే తెదేపా వాళ్లు, ఇదే విషయంలో) తెదేపాయేనని సమయానుకూలంగా మర్చిపోవటం రాజకీయం కాదు. మరాఠాలతో మక్కెలిరగదన్నించుకున్న బాబు ఎక్కడ సానుభూతి ఓట్లు కొల్లగొడతాడోనన్న భయంతో అసలు సమస్యని పలుచన చేసే ప్రయత్నం కూడా రాజకీయం కాదు. బాబు ఇంకెప్పుడూ కుదరనట్లు ఇప్పుడే బాబ్లీ దర్శన కార్యక్రమం పెట్టుకోటం మాత్రమే రాజకీయం. మరే. ఈ విసుర్ల మాటున దాగున్నదల్లా ‘అడ్డెడ్డె, ఈ అవిడియా ముందు మాకే ఎందుకు రాలేదబ్బా’ అన్న సుమర్లే.

చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడన్న మొదటి మహానుభావుడు మన అముఖ్యమంత్రి. రాజకీయ నాయకుడు రాజకీయం చెయ్యక మరేం చేస్తాడో రాజకీయాల్లో పండిపోయిన రోశయ్యామాత్యులే వివరిస్తే బాగుండేది. రాజకీయవేత్తకి టైమింగ్ ముఖ్యం. అది అతని ఉనికికి మూలం. ఆ సంగతి తెలియని అమాయకులా రోశయ్య గారు? లేని సమస్యలు పుట్టించి మరీ రోజులు నెట్టుకొస్తున్న దొరలున్నారు మన రాష్ట్ర రాజకీయాల్లో. వాళ్లని వేలెత్తి చూపటం రోశయ్యగారికి చేతకాదు. అయినదానికీ కానిదానికీ ‘అయినను పోయి రావలె హస్తినకి’ అనుకుంటూ బయల్దేరటమ్మాత్రమే ఆయనకొచ్చిన విద్య. బాబ్లీ మనకో సమస్యే కాకపోతే, ఉప ఎన్నికల నేపధ్యంలో బాబు వేషాలేస్తున్నాడన్న విమర్శలో పస ఉండేది. ఒకవేళ ఇప్పుడు ఉప ఎన్నికల్లేకపోతే బాబుకి రోశయ్యగారి మద్దతుండేదా? అదేం రాజకీయం!

ఇక మన మాటల మరాఠీగారు చంద్రబాబు మరాఠీలకీ తెలుగోళ్లకీ మధ్య తగువు పెడుతున్నాడని వాపోయారు! తెలుగోళ్ల మధ్య ప్రాంతాలవారీ చిచ్చుపెట్టిన ప్రబుద్ధుడు వేదాలు వల్లించటం ఎంత ఎబ్బెట్టుగా ఉందో వర్ణించటమూ కష్టమే. దీనికి తోడు, మహారాష్ట్రలో ఉన్న తెలంగాణవారికి ఏమౌతుందోనన్న భయంతో ఈయన బాబ్లీ సమస్యపై ఆచితూచి వ్యవహరిస్తున్నారట. కోస్తా జనాలని కోసెయ్యండి, నరికెయ్యండి అన్నప్పుడు అక్కడ స్థిరపడ్డ తెలంగాణవారి సంగతేమిటన్న స్పృహ వీరికుండదు. మహారాష్ట్ర తెలంగాణవాసులపై అంత ప్రేమ కారిపోతుంటే ఈయన కలలుగంటున్న తెలంగాణ సామ్రాజ్యంలో అక్కడి భాగాలనీ కలపాలని ఎందుకు గొడవ పెట్టడో. మన తెలంగాణకన్నా అవతలి వైపు మరింత పేదరికంలో మగ్గుతుందన్నది సత్యం కాదా? పైగా, ‘సీమాంధ్ర మీడియా’ చంద్రబాబు యాత్రకి అనవసరమైన ప్రాధాన్యతిస్తుందని ఈయన గగ్గోలు. డెబ్భయ్యారు మంది ప్రజా ప్రతినిధుల్ని పక్కరాష్ట్రం నాలుగు రోజుల పాటు బొక్కలో తోసిన విషయాన్ని ప్రముఖంగా ప్రచురించిన సీమాంధ్ర మీడియానే, ఈయనగారి బక్కప్రాణం చేసిన ఉత్తుత్తి దీక్ష డ్రామాకి అంతకన్నా పెద్దగా బాకాలూదిందని మర్చిపోవటం ఏ రకం రాజకీయమో!

పైనోళ్లిద్దర్నీ మించి బాబు మీద నోరు చేసుకుందో పెద్దావిడ. ఈవిడకి ప్రపంచంలో అన్ని విషయాలూ తమ వంశం చుట్టూతే తిరుగుతుంటాయనో పిచ్చి నమ్మకం. తమ తండ్రిగారికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి తెలుగువారి ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత లేదట. ఆనాడు చంద్రబాబు ఎన్టీయార్ని ఏ పోటు పొడిచినా, అది వాళ్ల కుటుంబ సమస్యే తప్ప తెలుగుజాతిది కాదు. కానీ ఈనాడు మహారాష్ట్ర పోలీసులు కుళ్లబొడిచింది ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడినే కానీ అన్నగారి మూడో అల్లుడిని కాదు. అక్కడ పోయిన పరువు ఆంధ్రులదే తప్ప అన్నగారి కుటుంబానిది కాదు. ఐనా, ఆనాటి ఆగస్టు సంక్షోభంలో పతిదేవుడికి వీర తిలకం దిద్ది మరీ బాబుకి తోడు పంపిన నారీమణి, పదవులపై ఆరాటంతో తమ తండ్రిగారు జీవితాంతం వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీలో చేరటానికీ సిద్ధపడ్డ పుత్రికారత్నం తీరిగ్గా ఇప్పుడు వెన్నుపోటు ప్రేలాపనలు చెయ్యటం గురివింద నైజం. ఇదో దిక్కుమాలిన దివాలాకోరు రాజకీయం.

చెప్పొచ్చేదేమంటే, అందరూ అందరే.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,010

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.