Posts Tagged 'భాష'

విశిష్ట భాష

‘తెలుగుకి దక్కిన ప్రాచీన హోదా’ – మూడు రోజుల క్రితం రాష్ట్రంలో దినపత్రికలన్నింటిలోనూ ఇదే మొదటి వార్త. తెలుగుతో పాటు కన్నడాన్ని కూడా ప్రాచీన భాషగా గుర్తిస్తూ, ‘నవంబరు ఒకటిన ఈ రెండు రాష్ట్రాల అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రకటించిన కానుక ఇది’ అంటూ కేంద్ర మంత్రి అంబికా సోనీ వెల్లడించారు (‘ప్రాచీన భాష’ కన్నా ‘విశిష్ట భాష’ అనేది సరైన మాటని కొందరి అభిప్రాయం). దీనితో దక్షిణాదిన ఉన్న నాలుగు ప్రధాన భాషల్లో మూడింటికి ఆ హోదా దక్కింది. మరి మలయాళమొక్కటీ ఏ పాపం చేసిందో తెలియదు!

ఈ వార్త విన్న వెంటనే చాలామంది తెలుగు భాషా ప్రేమికుల్లో వెల్లివిరిసిన ఆనందోత్సాహాలు. పక్కవాడికి ఉన్నది నాదగ్గరా ఉందన్న వెర్రి ఆనందం తప్ప దానివల్ల మనకు నిజంగా ఏమి లాభం? ఎవరూ గమనించనిది – అదే వార్తలో ‘మద్రాసు హైకోర్టులో పెండింగులో ఉన్న ఒకానొక రిట్ పిటిషన్ పై రాబోయే తీర్పుకి లోబడే ఈ నిర్ణయం అమలు’ అన్న సదరు మంత్రి గారి సన్నాయి నొక్కులు. ఆ తీర్పు ఎప్పుడొస్తుందో, ఎలా ఉండనుందో అనూహ్యం. ప్రస్తుతానికైతే కేంద్రం మనకిచ్చింది ఖాళీ కుండే. దానికే ఇంత సంతోషమా!?!

ఇంత హడావిడిగా ప్రాచీన హోదాపై ప్రకటన చెయ్యటం వెనుక రాష్ట్రంలో కొద్ది నెలల్లో రానున్న ఎన్నికల ప్రభావం లేదంటే నమ్మటం కష్టం. మన పుణ్యభూమిలో ప్రతిదీ రాజకీయమే. కాదేదీ ఓటుకనర్హం. ఇప్పుడు కేంద్రం నెత్తినెక్కించుకుంటే తెలుగుకి అర్జెంటుగా ఒరిగిపోయేదేమిటో అంతుపట్టని విషయం. ఆ మాటకొస్తే తమిళానికీ, సంస్కృతానికీ ఆ హోదా వచ్చాక జరిగిన ప్రత్యేక మేలేదన్నా ఉందా? ప్రభుత్వం చెయ్యవలసింది తెలుగునాట కొడిగడుతున్న మాతృభాషా మమకారాన్ని పెంపొందించటం, ఆంధ్రుల ఇష్టభాషగా తెలుగుని వెలిగించటమే కానీ, విశిష్ట భాషో మరోటో అంటూ జోలపాడటం కాదు.

అసలు – ఏ భాష గొప్పదనం దానిది. దేశంలో ఉన్న అనేకానేక భాషల్లో నాలుగయిదింటిని మాత్రమే విశిష్టమైనవిగా గుర్తించటమంటే మిగతావాటిని అవమానించటమే. నిజానికి కేంద్రం ఇప్పుడు చేయాల్సింది తమిళం, సంస్కృతాలకి కూడా ప్రాచీన/విశిష్ట హోదా రద్దు చేయటం, ప్రభుత్వం దృష్టిలో అన్ని భాషలూ సమానమే అని నిర్ద్వందంగా ప్రకటించటం. మన దేశంలో జన రాజకీయాలెప్పుడో కనుమరుగైపోయాయి. ఇప్పుడున్నవన్నీ విభజన రాజకీయాలే. ఇప్పటికే దేశమంతా కుల, మత, ప్రాంతాలవారీ కుంపట్లు. వాటికి భాషనీ జత చేయనవసరం లేదు. రాజ్ థాకరే లాంటి ఉన్మాదులకి మరో మంత్రదండాన్ని చేతికందించే తెలివిమాలిన పనే ఇది.

(ఈ ఏడాది మే నెలలో ఇదే అంశమ్మీద నేను రాసిన మరో టపా – ఇక్కడ)


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,194

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.