Posts Tagged 'బుల్లి కారు'

కారు చవక

ఐదేళ్ల క్రితం నేను హైదరాబాదు వెళ్లినప్పటి సంగతిది. అప్పటికి ఆ నగరంలో అడుగు పెట్టి ఐదేళ్లు దాటింది. 1999 – 2004 మధ్య కాలంలో హైదరాబాదులో భారీగా రోడ్లు విస్తరించారని పత్రికలు, స్నేహితుల ద్వారా వినుండటం వల్ల ట్రాఫిక్ సమస్యల్లేని నగర ప్రయాణాన్ని గురించి కలలుగంటూ ఆ ఊర్లో దిగిన నేను బేగంపేట విమానాశ్రయం బయటికొచ్చేసరికి కఠోర వాస్తవంలోకొచ్చిపడ్డాను. నేనెరిగిన నాటితో పోలిస్తే రోడ్లు వెడల్పైన మాట నిజమే. కానీ ట్రాఫిక్ సమస్యలు దానికి రెండు మూడు రెట్లు పెరిగినట్లనిపించాయి. ఆ ఐదేళ్లలో హైదరాబాదు జనాభా రెట్టింపైతే కాలేదు. మరి ఇంత ట్రాఫిక్ ఎక్కడ నుండొచ్చింది? సమాధానం కోసం తలబాదుకునే పనేమీ రాలేదు. ఎటు చూస్తే అటు మెరిసిపోతూ కనిపిస్తున్న రంగు రంగుల, రక రకాల కార్లు ఆ గుట్టు అడక్కుండానే విప్పేశాయి. తొంభయ్యో దశకం చివర్లో హైదరాబాదులో విరివిగా నా కళ్లబడ్డ కార్లు ముచ్చటగా మూడు రకాలే: మారుతి, అంబాసిడర్, అప్పుడప్పుడే వస్తున్న హుండాయ్. ఐదేళ్లలో ఎంత మార్పు? అమెరికన్, జపనీస్, కొరియన్, జెర్మన్, ఇటాలియన్, పేర్లోనే భారతీయత జోడించుకున్న టాటా ఇండికా మరియు ఇండిగో. ఇక పాత కాపులు అంబాసిడర్, మారుతీ ఉండనే ఉన్నాయి. మొత్తమ్మీద, ద్విచక్ర వాహనాలకు సమానంగా కనిపిస్తున్న కార్ల సంఖ్య.

* * * * * * * *

దిగువ మధ్యతరగతి భారతీయుల కోసం రూపొందించబడ్డ టాటా నానో త్వరలో రోడ్లెక్కనుందన్న వార్త నిన్న ప్రపంచవ్యాప్తంగా మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత చవకైన కారుగా పేరుబడ్డ నానో గురించిన విశేషాలు ప్రచురించని ప్రముఖ వెబ్ సైట్, దిన పత్రిక లేవంటే అతిశయోక్తి కాదు. లక్ష రూపాయలకే (నేటి మారక విలువ ప్రకారం రమారమి రెండు వేల డాలర్లకే) ఓ ‘పీపుల్స్ కార్’ అందించాలని రతన్ టాటా కన్న కల, దాన్ని సాకారం చేసుకోటానికి ఆయన ఆరేళ్ల కృషిని పొగడని వారు లేరు. ప్రధానంగా భారతీయులనే దృష్టిలో పెట్టుకుని తయారు చేసినా, అన్నీ సక్రమంగా జరిగితే ఈ బుల్లి కారుని ఐరోపా, అమెరికా మార్కెట్లలోనూ ప్రవేశ పెట్టే ఆలోచనున్నట్లు రతన్ టాటా వెల్లడించటం నిన్నటి వార్తకి కొసమెరుపు.       

లాభ నష్టాలతో సంబంధం లేకుండా, కార్లంటే మోజున్న భారతీయ మధ్య తరగతికి ఓ కారు వారయ్యే భాగ్యం కల్పించాలన్నదే తన సంకల్పమన్నది ఆయన అనేక సందర్భాల్లో చెప్పిన మాట. ద్విచక్ర వాహనాల కన్నా కొంత మాత్రమే అధిక మొత్తానికి సొంతమయ్యే టాటా నానో వల్ల రహదారి ప్రమాదాలు తగ్గుతాయన్నది కూడా అప్పుడెప్పుడో ఆయనే చెప్పిన మాట. ఆ మాటల్లో వాస్తవం ఎంతున్నా, ద్విచక్ర వాహనదారులని వల్లో వేసుకునే మార్కెటింగ్ ఉపాయమూ అందులో దాగుంది. రతన్ టాటా కల, దాన్నాయన సాకారం చేసుకున్న తీరు వినటానికి బాగానే ఉన్నాయి. టాటా నానోని పారిశ్రామికంగా మనదేశం సాధించిన అభివృద్ధికి చిహ్నంగా చూపే వాళ్లూ కొందరున్నారు. ఐతే ఈ పొగడ్తల హోరులో అందరూ అంతగా దృష్టి పెట్టని విషయాలు కొన్నున్నాయి.     

ఓ ఆటో రిక్షా కన్నా తక్కువ ఖరీదుకే వస్తున్న చవక కారులో నాణ్యతా ప్రమాణాలేపాటివి? రహదారి ప్రమాదాలు తట్టుకోగల భద్రతా ప్రమాణాలు ఉన్నాయా? వచ్చే రెండు మూడేళ్లలో నానోకి పోటీగా పలు ఇతర కంపెనీల నుండి కూడా కుప్పలు తెప్పలుగా బుల్లి బుల్లి కార్లు రంగ ప్రవేశం చేయబోతున్న తరుణంలో వాటి భద్రతకి సంబంధించిన ఈ ప్రశ్నలు అత్యంత ముఖ్యమైనవి. ఇవి నగర ప్రయాణానికి మాత్రమే అనువైనవిగా వాటిని తయారు చేసే సంస్థలు చెప్పొచ్చుగాక. కొనుగోలుదారులు వాటినేసుకుని హైవేలెక్కరని నమ్మకం మాత్రం లేదు. ఒకటో రెండో తప్పిస్తే – మిగతా భారతీయ హైవేల సొబగులు అందరికీ తెలిసినవే. ఈ బుల్లి కార్లు ఆ రోడ్లని తట్టుకోగలవా?     

రెండవది – ఈ కార్ల మన్నిక గురించిన ప్రశ్న. మనదేశంలో ఒక కారు సగటు వాడకం పది సంవత్సరాలకి తక్కువుండదు. సొంతదారులు మారితే మారొచ్చు, కారు మాత్రం దశాబ్దమన్నా ఉపయోగంలో ఉంటుంది. నానో వంటి బుల్లి కార్ల రాకతో ఈ పరిస్థితిలో మార్పులు రావటం తధ్యం. సెకండ్ హ్యాండ్ కార్ల వాడకం క్రమేణా కనుమరుగైపోవచ్చు. సరే, సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం చేసేవారి బ్రతుకులు బజార్న పడతాయన్నది ఇక్కడ సమస్య కాదు. దాన్ని మించినది – ఈ పాడు పడ్డ కార్లన్నీ ఎక్కడికి పోతాయన్నది. ఏడాదికి పాతిక లక్షలకి తక్కువ కాకుండా బుల్లి కార్ల మార్కెట్ ఉంటుందనేది ఓ ప్రాధమిక అంచనా. మన దేశంలో వాడేసిన కార్లని రీసైకిల్ చేసే విధానం ఉన్నట్లు నేను వినలేదు. అన్ని విషయాల్లో లాగానే ఈ విషయంలోనూ ప్రభుత్వం తరపున స్పష్టమైన నిబంధనలూ, వాటిని అమలు చేసే చొరవా, సత్తా ఉన్నాయన్నది అనుమానమే.    

మూడవది – ఈ కార్ల వల్ల పెరగనున్న వాయు కాలుష్యం. వీటిని ఏ స్థాయి ఎమిషన్ కంట్రోల్ ప్రమాణాలను అందుకునేలా తయారు చేస్తారో ఎవరికీ తెలిసినట్లు లేదు. తూతూ మంత్రంగా – ఉండటానికి మనదేశంలో వాహనాలకి సంబంధించిన స్మాగ్ చెక్ నియమాలు కొన్నున్నాయి కానీ అవెంత గొప్పగా అమలవుతాయో అందరికీ తెలిసిందే. లక్షల సంఖలో రోడ్లెక్కనున్న ఈ బుడత కార్లు ఇప్పటికే ఉన్న కాలుష్యానికి ఉడతా భక్తిగా తమ వంతూ జోడిస్తే ఇక నగర వాసులకి నరకమే (ఇప్పటికే అందులో ఉండకపోతే).  

చివరిది – ఈ బుల్లి కార్లు భారత దేశ ఇంధన బిల్లుకి పెట్టబోతున్న భారీ చిల్లు. దేశీయావసరాలకి తొంభై శాతం దాకా ఇంధనం దిగుమతి చేసుకుంటూ విదేశీ మారక ద్రవ్యంలో అత్యధిక శాతం దానికే ఖర్చు పెట్టే దేశంలో ఇటువంటి బుల్లి కార్ల నిర్మాణానికి ఎడా పెడా అనుమతులిచ్చేయటం కేంద్ర ప్రభుత్వాల హ్రస్వ దృష్టికి నిలువెత్తు దర్పణం. వీటి రాకతో రెండింతలవబోతున్న ఇంధన డిమాండుని దేశం ఎలా ఎదుర్కోబోతుంది? ప్రత్యామ్నాయ ఇంధనాల వైపుగా మనవాళ్లు చూపు సారిస్తున్న ఆనవాళ్లూ లేవు. కనీసం ప్రజా రవాణా సదుపాయాలని మెరుగు పరచటం, బస్సులు, రైళ్ల వంటి మాస్ ట్రాన్సిట్ సౌకర్యాల వాడకాన్ని ప్రోత్సహించటం, ఇంధన వాడకం తగ్గించటం మీద ప్రజల్లో అవగాహన కల్పించటం .. ఇత్యాది చర్యలనైనా ప్రభుత్వాలు చేపట్టకపోవటం శోచనీయం.   

* * * * * * * *

కొన్నేళ్లలో నేను మళ్లీ హైదరాబాదొచ్చినప్పుడు – శంషాబాదు విమానాశ్రయం నుండి ఇంటికెళ్లే దారిలో – రోడ్ల మీద జనాలకి బదులు బిలబిలలాడుతూ కార్లే కనిపిస్తే వింత లేదు. బిక్కుబిక్కుమంటూ వెళ్తున్న ఒకటో రెండో మోటారు సైకిళ్లపై ఆక్సిజన్ మాస్కులు తొడుక్కున్న చోదకులని చూసి ఆశ్చర్యపోనవసరం లేదు. ఎక్కడబడితే అక్కడ రోడ్ల పక్కన పారేసిన తుప్పు పట్టిన బుల్లి కార్లని చూస్తూ నోరు తెరవాల్సిన పనీ లేదు. ఉన్నదల్లా ఒకటే ప్రశ్న – ఆ అధివాస్తవిక దృశ్యాలు జీర్ణించుకునే శక్తి నాకుందా? 


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,298

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.