Posts Tagged 'బాలకృష్ణ'

తారలెంతగా మెరిసేనో

రేడియోలు రాజ్యమేలిన కాలంలో, వేసవి రాత్రులు వీధిలో మంచమేసుకు పడుకుని నీలాకాశంలో చుక్కల్లెక్కబెట్టే పనిలో మునిగి తేల్తుండగా దూరం నుండి పిల్లగాలి తెమ్మెర తెరలు తెరలుగా మోసుకొచ్చే మహమ్మద్ రఫీ మంద్రమైన మధుర గానం – గుర్తుందా? సైనికుల కోసం ప్రత్యేకించిన ఆకాశవాణి జనరంజని కార్యక్రమంలో సిపాహీ సర్వజిత్ సింగ్, హవల్దార్ హర్జిత్ సింగ్ తతిమ్మా సైనిక శ్రోతలడిగే పాటల్లో నూటికి తొంభై రఫీ లేదా కిశోర్ పాటలే ఉండటం అప్పట్లో నాకు వింతనిపించేది. వాళ్లిద్దరూ కాక హిందీలో గాయకులే లేరా అనుకునేవాణ్ణి. ఆ ప్రశ్నకి తర్వాతెప్పుడో సమాధానం దొరికిందనుకోండి. ప్రస్తుతం నేను చెప్పదలచుకుంది, రఫీ పాటలతో నాకు పరిచయం ఎలా అయిందనే విషయం మాత్రమే. అలా అయిన పరిచయం కాలక్రమంలో ఆయన పాడిన పాతికవేల పైచిలుకు పాటల్లో ఐదారొందల అద్భుత గీతాలు సేకరించి పెట్టుకునేవరకూ దారితీసింది.

కిశోర్, రఫీ ఇద్దరూ ఇద్దరే ఐనా నాకెందుకో రఫీ పాటలంటేనే కొంత ఎక్కువ ఇష్టం. బహుశా నా అభిమాన గాయకుడు ఎస్పీబీ మీద రఫీ ప్రభావం వుండటం దానిక్కారణమేమో. రఫీ తెలుగులో పాడిన పాటల్లో నాకు బాగా నచ్చినవి రెండు. రెండూ ‘అక్బర్ సలీం అనార్కలి’ చిత్రంలోనివే. వాటిలో ఒకటి ‘తారలెంతగా మెరిసేనో’ కాగా రెండవది ‘తానే మేలిముసుగు తీసి’. ఇవి కాక ఆయన తెలుగులో పాడినవి మరో పదిహేను దాకా ఉన్నాయనుకోండి, కానీ వాటిలో ఎక్కువ హిందీ స్వరాలకి తెలుగు అనుకరణలు కావటం వల్లో, లేదా ఆయన తెలుగుని ఖూనీ చేస్తూ పాడటం వల్లో మొత్తమ్మీద నా దృష్టిలో అవి సోసో.

ఈ మధ్య పాత హిట్ పాటల్ని నేటి తరం గాయకులతో మళ్లీ పాడించి కొత్త సినిమాల్లో వాడుకునే ప్రయోగాలు మొదలయ్యాయి కదా. ఆ పరంపరలో ఎవరన్నా ‘తారలెంతగా మెరిసేనో’ని సోనూ నిగమ్‌తో పాడించి (బాలూ కన్నా ఇతని మీద రఫీ ప్రభావం మరింత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది గమనించారా?) ఏ జూనియర్ ఎన్టీయార్ సినిమాలోనో వాడతారేమోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా నేను. అదటుంచితే – నాలుగైదు రోజుల కిందట యూట్యూబ్‌లో యధాలాపంగా ‘తారలెంతగా మెరిసేనో’ వీడియో నా కంటపడింది. దాన్ని మీతో పంచుకునేందుకే ఈ టపా. టీనేజ్ బాలకృష్ణ ఎంత చక్కగా ఉన్నాడో చూడండి (ఆ విగ్గు మాత్రం .. షరా మామూలే. విగ్గుల పిచ్చి అప్పట్నుండే ఉందన్నమాట!) ఆసక్తి కలవారి కోసం పాట సాహిత్యం, ఇతర వివరాలు – కింద.

చిత్రం: అక్బర్-సలీం-అనార్కలి  దర్శకుడు: ఎన్టీయార్  సంగీతం: సి.రామచంద్ర  సాహిత్యం: సి.నారాయణరెడ్డి

సాకీ:
ఏ మాయని గురుతు కోసం ఈ గాయం కలవరించెనో
ఏ తీయని వలపు కోసం ఈ గేయం పలవరించెనో

పల్లవి:
తారలెంతగా మెరిసేనో చందురుని కోసం
రేయి ఎంతగా మురిసేనో దినకరుని కోసం

చరణం:
చిగురుటాకులే చేతులుగా
మిసిమి రేకులే పెదవులుగా
పరిమళాలే పిలుపులుగా
మకరందాలే వలపులుగా
పూవులెంతగా వేచేనో తుమ్మెదల కోసం

చరణం:
నింగి రంగులే కన్నుల దాచి
కడలి పొంగులే ఎదలో దాచి
గులాబి కళలే బుగ్గల దాచి
మెరుపుల అలలే మేనిలో దాచి
పరువాలెంతగా వేచేనో పయ్యెదల కోసం

ఈ పాటకి రెండు వెర్షన్లు ఉన్నట్లున్నాయి. రెంటిలోనూ సాహిత్యం ఒకటే అయినా, సినిమాలో వాడిన పాటకీ ఆడియో రికార్డుల్లో విడుదలైన పాటకీ చిన్న చిన్న తేడాలున్నట్లు నాకనిపించింది. ఆడియో వెర్షన్ కూడా లంకె ఇస్తున్నాను.

Audio Version


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 302,465

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.