Posts Tagged 'బఫెలో వింగ్స్'

వేడి కుక్కలు, గేదె రెక్కలు

అమెరికా వచ్చిన తొలినాళ్లలో అంతా గందరగోళంగా ఉండేది నాకు. అందరికీ అంతేననుకుంటా. రోడ్లమీద ట్రాఫిక్, కరెంట్ స్విచ్‌లు, డోర్ నాబ్స్ – అన్నీ రివర్సే. ఇవి చాలనట్లు మైళ్లు-కిలోమీటర్లు, కేజీలు-పౌండ్లు, లక్షలు-మిలియన్లు, సెల్సియస్-ఫారన్‌హైట్ వగైరా కన్వర్షన్లొకటి. ఇక రూపాయలు-డాలర్ల గొడవుండనే ఉంది. ‘యెస్’ అంటానికి మన స్టైల్లో తలూపితే తెల్లదొరలు ‘నో’ అనుకుని కన్‌ఫ్యూజైపోయేవాళ్లు. అదో గోల. వీటన్నిట్నీ మించింది తిండి గోల.

మొదటిసారి డామినోస్ పిజ్జాకి వెళ్లినప్పుడు నా స్నేహితుడు – వాడప్పటికే ఏడాది పాత కాపు – ‘బఫెలో వింగ్స్ తింటావా’ అంటే తికమకపడిపోయా. ‘గేదె రెక్కలా!?! ఫెయిరీ టేల్స్‌లోనూ, ఫ్యాంటసీ కధల్లోనూ రెక్కల గుఱ్ఱాల గురించి వినున్నాం. రెక్కల గేదెల గురించెక్కడా విన్లేదే! ఈ దేశంలో అలాంటివుంటాయా? ఏమో, ఎంతైనా అమెరికన్లసాధ్యులు. జన్యు మార్పిడో మరోటో చేసి వాటినీ పుట్టించేశారేమో. అయినా మనం బీఫ్ తినం కదా. తిననప్పుడు అవి రెక్కలైతేనేంటి, గిట్టలైతేనేంటి’ అనుకుని వద్దన్జెప్పా. రెక్కల గేదెలెక్కడుంటాయో వాడినే అడుగుదామనుకుని కూడా ఇగో అడ్డొచ్చి ఆగిపోయా. ఇంటికొచ్చాక వాటికోసం ఇంటర్నెట్లో వెదికితే తెలిసింది – అవి చికెన్ వింగ్సనీ, న్యూ యార్క్ రాష్ట్రం బఫెలో నగరంలో మొదటిసారిగా వీటిని తయారు చెయ్యటం వల్ల వాటికి బఫెలో వింగ్స్ అనే పేరు స్థిరపడిపోయిందనీ. ఫాస్ట్ ఫార్వార్డ్ చేస్తే, ఇప్పుడు గేదె రెక్కలు నాకత్యంత ప్రీతిపాత్రమైనవి.

పసిఫిక్ తీరంలో క్యాలిఫోర్నియా సహిత పశ్చిమ రాష్ట్రాలన్నీ ఒకప్పుడు మెక్సికో అధీనంలో ఉండేవి. వీటిలో చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ మెక్సికన్ (స్పానిష్) భాష రెండో భాషగా చెలామణిలో ఉంది. అనేక నగరాలు, కొన్ని రాష్ట్రాల పేర్లు కూడా మెక్సికన్ తరహాలో ఉంటాయి. శాన్ ఫ్రాన్సిస్కో, శాక్రమెంటో, లాస్ ఏంజెలెస్, శాన్ ఆంటోనియో, కొలరాడో మొదలైనవి. వీటిలో కొన్నిటి పేర్లు శుభ్రంగా ఆంగ్లంలో ఉన్నదున్నట్లు పలికితే కుదర్దు. ‘San Jose’ ని ‘శాన్ హోసె’ అనీ, ‘La Jolla’ ని ‘లా హోయా’ అనీ పలకాలి. ఇలాంటి వింత పేరుగల ఒకానొక తిండి పదార్ధంతో నాకోసారి పెద్ద తంటా వచ్చింది.

ఆ రోజు ఆఫీసు కెఫటేరియాలో లంచ్‌కెళ్లాను. ఏం తీసుకుందామా అని చూస్తుంటే అక్కడ మెన్యూలో ‘quesadilla’ అనేది కనబడింది. అదేంటో మనకి తెలీదు కానీ మెన్యూలో ఉన్న బొమ్మ మాత్రం నోరూరిస్తుంది. సరే ఇదే లాగిద్దాం అనుకుని లైన్లో నిలబడి నా వంతొచ్చినప్పుడు స్టైల్‌గా ‘వన్ క్యూసడిల్లా ప్లీజ్’ అన్నా. ‘Excuse me?’ అనేది కౌంటర్లో ఉన్నతని క్వశ్చన్ మార్కు ముఖం నుండొచ్చిన బదులు. ‘పాపం చెవిటివాడేమో’ అనుకుంటూ మళ్లీ ‘వన్ క్యూసడిల్లా’ అన్నా అతనికేసి జాలిగా చూస్తూ, ఈ సారి కాస్త గట్టిగా. ‘I’m sorry. I don’t get you’ అనేదతని ప్రతిస్పందన. నా వెనక లైన్లో ఉన్న తెల్లోడెవరో కిసుక్కుమన్నాడన్న అనుమానం. మరుక్షణం మరిన్ని నవ్వులతో కెఫటేరియా ప్రతిధ్వనిస్తున్న ఫీలింగ్. అది నా చిత్తభ్రమా లేక నిజమా? సరే, ఈ గోలంతా ఎందుకనుకుని ‘this one’ అంటూ మెన్యూకేసి వేలెత్తి చూపించా. ‘ఓ.. కేసడీయ?’ అన్నాడతను. ‘తస్సదియ్యా, అది కేసడీయానా’ అనుకుంటూ ఔనౌనన్నట్లు గొర్రెలా తలాడించా. తీరా ఆర్డరొచ్చాక తినిజూస్తే – బొమ్మలో కన్పించినంత రుచిగా నిజం ‘క్యూసడిల్లా’ అన్పించలా, అది వేరే కధ.

గేదె రెక్కలు, క్యూసడిల్లాల్లా పేర్లతో తికమక పెట్టిన వంటలు మరికొన్నీ ఉన్నాయి. హాట్ డాగ్స్ వాటిలో మొదటివి. మొదటి సారి ఆ పేరు విన్నప్పుడు మరీ కుక్కల్ని తినేంత మొహం వాచిపోయారేంట్రా బాబూ వీళ్లు మాంసాహారానికి అనుకుని జాలి పడ్డా. తీరా చూస్తే అది కుక్క మాంసం కాదు. కుక్క మాంసం కాదనే కానీ, హాట్ డాగ్స్ ఎలా చేస్తారో నేనిక్కడ రాస్తే మీ మానిటర్లు ఖరాబయ్యే అవకాశముంది. పైగా వాటిని తినేవాళ్లెవరన్నా మీలో ఉంటే నన్ను తిట్టుకోవటం ఖాయం. ఇప్పటిదాకా రుచి చూడకుండా, ఇకముందు చూసే ఉద్దేశంతో ఉంటే మాత్రం you don’t want to know ..  కాబట్టి రాయట్లేదు (హమ్మయ్య. మొత్తమ్మీద, ఎలా చేస్తారో చెప్పకుండానే నేననుకున్న ఎఫెక్ట్ సాధించేశా). 

వేడి కుక్కల తర్వాత స్థానం పెప్పరానీది. నాకు పిజ్జా అంటే పెద్దగా ఇష్టముండదు కానీ ఓ సారెవరో ‘పెప్పరానీ పిజ్జా రుచి చూస్తావా’ అనడిగితే ‘ఓహో. పెప్పర్ కుమ్మేసుంటారు, మాంఛి స్పైసీగా ఉంటుంది కాబోలు’ అనుకుంటూ హుషారుగా ఓకే చెప్పా. తీరా తినబోయేముందు ఎందుకో అనుమానమొచ్చి అడిగితే అది బీఫ్ మరియు పోర్క్ సమ్మేళనమని తెలిసి పిజ్జా సన్యాసం చేశా. (నా వరకూ ఆ రెండూ తినకపోవటానికీ మతానికీ సంబంధం లేదు. బీఫ్ రుచి నాకు నచ్చదంతే. పోర్క్ తినకపోవటానికో  ప్రత్యేక కారణముంది, అదేమిటో పందిరాజములో వివరించబడింది) 

వీటన్నిటి తర్వాతిది ‘చీజ్ బర్గర్’. చీజ్ కుమ్మబడిన వెజిటేరియన్ బర్గర్ కాబోలుననుకుని ఆర్డరిస్తే వచ్చాక తెలిసింది అది బీఫ్ బర్గరని! ‘చిల్లీ సూప్’ తో కూడా అదే అనుభవం. కారం ఇరగదీసుంటారు, మనకి పండగే పండగ అనుకుని లొట్టలేసుకుంటూ కొనుక్కుని సేవించబోతే తెలిసింది – ఈ చిలీ (చిల్లీ) నిజానికి గ్రౌండ్ బీఫ్ మరియు మిరప కారం మిశ్రమమని. మరోసారి సుషీ అనబడే జపనీస్ పిండం ముద్దల్ని పేరు చూసి శుచిగా, రుచిగా ఉంటాయని పొరబడి మింగబోతే – అందులో ఉండేది పచ్చి మాంసమట – కళ్లు తిరిగి ముద్ద నోట్లోకొచ్చింది. అబ్బో తొలి ఆర్నెల్లలో ఇలాంటి అనుభవాలు ఒకటా రెండా. ఆ దెబ్బకి ఇప్పటికీ నేను ఏ వంటకాన్నీ కేవలం పేరు చదివి ఇందులో ఫలానావుంటాయని కమిటైపోను. కొత్త వంటకం ఎదురైతే వంటవాడిని అందులో ఉన్నవేంటో ఒకటికి రెండుసార్లు అడిగి కానీ కొనను, తినను.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.