లక్ష్యం ఎంత ఉన్నతమైనదైనా, ఆశయం ఎంత ఉదాత్తమైనదైనా దాని సాధనకి ఎంచుకునే మార్గం సైతం అంత ఉన్నతంగానూ ఉండాలని ఏనాడో మహాత్ముడు చెప్పిన సుద్దు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నదేంటి? మొన్నటిదాకా హైదరాబాదులో వేర్పాటువాదం పేరిట సాగిన పెను విధ్వంసం. రెండు రోజుల నుండీ, సోనియామ్మ పుట్టిన రోజు కానుక పేరుతో కేంద్రం పెట్టిన చిచ్చు దరిమిలా సమైక్యవాద నినాదంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మొదలైన వినాశనం. ఆర్టీసీ బస్సుల దహనం. బందులు, హర్తాళ్లు. చస్తామనే బెదిరింపులు. ప్రభుత్వాస్తుల విధ్వంసం.
ఎవరిదీ పాపం కట్టుకున్న పుణ్యం? నిస్సందేహంగా కాంగ్రెస్ అధిష్టానానిదే. రెండు వారాల కిందటివరకూ చచ్చిన పాములా పడున్న మనిషొకడు పది రోజులు నిరాహార దీక్ష నాటకమాడితే, అతని వందిమాగధులో వందమంది బస్సులు తగలెడితే, అదే అదనుగా కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర పార్టీ పగ్గాలు పూర్తిగా తన చేతిలోకి తెచ్చుకునే దురాలోచనతో ఏకంగా రాష్ట్ర విభజనకే జెండా ఊపితే .. అది ప్రజల్లోకి పంపే సందేశం ఏమిటి? ‘పనులవ్వాలంటే పంబ రేగ్గొట్టాల్సిందే, ప్రభుత్వాస్తులు తగలబెట్టాల్సిందే’ అని కాదా?
ఈ తప్పుడు సందేశం రాత్రికి రాత్రే రాష్ట్రంలోనే కాక, దేశవ్యాప్తంగా బలంగా అల్లుకుపోయింది. ఎంత బలంగానంటే, తెల్లవారే లోపు పదికి పైగా కొత్త రాష్ట్రాల ఏర్పాటు వాదనలు వినిపించేంత! రాష్ట్రంలో అగ్గి రాజేసి, ఆ సెగలతో ఢిల్లీ జనపథంలో తీరి కూర్చుని డిసెంబరు చలి కాచుకుంటున్న అధిష్టానం అండ్ కో మాత్రం తామెంత ప్రమాదకర ధోరణికి అంటుకట్టారో గ్రహించినట్లు అనిపించటం లేదు. బహుశా, గ్రహించినా వాళ్లకేమీ ఫరకు లేదేమో. వాళ్లకు కావలసంది విభజించి పాలించే వెసులుబాటు. దానికోసం అవసరమైతే ఎన్ని రాష్ట్రాలైనా విడగొట్టటానికి వాళ్లు తయార్.
ప్రజల్లో భావావేశాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే రాజకీయ పక్షాలకీ, వాటి అధినేతలకీ రాష్ట్రం ఇప్పుడు అట్టుడుకుతున్న వైనం చూసైనా బుద్ధొస్తుందనుకోవటం బొత్తిగా అమాయకత్వం. వచ్చేవేమన్నా ఉంటే అవి – చిచ్చులు పెట్టటానికి మరిన్ని ఐడియాలు, ఎంత సులువుగా విద్వేషాలు ఎగదోయొచ్చనేదానిపై అంచనాలు.
అసలింత రచ్చకీ నారు పోసిన దోషి బీజేపీ. ఎనభైల చివర్లో తమ ప్రాబల్యం పెంచుకోటానికి దేశాన్ని మత ప్రాతిపదికన నిట్టనిలువునా చీల్చిన పార్టీయే, హైదరాబాదులో తమకున్న అంతో ఇంతో ఉనికిని విస్తరించుకునే కపటాలోచనతో ఏ నాడో సద్దుమణిగిపోయిన ప్రత్యేక తెలంగాణవాదాన్ని పిలక పట్టుకు పైకి లాగింది. ‘ఒక వోటు, రెండు రాష్ట్రాలు’ నినాదంతో తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టి 1998 సార్వత్రిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలని చూసింది. ఆ ఎన్నికల అనంతరం (అప్పట్లో) సమైక్యవాద టీడీపీ దోస్తీ కేంద్రంలో తన ప్రభుత్వ మనుగడకి ప్రాణాధారమై తాత్కాలికంగా తెలంగాణ అజెండాని పక్కనబెట్టినా, చంద్రబాబు జమానాలో పదవి దక్కక ‘కింకర్తవ్యం’ అనుకున్న కేసీయారుకి మంత్రదండంలా దొరికింది నాడు బీజేపీ మూలన పడేసిన వేర్పాటు నినాదమే. అలా – రాష్ట్రం నేడు రావణకాష్టంలా రగలటానికి నాడు రాముడి పార్టీ మొదలెట్టి మధ్యలో వదిలేసిన అశ్వమేధం సగం కారణం. ప్రాంతీయ విద్వేషాలు ముదిరి నరమేధానికే దారితీస్తే దానికి మొదట నిందించాల్సింది వాళ్లనే. వాళ్లు రాజేసిన నెగళ్లకు స్వీయ ప్రయోజన పరిరక్షణాభిలాషతో శక్తిమేరా ఆజ్యమూది రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చిన పాపంలో సింహ భాగం తెరాస, కాంగ్రెస్ పార్టీలది; కొంత భాగం తెదేపాది.
తమ సంకుచిత రాజకీయాలకెంత ‘ప్రజల ఆకాంక్ష’ ముసుగు తొడిగినా వీటి వెనకుండేదెప్పుడూ స్వార్ధ ప్రయోజనాలే. ప్రజల కోరికే ప్రామాణికమైతే మరి మెజారిటీ కాశ్మీరీల అభీష్టం మన్నించి ఆ రాష్ట్రాన్ని దేశం నుండి విడగొట్టరేం – అలా చేస్తే తమకొచ్చే పొలిటికల్ మైలేజీ పూజ్యం కనుక. వేర్పాటువాదం ఏ రూపంలో ఉన్నా మొదట్లోనే అణచేయటం కేంద్రం కర్తవ్యం కావాలి. రాష్ట్రాల్ని విడదీయటం వల్ల సాధారణ ప్రజలకు ఒరిగేది సున్నా. అయినా ఎక్కడికక్కడ ప్రత్యేక రాష్ట్ర వాదనలు పుట్టుకొస్తున్నాయంటే, దానిక్కారణం పార్టీలు జన హితం కన్నా తమ ప్రయోజనాలే మిన్న అనుకోవటం. మొత్తమ్మీద, పార్టీల కుర్చీలాటలో బలిపశువులెప్పుడూ సాధారణ ప్రజలే. ఇప్పుడు వారితో వారి ఆస్థులనే తగులబెట్టించి తమ ప్రయోజనాలు తీర్చుకునే కొత్త ధోరణి మొదలయింది. మంటలంటించి మజా చేసుకునే వీళ్ల పాపాలకు లేదు నిష్కృతి; తేలిగ్గా భావావేశాలకు లోనై విచక్షణ మరిచే ప్రజలున్నంత కాలం భారతావనికీ లేదు పురోగతి.
మీ మాట