Posts Tagged 'పరిశోధన'

పన్ను నొప్పి

కొన్నేళ్లుగా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం. నీటిలో సహజంగా ఉండే కాల్షియం ఫ్లోరైడ్ శాతం మోతాదు మించటం వల్ల వచ్చే సమస్య ఇది. ఈ నీటిని తాగటం, వంటల్లో ఉపయోగించటం వల్ల ఎముకల పటుత్వం లోపించటం, బుద్ధిమాంద్యం, కేన్సర్, జన్యు పరమైన లోపాలు, ఇతరత్రా జబ్బులు వచ్చే అవకాశం ఉంది. మన దేశంలో ఫ్లోరోసిస్ సమస్యపై పోరాటానికి ప్రభుత్వం ప్రతి ఏటా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. అయితే అమెరికాతో సహా కొన్ని పాశ్చాత్య దేశాల్లో మునిసిపాలిటీలు సరఫరా చేసే మంచినీటిలో కాల్షియం ఫ్లోరైడ్ కన్నా రెట్టింపు ప్రమాదకరమైన సిలికో ఫ్లోరైడ్ అనే పదార్ధాన్ని కలపటం తప్పనిసరి చేస్తూ చట్టాలున్నాయన్నది ఓ నమ్మలేని నిజం. అమెరికాలో దశాబ్దాల క్రితం పెట్టుబడిదారీవర్గాల సారధ్యంలో రూపుదిద్దుకున్న ఓ మహానాటకం నేడు ప్రపంచవ్యాప్తంగా దంత వైద్యుల పంట పండిస్తుందన్నది మరో కలవరపరిచే నిజం. ఏ దేశంలో ఉన్నా, మీరూ ఈ మాయవలలో చిక్కిన చేపలే అయ్యుండే అవకాశం మెండు. చదవండి.

                                    * * * *

1909లో అమెరికాలో కొలరాడో రాష్ట్రంలో ఫ్రెడెరిక్ మెకే అనే దంతవైద్యుడు ఓ విషయం గమనించాడు. ఆ రాష్ట్రంలోని కొలరాడో స్ప్రింగ్స్ అనే ప్రాంతంలో చాలామంది వ్యక్తుల దంతాలు ఇతర ప్రాంతాల వారితో పోలిస్తే ఎక్కువగా గార పట్టి, చాలా పెళుసుగా ఉండేవి. వాటి మీద పసుపు రంగులో మచ్చలు కూడా ఉండేవి. నేటి దంతవైద్యుల పరిభాషలో ఇది డెంటల్ ఫ్లోరోసిస్ అనబడే పళ్ల జబ్బు. అప్పట్లో దాన్ని కొలరాడో బ్రౌన్ స్టెయిన్ గా పిలిచేవారు. కొలరాడో బ్రౌన్ స్టెయిన్ ఉన్నవారి దంతాల్లో కేవిటీ (రంధ్రాలు) సమస్యలు చాలా తక్కువగా ఉండటం ఫ్రెడరిక్ మెకేని ఆశ్చర్యపరచింది. తన పరిశీలనని ఆయన ఇతర దంతవైద్యులతో పంచుకున్నాడు. వార్తా పత్రికల ద్వారా ఈ విషయం ఇతరుల దృష్టిలోకీ వచ్చింది.

తరువాత రెండు దశాబ్దాల పాటు దీని మీద అధ్యయనాలు జరిగాయి. అవి తేల్చినదేమంటే, కొలరాడో బ్రౌన్ స్టెయిన్ కలగటానికి కారణం అక్కడి నీళ్లలో అధిక శాతంలో ఉన్న ఫ్లోరైడ్. ఆ ప్రాంత ప్రజలకి కేవిటీ సమస్యలు లేకపోవటానికీ ఫ్లోరైడే కారణం! ఇటువంటి అధ్యయనాల్లో ఎక్కువవాటికి నిధులు సమకూర్చింది అల్కోవా అనబడే అల్యూమినం కంపెనీ ఆఫ్ అమెరికా. ప్రపంచంలోని అతి పెద్ద అల్యూమినం ఉత్పత్తి సంస్థల్లో ఇది ఒకటి. పంటి జబ్బుల మీద ఒక అల్యూమినం తయారీ సంస్థకి అంత ఆసక్తి ఎందుకు?

                                    * * * *

1930లలో అమెరికాలో పారిశ్రామికీకరణ వెల్లువెత్తింది. ఎక్కడ చూసినా కొత్త రకాల వస్తువులు. పాలిమర్ విప్లవంతో మార్కెట్లని ముంచెత్తిన నైలాన్, లిక్రా, మైలార్, టెఫ్లాన్ వగైరా వింత వస్త్రోత్పత్తులు. అదే సమయంలో అధికమైన రాగి, ఇత్తడి, అల్యూమినం వస్తువుల వినియోగం. జనాలు వేలం వెర్రిగా వీటితో తయారు చేసిన వస్తువులు కొనటానికి ఎగబడేవాళ్లు. ఈ సందడిలో ఎవరూ అంతగా దృష్టి పెట్టని విషయం: పారిశ్రామిక వ్యర్ధాలు.

రాగి, ఇనుము, సత్తు (అల్యూమినం) వగైరా తయారీ పరిశ్రమల్లో ఉత్పత్తయ్యే పారిశ్రామిక వ్యర్ధం ఫ్లోరైడ్. విషపూరితమైన ఈ పదార్ధాన్ని వదిలించుకోటానికి రెండే మార్గాలు. ఒకటి, శుద్ధి చేయటం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని, పైగా దాని వల్ల ఆయా పరిశ్రమలకి వచ్చే లాభమూ లేదు. రెండు, ఎలుకల మందు లాంటి విషపూరిత పదార్ధాల తయారీలో వాడటం. అమెరికాలో ఉన్న ఎలుకలన్నింటినీ సంహరించటానికి ఆ దేశంలో ఉత్పత్తయ్యే ఫ్లోరైడ్‌లో అతి కొద్ది శాతం చాలు. మరి మిగిలిన దాన్ని వదిలించుకోవటమెలా? దాన్నలాగే వదిలేస్తే గాలి, నీరు ద్వారా వ్యాపించి ప్రజల ఆరోగ్యాలకి హాని చేసే ప్రమాదం ఉంది. ప్రజారోగ్యంతో ఆటలాడుతున్నారు అనే పేరు పరిశ్రమల మనుగడకి అతి ప్రమాదకరం. మరోవంక ప్రభుత్వమూ ఈ విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి. పారిశ్రామికీకరణ వేగాన్ని తగ్గించటమో, ఆయా వస్తువుల ఉత్పత్తినే ఆపేయటమో ప్రభుత్వానికి తలకు మించిన పని. మహా మాంద్యం, మొదటి ప్రపంచయుద్ధం దెబ్బల నుండి అప్పుడే తేరుకుంటున్నఅమెరికా ఆర్ధిక వ్యవస్థని దెబ్బదీసే ఏ చర్యకీ ప్రభుత్వం ఒడికట్టలేదు. ఆ దశలో ఫ్రెడెరిక్ మెకే పరిశీలన పరిశ్రమలకి ఊహించని వరం.

                                    * * * *

డ్యూపాంట్ – రసాయనాల తయారీలో రెండువందల సంవత్సరాల పైబడ్డ చరిత్ర ఉన్న కంపెనీ. ప్రపంచంలో రెండవ అతి పెద్ద కెమికల్స్ తయారీ సంస్థ. వస్త్ర ప్రపంచంలో నైలాన్, టెఫ్లాన్ వంటి విప్లవాత్మక ఆవిష్కరణలు వీరివే. ఇటువంటి వస్త్రాల తయారీకి ఉపయోగించే రసాయనాల్లో ఫ్లోరైడ్ కీలకమైనది. రెఫ్రిజిరేటర్లలో వాడే క్లోరోఫ్లోరోకార్బన్లు కూడా డ్యూపాంట్ ఆవిష్కరణలే. దీని తయారీలోనూ ఫ్లోరైడే కీలకం. ఫ్లోరైడ్ సంబంధిత ఆరోగ్య సమస్యల గురించి కార్మికుల నుండి, ప్రజల నుండీ వస్తున్న వత్తిడి తప్పించుకోవటానికి డ్యూపాంట్ శతవిధాల ప్రయత్నిస్తున్న కాలం అది.

ఫ్లోరైడ్ వల్ల ఉపయోగాలున్నాయంటూ వచ్చిన వార్తలు సహజంగానే వీరి చెవులకి ఇంపు. అల్కోవాకి అల్యూమినం తయారిలో ఉత్పన్నమైన ఫ్లోరైడ్ వ్యర్ధాన్ని తక్కువ ఖర్చుతో, వీలైతే ఎంతో కొంత లాభంతో వదిలించుకోవటం ముఖ్యం. డ్యూపాంట్‌కి ఫ్లోరైడ్ వల్ల మేలే కానీ కీడు లేదని ప్రజల్ని నమ్మించటం ముఖ్యం. ఇలాంటి భారీ సంస్థలు తలచుకుంటే తిమ్మిని బమ్మిని చేయటం ఎంత సేపు? దంత క్షయాన్ని అరికట్టటానికి ప్రతి ఒక్కరూ రోజుకి కొద్ది శాతంలో ఫ్లోరైడ్ తీసుకోవటం మంచిది అని ప్రతిపాదించే అధ్యయనాలు వెను వెంటనే వెలుగు చూశాయి. ఇటువంటి అధ్యయనాలకి నిధులు సమకూర్చిందెవరో చెప్పటానికి పెద్దగా తెలివితేటలక్కరలేదు. గమనించాల్సిన విషయమేమిటంటే, ఇవి కేవలం అధ్యయనాలే –  శాస్త్రీయ పరిశోధనలు కావు. అదే సమయంలో ఫ్లోరైడ్ చేసే హాని గురించి జరుగుతున్న పరిశోధనలు ఆశ్చర్యకరంగా నిధుల లేమితో నిలిచిపోయాయి. దేశరాజధానిలో రాజకీయుల అండదండలు సాధించటమూ ఈ సంస్థలకి కష్టమైన పనేం కాదు. 1945లో దేశమంతటా మునిసిపాలిటీలు సరఫరా చేసే మంచినీటిలో కొంత శాతం ఫ్లోరైడ్ కలపటం తప్పనిసరి చేస్తూ ఓ శాసనం వెలుగు చూసింది. ప్రజల దంతారోగ్యానికి ఇది తప్పనిసరి అని ప్రభుత్వ వివరణ! (ఈ శాసనాన్ని అమలు చేయని మునిసిపాలిటీలూ ఉన్నాయి – అది అమెరికన్ ఫెడరల్ విధానంలోని విశిష్టత). 1955 నాటికి దేశంలో 65 శాతం ప్రజలు ఫ్లోరైడ్ కలిసిన మంచినీటినే తాగసాగారు. అల్కోవా రొట్టె విరిగి నేతిలో పడింది. ఇలా మంచినీటిలో కలిపే ఫ్లోరైడ్ లో అధిక శాతం అల్కోవా వారి కర్మాగారాల్లో ఉత్పత్తయ్యే వ్యర్ధమే మరి! పనిలో పనిగా ఏకంగా టూత్‌పేస్టుల్లోనే ఫ్లోరైడ్ కలిపితే అది మరింత సమర్ధంగా దంతక్షయాన్ని అరికడుతుందనే నివేదికలూ సృష్టించబడ్డాయి. అమెరికన్ డెంటిస్ట్స్ అసోసియేషన్ (అడా) మీద వత్తిడి తెచ్చి టూత్‌పేస్టుల్లో ఫ్లోరైడ్ ఉండటం మంచిది అనే వాదన అంగీకరించేలా చేశారు. అడా సూచనతో టూత్‌పేస్ట్ తయారీ సంస్థలు కేవిటీ ప్రొటెక్షన్ పేరుతో ఫ్లోరైడ్ కలిపిన పేస్టులు అమ్మటం మొదలు పెట్టాయి. అలా అటు మునిసిపాలిటీలకీ, ఇటు టూత్‌పేస్టు తయారీదార్లకీ ఇబ్బడి ముబ్బడిగా ఫ్లోరైడ్ అమ్మి పరిశ్రమలు పారిశ్రామిక వ్యర్ధాల నుండి కూడా సొమ్ములు చేసుకోసాగాయి. ప్రోక్టర్ అండ్ గేంబుల్ (కోల్గేట్ తయారీదారు) వంటి బహుళజాతి సంస్థల ద్వారా ఇటువంటి యాంటీ కేవిటీ టూత్‌పేస్టులు త్వరలోనే ప్రపంచమంతటా వ్యాపించాయి. ఈనాడు ప్రపంచంలో వాడే టూత్‌పేస్టుల్లో ఎనభై ఐదు శాతం పైగా ఫ్లోరైడ్ కలిపినవే – చిన్న పిల్లల టూత్‌పేస్టులతో సహా!

                                    * * * *

అమెరికాలో ‘దంతారోగ్యానికి ఫ్లోరైడ్’ ప్రయోగం మొదలై అరవయ్యేళ్లు గడిచాయి. ఈ మధ్య కాలంలో ఫ్లోరైడ్ గురించి అనేక శాస్త్రీయ పరిశోధనా ఫలితాలు వెలుగు చూశాయి. అవన్నీ తేల్చిన విషయం ఒకటే: దంత క్షయం తగ్గించటంలో ఫ్లోరైడ్ పాత్ర ఏమీ లేదు. అసలు ఈ కధలో కీలకమైన ‘కొలరాడో బ్రౌన్ స్టెయిన్’ బాధితుల దంతాల్లో రంధ్రాలు ఏర్పడకపోవటానికి అక్కడి నీటిలో సమృద్ధిగా ఉన్న మెగ్నీషియం మరియు కాల్షియం కారణమే కానీ ఫ్రెడెరిక్ మెకే అనుకున్నట్లు ఫ్లోరైడ్ కాదు. పైగా, మితిమీరిన ఫ్లోరైడ్ వినిమయం వల్ల ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇది ఇప్పటికే అమెరికన్లకి అనుభవంలోకొచ్చిన విషయం. టూత్‌పేస్టుల్లోని ఫ్లోరైడ్ రంధ్రాలు అరికట్టినా లేకున్నా డెంటల్ ఫ్లోరోసిస్ మాత్రం తెచ్చిపెడుతుంది. దీన్ని వదిలించుకోటానికి  మూడ్నెల్లకో, ఆర్నెల్లకో ఒకసారి క్రమం తప్పకుండా దంతవైద్యులని దర్శించటం తప్పనిసరి. అలా వెళ్లిన ప్రతి సారీ వందలాది డాలర్లు వదిలించుకోవటమూ రివాజు. ఫ్లోరైడ్ వల్ల పచ్చబడ్డ పళ్లని తిరిగి తెల్లగా మెరిసేలా చెయ్యటానికి ప్రత్యేక పేస్టులు, ఇతరేతర ఉత్పత్తుల కోసం మరిన్ని వందలు క్షవరం.

ఫ్లోరైడ్ వ్యతిరేక వర్గాల వత్తిడితో కొన్నేళ్లుగా అమెరికాలో అనేక మునిసిపాలిటీలు మంచినీటి సరఫరాలో ఫ్లోరైడ్ కలపటాన్ని ఆపి వేస్తున్నాయి. అలాగే, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఏ) సూచనతో టూత్‌పేస్టు తయారీదారులు యాంటీ కేవిటీ పేస్టుల మీద ‘ఈ పేస్టుని మింగటం లేదా అవసరమైన దానికన్నా ఎక్కువ మొత్తంలో వాడటం ప్రమాదకరం. అటువంటివి జరిగితే వెంటనే పాయిజన్ కంట్రోల్ శాఖని సంప్రదించండి’ అని ముద్రించటం మొదలు పెట్టారు (మీరు అమెరికాలో ఉన్నట్లయితే మీ టూత్‌పేస్టు మీది ‘వార్నింగ్’ ని ఓ సారి గమనించండి). ఎలుకల మందులో కలిపే విషాన్ని టూత్‌పేస్టుల్లో వాడేసి ‘మేం అప్పుడే చెప్పాం’ అని చేతులు దులుపుకోవటమన్నమాట ఇది!


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,298

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.