Posts Tagged 'నేనొక్కడినే'

నేనొక్కడినే

ఓ మంచి పుస్తకం చదివినప్పుడూ, ఓ మంచి సినిమా చూసినప్పుడూ …. అది మరో పది మందితో పంచుకోవాలనిపిస్తుంది. వాళ్లనీ ఆ పని చెయ్యమని ప్రోత్సహించాలనిపిస్తుంది. తెలుగు సినిమాలు చూసినప్పుడు నాకలాంటి భావం అంత తరచుగా కలగదు.

ఈ రోజు కలిగింది.

‘మన సినిమాలు బాగు పడవు గురూ’. తెలుగు సినీ విమర్శకుల నోళ్లలో పాచిపోయిన పాటిది. ఇన్నాళ్లకి వాళ్ల కల నిజం చేసే సినిమా ఒకటొచ్చింది. తీరా చూస్తే దానికి వాళ్ల స్పందన: ‘అబ్బే, ఇది నాకే అర్ధమవలా. ఇంక మామూలు ప్రేక్షకుడికేం అర్ధమవుద్ది’. అచ్చు పత్రికల్లో, వెబ్ మ్యాగజైన్లలో, టీవీల్లో … అన్ని చోట్లా అదే మోత. “నేల విడిచి సాము”, “మనోళ్లకి ఇది ఎక్కదు”, వగైరా, వగైరా.

మొత్తానికి అంతా కలిసి ఈ సినిమా ఎవరికీ అర్ధం కాదని తేల్చేసి చప్పరించేశారు.

అంతగా అర్ధం కానిదేం ఉందో అర్ధం చేసుకుందామని ఈ రోజు పనిగట్టుకుని మరీ వెళ్లి ఆ సినిమా చూశాను. చూశాక, డంగైపోయాను. తేరుకున్నాక, చప్పట్లు చరిచాను – తక్కిన ప్రేక్షకులు నన్ను అదోలా చూసినా పట్టించుకోకుండా.

ఈ సినిమాలో ….

– కథానాయకుడి కరుణా కటాక్షాల కోసం దేబిరిస్తూ అతని మీదకి ఎగబడిపోయే నాయిక లేదు. ఆమెని ఎంత కించపరిస్తే అంత మగతనం అనుకునే హీరో లేడు.
– నాయకుడి పక్కనో నలుగురు సైడ్ కిక్కుల్లేరు. వాళ్ల బఫూనరీ లేదు. కథకి సంబంధం లేని కామెడీ ట్రాక్ లేదు. నలుగురినీ నవ్వించటానికి పదుగురితో తన్నులు తినే జఫ్ఫాలూ, వాళ్లు పడే తిప్పలూ లేవు.
– విశ్రాంతి సమయానికి ముందో వీర భీకర బిగ్ బ్యాంగ్ లేదు. ఆ తర్వాత హీరో అసలు రూపం గుట్టు విప్పటం అసలే లేదు.
– చీజీ గ్రాఫిక్స్ లేవు. పాత్రోచితంతో పనిలేకుండా ప్రతి పదంలోనూ ప్రాస కోసం ప్రయాస పడే పాత్రల్లేవు. పంచ్ డైలాగుల్లేవు.
– వంశ చరిత్రలు తవ్విపోసుకుని ఉద్రేకపడిపోయే కథానాయకుల్లేరు. తండ్రుల, తాతల పేర్లు తలచుకుని తబ్బిబ్బైపోవటం లేదు. తొడలు కొట్టటాల్లేవు. భుజాలు చరుచుకోవటాల్లేవు.

అలాగని – విమర్శనాగ్రేసరులు వాపోయినట్లు – అర్ధం కాకుండా బుర్రలు తినేంత గజిబిజి కథనమూ లేదు. ఈ మాత్రం కథన శైలికే కళ్లు తేలేసే ప్రబుద్ధులు విమర్శకావతారాలెత్తి ప్రేక్షకుల నాడి ప్రభావితం చెయ్యటం తెలుగు సినిమాకి పట్టిన దరిద్రం.

ఈ సినిమాలో ఉన్నదల్లా – నిఖార్సైన నిజాయితీతో ఓ దర్శకుడు చేసిన ప్రయత్నం; అతని మీద నమ్మకంతో కోట్లు కుమ్మరించే దమ్మున్న నిర్మాతలు; వాళ్ల నిబద్ధతకి మెచ్చి ‘నా ఫ్యాన్స్ కోసం ఫలానా ఫలానా లెక్కలుండాల్సించే’ అని బెట్టు చెయ్యకుండా పనిచేసుకు పోయిన ప్రధాన నటుడు; ఇన్నాళ్లూ హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే కళ్లు విప్పార్చుకు చూసిన విజువల్స్; అద్భుతమైన నేపధ్య సంగీతం; చిన్న కథకి ఈ హంగులన్నిట్నీ అవసరమ్మేరా వాడుకుంటూ రెండున్నర గంటలు కట్టిపడేసే చిక్కటి చక్కటి కథనం. (చిన్నా చితకా పొరపాట్లూ ఉన్నాయి. మహా మహా ‘టైటానిక్’లోనే ఉన్నాయవి. ఇక్కడెంత? అవన్నీ క్షమించగలిగేవే) వెరసి, తెలుగు తెరపై ఓ నవశకానికి నాంది పలికే సినిమా.

ఇంతకంటే చెప్పాల్సిందేం లేదు. పత్రికల్లో చదివినవి, టీవీల్లో చూసినవీ నమ్మటం మానేసి, వెళ్లి చూడండి … శ్రద్ధగా చూడండి …. ‘నేనొక్కడినే’.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 302,465

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.