Posts Tagged 'నాగరికథ'

కథాయణం

‘రాసిన కథలు ముచ్చటగా మూడు, వాటిలో అచ్చైంది ఒకే ఒకటి. అప్పుడే కథ వెనక కథ పేరిట ఊదరగొట్టేటన్ని అనుభవాలు సమకూరాయా?’. ఈ టపా రాయబోయేముందు నన్ను నేను వేసుకున్న ప్రశ్నిది. అనుభవాలున్నా లేకున్నా నలుగురితో పంచుకోదగ్గ నాలుగైదు విషయాలైతే ఉన్నాయన్నది నాకొచ్చిన సమాధానం. అవేంటో చూద్దాం పదండి.

కొంత చరిత్ర, కొంత కల్పన కలగలిసిన కథొకటి రాయాలన్న ఆలోచన నాకెప్పట్నుండో ఉంది. అయితే కథలు రాసే సత్తా నాకు లేదేమోనన్న అనుమానంతో దాన్ని అమల్లో పెట్టే ప్రయత్నం చెయ్యలేదు. గడియారం రాశాక ‘ఫర్లేదు, నేనూ కథలు రాయగలను’ అన్న నమ్మకమొచ్చింది. దాంతో, రెండో కథగా నా పాత ఆలోచన బయటికి తీశాను. (‘గడియారం’తో నేర్చుకున్న విషయమొకటుంది – ‘కొత్తగా కథలు రాయటం మొదలెట్టేవారు కొత్తలో ఫస్ట్ పర్సన్ నేరేటివ్‌లో రాయటం మంచిది’ అని. అప్పుడైతే రచయిత పాత్రల్లో తొంగి చూసినా తప్పించుకోటం తేలిక. రెండో కథ ఆ పద్ధతిలో ప్రయత్నిద్దామని ముందే అనుకున్నాను) చరిత్రలో లెక్కలేనన్ని మిస్టరీలున్నాయి. వాటిలో ఒక ప్రముఖమైనదాన్ని తీసుకుని దాన్ని నాదైన శైలిలో పరిష్కరిస్తే ఎలా ఉంటుందన్న ఐడియా వచ్చింది మొదట. వెంటనే సింధు లోయ నాగరికత, అదెలా అంతమయిందనేదానిపై నెలకొన్న గందగోళం గుర్తొచ్చాయి. ఆ సివిలైజేషన్ అంతమవటానికి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న కారణాలు కాక మరేదైనా క్రియేటివ్ కారణం చూపాలని బుర్ర బద్దలు కొట్టుకొంటుండగా, చప్పున ఈజిప్ట్ పిరమిడ్లు ఏలియన్స్ నిర్మించారనే వాదన గుర్తొచ్చింది. ఆ దిశలో ఆలోచించి బుర్రని ఇంకాస్త గట్టిగా బద్దలు కొట్టుకోగా వచ్చిన ఊహే – సింధు నాగరికతకి టైమ్ ట్రావెల్ అంశాన్ని జత చెయ్యటం. అలా ఆర్కియాలజీకి, చరిత్రకీ కొంత సైన్సు, మరి కొంత ఫిక్షన్ కలగలిపి ఓ కథాంశం రూపుదిద్దుకుంది.

కథాంశమైతే తట్టింది కానీ దానితో ముడిపడున్న సైన్సు సంగతులు ఎలా వివరించాలన్న విషయం దగ్గర పెద్ద చిక్కొచ్చి పడింది. కథలో సైన్సు మరీ ఎక్కువైపోతే అదో పాఠంలా తయారౌతుంది, తక్కువైతే అసలు కథే అర్ధం కాకుండా పోతుంది. రెండిటికీ బ్యాలన్స్ చెయ్యటం మొదటి సమస్య. ఆ  సైన్సు సంగతుల్ని తెలుగులో చెప్పటం రెండో సమస్య. తెలుగు కథలో ఆంగ్ల పదాలు మరీ ఎక్కువ దొర్లించటం నాకు ఇష్టం లేని పని. కానీ ‘సింగ్యులారిటీ’, ‘డార్క్ మ్యాటర్’ వంటి వాటిని తెలుగులో ఏమంటారో తెలీదు మరి! కొంతాలోచించాక ఒక వేళ వాటికి తెలుగులో పదాలున్నా ఆంగ్ల పదాలే వాడటం మేలన్న నిర్ణయానికొచ్చేశాను.

కథాంశం పైపైన అనుకున్నాక అందులో ప్రస్తావించబోతున్న సాంకేతిక, చారిత్రక సంగతుల గురించి అధ్యయనం మొదలెట్టాను. చేతికొచ్చినట్లు రాసి పారేస్తే వీపు చీరేయటానికి విమర్శకులు సిద్ధంగా ఉంటారు మరి. అయితే ఈ అధ్యయనానికి మరీ ఎక్కువ రోజులు పట్టలేదు. నేను రాయబోయేది కథే కానీ, పరిశోధనా పత్రం కాదు కదా. అవసరమైనంత సమాచారం సేకరించాక కథ రాయటం మొదలయింది. రెండే రోజుల్లో మొదటి డ్రాఫ్ట్ తయారయింది. హాలీవుడ్ సినిమా కథల్లో చాలా ‘వాట్ ఇఫ్’ అనే చిన్న ప్రశ్న ఆధారంగా మొలకెత్తుతాయి. అదే పంధాలో, ‘ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా అంతమయిందో కనుక్కుందామని వెళ్లిన టైమ్ ట్రావెలర్స్ ప్రమాదవశాత్తూ దాన్ని నాశనం చేసొస్తే?’ అన్న ప్రశ్నతో నాగరికథ పుట్టింది. అయితే కథంతా అతి సరళంగా ‘ఇదంతా నిజమేనహో’ అన్నట్లు రాసేస్తే సిల్లీగా ఉంటుంది కాబట్టి తాతయ్య చెప్పిన కథలా నాన్ లీనియర్ నేరేషన్‌లో చెప్పుకొచ్చాను. మనవడిని పాఠకుడి స్థానంలో కూర్చోబెట్టాను. తాతయ్య చెప్పింది కథా, నిజమా అన్న సందేహంతో మనవడిని చివరిదాకా వేధించి చివర్లో అతనికి సమాధానం దొరికేలా చెయ్యాలన్నది నా ప్లాన్. ఇది ‘చివరికేమవుతుందో’ అంటూ పాఠకులని కట్టిపడేసే ఎత్తుగడ. నేను మొదట అనుకున్న ప్రకారం – ‘అది కథే, నిజం కాదు’ అని మనవడు కనుక్కోవటంతో నాగరికథ ముగిసిపోతుంది. అయితే చివర్లో ఏదో ఒక ట్విస్ట్ పెట్టకపోతే నా చేతులు ఊరుకోవు కాబట్టి, ఆంధ్రజ్యోతికి పంపబోయే ముందు ఆఖరి నిమిషంలో క్లైమాక్సుకి ‘మమ్మీ రిటర్న్స్’ మలుపు జత చేసి పంపించేశాను. అది తప్పకుండా ఎంపికవుతుందన్న నమ్మకం ఉంది. అలాగే జరిగింది. కాకపోతే ‘నిడివి ఎక్కువయింది, ఒకింత తగ్గించండి’ అన్న ప్రత్యుత్తరం వచ్చింది. ఆ పని చెయ్యటానికి నాలుగైదు రోజులు పట్టింది. కుదించి పంపించాక అది అచ్చులో రావటానికి రమారమి మూడు నెలలు పట్టింది.

నాగరికథకి నా బ్లాగులో వచ్చిన స్పందన అటుంచితే, ఆంధ్రజ్యోతి పాఠకుల నుండి చాలా ఇ-మెయిళ్లొచ్చాయి. సాధారణ గృహిణుల నుండి సివిల్ సర్వెంట్స్ దాకా, విద్యార్ధుల నుండి అధ్యాపకుల దాకా పలురకాల వ్యక్తులు ఉన్నారు వారిలో. వాళ్ల ప్రతిస్పందన ఆసక్తికరంగా ఉంది. ‘ఇది నిజంగానే జరిగిందా’ అని అడిగిన వాళ్లు అందులో సగం మందున్నారు! ‘మీ తాతగారు నిజంగానే మీకీ కథ చెప్పారా’ అనడిగినోళ్లూ ఉన్నారు. ఇదో కల్పిత గాధ మాత్రమే అని నొక్కి వక్కాణిస్తూ బదులు పంపించాను వాళ్లకి. చివర్లో ప్రస్తావించిన ‘మమ్మీ రిటర్న్స్’ సినిమాకి అసలు కథతో సంబంధం ఏమిటో అర్ధం కాక తలలు బాదుకుంటూ ఆ చిక్కు ముడి విప్పమని నన్నడిగేసిన వాళ్లు మరో అరడజను మందున్నారు. దీనికి కొంత పొడుగాటి వివరణ ఇవ్వాల్సొచ్చింది. ఒక కుర్రాడైతే, నా పేరు చూసి తెలుగోడిని కాదనుకున్నాడో ఏమో, ‘మీకు తెలుగొచ్చా, ఈ కథ మీరే తెలుగులో రాశారా లేక ఆంగ్లంలో రాసి వేరెవరితోనన్నా అనువాదం చేయించారా’ అనడిగేశాడు.

మొత్తమ్మీద, ఇందరి స్పందన చూశాక నాకు అర్ధమైన విషయాలు కొన్నున్నాయి. ఒకటే కథ ఆన్‌లైన్ పాఠకుల కోసమైతే ఒక రకంగా, అచ్చులో చదివేవారికోసమైతే మరో రకంగా రాయాల్సుంటుందనేది వాటిలో మొదటిది. అచ్చయ్యే కథల్లో పాఠకుల అవగాహనా స్థాయిల్లో ఉండే తారతమ్యాలు దృష్టిలో ఉంచుకుని కొంత ఎక్కువ వివరణ ఇవ్వాల్సుంటుందనేది దాని భావం. నాగరికథ రాస్తున్నప్పుడు కొన్ని విషయాలు అనవసరంగా విపులీకరిస్తున్నానేమో అన్న అనుమానం తొలుస్తుందేది. అది అనవసరం కాదు, అవసరమే అని ఇప్పుడనిపిస్తుంది. ఈ తరహా కథలు భవిష్యత్తులో రాసేటప్పుడు సంబంధిత సమాచారం ఏ మోతాదులో రంగరించాలనేదాని మీద ఇప్పుడు కొంత అంచనా వచ్చింది. అలాగే, మరీ సటిల్‌గా హింట్స్ ఇచ్చేస్తే చాలామంది పట్టుకోలేకపోవచ్చు అని కూడా తెలిసొచ్చింది. అయితే ఈ రెండో విషయంలో మాత్రం నా ధోరణి మార్చుకునే ఉద్దేశం లేదు.

అవీ – నా పరిమిత అనుభవంతో నేను నేర్చుకున్న, నలుగురితో పంచుకోవాలనుకున్న సంగతులు. కథలు రాయాలనే ఆసక్తిగల వారికి ఇవి ఏ కొద్దిగా ఉపయోగపడినా సంతోషమే.

బైదవే, నా మూడు కథల్లోనూ ఎక్కువమందికి నచ్చింది ఈ నాగరికథ. నాకెక్కువగా నచ్చింది మాత్రం ఆరోప్రాణం. ఎందుకో మరి!


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,194

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.