Posts Tagged 'నరసరావుపేట'

తెలుగోడు

తెలుగోడు జూలు విదిల్చాడు. ఐదేళ్లకోసారి మాత్రమే చేతికందే విచ్చుకత్తితో ఎన్నికల రణరంగాన వీరవిహారమే చేశాడు. ప్రత్యేక రాష్ట్రం పేరుతో దశాబ్దంగా పబ్బం గడుపుకుంటున్న వేర్పాటువాదుల్ని పాతిక కిలోమీటర్ల లోతున బొందబెట్టి పాతరేశాడు. ఏ ఎండకా గొడుగు పట్టబోయిన ప్రతిపక్షానికి కొర్రు కాల్చి వాత పెట్టాడు. అభివృద్ధితోనే మళ్లీ అందలమెక్కామని అధికారపక్షం భుజాలు చరుచుకునే వీల్లేకుండా పద్నాలుగు మంది సచివులకి అధోగతి, సభాపతికి సైతం అదే గతి పట్టించాడు. అసెంబ్లీలో మందబలంతో పనులు చక్కబెట్టుకునే వెసులుబాటివ్వకుండా రాష్ట్ర చరిత్రలోనే ప్రప్రధమంగా అత్తెసరు మెజారిటీతో పాలక పక్షాన్ని గట్టెక్కించాడు. వెండితెర వేల్పులు ఎక్కడుండాలో అక్కడుంటేనే ముద్దంటూ ముద్ద నోట్లోకొచ్చేలా నెత్తిమీద మొట్టి అక్షింతలేశాడు. రానున్నది హంగేనంటూ ఆవులించిన సర్వేరాయుళ్ల మెదళ్లు మొద్దుబారేలా నా రూటే సపరేటంటూ విలక్షణత ప్రదర్శించాడు.

(ఒడలు పులకరించేలా వార్తలు ప్రెజెంట్ చెయ్యటం మనకీ వచ్చని చాటేందుకే పై పేరా. ఇక మామూలుగా పోదాం)

ఎదురుచూసిన ఎన్నికల ఫలితాలొచ్చేశాయి. ఎవరికి తోచిన రీతిలో వారు భాష్యాలు చెప్పటాలు మొదలయ్యాయి. ఐదేళ్లుగా ప్రభుత్వం చేసిన అభివృద్ధే గెలుపు మంత్రం అన్నోళ్లున్నారు. అవినీతి అసలు సమస్యే కాలేదన్నోళ్లున్నారు. ప్రతిపక్షానికి విశ్వసనీయత లేకనే ఈ వోటమి అన్నోళ్లున్నారు. దేవుడు చల్లగా చూసి ఐదేళ్లూ వర్షాలు పడటమే రాజశేఖరరెడ్డి చేసుకున్న పుణ్యమన్న భక్తులూ ఉన్నారు. ఇవన్నీ నిజాలే కావచ్చు. ఇవి మాత్రమే నిజాలు కాకనూ పోవచ్చు. ఆ మిగతావేంటో చూద్దాం.

చాలావరకూ చంద్రబాబు ఓటమి స్వయంకృతం. తెరాసతో పొత్తు పెట్టుకుని అన్ని స్థానాలొదులుకోకపోయుంటే తెదెపాకి మరో పాతిక స్థానాలన్నా అదనంగా వచ్చుండేవనటంలో సందేహం లేదు. గణాంకాలు చూడండి. తెలంగాణలో తెదెపా 59 చోట్ల పోటీ చేసి 39 గెలిచింది. భాగస్వాములకి 53 స్థానాలొదిలితే వాళ్లు గెలిచినవి పట్టుమని పదిహేను లేవు. వాటిలో తెదెపా తప్పకుండా గెలిచే స్థానాలూ ఉన్నాయన్నది గమనార్హం. 2004లో కేసీయార్‌తో గొడవ పెట్టుకుని, ఇప్పుడు పొత్తు పెట్టుకుని – రెండు సార్లూ బాబు చావుదెబ్బ తిన్నాడు. ఆ పాతిక సీట్ల తేడా అసెంబ్లీలో బలాబలాలని తారుమారు చేసేసింది. అదొక్కటే కాదు, తెదెపా వస్తే రాష్ట్రం చీలటం ఖాయం అన్న భయం రేకేత్తించి కోస్తా, రాయలసీమల్లో ఆ పార్టీ వోట్లకి భారీ గండి పెట్టేలా చేసింది కూడా ఈ అనవసర పొత్తులే. మహాకూటమి ఆర్భాటం, వై.ఎస్. జంకు గొంకు లేకుండా ‘హైదరాబాదులో విదేశీయులవుతారు’ అంటూ పేల్చిన తూటా కోస్తా, సీమల్లో చూపిన ప్రభావం తక్కువేమీ లేదు. బాబు మెడలు బలవంతంగా వంచి జై తెలంగాణ అనిపించిన తెదేపా థింక్‌ట్యాంక్ ఇప్పుడు ముఖమెక్కడ పెట్టుకుంటుందో?

ప్రరాపా, లోక్‌సత్తాలు తెదేపా వోట్లు చీల్చటం బాబుని దెబ్బమీద దెబ్బతీసిన మరో కారణం. ‘చిరంజీవి వల్ల కోస్తాలో ఓ వర్గం వోట్లు గంపగుత్తగా కాంగ్రెస్ నుండి ప్రరాపాకి బదిలీ అయ్యి ఆ వారా తెదేపాకి లాభం’ అంటూ అదే పనిగా ఊదరగొట్టిన పత్రికల ప్రచారంతో ఆ వర్గం ఆప్రమత్తమై తమ వోట్లని మరింత భద్రంగా కాంగ్రెస్‌కే వేసినట్లు కనిపిస్తుంది. దెబ్బతో – ప్రరాపా వల్ల కోస్తాలో చీలిందల్లా తెదేపా వోట్లే. తెదేపాని లోక్‌సత్తా తీసిన దెబ్బ కూడా కూడా తక్కువేమీ కాదు. లోక్‌సత్తా సానుభూతిపరుల్లో అత్యధికులు గతంలో తెదేపాకి ఓట్లేసినవాళ్లే. తక్కువ తేడాతో తెదేపా ఓడిన స్థానాల్లో లోక్‌సత్తా ప్రభావం తీసిపారేయలేం. ఒకటిన్నర శాతం కన్నా తక్కువ తేడాతో తెదేపా అనేక స్థానాల్లో ఓడటం, దాదాపు అదే శాతం వోట్లు లోక్‌సత్తా ఖాతాలో జమపడటం దేనికి సూచిక?

ఈ ఫలితాల వల్ల నాకు రెండు విషయాల్లో మాత్రం సంతోషంగా ఉంది. ఒకటి జేపీ విజయం. రాజకీయాలు అన్ని రకాలుగానూ  భ్రష్టుపట్టిన ఈ రోజుల్లోనూ మందు పొయ్యకుండా, వోట్లు కొనకుండా కూడా ఓ అభ్యర్ధి గెలవొచ్చని నిరూపించిన మొనగాడు జేపీ. ఈ ఒక్కడి విజయం మరెందరికో స్ఫూర్తి కావాలని ఆశిద్దాం. అసెంబ్లీలో కొలువుదీరనున్న వందలాది కలుపుమొక్కల నడుమ ఈ తులసి మొక్కెలా చిగుర్లేస్తుందో చూడాలి. ఆయన అడుగుపెట్టటంతో విధానసభ చర్చల్లో ఎంతో కొంత పరిణితొస్తుందనటంలో సందేహం లేదు.

నన్ను అమితంగా సంతోష పెట్టిన రెండో విషయం – దాదాపు దశాబ్దంగా తెలంగాణ పిడివాదులు ‘దోపిడీ దారులు’ అంటూ వేస్తున్న నిందల్ని మౌనంగా భరించిన కోస్తాంధ్ర, రాయలసీమ ఓటర్లు అదను చూసి ఒక్క ఓటు ముద్రతో ప్రత్యేకవాదానికి కట్టిన గోరీ, ఆంధ్ర సోదరుల బాధని అర్ధం చేసుకున్నట్లుగా తెలంగాణ వాసులూ వేర్పాటు వాదులకి బిగించి కట్టిన పాడె. ఈ దెబ్బతో ప్రత్యేకవాదం మంటలు చల్లారి అఖండాంధ్రప్రదేశ్ అవిభక్తంగా వెలుగొందే సూచనలు మొదలు. రోజుకో మాట చెప్పి, ఏరు దాటి తెప్పతగలేసి, ఎన్ని మాయవేషాలేసినా – చంద్రబాబు చేతగానితనంతో రాష్ట్రం నెత్తిన రాజేసిన కుంపటిని సమర్ధంగా అణచేసినందుకు రాజశేఖరరెడ్డి అభినందనీయుడు. ఆ ఒక్క కారణంగానే అతడు మరో ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగటానికి అర్హుడు. అవినీతి పంకిలంలో పీకల్దాకా కూరుకుపోయినా తిరిగి అందలం దక్కిందన్న అహంభావంతో మరింత విచ్చలవిడితనానికి తెగిస్తాడో, ఇకనైనా రాష్ట్రాభివృద్ధికి పాటుపడి చరిత్రకెక్కుతాడో ఇక ఆయన చేతిలోనే ఉంది.

కొసరు: ఇది కాన్‌స్పిరసీ థియరీల కాలం. ఎన్నికల ఫలితాలొచ్చిన రోజునే ఏంజెల్స్ & డీమన్స్ సినిమా కూడా విడుదలయింది. కాబట్టి మనమూ ఒకట్రెండు కాన్‌స్పిరసీ సిద్ధాంతాలు ప్రతిపాదించటం న్యాయం. ఇంతకీ – ప్రతిపక్షం ఓడిందా, లేక ఓడించబడిందా? ప్రతిపక్షానికి పట్టున్న ప్రాంతాల్లో ఓటర్ల పేర్లు గల్లంతవటం, ఈవీఎమ్‌లలో మీట నొక్కినా ప్రిసైడింగ్ ఆఫీసర్ల ‘చలవ’తో వోట్లు నమోదవకపోవటం, తొలినుండీ తెదేపా ఆధిక్యతలో కొనసాగిన యాభై దాకా స్థానాల్లో చివరి రౌండ్లలో అధికార పక్షానికి అనుకూలంగా ఫలితం తిరగబడటం కాకతాళీయమా? పత్తిపాడులో తొలుత తెదేపా గెలిచినట్లు ప్రకటించి తర్వాత కాంగ్రెస్ గెలిచినట్లుగా మార్చటం వెనక మతలబేంటి? దేశంలోని అతి పెద్ద పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒకటి, రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనదీ అయిన నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో తెదేపా అభ్యర్ధి వేణుగోపాలరెడ్డి విజయాన్ని ప్రకటించకుండా అర్ధరాత్రి దాకా హైడ్రామా నడపటం వెనక కమామీషేమిటి?


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,298

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.