Posts Tagged 'తెదేపా'

చంద్ర గ్రహణం

రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవని నానుడి. వర్తమాన రాజకీయాల్లో ఆ వైనానికి నిలువెత్తు నిదర్శనం నారా చంద్రబాబునాయుడు. నిన్నా మొన్నటివరకూ అధికశాతం తెలుగువారి దృష్టిలో ఆయనో విజనరీ ముఖ్యమంత్రి. రాజకీయాల్లో అపర చాణక్యుడు. సాక్షాత్తూ ఎన్టీయార్‌కే పొగబెట్టగలిగిన సమర్ధుడు, సాహసికుడు. మరో చాణక్యుడు, ఒకనాటి తన సావాసగాడు వైఎస్ ముప్పేట దాడిని ఐదేళ్లు తట్టుకుని పార్టీని కాపాడుకున్న ఘటికుడు. ఏడాది కిందటివరకూ – అధికారం కోల్పోవటానికైనా సిద్ధపడతాడే తప్ప, ఆంధ్ర ప్రదేశ్ సమైక్యత విషయంలో మడమ తిప్పడని మన్ననలందుకున్నవాడు. సమైక్యాంధ్ర నినాదంతో 2004 ఎన్నికల్లో ఓడిపోయినా, ఆ తర్వాత పలువురు ముఖ్య నేతలను పార్టీకి దూరం చేసుకున్నా తన విధానానికే కట్టుబడ్డ మొండివాడు. మరి ఇప్పుడో – చేతులు కాలాకైనా ఆకులు పట్టుకుందామనుకుని ఆచి తూచి తీసుకున్న ఒకే ఒక తప్పుడు నిర్ణయం తెలుగుదేశం భవిష్యత్తుని గాల్లో దీపంలా మార్చేస్తుంటే చూస్తూ ఊరుకోవటం తప్ప మరేమీ చేయలేని అశక్తుడు, చేష్టలుడిగి చేతులెత్తేసిన దైన్యుడు. తెదేపా పరిస్థితిప్పుడు రెంటికీ చెడ్డ రేవడి. కొందరి ఒత్తిడికి లొంగిపోయి విధానాలు మార్చుకున్నందుకు జరిగిన శాస్తిది.

పదేళ్లపాటు తమపై పోగుపడ్డ వ్యతిరేకతకి ప్రతిపక్షాలు ఏకమవటం, విద్యుత్ వివాదం, నాలుగేళ్ల క్షామం, ఇంకా ఇతరత్రా కారణాలు జతపడి 2004 ఎన్నికల్లో కుదేలైనా, ఆ ఎన్నికల్లో సమైక్యవాదంతో తాము తెలంగాణలో గెలిచిన స్థానాలు కోస్తా, సీమల్లో ఉమ్మడిగా సాధించిన స్థానాలకన్నా ఎక్కువ అని మర్చిపోయి 2009 ఎన్నికల్లో అప్పటికే కొనఊపిరితో కొట్టుకుంటున్న తెరాసతో జట్టు కట్టటం బహుశా చంద్రబాబు ముప్పయ్యేళ్ల రాజకీయ జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు. ఆ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో తెరాసకన్నా గోడమీది పిల్లివాటం ప్రదర్శించిన తెదేపా, కాంగ్రెస్‌లే ఎక్కువ స్కోరు చెయ్యటం గమనించాకైనా లెంపలేసుకుని మళ్లీ సమైక్యాంధ్ర నినాదాన్ని భుజానేసుకోకపోవటం తప్పు మీద తప్పు. మనసులో సమైక్యతా మంత్రమే పఠిస్తున్నా, ఆ సంగతి బయటికి చెప్పకుండా ‘కాంగ్రెస్ ఎటూ తెలంగాణ ఇవ్వదుగా, మనమూ నంగనాచి కబుర్లే చెబితే పోలా’ అనుకోటం ఇన్ని తిప్పలు తెచ్చి పెడుతుందని చంద్రబాబు కలలో సైతం ఊహించి ఉండకపోవచ్చు. చరిత్రని మలుపు తిప్పినవన్నీ ఊహాతీత సంఘటనలేనని అంతటి అనుభవజ్ఞుడూ మరచిపోవటం వింతల్లో వింత! కాంగ్రెస్ నైజం తెలిసీ, ఎదుటి పక్షాన్ని దెబ్బతీయటానికి ఎంతకైనా తెగిస్తుందనీ, ఎన్ని మాటలైనా మారుస్తుందనీ ఎరిగీ ఏమరుపాటుగా ఉండటం ఆత్మహత్యా సదృశం. ఇప్పుడనుభవిస్తున్నది దాని ఫలితం.

అటు కాంగ్రెస్ పార్టీకి సైతం ‘అర్ధరాత్రి కేక్ కటింగ్’ ప్రయోగం అనుకోని విధంగా వికటించి రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లోనూ పార్టీ ఉసురు తీసేసే పరిస్థితే. ఇంత రచ్చ జరిగాక ఇప్పుడు వెనకడుగు వేస్తే తెలంగాణలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవటం తధ్యం. అలా కాక, రాష్ట్రం చీలికకే కట్టుబడ్డా ఆ క్రెడిట్ తెరాసకే పోవటం, రాబోయే కొన్నేళ్ల పాటు తెలంగాణలో కనీసం సగం జిల్లాల్లో తెరాస హవా నడవటం ఖాయం. ప్రస్తుతం ఉనికే లేని తెలంగాణ జిల్లాల్లో సైతం తెరాస ప్రాబల్యం ఎంతో కొంత పెరగటమూ ఖాయమే. మొత్తమ్మీద – రెండు వారాల కిందటివరకూ చచ్చిన పాములా పడున్న కేసీయార్‌కీ, తెరాసకీ లేనిపోని అత్యుత్సాహంతో అనవసర ప్రయోగాలకి పోయి నూతన జవసత్వాలు తొడిగిన ఘనత మాత్రం కాంగ్రెస్‌దే. ఇటు కోస్తా/సీమల్లోనూ కాంగ్రెస్‌పై వెల్లువెత్తిన ఏహ్యభావం ఇప్పుడిప్పుడే ఉపశమించే సూచనలు లేవు. ఆ వారా తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం మార్చుకున్నా, మార్చుకోక పోయినా ఈ రెండు ప్రాంతాల్లోనూ ఆ పార్టీకి బోడిగుండే. రాష్ట్రంలో కాంగ్రెస్‌ని భూస్థాపితం చెయ్యటానికి ఇంతకన్నా పెద్ద అవకాశం చంద్రబాబుకి మరోటి వచ్చుండేది కాదు – ఆయన కొంత తెలివిగా వ్యవహరించి రెండు మూడు నెలల కిందటే ఏం జరిగితే అదే జరుగుతుందనుకుని ‘మా పార్టీ విధానం సమైక్యాంధ్రే’ అని తెగేసి చెప్పుంటే. ఆయనే ఆ పని చేసుంటే నేడు కోస్తా, సీమల్లోనూ, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోనూ, హైదరాబాదులోనూ తెదేపాకి ఎదురే ఉండేది కాదు. కాంగ్రెస్ పార్టీ నుండి సైతం తెదేపాకి వలసలు వెల్లువెత్తేవి. కేడర్ కూడా కరువై కాంగ్రెస్ మట్టి కరిచేది.

అయితే, చరిత్రలో ‘ఐతే’లకీ, ‘కానీ’లకీ స్థానం లేదు కాబట్టి ఇవన్నీ ఇప్పుడనుకుని లాభం లేదు. ఇప్పటికి మాత్రం తెదేపా పరిస్థితి అగమ్య గోచరం. జాతీయ పార్టీ కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైనా తట్టుకోగల శక్తి దానికుంది. ఓ ప్రాంతీయ పార్టీగా తెదేపాకి ఆ వెసులుబాటేదీ? గోడ మీది పిల్లి వాటం ప్రదర్శించినందుకూ, వరసవెంబడి పిల్లి మొగ్గలేసినందుకూ, ఆ వేసినవి కూడా సరైన సమయంలో వెయ్యనందుకూ, వెయ్యాల్సిన మొగ్గొకటి ఇంకా బాకీ పడ్డందుకూ చంద్రబాబు చెల్లించబోతున్న మూల్యం ఇది. వంద రోజుల క్రితమే రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ శకం ఊహించని విధంగా ముగిసింది. ఇప్పుడు చంద్రబాబు శకమూ అలాగే ముగియనుందా? ఒకనాడు రాజకీయ టెండూల్కర్‌గా పేరుబడ్డ బాబు ఫామ్ పూర్తిగా కోల్పోయాడా? లేక అనూహ్యమైన ఎత్తేదైనా వేసి ప్రత్యర్ధులని చిత్తు చేస్తాడా? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే ఆ అవకాశాలు కనిపించటం లేదు. ప్రస్తుతానికి చంద్ర గ్రహణం తప్పేలా లేదు. అదెన్నాళ్లుంటుందో కాలమే చెప్పాలి.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,194

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.