Posts Tagged 'చిరంజీవి'

జెండాపై కపిరాజు

ప్రజారాజ్యం పార్టీ ప్రస్తుత పరిస్థితి ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా-సోవియెట్ అభిజాత్యాల మధ్య నలిగి నాశనమైపోయిన ఆఫ్ఘనిస్తాన్‌ని తలపిస్తుంది. రెండు అగ్ర రాజ్యాల బల ప్రదర్శనకు, రాజకీయపుటెత్తుగడలకు చిన్నాభిన్నమైపోయిందా చిరు దేశం. చిరు పార్టీ పరిస్థితి దానికి భిన్నంగా లేదిప్పుడు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెదేపాల మధ్యలో చిక్కుకుని చిగురుటాకులా వణికిపోతుందా పార్టీ. వచ్చే ఎన్నికలనాటికి ఏదోలా ప్రరాపా ఉసురు తీసేస్తే తప్ప మరో ఓటమి తప్పదన్న ఆదుర్దా తెదేపాది. గత ఎన్నికల్లో శక్తిమేరా ఓట్లు చీల్చి తమ గెలుపుకు సైంధవ సాయం చేసిన ప్రరాపా ఐదేళ్ల తర్వాతా అదే మోస్తరు ఉపకారం చేస్తుందన్న పేరాశ కాంగ్రెసుది. రాజశేఖరరెడ్డికి కావలసింది – రాబోయే కాలంలో తెదేపా బలహీనపడటం, ప్రరాపా ఎదుగూబొదుగూ లేకుండా యధాతధంగా ఉండటం. చంద్రబాబు కోరుకునేది – సొంత పార్టీ బలపడటం, ప్రరాపా కొట్టు కట్టేయటం. ప్రరాపా నాయకులు వెదుక్కునేది – పార్టీ ఏదన్నదానితో సంబంధం లేకుండా, తమ సొంత భవిష్యత్తు. వీళ్లందరి భావాలూ, వ్యూహాలూ స్పష్టంగానే ఉన్నాయి. ప్రరాపా కథానాయకుడి మదిలో ఏముందనేది మాత్రం అస్పష్టం.

చిరంజీవి బుర్రలో అసలు ఆలోచనలంటూ ఉన్నాయా అన్నదే అప్పటికీ ఇప్పటికీ అంతుపట్టని ప్రశ్న. గ్లామర్‌ని నమ్ముకుని పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటి ఎన్నికల్లో ఉపయోగించాల్సిన ట్రంప్‌కార్డ్: సర్ప్రైజ్ ఎలిమెంట్. తన బలాలూ, బలహీనతలూ ప్రత్యర్ధులకి తెలీకముందే దాడికి దిగటం ముఖ్యం. వేగంగా ఎత్తులేసి ప్రత్యర్ధుల్ని చిత్తు చేయటం నేటి రాజకీయాలకి అత్యవసరం. ఆ విషయంలో చిరంజీవి ఘోరంగా విఫలమయ్యాడనేది కాదనలేని నిజం. ఆర్చుకునీ తీర్చుకునీ ఇదిగో అదిగో అంటూ ఊరించి రైలు బండిని పట్టాలెక్కించేసరికే ఓటరు జనాల్లో ఆసక్తి సగం ఆవిరైపోయింది. పక్క పార్టీల్లోంచి ఊసరవెల్లుల్ని పిలిచి పీటలేసిన సంబడం చూసి మిగిలిన జనాల్లో సగం మందికి చిర్రెత్తింది. ఎన్నికలకి ముందు జరిగిన తంతుకి రోతపుట్టి ఇంకొందరు ఓటర్లెగిరిపోయారు. ఎప్పుడైతే పార్టీలో చిరంజీవి ఉత్సవ విగ్రహమేనన్న అనుమానాలు మొదలయ్యాయో అప్పుడే ఆయన వీరాభిమానుల్లో సైతం ప్రరాపాపై నమ్మకం కొండెక్కింది. అయ్యవారిని చెయ్యబోతే కోతైన చందం ఆ పార్టీది.

లంకలోకి లంఘించి దూకిన హనుమంతుడిలా చిరంజీవి సినిమాల్లోంచి రాజకీయాల్లోకి అవలీలగా దూకేశాడు కానీ ముందున్న ముసళ్ల పండగ మొదట్లోనే అంచనా వేయలేకపోయినట్లు ప్రస్తుత పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. పార్టీ పెట్టిన మొదటి రోజునుండీ చిరంజీవి తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లాడిలాగానే కనిపించాడు. పార్టీ ప్రధమ వార్షికోత్సవం దగ్గరకొస్తుండగా, ఇప్పటికీ ఆయనది అదే పరిస్థితి. తన ప్రత్యర్ధి తెదేపానో, కాంగ్రెసో కూడా తేల్చుకోలేని అయోమయం. తమది ప్రతిపక్షమో, మజ్లిస్‌లా ప్రభుత్వానికి మిత్రపక్షమో తెలీని గందరగోళం. అసెంబ్లీలో మాట్లాడటంలో అపరిపక్వత. విలేకర్ల సమావేశాల్లోనూ అదే అసందిగ్ధత. మునిపుంగవుల బాణీలో ‘వెళ్లేవారు వద్దంటే వింటారా, ఉంటారా’ అంటూ నిర్వేదం ఒకసారి, ముఖ్యమంత్రి ఫక్కీలో ‘ఆ రెండు పత్రికల’ పైన అక్కసు వ్యక్తం చెయ్యటం మరోసారి. ఈ మాత్రం ఆవేశం ఇంతకు ముందే ప్రదర్శించుంటే కొందరన్నా మనసు మార్చుకునేవాళ్లేమో. అందరూ వెళ్లిపోయాక ఎవరినేమన్నా ఒరిగేది సున్నా.

ఈనాడు, ఆంధ్రజ్యోతి రాయబట్టే ‘వాళ్లెటూ రాసేశారుగా’ అనుకుంటూ తన పార్టీ నాయకులు గోడ దూకేస్తున్నారని చిరంజీవి ఆవేదన. మరి వాళ్లంతా వచ్చేటప్పుడు ఏ పత్రిక చెప్పిందని వచ్చారో ఆయన వివరించలేదు. ఆ రెండు తెదేపా అనుకూల పత్రికల వల్లే ప్రరాపా అధికారంలోకి రాలేకపోయిందని ఆయన అభియోగం. ఆ రెంటికీ అంత సత్తానే ఉంటే తెదేపానే అధికారంలో కూర్చోబెట్టుండాలి కదా! ఆడలేక మద్దెల ఓడనే తీరిది. పత్రికల పని పత్రికలు చేస్తాయి, చేస్తున్నాయి – ఆయా రాతల వెనక ఉద్దేశాలేమిటనేది వేరే సంగతి. తన పని తను సరిగా చేసుంటే పత్రికలపై పడి ఏడవాల్సిన అవసరం వచ్చుండేది కాదు చిరంజీవికి. అనుకూల వాతావరణంలో మాత్రమే నెగ్గుకొచ్చేవాడు అలెగ్జాండర్ కాలేడు. వందలాది సినిమాల్లో అలాంటి పాత్రలెన్నిట్లోనో అలవోకగా నటించేసిన చిరంజీవికి ఒకరు చెప్పాల్సిన విషయం కాదిది. అయితే ఆ పాత్రల సారాన్ని ఆయనెంతవరకూ జీర్ణించుకున్నాడనేదే అనుమానం. పార్టీలో జరుగుతున్న పరిణామాలకి చిరంజీవికి కాళ్లూ చేతులూ ఆడటం లేదని ఆయన ముఖంలో దైన్యాన్ని చూస్తే తెలిసిపోతుంది. రాజకీయాల్లో నెట్టుకురావటమంటే సినిమాల్లో వందమంది రౌడీలని ఒంటిచేత్తో రఫ్ఫాడించటమంత తేలిక్కాదని ఆయంకింకా అర్ధమయిందో లేదో కానీ, తట్టాబుట్టా సర్దుకుని తలోదారీ చూసుకుంటున్న నేతలకి మాత్రం బహు భేషుగ్గా అర్ధమయింది. ‘కొద్ది రోజుల్లోనే పార్టీని ఈ స్థాయికి తెచ్చా’ అని ఆయనన్న మాటలు ప్రరాపాలో మిగిలిన కొద్దిమందికీ మరో అర్ధంలో వినిపిస్తే – ఆ రెండు పత్రికలూ రాసినా రాయకున్నా పొలోమంటూ వాళ్లదారిన వాళ్లూ పోతారు.

రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయనేదానికి చిరంజీవి నిలువెత్తు నిదర్శనం. నేటి దుస్థితి ఆయన స్వయంకృతం. జెండాపై కపిరాజుంటే చాలు ఆడుతూ పాడుతూ అధికారానికి నిచ్చెనేసుకుని ఎక్కేయొచ్చనుకుంటూ ఆశతో వచ్చినోళ్లు ఆ కలలు కల్లలయ్యే పరిస్థితొస్తే జెండా పీకటానికీ ముందుంటారని ఊహించలేకపోవటం ఆయన మొదటి తప్పు. అరవింద్ ప్రభృతుల చేతిలో కీలుబొమ్మగా మిగలటం రెండో తప్పు. పార్టీ పుట్టకముందునుండీ తనవెంట ఉన్నవాళ్లు ఒక్కొక్కరే దూరమవుతున్నా మిన్నకుండటం మూడో తప్పు. తప్పుల మీద తప్పులు చేసి చేతులు పూర్తిగా కాల్చేసుకున్నాక – ఇక ఏం పట్టుకున్నా పెద్దగా లాభం ఉండకపోవచ్చు. మహా అయితే, ప్రరాపా పడుతూ లేస్తూ మరికొన్నాళ్లు ప్రస్థానం సాగించొచ్చు. వచ్చే ఎన్నికలనాటికి పుంజుకుంటుందనేది మాత్రం అనుమానమే. ప్రరాపా ఉండీ ఉపయోగం లేదన్న అభిప్రాయం ముఖ్యమంత్రికి రానన్నాళ్లే ఆ నామమాత్రపు మనుగడైనా సాధ్యం. ఆయనకా అభిప్రాయం ఏర్పడ్డాక ప్రరాపా గతేమౌతుందో ఊహించుకోవాలంటే ఓ సారి ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్‌ని గుర్తుచేసుకోండి.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 302,244

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.