Posts Tagged 'గులాబి'

గులాబి గోల

పదేళ్లనాటి సంగతి. అమెరికా జీవితం ఇంకా కొత్తగానే ఉన్న రోజులు. ఇక్కడి అలవాట్లు, పద్ధతులు నేర్చుకుంటున్న దశ. శాన్ ఫ్రాన్సిస్కోలో పనిచేసేవాడిని అప్పట్లో నేను. మా టీమ్‌లో నేనొక్కడినే భారతీయుడ్ని. ఓ రోజు నా టీమ్మేట్లు కొందరు నాకేసి కొంత వింతగా చూస్తున్నట్లనిపించింది. ఎందుకో అర్ధం కాలా. అడుగుదామంటే మొహమాటం (భయం అనాలేమో. ఇండియాలో ఉండగా చూసిన హాలీవుడ్ సినిమాల ప్రభావం. అప్పటిదాకా నవ్వుతూ మాట్లాడుకునే అమెరికన్లు హఠాత్తుగా పిస్తోళ్లు తీసి ఒకర్నొకరు కాల్చేసుకోటం ఎన్ని సినిమాల్లో చూడలా? అడిగితే అలాగే రియాక్టవుతారేమోనన్న భయం అన్నమాట)

సాయంత్రానికి, అలా తేడాగా చూసేవాళ్ల సంఖ్య పెరుగుతున్నట్లనిపించింది. ఇక లాభం లేదనుకుని మొహమాటం వదిలేసి (‘ధైర్యం తెచ్చుకుని’గా చదువుకోగలరు) కాస్త సాత్వికుడిగా కనబడే ఓ టీమ్మేటుడ్ని అడిగేశా, ‘ఏంటి గురూ, నాకేసందరూ ఎందుకలా చూస్తున్నారు?’ అని. ‘తెలుగులో అడిగావా’ అంటూ చొప్పదంటు ప్రశ్నలేయొద్దని మనవి.

టీమ్మేటుడు గంభీరంగా – అంటే నవ్వాపుకుంటూ – చెప్పాడు, ‘ఏం లేదు. నీ చొక్కా బాగుందనీ’.

కొత్త చొక్కానే. కానీ అంత బాగుండటానికేముందో అర్ధం కాలా. అదే అడిగా.

‘అంటే, డిఫరెంట్ కలర్ కదా. అది బాగుందన్న మాట’, బుర్రపై లేని జుట్టు బరుక్కుంటూ చెప్పాడతను.

అంత డిఫరెంట్ కలర్ కూడా కాదే! లేత గులాబీ రంగు. నాకు ఇష్టమైన రంగేమీ కాదు, అయిష్టమైనదీ కాదు. ఏదో చేతికందింది, కొన్నాం, ధరించాం. చొక్కా కూడా అంత స్టైలిష్‌గా ఉండదు. ఏదో దాస్తున్నాడు గురుడు. మళ్లీ రెట్టించి అడిగాను, డెస్క్ వెనక నక్కటానికి సిద్ధమౌతూ. తుపాకీ గట్రా తీస్తే తప్పుకోవాలి కదా మరి.

తుపాకి పేలలేదు కానీ తూటాలాంటి ప్రశ్నొచ్చింది అతన్నుండి, ‘ఆ రంగు దేనికి గుర్తో తెలుసా నీకు?’ 

షాట్ కట్ చేస్తే, ఆ వారాంతం నా దగ్గరున్న గులాబి రంగు వస్తువులు – ఆ వర్ణంతో సుదూర సంబంధమున్నవి సైతం, మణిరత్నం ‘రోజా’ సినిమా డీవీడీతో సహా – అన్నీ సాల్వేషన్ ఆర్మీ వారికిచ్చేయబడ్డాయి.

ఆ నాడు – ‘రంగులకీ విపరీతార్ధాలా! ఇదేం దేశంరా బాబూ’ అని చిరాకొచ్చింది. ఆ తర్వాత ఏడాదికో రెండేళ్లకో ఓ మహానుభావుడు తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేసే మహాశయంతో పార్టీ ఒకటి పెట్టి గులాబి రంగు జెండా ఎంచుకున్నప్పుడు నవ్వొచ్చింది. అప్పటికి అమెరికా అంతో ఇంతో వంటబట్టిందాయె.

* * * *

పదేళ్ల పాత కధ. ఇప్పుడెందుకు గుర్తొచ్చిందంటే – ‘గులాబి బాలలు, బాలికలకు డిస్కౌంట్ రేట్లతో అలాస్కా క్రూయిజ్ అవకాశం’ అన్న ప్రకటన నేడో వార్తాపత్రికలో చూడబట్టి. కాదేదీ వ్యాపారానర్హం. అదేమంటే సమానత్వమట! వికలాంగులకీ, వయసు మళ్లిన వారికీ అలాంటి అవకాశాలు కల్పించే ప్రకటనలెప్పుడన్నా చూశామా?

ఇది ఫ్యాషన్ భరిత ప్రపంచం. చిరిగిన దుస్తులు, జిబ్బిరి జుట్ల ఫ్యాషన్ మొన్నటిదాకా నడిచింది. మానసిక వికారాలకు లోనయ్యేవారి సమానత్వం, హక్కుల కోసం పలవరించటం నేటి లేటెస్ట్ ఫ్యాషన్. అది పాశ్చాత్య దేశాలకి పరిమితమైతే మనకి సమస్య లేదు. ప్రపంచీకరణ మహత్తుతో మనదేశానికీ దిగుమతయ్యిందిది. ఈ విషయంలో పాశ్చాత్యులని తప్పుబట్టనవసరం లేదు. వాళ్ల సమస్యతో వాళ్లు వేగుతారు, మనకనవసరం. పులిని చూసి వాతలు పెట్టుకునే స్వదేశీ ఫ్యాషన్ పోరగాళ్లు వినోదం ముసుగులో ఇలాంటి పెడ ధోరణులని దేశమంతటా పాకించటానికి చేసే నిర్విరామ ప్రయత్నం ఉందే – అదీ తప్పు పట్టాల్సిన విషయం.

నేను చెప్పేది బాలీవుడ్ దర్శక నిర్మాతల గురించి. పేరు సైతం హాలీవుడ్ నుండి ప్రేరణ పొంది కానీ పెట్టుకోలేని భావదారిద్ర్య రంగమది. అధిక శాతం సినిమాలు ఎక్కడ్నుండో ఎత్తేసిన కధలతో మాత్రమే నిండి ఉండటం ఈ పరిశ్రమ ప్రత్యేకత. అంతటితో ఆగితే ఫరవాలేదు. కొత్తగా తమ మనో వికారాలు ప్రేక్షకుల మీద రుద్దే ఉద్దేశంతో సినిమాలు తీసే నవ యువతరం ఒకటి పుట్టుకొచ్చింది. ‘కల్ హో న హో’తో ఈ ధోరణి మొదలయింది. ‘దోస్తానా’తో తారాస్థాయికెళ్లింది (దోస్తానా-2 కూడా రాబోతున్నట్లు తాజా వార్త). అవి తీసేవారి వ్యక్తిగత జీవితాలు పరిశీలిస్తే, ఏ రహస్య అజెండాలూ లేకుండా వినోదం కోసమే ఇటువంటి సినిమాలు తీస్తున్నారంటే నమ్మటం కష్టం. వీళ్ల పుణ్యాన ఈ చీడ మెల్లి మెల్లిగా ఇతర భాషా సినీ రంగాలకీ పాకింది. కామెడీ పేరుతో వెకిలి వేషాలేయించే వాళ్లు మనకెప్పుడూ ఉన్నారు. వాళ్లకిప్పుడో కొత్త అస్త్రం దొరికింది. గులాబి వీరుల గోలతో నిండిన హాస్య సన్నివేశాలు ఇప్పుడు తరచూ దర్శనమిస్తున్నాయి మన సినిమాల్లో. అతి తేలిగ్గా వ్యామోహాలకి గురయ్యే టీనేజ్ బుర్రలకి ఇటువంటి సన్నివేశాలిచ్చే సందేశాలేమిటో ఊహించటం తేలికే. పేరు గొప్ప సెన్సార్ ఉండీ ఉపయోగం లేని పరిస్థితి. ఎలాగోలా వార్తల్లో ఉండే యావతో బరితెగించిన బాలీవుడ్ నటీమణుల ఫోటో విన్యాసాలు, బహిరంగ వ్యాఖ్యలు కూడా దీనికి ఆజ్యం పోస్తున్నాయి. అశ్లీల ప్రతిఘటనా వేదికలూ, సంఘాలూ ఈ ధోరణిపై ఇంకా దృష్టి పెట్టిన ఆనవాళ్లు లేవు. సంస్కృతి పరిరక్షణోద్యమకారులకి పరాయి మతాలపై విరుచుకు పడటానికే ఎక్కడి సమయమూ చాలటం లేదు, ఇక ఇటువంటివి పట్టించుకునే తీరికేది పాపం?

ఎవరో పట్టించుకునేదాకా మనమెందుకాగాలి? ఉద్యమాలన్నీ కలివిడిగా చెయ్యాల్సిన అవసరం లేదు. కొన్ని విడివిడిగానూ చెయ్యొచ్చు. ఎవరికి వారు అటువంటి సినిమాలని బహిష్కరించే నిర్ణయం తీసుకోవాలి. తాము చూడటం మానేయాలి, మరో నలుగురితో చెప్పి మాన్పించాలి. ఏమంత కష్టం. చెయ్యలేమా?


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 302,731

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.