Posts Tagged 'కేతిగాళ్లు'

విదూషకులు

తెలుగునాట ఈ మధ్య కాలం దాకా కథానాయకుల ప్రేక్షకాదరణకి వాళ్ల సినిమాల శతదినోత్సవ కేంద్రాల సంఖ్య గీటురాయిగా ఉండేది. అదే ఒరవడిలో – రాజకీయ నాయకుల ప్రజాదరణకి నిలువెత్తు నిదర్శనంగా వాళ్ల పీనుగులు తోడు తీసుకెళ్లిన ప్రాణాల సంఖ్య ఉదహరించే కొంగ్రొత్త సంప్రదాయం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. దానికి ముందస్తు ఏర్పాట్లలో భాగంగా, నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో చావులన్నీ వైఎస్ ఖాతాలోకే చేరుతున్నాయి. దివంగతులైన నాయకుల్ని తదనంతర కాలంలో తలచుకున్నప్పుడు, బతికుండగా ఆయా నాయకులు చేసిన ఘనకార్యాలు గుర్తుకు రావటం సహజం. వైఎస్ విషయంలో ఆయనకి తోడుగా తద్దినాలు పెట్టించుకునేవారి సంఖ్య మాత్రమే గుర్తొచ్చేలా చెయ్యాలన్నది ఆయన వీరాభిమానుల దూరాలోచన కావచ్చు. భవిష్యత్తులో రాష్ట్రమంతటా ఏర్పాటు చెయ్యబోయే ఆయన విగ్రహాల కిందుండే శిలాఫలకాల్లో ఈ సంఖ్య కూడా ప్రముఖంగా అగుపడేలా చెక్కిస్తే బాగుంటుంది. మొత్తమ్మీద – నాయకులు పోయినప్పుడు జరిగే అల్లర్లూ, ఆస్థి నష్టమూ వాళ్ల ప్రజాదరణకి కొలబద్దగా తీసుకునే ధోరణితో పోలిస్తే ఇది మంచి మార్పే.

మార్పు మరొకటీ ఉంది. నిజానికి ఇది మార్పు కాదు, కొన్నేళ్లుగా దుప్పటి కప్పేసి బబ్బోబెట్టిన కాంగీయుల నిజ నైజం ఇప్పుడు నిద్ర లేచి వళ్లు విరుచుకుంటుందంతే. వైఎస్ పోగానే, రాష్ట్ర ప్రజానీకం అంచనాలు నిజం చేస్తూ, అనుకున్నట్లుగానే కాంగిరేసు కేతిగాళ్ల కోలాహలం మొదలయింది. ముఖ్యమంత్రి పదవి కోసం ఆశావహులంతా రెక్కలు కట్టుకు ఢిల్లీలో వాలి జనపధంలో బారులు తీరి ఎవరి పిండి కొద్దీ వారు లాబీయింగ్ నడుపుకుంటున్నారు. పిండి పెద్దగా లేనివారూ, ఉన్నా పిసికే ఓపిక లేనివారూ ఎవరి లెక్కలు వాళ్లేసుకుని ఏదో ఓ వర్గంలో చేరిపోయారు. ఏ వర్గంలోనూ చేరని గోపీలూ కొందరున్నారు. వాళ్ల లెక్కలూ వాళ్లకున్నాయి మరి! ఈ సందర్భంగా వీళ్లందరూ వాడుతున్న పదజాలాన్నీ, వారి మాటల వెనకున్న గూఢార్ధాల్నీ సాధారణ ప్రజానీకం అర్ధం చేసుకోలేక సతమతమౌతుంది. ఆయా నిగూఢార్ధాల గుట్టు విప్పుతూ వాటి యదార్ధ ప్రతిపదార్ధాలతో ప్రత్యేక నిఘంటువునొకదాన్ని రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదాహరణకి, ‘ముఖ్యమంత్రయ్యే ఉద్దేశం లేదు’ అంటే ‘ఉద్దేశముంది కానీ, ఆ అవకాశమే లేదు’ అని మొన్ననే చెప్పుకున్నాం. అలాంటివే మచ్చుకి మరో ఐదు:

సీనియర్లెందరో ఉన్నారు = సీనియర్ మోస్టుని నేనే
అతనికి అనుభవం లేదు = నాకు శానా బోలెడుంది
అంతా అధిష్టానమే చూసుకుంటుంది = ఎవడు సీయమ్మైతే నాకేంది, నా పదవి నాకిస్తే చాలు
నేను రేసులో లేను = నాకూ రేసులో ఉండాలనే ఉంది కానీ .. ప్చ్
జగన్ కోసం రాజీనామా చేస్తా = ఛా ఊకో .. ఎవుడి కోసమో నేనెందుకు రాజీనామా చేస్తా?

చివరి ఉదాహరణ మాట వరసకన్నది కాదు. అది నిజమేననేదానికి ఇదిగిదిగో తిరుగులేని రుజువు. ‘జగనన్న’ని ముఖ్యమంత్రిని చెయ్యకపోతే మంత్రులుగా పునఃప్రమాణం చెయ్యంగాక చెయ్యం అని ఏడుగురు మంత్రులు భీష్మించారట. తీరా చూస్తే – వీళ్లు ఏడుగురూ మిగతా మంత్రులకన్నా ముందే రాజ్‌భవన్ చేరుకుని తమవంతు ప్రమాణ స్వీకారం కోసం చేతులు నులుముకుంటూ, చెమటలు తుడుచుకుంటూ (కాంగీయుల మెడల్లో కండువాలెందుకో తెలిసిందా?) ఎదురు చూశారని ఆ ఒకటో పత్రిక అందించిన ఉప్పు. చెరువు మీద అలిగితే ఒరిగేదేమీ లేదని వీళ్లకి వేరెవరో చెప్పాలా? కారణాలేవైనా, రాకుమారుడి ఏడు చేపలూ ఎండలేదు; సోనియామ్మ దగ్గర పప్పులు ఉడకలేదు. రాజీనామా చేస్తామంటున్న మరికొందరు ఎమ్మెల్యేల బెదిరింపులూ తాటాకు చప్పుళ్లేనని ఈ దెబ్బతో హైకమాండ్‌కి అర్ధమైపోయుంటుందనటంలో అనుమానం లేదు. ఏదేమైనా, కేతిగాళ్ల కామెడీకిది పరాకాష్ట. ఈ హాస్య ప్రహసనానికి తోడుగా ‘జగన్‌ని ముఖ్యమంత్రిని చెయ్యకపోతే మానవబాంబులుగా మారతాం, రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తాం’ అంటూ తొడలు కొడుతున్న చిల్లరమల్లర సీమ నేతల కారు కూతలు పేపర్లో చదివి కామెడీ సినిమాల్లో పారడీ ఫ్యాక్షనిస్టుల పాత్రలు మదిలో మెదిలి పగలబడి నవ్వుకుంటుండగా నా బుర్రలో ఓ ఐడియా తళుక్కుమంది. కేంద్ర ప్రభుత్వం ఏటేటా ఇచ్చే సినిమా అవార్డుల్లో తెలుగువారికి స్థానం దక్కటం లేదని మన సినీప్రియుల ఆవేదన. రాజకీయ నటీనటులకీ దేశవ్యాప్త అవార్డుల పంపకం మొదలెడితే విదూషకుల విభాగంలో మన రాష్ట్ర కాంగీయులకి ఎదురే ఉండకపోవచ్చు. సినిమాల్లో సాధించలేనిది ఇక్కడ సాధించొచ్చు. ఏమంటారు?


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,298

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.