Posts Tagged 'కచరా'

విశ్వరూపం

రెండు నెలలుగా కచరా కనబడ్తలేదు, వినబడ్తలేదని అందరూ చస్తుండ్రు. ఒకటే లొల్లి చేస్తుండ్రు. అన్ని విషయాలు బజార్న కూర్చొని చెప్పుకోలేంగ మరి. కొన్ని రైల్ పట్టాలెంట వంటావార్పుల్ జేసుకుంటా చెప్పుకోవాలె. ఇంకొన్ని కల్లుకాంపౌండ్లలో బుడ్డీల్లేపుకుంటా చెప్పుకోవాలె. చెప్పుకోటానికేం లేకపోతే వ్యూహాత్మక మౌనం పాటించాలె. గదే నే జేస్తుండ. గిట్టనోల్లు లక్షంటరు. ఎవరో ఏదో అన్నరని ఉద్యమకార్లు ఆగం గావద్దు. మిమ్మల్ని ఆగమాగం చెయ్యనీకి నేనున్న కాబట్టి ఫికరొద్దు.

ఆ మద్దెన ప్రధానమంత్రి నాతో చెప్పిండు. రాష్ట్రంలో జనాలు తలో దిక్కు కొట్లాడుతుంటే పంచాయితీ తెంపటం కష్టమన్నడు. ఇంత వేడిగుంటే తేల్చలేం అన్నడు. సల్లబడిందాక ఆగమన్నడు. ప్రధాన మంత్రి జెపితే ఇనాల్న వద్దా? గందుకే సమ్మర్ ఐపోయిందాక ఆగుదమని డిసైడ్ జేసినా. గిప్పుడు ఎండలు పోయి చల్లబడిందని బయటికొచ్చిన. జర మంచి ఖబర్ చెబ్దమనే మీ ముందుకొచ్చిన. ఢిల్లీ వాళ్లు మన దెబ్బకి బయపడ్డరో, బతికిండ్రో, సచ్చిండ్రో తెల్వదుగాని మొత్తానికి తెలంగాణ ఇస్తే బాగుంటదో లేదో అని ఆలోచిద్దామనేదానిగురించి ఆలోచించేదానికి ఆలోచిద్దమని సోచాయిస్తుండ్రని నాకు సిగ్నల్సొచ్చినై. జర సోచాయిస్తేనే మంచిదని చెప్పొచ్చినా.

ఆ పత్రికాయన ఏదేదో రాసిండు. నాకు సిగ్నల్స్ లేవంటడు. రావంటడు. గీడ సూడండ్రి. ఆపిల్ కంపెనోడి ఐ-ఫోనిది. బిందాస్ ఫోన్. లేటెస్ట్ మోడల్. ఇంకెవుని దగ్గరన్నా ఉందా ఇది? గిందులో రాకపోతె సిగ్నల్సు ఇంకెందులో వస్తయ్? గా పత్రికాయన సిగ్నల్సొచ్చినా నాకే ఎందుకొస్తయ్యంటడు. అరె దిమాకున్నోని ప్రశ్నేనార భై అది? ఢిల్లీవోళ్లు నాకు ఫోన్ గొట్టక దార్నబోయే దానయ్యలకు కొడతరా? నేనంటే గింత మందుగొట్టి పండుకుని ఫోనెప్పుడొస్తదాని ఎత్తనీకి రెడీగుంటా. దానయ్యలకేం అవుసరం భై? ఆల్లకింకేం పన్లుండవా? గందుకే ఢిల్లోళ్లు ఫోన్ గొడ్తే గిడ్తే నాకే గొడ్తరు మల్ల.

తెలంగాణకోసం మన పొన్నమన్న స్పీకరు ముంగిట్ల బైఠాయించిండు. ఇంతకన్న గొప్ప త్యాగాలెవడన్నా జేసిండా? మరి కేశవన్న పదవులు ఒదులుకుండు. ఉన్న పదవులు ఏ ఔలాగాడన్న ఒదులుకుంటడు. లేని పదవులు ఒదులుకోవాలంటె ఎంత దిల్లుండాలె? గందుకే రాష్ట్రం ఏర్పడగనే ఈళ్లకి షాందార్ పదవులిస్తం. తెలంగాణ కోసమే గౌడన్న ఉద్యోగ విరమణ జేసిండు. నిజానికి గౌడన్న విరమణ చేసినట్టుగాదు. విరమణ చెయ్యనీకి ఆయన్న ఎప్పుడన్న ఉద్యోగానికెళ్తె గద. జీతం పైసలైతె ఠంచన్‌గ తీస్కుండు కాని ఏడాది పొడుగూత పనెగ్గొట్టి మన కోసమే కొట్లాడిండు. గందుకే మన రాష్ట్రమొచ్చినంక గౌడన్ననే ఉద్యోగ మంత్రిని చేస్తం. కేంద్ర ప్రభుత్వోద్యోగులకంటె మనోళ్లకె పెద్ద పెద్ద స్కేళ్లిస్తం. ఆళ్ల స్కేళ్లు అడుగు పొడుగే ఉంటై. మనం జబర్దస్తుగ రెండడుగులు చేయించిద్దం. అయ్యీ చాలవంటె మీటరు బద్దలు చేయించిద్దం.

వాల్లు రాష్ట్రం ఇస్తరో చస్తరో ఇంకో పదిహేను రోజులు చూద్దం. ఇయ్యకపోతే ఇరవయ్యో తారీకున దుకానం తెరుద్దం. మన్లో మనకి లక్షుంటయ్. అయన్నీ అవతలేద్దం. పార్టీలు పక్కనబెడ్దం. అందరికీ విశ్వరూపం చూపిద్దం. ఆల్రెడీ మా కవితమ్మకి చెప్పి కమలాసన్‌తో మాట్టాడించిన. సైన్మ మస్తుగొచ్చిందంట. ముందస్తుగ మనకే ప్రివ్యూ చూపించనీకి ఒప్పుకుండు. అందరం కల్సి విశ్వరూపం చూద్దం. పార్టీలు పక్కన బెట్టి దావత్ చేస్కుందం. మస్త్ మజా చేద్దం. ఐనంక మల్లింకో డెడ్‌లైన్ పెడదం. మన్దగ్గర డెడ్‌లైన్లు మస్తుగున్నయ్లే. యాద్ మర్వకండ్రి. ఇరవయ్యో తారీకు మల్లీ కలుద్దం.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.