Posts Tagged 'ఎలక్ట్రానిక్స్'

సర్క్యూట్ సిటీ

అమెరికా వచ్చిన కొత్తలో ఎదురైన చిన్నా పెద్దా అనుభవాలూ, వాటికి సంబంధించిన స్థలాలూ నా వరకూ ఎప్పటికీ ప్రత్యేకమైనవే. అలవాటై పోయాక ఇప్పుడు ఎంత గొప్ప విషయమైనా సాధారణంగానే కనిపిస్తుంది కానీ, అప్పట్లో ప్రతిదీ అబ్బురమే, అద్భుతమే. అది మొదటిసారి ఆటోమాటిక్ వెండింగ్ మెషీన్లో టికెట్ కొని లోకల్ ట్రైనెక్కటం కావచ్చు, డ్రైవింగ్ సరిగా రాక ముందే శాన్ ఫ్రాన్సిస్కో మహానగర వీధుల్లో ఒంటరిగా కారేసుకుని ఇంటర్వ్యూకెళ్లే ధైర్యం చెయ్యటం కావచ్చు (శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్ రోడ్లు – అంత గందరగోళంగా ఉండే రోడ్లు మరెక్కడా ఉండవని నా నమ్మకం. నలభయ్యైదు డిగ్రీల కోణంలో ఏటవాలుగా ఉండే ఇరుకు రోడ్లు, వాటి మీదనే లోకల్ రైల్ ట్రాక్స్, ఆ ట్రాక్స్ మీద కారు నడపొచ్చో లేదో తెలీని అయోమయం, వీటి మధ్య రెండ్రెండు బస్సులు తగిలించుకుని జోరుగా వెళ్తుండే ఎలక్ట్రిక్ సిటీ బస్సులు .. అబ్బో వర్ణనాతీతం). ప్రతి అనుభవం నుండీ నేర్చుకున్నదెంతో. మనసు బాగోలేనప్పుడు తొలినాళ్లలో వెళ్లిన ప్రదేశాలకి వెళితే ఎంతో ఊరట, ఉపశమనం. జేబులో ఆరొందల డాలర్లతో ఈ గడ్డ మీద బిక్కు బిక్కుమంటూ అడుగు పెట్టి, స్నేహితులు, సన్నిహితుల తోడు లేకుండా ఒంటరిగా ఉద్యోగ వేట సాగించిన ఆ రోజుల్ని గుర్తు చేస్తాయి ఆయా స్థలాలు. ‘ఏఁవాయ్, బాగున్నావా? అప్పట్లో భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకునే వాడివి. ఎదిగిపోయావు చూశావా’ అని వెన్ను తడుతున్నట్లనిపిస్తాయి. చికాకులు, చిన్నా పెద్దా కష్టాలు ఎదురైనప్పుడు – నాటి నుండి నేటి దాకా నా ప్రస్థానాన్ని తలచుకుంటే, వెలుగులు చిమ్మే రేపటి గురించి భరోసా దానంతటదే వస్తుంది. అందుకే ఆ స్థలాలు, ప్రదేశాలంటే నాకంత ఆపేక్ష.

అటువంటి ప్రత్యేక అనుబంధం కలిగిన ఒక పేరు సర్క్యూట్ సిటీ. అమెరికా వ్యాప్తంగా సుమారు ఆరొందల స్టోర్లు కల ఎలక్ట్రానిక్ ఉపకరణాల రిటైల్ చైన్. నేనీ దేశంలో తొలిసారిగా షాపింగ్ చేసిన ప్రదేశం. షాపింగంటే భారీ ఎత్తున ఊహించుకోకండి. నేను కొన్నది పందొమ్మిది డాలర్ల విలువగల ఒక పానాసోనిక్ వాక్‌మాన్. రాబడేమీ లేనప్పుడు – నాదగ్గరున్న ఆరొందల డాలర్లలో తెగించి పందొమ్మిది డాలర్లు ఖర్చు పెట్టటమంటే ఎక్కువే మరి. తర్వాత కాలంలో ఎన్నెన్ని ఎలక్ట్రానిక్స్ కొన్నా ఆ వాక్‌మాన్ స్థానం దానిదే. తర్వాత్తర్వాత బెస్ట్ బై, ఫ్రైస్ ఎలక్ట్రానిక్స్, గుడ్ గైస్, మైక్రో సెంటర్ ఇత్యాది ఎలక్ట్రానిక్ రిటైల్ సెంటర్లలో కొన్నంత విరివిగా సర్క్యూట్ సిటీలో కొనకపోయినా నా దృష్టిలో ఆ చైన్ ప్రత్యేకత మిగిలిన చైన్లకి లేదు.

పోయిన వారం సర్క్యూట్ సిటీ త్వరలో మూతపడనున్నట్లు వచ్చిన వార్త చదివి నాకు బాధేసింది. అమెరికాలో ఆర్ధిక మాంద్యం బలితీసుకున్న భారీ వ్యాపార సంస్థల్లో ఇది తాజాది. 1949లో స్థాపించబడి, అరవై సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులనెదుర్కుని ఒడ్డున పడ్డా, నేటి మాంద్యం దెబ్బకి చేతులెత్తేయక తప్పలేదీ సంస్థకి. ఇది దివాలా తీయటంతో రమారమి ముప్పై ఐదు వేల మంది ఉద్యోగులు బజార్న పడ్డారు. నిన్న సాయంత్రం ఇంటి దగ్గర్లో ఉన్న సర్క్యూట్ సిటీకి వెళ్లినప్పుడు నా జ్ఞాపకాల దొంతర కదిలింది. ఎప్పుడూ షెల్ఫుల నిండా రకరకాల ఎలక్ట్రానిక్ సామాగ్రితో కళకళలాడుతుండే షాపులో ఇప్పుడు చాలావరకూ ఖాళీ షెల్ఫులే వెక్కిరిస్తుంటే ఏదోలా అనిపించింది. మార్చి నెలాఖరు నాటికి షాపులన్నీ పూర్తిగా ఎత్తేస్తారని తెలిసి దిగులేసింది. స్టోర్ క్లోజింగ్ డీల్స్ ఉంటాయేమోనని వచ్చిన కస్టమర్లతో షాపు సందడిగానే ఉన్నా, త్వరలో బ్రతుకు తెరువు కోల్పోనున్న సేల్స్‌మెన్‌లో కొట్టొచ్చినట్లు కనిపించే నిరాసక్తత, నిర్లిప్తత. నెల క్రితం – క్రిస్మస్ రోజుల్లో – మూత పడ్డ మరో రిటైల్ దిగ్గజం మెర్విన్స్ లోనూ ఇదే సన్నివేశం. ఎందుకో మరి – జనాలు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నప్పుడు ఏమీ మాట్లాడకుండా కూర్చుని, ఈ కష్టకాలంలో పొదుపు చెయ్యటమెలా అని ఎగబడి ఉచిత సలహాలు పారేస్తున్న మహా మహా అనలిస్టుల మీద అప్రయత్నంగా ఒళ్లు మండింది. వెనక్కొచ్చేస్తుంటే, రియర్ వ్యూ మిర్రర్లో నుండి తిరగబడి కనిపిస్తున్న సర్క్యూట్ సిటీ సైన్ బోర్డు – బోర్డు తిప్పేస్తున్నాం చూశావా అంటున్న భావం. శాశ్వతంగా దూరమౌతున్న స్నేహితుడికి వీడ్కోలు చెబుతున్నట్లుగా ఫీలవుతూ ఇంటికి తిరిగొచ్చాను.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,998

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.