Posts Tagged 'ఇంటర్'

అహం బ్రహ్మాస్మి

ఇగో – అచ్చ తెనుంగులో అహం – లేని వాడు మనిషే కాడు (అహమున్న మహిళామణులూ, ‘ఏం, లేనిది మనిషే కాదు అనొచ్చుగా’ అని నిరభ్యంతరంగా అభ్యంతర పెట్టుకోండి. నో ప్రోబ్లిమో). అహరహమూ అహంతో రగిలేవాడు మనిషికన్నా మిన్న – వాడు దేవుడంతటోడే. ‘అహం బ్రహ్మాస్మి’ అని పెద్దలూరకే అన్నారా? అహమున్న వాడే దేవుడని దానర్ధం. అగ్నానులు దానికి మరో అర్ధమూ చెబుతారు కానీ మేం చెప్పిందే కరెక్టు. విజేతలందరి ఉమ్మడి విజయ రహస్యం ఓటమినొప్పుకోని ఇగోనే. ఐతే, అహానికి రెండో మూడో టేబుల్ స్పూన్ల కారం కలపనంతవరకూ చూసేవాళ్లకీ బాగానే ఉంటుంది. ఆ ఘాటు తట్టుకోలేని స్థాయికెళితేనే సమస్యలు – ఎక్కువగా ఎదుటోళ్లకి, అప్పుడప్పుడూ సదరు దేవుడికీ.  

అహం పేరు చెబితే మాకు తట్టే మొట్టమొదటి పేరు – ఇంకెవరిది – ఆంధ్రుల అన్నగారిదే. ఆయన రాజకీయాల్లోకి రాకముందు జరిగిన సంఘటనిది. ఏదో సినిమా షూటింగ్ విరామ సమయంలో ఈయన సేదదీరుతుంటే ఓ నిర్మాతొచ్చి ఈయన్ని ఉబ్బేసే ఉద్దేశంతో, ‘రామారావు గారూ, నిన్న మీ హరిబాబు సినిమా చూశానండీ. ఆహాహా .. ఏం నటన, ఏం నటన. కుర్రాడు అదరగొట్టేశాడనుకోండి. తండ్రిని మించిన తనయుడనిపించుకున్నాడు’ అన్నాడు. హరికృష్ణ ‘తాతమ్మ కల’ విడుదలైన రోజులవి. అన్నగారు పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతూ తన తర్వాతి సినిమాకి కాల్షీట్లిచ్చేస్తాడని ఆ నిర్మాత ఆశ కాబోలు. ఆయన ఆశేదైతేనేం, రామారావుకి మాత్రం ఒళ్లు రక రకాలుగా మండింది. ‘ఠఠ్. మమ్మల్ని మించిపోవటమేంటి, నాన్సెన్స్’ అంటూ చివ్వున లేచి వెళ్లిపోయాడక్కడనుండి. షాట్ కట్ చేస్తే – ఆ నిర్భాగ్య నిర్మాత తర్వాతి చిత్రంలో హీరో ఎన్టీవోడు మాత్రం కాదని చెప్పటానికి పెద్దగా తెలివితేటలక్కర్లేదు.

అన్నగారి అహం రాజకీయాల్లోకొచ్చాకా చెక్కుచెదర్లేదనేదానికి బోలెడు ఉదాహరణలు. ఇప్పుడవన్నీ విప్పలేంగానీ, మచ్చుకి, అందరూ ఎరిగిందే ఒకటి గుర్తు చేస్తాం. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార పోస్టర్లు చూసే ఉంటారు కదా. వాటిలో అన్నగారు వోట్లడిగే పద్ధతెంత పసందుగా ఉంటుందో గమనించారా? ‘తెలుగుదేశం పిలుస్తోంది రా’ అంటూ ఒక చెయ్యి నడుమ్మీదేసుకుని రెండో చెయ్యి ముందుకు చాచి ఎంత ధీమాగా ఆజ్ఞాపిస్తారో! అదేదో, మనందరమూ చచ్చినట్లు వెళ్లి తెలుగుదేశానికే వోట్లేసి తరించాలన్న హుకుంలా ఉంటుందే కానీ మిగతా పార్టీల్లా వోట్లు అడుక్కుంటున్నట్లుండదు. ఆయనకే సాధ్యమైన స్టైల్ అది.
ఇగో విషయంలో అన్నగారి తర్వాత అంతటోడు మా ఎరికలో మరొక్కడే ఉన్నాడు. అది మేమేనని వేరే చెప్పకపోయినా మీకు తెలుసని మాకు తెలుసనుకోండి …. అయినా తెలీని అగ్నానులకి తెలీజెప్పే బాధ్యతంటూ ఒకటేడిచింది కాబట్టి చెబుతున్నాం, అది మేమే. మదీయ ఇగోని దెబ్బతీసిన వారిని మర్చిపోవటం, క్షమించటం చిన్నప్పట్నుండీ మాకలవాటు లేదు. మాయొక్క ఇగోని రెచ్చగొట్టిన సంఘటనలు అత్యంత పిన్న వయసులోనే కొన్నున్నాయి. మేము రెండో తరగతిలో ఉండగా – అనగా, మాకప్పుడు ఆరేళ్లు – జరిగినదొకటి మాకిప్పటికీ బాగా గుర్తు. ఓ రోజు ట్రాఫిక్ సమస్య వల్ల మేము బడికి వెళ్లటం ఆలస్యమైతే టీచర్ మమ్మల్ని అందర్లోనూ అవమానించింది. అప్పుడు ఆవిడన్నమాట మేం ఎప్పటికీ మర్చిపోం: ‘ఈ చీమకి ట్రాఫిక్ అడ్డమొచ్చిందట’! ఆ మాటంటూ ఆవిడ నవ్విన వెటకారపు నవ్వూ మర్చిపోం. చీమతో పోల్చటానికి మేమేమన్నా చిన్నా చితకా వాళ్లమా? ఆ టీచర్ మీద ఆనాడు రగిలిన పగ నేటికీ చల్లారలేదు. ఆమెతో పాటు చీమలన్నా మాకు కోపమే – ఇప్పటికీ.
ఇగో వల్ల అడపాదడపా ఇటువంటి ఇబ్బందులున్నా, కొన్నిసార్లు బ్రహ్మాండమైన ఉపయోగాలూ ఉంటాయి. హైస్కూల్లో ఓ స్నేహితుడు ‘ఉప్పు లేకుండా పెరుగన్నం తిను చూద్దాం’ అని మమ్మల్ని రెచ్చగొడితే, నాటి నుండి నేటి దాకా మేం పెరుగన్నంలో ఉప్పు కలుపుకొని ఎరగం. ఉప్పు తగ్గించటం వల్ల ఆరోగ్యపరమైన ఉపయోగాలుంటాయని అప్పుడు తెలీకపోయినా ఇప్పుడు తెలిసింది కాబట్టి ఈ విషయంలో మా ఇగో మాకు మేలే చేసిందనుకుంటాం.  

ఐతే ఇగోలు కొన్ని సార్లు మనల్ని భీకరమైన డైలమాలో పడేసే సందర్భాలూ ఎదురౌతుంటాయి. ఒక రకమైన ఇగోని తృప్తి పరిస్తే మరో రకం ఇగో దెబ్బ తినాల్సొచ్చే సందర్భాలన్న మాట. అటువంటప్పుడు ఏ ఇగో వైపు మొగ్గు చూపాలో అర్ధం కాక ఎందుకొచ్చిన ఇగోలరా బాబూ అనిపించొచ్చు (కానీ మావంటివారికి అలా అనిపించదు. -పిస్తే మేం మేమెలా అవుతాం?). ఇది మేం ఇంటర్మీడియెట్‌లో ఉండగా జరిగింది. ఇంటర్ గణితంలో ‘Probability’ ఓ కీలకమైన చాప్టర్. అందులో పేకలకి సంబంధించిన ఉదాహరణలు ఎక్కువగా ఉంటాయి. వాటికోసం పేక ముక్కల రంగులు, రకాలు వగైరా తెలుసుకోవాలి. వీలైతే కాస్త పేకాటా నేర్చుకోవాలి. మాకేమో చిన్నప్పట్నుండీ పేకలంటే బహు చిరాకు. జన్మలో ఆ ఆట నేర్చుకోకూడదు, ఆడకూడదు అని ఊహ తెలీకముందే కఠోర నిర్ణయం తీసేసుకున్నాం మేం. ఇంటర్మీడియెట్‌లో ఆఫ్ట్రాల్ మార్కుల కోసం మా నిర్ణయాన్ని మార్చుకోవాలా? ఎలా పడితే అలా మార్చుకోటానికి ఇదేమన్నా ఆషామాషీ వ్యవహారమా, మా ఇగోతో వ్యవహారం. ఇగోనా, మార్కులా? పెద్దగా ఆలోచించే పని లేకుండానే మా వోటు ఇగోకి పడింది. ప్రాబబిలిటీ చాప్టర్ మొత్తాన్నీ ‘ఛాయిస్’ కోటాలో వదిలెయ్యాలని నిర్ణయించేశాం. ఓస్ అంతేగా అనుకోకండి. ఇప్పుడెలా ఉందో కానీ అప్పట్లో ఇంటర్ గణితంతో తలగోక్కోటమంటే అల్లాటప్పా విషయం కాదు. పైగా, మనకి ‘ఏ పరీక్షా రెండో సారి రాయకూడదు’ అనే మరో కఠోర నియమమూ ఉంది. ఒక ఇగో కోసం ప్రాబబిలిటీ చాప్టర్ మొత్తం వదిలేసి పరీక్ష తన్నిందంటే రెండో ఇగో దెబ్బ తింటుంది మరి. కింకర్తవ్యం? దొడ్డిదార్లు మాకు పడవు కాబట్టి మిగిలిందొకే దారి – ఛాయిస్ లేకుండా నూటికి నూరు ప్రశ్నలకీ సమాధానమివ్వగలిగే స్థాయిలో పరీక్షకి తయారవటం. తయారయ్యాం, పరీక్షలో విజయం సాధించాం. ఒక్క దెబ్బకే రెండు ఇగోలు.  

‘ఏ పరీక్షా రెండో సారి రాయకూడదనే’ నియమం మాకోటుందన్నాం కదా. అందులో ఓ చిన్న తిరకాసుంది. దాన్ని గనక మీరు ‘ఏ పరీక్షా తప్పకూడదు’ అని అర్ధం చేసుకున్నారంటే మీరగ్నానులే. ‘ఒకవేళ తప్పితే, మళ్లీ రాయకూడదు’ అని మాత్రమే దానర్ధం. నిజానికి మాకు మొదట్లో ‘పరీక్ష తప్పనేకూడదు’ అనే నియమమే ఉండేది. పాతికేళ్లొచ్చేదాకా దాన్నలాగే కాపాడుకుంటూ వచ్చాం. ఆ తర్వాత విధివశాత్తూ ఇష్టం లేని అర్హతా పరీక్షొకటి రాసి అది తప్పటం, దాని వల్ల దెబ్బతినబోతున్న మా ఇగోని బుజ్జగించటం కోసం ఆ నియమాన్ని కాస్త సడలించి ‘రెండో సారి రాయకూడదు’గా మార్చటం జరిగిపోయాయి. ఒకానొక బ్యాంక్ ఎంట్రన్స్ టెస్ట్ సందర్భంగా జరిగిందిది. మేం రాసిన మొదటి మరియు చివరి ప్రవేశ పరీక్షిది (ఎంసెట్‌తో సహా ఏ రకమైన ఇతర అర్హతా పరీక్షలూ మే రాసుండలేదని ఈ సందర్భంగా సగర్వంగా జనులకు తెలియజేస్తున్నాం). అది కూడా ఇంటిపోరు పడలేక అయిష్టంగా చేసిన పని. మా చదువులకీ, అభిరుచులకీ ఈ బ్యాంక్ ఉద్యోగం సరిపడదని మా నిశ్చితాభిప్రాయం. అయినా రాయక తప్పకపోవటంతో చిరాగ్గానే రాయటానికెళ్లామా, అందులో వాడడిగిన చచ్చు ప్రశ్నలు చదివి మాకు చిర్రెత్తుకొచ్చింది. ముఖ్యంగా ‘భారద్దేశంలో పేదరికాన్ని తొలగించేదెలా?’ అన్న ప్రశ్న చదివి మా అరికాలి మంట నెత్తికెక్కింది. ఉద్యోగార్ధుల ఉచిత సలహాలతో పేదరికం తొలగిపోతే దేశం ఇలాగెందుకేడుస్తుంది? మాకొళ్ళు మండి ‘అది చాలా సులభం. దేశంలో ఉన్న పేదలందర్నీ బయటికి తరమాలి’ అని రాసేసి చక్కా వచ్చాం. పరీక్ష ఫలితం మీకాల్రెడీ తెలుసు.
అదండీ మా ఇగోల గోల. రాసుకుంటూ పోతే ఇలాంటివి ఇంకా బోలెడు. ఎక్కువ సందర్భాల్లో మా ఇగో బాధితులం మేమే కాబట్టి దానివల్ల ఎవరికీ సమస్యల్లేవని మా నమ్మకం. ఇదంతా చదివాక మమ్మల్ని గురించి మీరేమనుకుంటారో మాకు తెలీదు కానీ, ఏమనుకున్నా మేం పట్టించుకోమని మీకీపాటికే తెలిసుండాలి.

ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,298

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.