ఆంధ్ర ప్రదేశ్‌లో రెండే రకాల ప్రజలున్నారు – రాజశేఖర రెడ్డిని గాఢంగా అభిమానించేవాళ్లు, రాజశేఖర రెడ్డిని తీవ్రంగా ద్వేషించేవాళ్లు. ఆయన్ని పట్టించుకోని వాళ్లు మాత్రం లేరు. అభిమానుల దృష్టిలో ఆయన – పేదల పాలిట పెన్నిధి, నమ్ముకున్నవారి కోసం ఎంతకైనా తెగించేవాడు, రైతుజన బాంధవుడు. వ్యతిరేకుల దృష్టిలో ఆయనే – కరడుగట్టిన ఫ్యాక్షనిస్టు, అవినీతికి కొత్త అర్ధాలు చూపినవాడు, అధికారాన్ని యధేచ్చగా దుర్వినియోగం చేసినవాడు. ఇవన్నీ ఆయన విషయంలో ఎంతో కొంత నిజాలే. ఒక వ్యక్తిలో భిన్న కోణాలుండటం అసాధారణం కాదు. మంచీ చెడూ రెండూ ఒకే వ్యక్తిలో శిఖరాగ్రాల్ని తాకటం మాత్రం అసాధారణమే. రాజశేఖరరెడ్డిని ఇష్టపడేవాళ్లూ, పడనివాళ్లూ కూడా ఆయన ఇక లేడన్న వార్త తెలిసినప్పుడు ఒక్కసారన్నా ‘అయ్యో’ అనుకుని ఉంటారనటంలో అతిశయోక్తి లేదు.
రాజశేఖరరెడ్డి లేని దెబ్బ అందరికన్నా ఎక్కువగా తగిలేది కాంగ్రెసు పార్టీకే. ఆ పార్టీపై ఆయన వేసిన ముద్ర అటువంటిది. తెలుగుదేశం ఆవిర్భావానంతరం కళతప్పి కుదేలైన రాష్ట్ర కాంగ్రెసు శాఖకి ఒంటి చేత్తో పూర్వ వైభవం తెచ్చిపెట్టిన ఘనత నిస్సందేహంగా రాజశేఖరరెడ్డిదే. అది ఒక్కరోజులో సాధ్యపడలేదు. దాదాపు పదేళ్ల పోరాట ఫలితమది. ఏనాటికన్నా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న కోరిక ఆయన్నా దిశలో నడిపిందనేది వాస్తవమే. అయినా – కీచులాటలతో కునారిల్లుతున్న కాంగ్రెసుని ఏకతాటిపైకి తెచ్చి, యాభై నాలుగేళ్ల వయసులో మండే ఎండల్లో పద్నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసి, చంద్రబాబు చాణక్యాన్ని దీటుగా ఎదుర్కొని పార్టీకి జవసత్వాలు చేకూర్చటానికి కేవలం పదవీ కాంక్ష సరిపోదు. అంతకు మించిన స్థిరచిత్తమూ, స్థితప్రజ్ఞతా అవసరం. అవి పుష్కలంగా ఉండబట్టే పదేళ్ల తెలుగుదేశం పాలనకి తెర దించగలిగాడాయన.
ముఖ్యమంత్రయ్యాక ఐదేళ్లలో రాజశేఖరరెడ్డిపై కురిసిన పూలెన్నో, పడ్డ రాళ్లూ అన్నే. అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. ఒక ప్రాంతీయ పార్టీని నడిపిన తీరులో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానే అయ్యి నడపటం మాత్రం అద్భుతం. స్వతంత్రానంతరం అరవై మూడేళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో బహుశా ఏ రాష్ట్ర స్థాయి నేతా సాధించని ఘనత ఇది. కిట్టని వారు అలవిమాలిన రాజీవ్ భజనే అధిష్టానం దగ్గర ఆయన హల్‌చల్ నడిపించిందంటారు. రాజీవ్ భజన రాష్ట్రంలో వోట్లు రాల్చిపెట్టదనీ, వోట్లూ సీట్లూ లేకపోతే ఎంత భజన చేసినా అధిష్టానం ఆయన్ని పట్టించుకోదనీ మాత్రం వాళ్లు మర్చిపోతారు. ఏదేమైనా రాష్ట్ర కాంగ్రెస్‌లో పీవీ నరసింహారావు, కాసు బ్రహ్మానంద రెడ్డి, జలగం వెంగళరావు వంటి ఉద్ధండులకు సైతం తప్పని అసమ్మతి పోటుని ఆయన విజయవంతంగా తప్పించుకుని పార్టీని సొంత జాగీరులా ఏలాడన్నది మాత్రం నిజం. ఈ విషయంలో అధిష్టానంతో ఆయనకేవో రహస్య ఒప్పందాలున్నాయనీ, ముప్పై మందికి పైగా ఎంపీల బలమున్నా మంత్రి పదవులనుండి నిధుల మంజూరు దాకా రాష్ట్ర వాటా విషయంలో కేంద్రాన్ని పట్టుబట్టకపోవటం వెనక అదే మతలబనీ గుసగుసలున్నాయి. వాటిలో నిజానిజాలెన్నున్నా, రాజశేఖరరెడ్డి రాష్ట్ర కాంగ్రెస్‌లో రెండవ నెంబరు నేత లేకుండా చేసిపోవటం ఆ పార్టీని తీవ్ర గందరగోళంలోకి నెట్టే విషయమే. ఆయన అస్తమయంతో కాంగ్రెస్ మార్కు కంగాళీ రాజకీయాలు మళ్లీ మొదలవచ్చు.
మొండివాడు రాజుకన్నా బలవంతుడనేది నానుడి. అయితే ఎంతటి మొండివాడైనా రాజశేఖరరెడ్డి ముందు దిగదుడుపే. ఎందుకంటే ఆయన జగమొండి. ఆయన్ని దశాబ్దాలపాటు కాంగ్రెసులో నిత్య అసమ్మతివాదిగా చేసి అధికార పీఠానికి ఆమడ దూరంలోనే నిలబెట్టేసింది ఆ గుణమే. అనుకోని రీతిలో అధికారానికి తెచ్చిందీ, ఊహించని విధంగా పునరధికార ప్రాప్తి కలిగించింది సైతం ఆ గుణమే. అధికారమున్నా లేకున్నా ఆయన తత్వం ఆయనదే, ఆయన దర్పం ఆయనదే. చివరికా మొండితనమే, వాతావరణాన్ని లెక్కచేయకుండా బయల్దేరేలా ప్రేరేపించి, ఆయన ప్రాణాలు తీసిందన్నది విషాదకర వాస్తవం. రాష్ట్ర నేతల్లో రామారావుని తలదన్నే మొండి మొనగాడు ఎవడన్నా ఉన్నాడా అంటే రాజశేఖర రెడ్డి ఉన్నాడనేది సమాధానం. రాష్ట్రవ్యాప్త ప్రజాభిమానం విషయంలోనూ రామారావుతో సరితూగగలిగే నేత ఆయనొక్కడే కావచ్చు. మరి రామారావులా ఆయనా చరిత్రలో నిలిచిపోతాడా? అది ఏదోనాడు చరిత్రే సమాధానం చెప్పే ప్రశ్న. ప్రస్తుతానికైతే, రాష్ట్ర రాజకీయాల్లో రాజశేఖరరెడ్డి వదిలివెళ్లిన శూన్యాన్ని భర్తీ చేసేదెవరన్నది మరింత ముఖ్యమైన ప్రశ్న. దీనికీ చరిత్రే సమాధానం చెబుతుంది. వేచి చూద్దాం.
మీ మాట