Posts Tagged 'అరవింద్'

అర విందు

సినీరంగంలో అడుగు పెట్టిన తొలినాళ్లలో చిరంజీవి జీవితం వడ్డించిన విస్తరి కాదు. తళుకు బెళుకుల జగతిలో అనామకుడిగా మొదలెట్టి అగ్రనటుడిగా ఎదిగే క్రమంలో ఆయన అధిగమించిన అడ్డుగోడలెన్నో. పాతికేళ్ల పైచిలుకు నట జీవితానికి స్వస్తి చెప్పి గతేడాది రాజకీయ నాయకుడిగా కొత్త అవతారమెత్తే నాటికి పరిస్థితి తద్భిన్నం. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ప్రేక్షకుల అభిమానమే ఆయన పార్టీకి పునాది. శుభం పలికిన నోళ్లూ, సన్నాయి నొక్కులు నొక్కిన వేళ్లూ కూడా ఉన్నా – ప్రజారాజ్యం ఆవిర్భావం నాడు వచ్చే ఎన్నికల్లో చిరంజీవి గెలుపు నల్లేరుపై నడకే అన్నవాళ్లూ కోకొల్లలు. తీరా, ఎన్నికలు వారం దూరంలో ఉండగా ప్రరాపా గుమ్మంలోకి తొంగి చూసినవాళ్లకి అక్కడ అగుపడుతున్నది – సినీ పరిభాషలో – యాంటీ క్లైమాక్స్‌ దిశగా సూచనలిస్తున్న ఇంటర్వల్ బ్యాంగ్. 

రాజకీయం ప్రజాసేవ కోసం అనేది పాచిపట్టిన పాత మాట. ప్రస్తుతం ‘నాకేంటి’ అనే నాయకులే ఎక్కడ చూసినా. ఎన్నికల ముందు టికెట్లాశించి భంగపడ్డ ఛోటా మోటా నాయకుల అలకలు, అసమ్మతి రాగాలు, గోడ దూకుళ్లు రెండు మూడు సీజన్లుగా అలవాటైపోయిన వ్యవహారమే. కమ్యూనిస్టుల్ని మినహాయిస్తే దేశ వ్యాప్తంగా ఈ సంస్కృతి లేని రాజకీయ పార్టీ దుర్భిణీ వేసి వెదికినా కనిపించని పరిస్థితి. ఈ తంతు చూసి బుగ్గలు నొక్కుకోవటం ప్రజలెప్పుడో మానేశారు. రాజకీయాలంటే సామాన్యులకి ఏవగింపు కలిగిన దశలో మార్పు తెస్తాం అంటూ వచ్చిన ప్రజారాజ్యం రాష్ట్రంలో ఎందరికో ఆశలు రేకెత్తించింది. చిరంజీవి రూపంలో వచ్చిన కొత్త నీరు వరదై పారి రాష్ట్ర రాజకీయాలని కడిగేస్తుందని ఆయన అభిమానులతో పాటు అనేకమంది ఇతరులూ ఆశ పడ్డారు. కానీ జరిగింది, జరుగుతుంది ఏమిటి? 

ప్రజారాజ్యం పార్టీకి చిరంజీవి గ్లామరే పెట్టుబడి. ఇది ఆయన కోటరీ సదా వల్లెవేసే మాటే. అయితే ఆ పెట్టుబడినెలా వాడుకోవాలో తెలీకపోవటం చిరంజీవి బలహీనత, ఇంకా చెప్పాలంటే ఆయన అసమర్ధత. ప్రత్యర్ధుల్ని ఆశ్చర్యంలోకి నెడుతూ ఎవరూ ఊహించని సమయంలో పార్టీ ప్రకటించాల్సింది పోయి నెలల పాటు వదంతులతో తాత్సారం చేసి తర్వాత తీరిగ్గా ప్రకటించటం తొలి తప్పు. ఆలస్యానికి నాడాయన ఇచ్చుకున్న వివరణ ‘పార్టీ విధానాలని రూపొందించటానికి ఇంత సమయం పట్టింది’. అంత సమయం తీసుకుని రూపొందించిన విధానాలేమిటని అడిగిన వాళ్లకి ఆవు పాఠంలా ఆయన్నుండొచ్చే రెడీమేడాన్సర్లు: ‘మేధావులతో చర్చిస్తున్నాం’, ‘ ప్రజలు రమ్మన్నారు’, ‘ప్రజలకే చెబుతా’, ‘సామాజిక న్యాయం’! 

నెలల తరబడి వినిపించిన ఈ అర్ధరహిత వివరణలతో చిరంజీవిపై ఆశలొదిలేసుకున్న వాళ్లు కొందరు. ఇంకా ఆయన తేబోతున్న సమూల మార్పుపై ఆశలుడగని వాళ్లకి తర్వాత జరిగిన తంతుతో కళ్లు బైర్లు కమ్మేలా తత్వం బోధపడింది. శుద్ధ రాజకీయాలకు తెరతీస్తానంటూ వచ్చినోడు వైరి పక్షాల ఫిరాయింపుదార్లకి హారతి పళ్లాలతో ఆహ్వానం పలకటం జీర్ణించుకోలేకపోయారు వీళ్లు. అధికార పక్షంతో పోలిస్తే ఫిరాయింపుల సెగ ఎక్కువ తగిలింది తెలుగుదేశానికే. ఒకానొక దశలో ఇవి ఏ స్థాయికెళ్లాయంటే – కార్పొరేట్ భాషలో – ప్రరాపా తెదెపాకి సబ్సిడియరీయేమో అనిపించే రీతిలో కొనసాగిన వలసలు! అసలు తెదెపా నాయకత్వమే ఈ వలసల్ని ప్రోత్సహిస్తుందన్న గుసగుసలూ అప్పట్లోనే వినొచ్చాయి. కోవర్ట్ ఆపరేషన్లంటూ ఇప్పుడు గుండెలు బాదుకుంటున్న ప్రరాపా అగ్ర నేతలు ఆనాడు వలసదారుల కోసం పనిగట్టుకుని వలలు విసరకుండా ఉంటే నేడీ తిప్పలుండేవా? స్వలాభం కోసం తరలొచ్చిన ఆయారాంలకి ఆదిలోనే అడ్డుచెప్పి కొత్త రక్తంతో నూతన పార్టీని నింపుంటే – మిగతా పక్షాలు ప్రచారంలో దూసుకు పోతుంటే – నేడు ప్రరాపా నేతలు ఆరోపణలకి సమాధానాలిచ్చుకుంటూ, ఎన్నికల ముందు కాడవతల పడేసినోళ్లని బుజ్జగించుకుంటూ, మూత పడ్డ కార్యాలయాల తాళాలు తెరిపించుకుంటూ పుణ్యకాలం గడిపే అవసరమొచ్చుండేది కాదు.

ఇదంతా చూస్తూ కూడా చిరంజీవి నాయకత్వమ్మీద నమ్మకం సడలని వాళ్లెవరన్నా ఉన్నారంటే – వాళ్లు ఆయన వీరాభిమానులే. అయితే, తన సత్తాపై అభిమానులకున్న నమ్మకం చిరంజీవికి తనపై ఉందా అన్నది అనుమానం. ఓ పక్క ‘నన్ను చూసి ఓట్లేస్తారు’ అంటూనే మరోపక్క కులాల వారీ లెక్కలు, పరాయి పార్టీల్లోని బలమైన నాయకులకి గాలం, ఇతర పార్టీలతో పొత్తుల కోసం ఆరాటం .. ఇలా పొంతన లేని చర్యలెన్నో. ఎన్టీయార్ స్ఫూర్తితో రాజకీయాల్లోకొచ్చానని స్వయానా చెప్పుకున్న చిరంజీవికి ఎన్టీయార్‌కున్న నాయకత్వ లక్షణాలున్నాయా అనేది ప్రశ్న. తెదెపా ఎదుర్కొన్న తొట్టతొలి ఎన్నికల్లోనే వందలాది అనామకులకి టికెట్లిచ్చి రాత్రికి రాత్రే రాష్ట్రంలో కొత్త తరం నాయకుల్ని సృష్టించిన ఎన్టీయార్ సాహసం చిరంజీవికేదీ? 

సాహసం సంగతటుంచితే – ప్రరాపాలో చిరంజీవి కేవలం ఉత్సవ విగ్రహమేనా అన్నది నేడా పార్టీలో నెలకొన్న గందరగోళాన్ని గమనిస్తున్న వారికెవరికైనా వచ్చే సందేహం. పార్టీ విధానాల రూపకల్పన నుండి, అభ్యర్ధుల ఎంపిక దాకా ముందుండి నడిపించకుండా అరవింద్ ప్రభృతుల నిర్ణయాలకి తలాడించటమే పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఏకైక విధి లాగుంది! 

బావమరదులు బతుక్కోరుతారనేది తెలుగు సామెత. బ్రతకనేర్చిన బావమరిదిగా పేరుబడ్డ అరవిందుడు మాత్రం చిరంజీవిని శిఖండిని చేసి స్వకార్యాలు చక్కబెట్టేసుకుంటున్నాడన్నది ప్రరాపా నుండి బయటికొచ్చేస్తున్న వారందరి ఆరోపణల్లోనూ ఉన్న పోలిక. చిరంజీవి సోదరులకి సైతం అరవింద్ వ్యవహారశైలి నచ్చకపోయినా మిగతావారిలా బయటపడలేక మిన్నకుంటున్నారని మీడియా కధనాలు. ఇందులో నిజానిజాలెంతున్నా, ప్రరాపాలో అరవింద్ మితిమీరిన జోక్యం వల్ల ఎన్నికల ఫలితాలొచ్చాక చిరంజీవిని ఖాళీ విస్తరి వెక్కిరిస్తే ఆశ్చర్యం లేదు. పూర్తి ఖాళీ కాకపోయినా – ఫుల్ మీల్స్‌కి బదులు వోటర్లు అర కొర సీట్లతో అర విందే వడ్డిస్తే, రాష్ట్ర రాజకీయాల్లో చిరంజీవి మరో మహాశక్తిగా ఎదిగే మాట అటుంచి కమ్యూనిస్టుల్లా ఎప్పటికీ పక్కవాద్యగాడుగానే మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది. అది జరగ కూడదంటే ఆయన ఇప్పటికైనా అరవింద్ నీడ నుండి బయట పడాలి, అసమర్ధ నాయకుడికన్నా తప్పులు చేసే నాయకుడికే విలువెక్కువని గ్రహించాలి, తప్పటడుగులు వేసైనా నాయకుడిగా తనేమిటో నిరూపించుకోవాలి. లేకపోతే రైలు మిస్సవటం ఖాయం.

ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,298

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.