Posts Tagged 'అబ్రకదబ్ర'

మరో వసంతం

రెండేళ్లు – రెండ్రోజుల్లో నేనీ బ్లాగు మొదలెట్టి. ఏడాది క్రితం ఓ సారి సింహావలోకనం చేసుకున్నాను. అప్పుడే మరో ఏడు గడిచింది. ఈ ఏడాదిలో అరవై దాకా టపాలు రాల్చాను. వాటిలో నాకు నచ్చినవి: మిస్టర్ నో, బోఫా, తనాయాసం, మేకింగ్ ఆఫ్ సున్నం, సమైక్య నాదం మరియు ఎక్‌స్ట్రా క్లాస్.

తొలి ఏడాది నాకో శైలంటూ ఏర్పడింది. ఈ ఏడాదీ అదలాగే ఉంది. అందులో పెద్దగా తేడాలొచ్చినట్లు నాకైతే అనిపించలేదు. గతేడాది ఫోటోగ్రఫీ కోసం ప్రత్యేకించిన ఆంగ్ల బ్లాగొకటి ప్రారంభించాను కానీ అదో ఆరంభ శూరత్వ ప్రదర్శనగా మిగిలిపోయింది – ఆంధ్రుడ్ని మరి. దాన్ని మళ్లీ పట్టాలెక్కించే ఆలోచన ప్రస్తుతానికి లేదు. నవతరంగంలో సినిమాల మీద తొమ్మిది వ్యాసాలు రాశాక అందులోనూ ఆసక్తి ఆవిరై పోయింది. మరోటీ రాస్తే పదౌతాయన్న తలపుంది కానీ రౌండ్ ఫిగర్ చేసేయాలని మొక్కుబడిగా ఏదోటి రాసేంత బలీయంగా అది లేకపోవటంతో నవతరంగమూ, దాని ఫాలోయర్లూ బతికిపోయారు.

సింహావలోకనంలో ప్రస్తావించిన ఆరున్నొక్క సూత్రాలు రెండో ఏడాదీ పాటించాను. ఈ ఏడాది తెలుగు బ్లాగుల్లో కురిసిన తిట్లూ రంకెల కుంభవృష్టిలో నేను తడవకపోటానికి అదో కారణం కావచ్చు. అంత మాత్రాన వివాదాస్పద అంశాల జోలికే వెళ్లలేదని కాదు. స్వీయలాభాల కోసం నిష్టగా ఏర్చికూర్చిన అసత్యారోపణలతో వేర్పాటోద్యమాలు వండివార్చి తెలుగు ప్రజల మధ్య ప్రాంతీయ చిచ్చు పెట్టిన రాబందుల రాజకీయాన్ని పది టపాల పరంపర ద్వారా ఎండగట్టాను. వాటిద్వారా నా మీద సమైక్యవాది అన్న ముద్ర పడిపోయింది. నో ప్రోబ్లిమో. విభజనవాది, వేర్పాటువాది, ప్రాంతీయవాది వగైరా ముద్రలకనా ఇది వేలరెట్లు మెరుగు – వ్యతిరేకులు ఎలాంటి పెడార్ధాలు తీసుకున్నా సరే. ఓ వివాదాస్పద అంశమ్మీద ఆ స్థాయిలో చర్చ రగిలినా నా బ్లాగు దూషణ భూషణ కీలల్లో కాలిపోలేదు. ఆ మేరకు వ్యాఖ్యాతల సంయమనానికి సంతోషం, పరిపరి ధన్యవాదం. ఆ టపాలని శ్రీకృష్ణ కమీషన్‌కి పంపమని అనేకమంది సూచించారు. ఇ-మెయిల్ ద్వారా పంపితే అవి చెత్తబుట్టలో చేరే అవకాశాలే ఎక్కువ కాబట్టి, వాటికి మరికొంత స్టాటిస్టికల్ సమాచారం జోడించి ఓ అసెంబ్లీ సభ్యుడి ద్వారా కమిటీకి అందజేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తద్వారా భారతదేశం విచ్చిన్నం కాకూడదని కోరుకునే వ్యక్తిగా నాకు చేతనైన పని నేను చేశాను. ప్రయత్నం ముఖ్యం. ఫలితమేదైనా ఫరకు లేదు.

భావోద్వేగాలు, నీతిబోధల జడిలో తడిసి ముద్దౌతున్న తెలుగు కథల్ని అర్జెంటుగా ఉద్ధరించేద్దామన్న మహాశయంతో గత ఏడాది కథన రంగంలో కాలు మోపాను. ఆ క్రమంలో రాసిన తొలికథ గడియారం నా అంచనాలే అందుకోలేకపోయింది. తొలికథలో చేసిన తప్పులు దిద్దుకుంటూ కొంత సైన్సుకి మరికొంత చరిత్రనీ ఇంకొంత ఊహనీ జతచేసి రాసిన నాగరికథ పాఠకుల ప్రశంసలందుకుంది. ఈ కథ వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ గార్లు కూర్చే కథ-2009 సంకలనానికి ఎంపికైనట్లు కొన్నాళ్ల క్రితం తెలిసింది. అదో అదనపు గౌరవం. అన్‌రిలయబుల్ నెరేటర్ పద్ధతిలో చేసిన సైకో థ్రిల్లర్ ప్రయోగం ఆరోప్రాణం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. లీటర్ సైన్సుకి పావు లీటర్ అధివాస్తవికత, పది మిల్లీలీటర్ల ఆధ్యాత్మకత రంగరించి రూపొందించిన ‘మరో ప్రపంచం’ (ఇంకా విడుదవలేదు) వంగూరి ఫౌండేషన్ వారి 2010 ఉగాది కథల పోటీల్లో ఉత్తమ కథగా ఎంపికయింది. ఏడాదిలో నే రాసిన నాలుగు కథలవి. ప్రస్తుతం మరో మూడు కథలకి ప్లాట్ ఎలిమెంట్స్ బుర్రలో సుడులు తిరుగుతున్నాయి. షరా మామూలుగా ఇవీ తోకలో చిన్నదో పెద్దదో ఓ ట్విస్టుండేవే. ఈ మూడింటి కోసం చేయాల్సిన హోమ్‌వర్క్, సేకరించాల్సిన సమాచారం చాలా బోలెడుంది. ఆయుర్వేదం నుండి అల్లోపతీ దాకా, కాలజ్ఞానం నుండి కెమిస్ట్రీ దాకా తెలుసుకోవలసినవి శానా ఉన్నాయి. కాబట్టి ఈ కథలు ఎప్పటికి వెలుగు చూస్తాయో తెలీదు. వాటికోసం కళ్లలో వత్తులతో పడిగాపులు పడుతున్న చకోరపక్షులెటూ లేవు కావున హడావిడిగా రాసి పడేయాలన్న ఒత్తిడీ లేదు. వచ్చినప్పుడొస్తాయి.

నాకు సాహితీ సదస్సులకీ సమావేశాలకీ వెళ్లే అలవాటు శూన్యం. మొదటిసారిగా పోయినేడాది అటువంటి రెండింట్లో పాల్గొన్నాను. ఒకటి మల్లాది వెంకట కృష్ణమూర్తి గారితో కాలక్షేప గోష్టి, రెండోది మేడసాని మోహన్ గారి శతావధానంలో పృఛ్చకత్వం. రెండూ గుర్తుంచుకోదగ్గ అనుభవాలు. వాటి గురించి నా బ్లాగులో రెండు టపాలు రాశాను.

కొత్తగా మాక్రో ఫోటోగ్రఫీ మీద మోజు మొదలయింది. చుట్టూ ఉన్న సూక్ష్మలోకాన్ని వందల రెట్లు పెద్దది చేసి చూపే ఫోటోలు క్లిక్కుమనిపించి, వాటిలో ఇన్నాళ్లూ చూడని వింతలెన్నో గమనించి విస్తుపోటానికి ఎక్కడెక్కడి సమయమూ చాలటం లేదు. ఈ మోజెన్నాళ్లుంటుందో తెలీదు. ఇదొదిలాకన్నా తన జోలికొస్తానేమోనని ఆశగా ఎదురు చూస్తున్న షార్ట్ ఫిల్మ్ స్క్రిప్టొకటి పుస్తకాల సొరుగులో పడుంది. మూడేళ్ల క్రితం రాసిన ఐదు నిమిషాల చిట్టి సినిమా స్క్రిప్టది. ఎప్పటికన్నా దాన్ని తెరకెక్కించాలన్న కోరిక. అప్పట్లో నాకు నచ్చే నాణ్యతతో తీయగలన్న నమ్మకం లేక పక్కన పెట్టేశాను. ఇన్నేళ్లలో కన్స్యూమర్ కెమేరాల పురోగమనం గమనించాక, నాకవసరమైన క్వాలిటీతో చిత్రీకరించగలిగే కెమేరాలు అందుబాట్లోకొచ్చాయన్న విషయం అవగతమయింది. ఇక నా స్క్రిప్ట్ దుమ్ము దులపటమే తరువాయి. దానికన్నా ముందు – నా సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ ప్రతిభ పరీక్షించుకోటానికి ర్యాండమ్ షాట్స్‌తో కూడిన ఒకట్రెండు నిమిషాల నిడివి మ్యూజిక్ వీడియో చేసే ఆలోచనుంది. వీలు కుదుర్చుకుని ఈ వేసవిలో చేసెయ్యాలి.

అదీ రౌండప్. ఆఖరుగా – ఇన్నాళ్లుగా నే రాసినవి చదివి వెన్నుతట్టిన, విమర్శించిన వారందరికీ ధన్యవాదాలు.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,298

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.