Archive for the 'సినిమా' Category

సినిమాయణం – 2: చిత్రానువాదం

ఇంతకు ముందు భాగంలో మన ఘనమైన శూన్యబడ్జెట్ లఘుచిత్రానికి కథ ఎలా ఎంచుకోవాలో చూశాం. ఈ భాగంలో – ఆ కథని తెరకి తగ్గట్లు మార్చటమెలాగో చూద్దాం.

ముందుగా మీకు తట్టిన కథ కాగితమ్మీద రాసుకోండి (లేకపోతే వర్డ్ డాక్యుమెంట్‌లో. ఎక్కడనేది ముఖ్యం కాదు). ఈ సమయంలో బడ్జెట్, నటీనటులు, నిడివి, గట్రా నియంత్రణలేవీ పెట్టుకోవద్దు. కథ మీకు నచ్చినట్లు రాసుకుంటూ పోవటమే. ఒకవేళ కథలు రాయటం మీకొచ్చిన కళ కాకపోతే – ఫర్లేదు. మీకు నచ్చిన కథ ఎంచుకోండి (రచయిత అనుమతితో). 

కథ సిద్ధం. ఇక దీన్ని చిత్రానువాదం చెయ్యాలి (ఇలాంటి విచిత్రమైన పదాలు చూసి తికమక పడొద్దు. చిత్రానువాదం అంటే screen adaptation. అది కూడా అర్ధం కాకపోతే … సినిమా స్క్రిప్ట్ రాసే పద్ధతి అన్న మాట). 

‘కథ’ అనేది వినటానికి, లేకపోతే చదువుకోటానికి ఉద్దేశించిన ప్రక్రియ. మరి సినిమా? అది చూడటానికి ఉద్దేశించింది. కథలో చాలా ‘చెప్పటం’ ఉంటుంది. అదే తెరపైకొచ్చేసరికి అదంతా ‘చూపాలి’.  ఉదాహరణకి, కథలో ఐతే మన ప్రధానపాత్రని ‘రాముడు మంచిబాలుడు’ అని ఏకవాక్యంలో వివరించేస్తే చెల్లిపోతుందేమో. మరి సినిమాలో ఎలా? నేపధ్యంలో అమితాబచ్చన్ గంభీరస్వరం ‘రామ్‌డూ ఏక్ మంచి బాల్‌డూ హైఁ’ అని పరిచయం చేస్తే చప్పరించేసినట్లుటుంది. రాముడు ఎంత మంచి బాలుడో చూపటానికి ఓ సన్నివేశం సృష్టించాలి. పని మానుకుని గుడ్డి బిచ్చగాడిని రోడ్డు దాటించినట్లో, క్లాస్‌మేట్ కోసం తాను తన్నులు తిన్నట్లో … ఇలాంటిదన్న మాట. ‘ఎవరి పేరు వింటే ఆవులు కావుమంటాయో, ఎవరి నీడ పడితే పీతలు ఈత మానేస్తాయో’ … ఇలా ప్రతిదీ చెప్పే పని పెట్టుకోవద్దు. మీ స్క్రిప్ట్‌లో ‘చెప్పుడు మాటలు’ ఎంత తక్కువైతే మీ చిత్రానువాదం అంత బాగున్నట్లు. 

మన్లో మాట. చాలా తెలుగు సినిమాల్లోనే కాక, కథల్లో కూడా అవసరానికి మించిన ‘చెప్పుడు మాటలు’ ఉంటాయి. మీరా తప్పు చేయమాకండి. మీ జీరో బడ్జెట్ సినిమాకి నాణ్యత అద్భుతమైన సినిమాటోగ్రఫీ, అరివీరభయంకరమైన గ్రాఫిక్స్, భీభత్సకరమైన సౌండ్ ఎఫెక్ట్స్ వల్ల మాత్రమే వస్తుందనుకుంటే మీరు బురదలో కాలేసినట్లు. ఆ నాణ్యత అన్నిటికన్నా ముందుగా ఉండాల్సింది మీ స్క్రిప్ట్‌లో.

చిత్రానువాదం అనుకున్నంత తేలిక పని కాదు. అదంత ఆషామాషీ యవ్వారమూ కాదు. ఓ కథని తెరకి అనువాదం చేయాలంటే మీకు ముఖ్యంగా అవగాహనుండాల్సిన విషయం: దృక్కోణం. కథల్ని రకరకాల దృక్కోణాల్లో (points of view) రాసే అవకాశం ఉంటుంది. ఉత్తమ పురుషం, మధ్యమ పురుషం, ప్రధమ పురుషం – ఇలా. ఈ చివరి రకంలో మళ్లీ మూడు రకాలు: పరిమిత ప్రధమ పురుషం, సర్వజ్ఞ ప్రధమ పురుషం, బాహ్య ప్రధమ పురుషం. (దృక్కోణాలపై మరిన్ని వివరాలు కావాలంటే ‘కథాయణం‘ చదవండి) 

దృక్కోణాల విషయంలో కథలకున్న వెసులుబాటు సినిమాలకి లేదు. ఏ సినిమా ఐనా నడిచేది కెమెరా కోణంలోంచే. కథల భాషలో చెప్పాలంటే, సినిమాలన్నీ ప్రధమ పురుషంలోనే నడుస్తాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే, సినిమాలన్నీ సర్వజ్ఞ ప్రధమ పురుషంలో నడుస్తాయి. అంటే కెమెరా కన్ను సర్వాంతర్యామిలా అన్నిటినీ చూస్తూ, చూపిస్తూ ఉంటుందన్నమాట. (‘ప్రధమ పురుషం’ అంటే ఆంగ్లంలో First Person అనుకునేరు. కానే కాదు. అంగ్లంలో అది Third Person. అలాగే సర్వజ్ఞ ప్రధమ పురుషం అంటే Omniscient Third Person) 

కాబట్టి – కథ ఏ పురుషంలో ఉన్నా సినిమాకొచ్చేసరికి మీ స్క్రిప్ట్ ప్రధమ పురుషంలో రాయబడాల్సిందే. ఉత్తమ పురుషంలో (First Person narrative) రాయబడిన కథల్ని చిత్రానువాదం చేయటానికి కుసింత ఎక్కువ శ్రమ, శ్రద్ధ అవసరం. ఎందుకని? ఉత్తమ పురుషంలో నడిచే కథల్లో ఎక్కువ భాగం ప్రధాన పాత్ర మదిలో మెదిలే తలపులు, అంతరంగ తరంగాలు, ఆత్మఘోషతో నిండిపోయుంటాయి. కథలో రచయిత ఇవన్నీ పెన్నుచ్చుకుని రాసిపారేస్తాడు. పాఠకుడేమో ప్రధాన పాత్ర మస్తిష్కంలోకి దూరేసి అతని/ఆమె ఆలోచనలు అలవోకగా చదివేసినట్లు ఫీలైపోతాడు! అదే సినిమాకొచ్చేసరికి ఇవన్నీ ‘చూపించాలి’. ఎలా? అందుకే చిత్రానువాదం అంత వీజీ కాదనింది. అయితే అదేమీ అసాధ్యమూ కాదు. కథలో లేని కొన్ని పాత్రలు, సన్నివేశాలు సృష్టించి ఇలాంటి సమస్యల్ని అధిగమించొచ్చు. మొత్తమ్మీద – చిత్రానువాదం అంటే కథని ఉన్నదున్నట్లు స్క్రిప్ట్ రూపంలోకి తర్జుమా చేసేయటం కాదు. అది చాలా ఓపికగా, శ్రద్ధగా చేయాల్సిన పని. (స్క్రిప్ట్ రచన, చిత్రానువాదాలపై ఇంటర్నెట్‌లో చాలా సమాచారం అందుబాటులో ఉంది. నాణ్యత గురించి తపించేవారు స్క్రీన్‌ప్లే ఎలా రాయాలో తెలుసుకోవటమ్మీద కొద్ది గంటలన్నా ఖర్చుపెట్టాలి). 

నా మొదటి లఘుచిత్రం Myriad అప్పుడెప్పుడో దశాబ్దం కిందట రాసిన తెలుగు కథ ‘మరో ప్రపంచం‘ ఆధారంగా రూపొందింది. ఆ కథ ఉత్తమ పురుషంలో నడుస్తుంది. అదే కథని ‘Myriad‘ రూపంలోకి తేవటానికి ఎన్ని మార్పులు, చేర్పులు చేయాల్సొచ్చిందో తెలుసుకోవాలంటే – ఆ కథ లంకె ఇక్కడ, మరియు ‘Myriad‘ సినిమా లంకె ఇక్కడ లభిస్తాయి.

చాలా తెలుగు లఘుచిత్రాల్లో నేను గమనించిన లోపం ఏంటంటే – పది నిమిషాల నిడివున్న సినిమాలో మొదటి రెండు నిమిషాలు రకరకాల లోగోలు, ఎవరెవరికో ధన్యవాదాలు, తమ పెంపుడుకుక్కకి ముద్దులు, నటీనటుల మరియు సాంకేతిక నిపుణుల పేర్లు – ఇవన్నీ ప్రదర్శిస్తూ వృధా చేస్తారు. నిజాలు మాట్లాడుకోవాలంటే – మీ జీరోబడ్జెట్ షార్ట్‌ఫిల్మ్ తీసిందెవరో, అందులో వేషాలేసిందెవరో – ఇవన్నీ ఎవడిక్కావాలి? మీ సినిమాని ఓ ప్రేక్షకుడు వచ్చిచూడటమే ఎక్కువ. అతను మీకిచ్చిన పది నిమిషాల్లో ఇరవైశాతం అతనికి ఆసక్తి లేనివి చూపుతూ కూర్చునేబదులు, ఎకాఎకీ కథలోకి దూకేస్తే ప్రేక్షకుడు మొదటి ఫ్రేమ్ నుండీ మీ సినిమాలో నిమగ్నమైపోతాడు. మీ సినిమా నాణ్యంగా కనపడాలంటే – అది తెరపై నడిచిన ప్రతిక్షణం, ప్రతి ఫ్రేమ్‌లో కనపడే ప్రతి విషయం – టైటిల్స్‌తో సహా – శ్రద్ధగా చెక్కబడాల్సిందే. కాబట్టి సినిమాకి టైటిల్స్ ప్రదర్శించే విషయాన్ని కూడా కథ చెప్పటంలో భాగంగానే చూడండి. మొదట్లోనో, చివర్లోనో వాటిని అతికేస్తే ఓ పనైపోతుందనుకున్నారో – మీరు నాణ్యతపై మరీ అంత శ్రద్ధలేని వారన్నట్లు.

నా వరకు – నటీనటుల నామధేయాలు మాత్రమే సినిమా మొదట్లో ప్రదర్శించే అలవాటు. అది కూడా ఓ పక్క కథ నడుస్తూండగానే. సినిమా టైటిల్, మరియు ముఖ్యమైన క్రెడిట్స్ ఎప్పుడు, ఎలా రావాలో కూడా స్క్రిప్ట్ దశలోనే రాసుకుంటాను. ‘The Boogeyman‘ ఉన్నపళాన ఉరుములు మెరుపులతో దద్దరిల్లిపోతూ మొదలవుతుంది. ఊరూ పేరూ లేని దర్శకుడు తీసిన ఈ సినిమా మొహమాటానికో, మరెందుకో చూట్టానికొచ్చి, అవకాశం దొరికిన మరుక్షణం ఆపేద్దామనుకుంటూ కూర్చున్న ప్రేక్షకుడు – ఈ ఆరంభానికి ఉలికిపడి సర్దుక్కూర్చుని సినిమా ఆసక్తిగా చూస్తాడు. ఆ తర్వాత – నేపధ్యసంగీతానికి అనుగుణంగా సినిమా పేరు లయబద్ధంగా ప్రత్యక్షమై, మెల్లిగా పొగలా మారి మాయమైపోతుంది. అది ప్రేక్షకుడిని పూర్తిగా సినిమాలోకి లాగేస్తుంది.

స్క్రిప్ట్ దశలో కెమెరా కోణాలు, నటీనటుల ఆహార్యాంగికాలు, ఇత్యాది వివరాలు కథాగమనానికి ముఖ్యమైతే తప్ప రాసుకోకపోవటం ఉత్తమం. మీది శూన్యవ్యయ చిత్రం కాబట్టి, మీకుండే పరిమితులు అపరిమితం. చిత్రీకరణ సమయంలో పరిస్థితులనిబట్టి అప్పటికప్పుడు తీసుకోవలసిన నిర్ణయాలు బోలెడుంటాయి. ఏ షాట్ ఎలా తీయాలో, అందులో ఏమేం props వాడాలో – ఇలాంటివన్నీ మరీ విపులంగా ముందే రాసిపెట్టుకోవటం అనవసరమే కాదు, అసాధ్యం కూడా.

జీరో బడ్జెట్ సినిమాకి చిత్రానువాద దశలో చేయనవసరం లేని పని పైదైతే, తప్పకుండా చెయ్యాల్సిన పని ఇది: మీ పరిమితులు దృష్టిలో పెట్టుకుని సన్నివేశాలు రూపొందిచటం. కథ రాసుకునేప్పుడు ఇవన్నీ పెద్దగా పట్టించుకోకుండా రాసుకుపోమని పైనెక్కడో అన్నాను. అవన్నీ ఇప్పుడు చాలా శ్రద్ధగా పట్టించుకోవాలి. మీకు అందుబాటులో ఉన్న వనరులతో, మీరు సిద్ధం చేసి పెట్టుకున్న కథని సినిమాగా ఎలా మలచొచ్చో ఆలోచించుకోవాలి. అవసరమైతే కథ తిరగరాయాలి.

The Boogeyman‘ చిత్రంలో మొదటి ఒకటిన్నర నిమిషం నా స్క్రిప్ట్‌లో లేదు! చిత్రీకరణ కోసం నా స్నేహితుడి ఇల్లు పరిశీలించినప్పుడు – అక్కడున్న సోఫాలు, డైనింగ్ టేబుల్, టెలివిజన్, glass sliding doors, ఇంట్లోనుండి చూస్తే బయట దూరంగా కనపడే రహదారి, ట్రాఫిక్ లైట్స్ – ఇవన్నీ చూశాక, వాటన్నిట్నీ కథలో భాగం చేస్తే బాగుంటుందనిపించింది. అందుకోసం సినిమా opening scene మార్చేశాను. దానివల్ల సినిమా నాణ్యత ఎంత మెరుగైందో నాకొక్కడికే తెలుసు. ఎందుకంటే – అసలు స్క్రిప్ట్‌కి, తుది చిత్రానికి మధ్యనున్న తేడా నేనొక్కడినే ఎరుగుదును కాబట్టి. చెప్పొచ్చేదేమంటే – ‘స్క్రిప్ట్ పక్కాగా తయారయ్యాక దాన్ని మార్చే ప్రసక్తే లేదు’ అనే ఆలోచనా ధోరణి మీకుంటే లఘుచిత్రాలు మానేసి హాలీవుడ్ సినిమాలు తీయటానికెళ్లండి. శూన్యవ్యయ లఘుచిత్ర దర్శకుడికి spot improvisations చేసే గుణం నిలువెల్లా ఉండాలి.

మీ లఘు చిత్రం పదిహేను నిమిషాల లోపే ఉండేలా చూసుకోండి. అంతకన్నా పెద్ద లఘుచిత్రాలు చూసే ఓపిక ఇప్పట్లో ఎక్కువమందికి ఉండట్లేదు (నా తొలి లఘుచిత్రం Myriad విషయంలో నేను చేసిన పెద్ద పొరపాటు – దాని నిడివి 24 నిమిషాలు ఉంచటం. ఆ కథని మరీ పదిహేను నిమిషాలకి తగ్గించటం దాదాపు అసాధ్యం. దానికి బదులు వేరే కథతో నా తొలి చిత్రం తీసుండాల్సిందని ఆ తర్వాత అనిపించింది). మీ స్క్రిప్ట్ తొలి డ్రాఫ్ట్ అంతకంటే పెద్దగా రావచ్చు. పెద్ద కత్తెర పట్టుక్కూర్చుని అనవసరమైన సన్నివేశాలు, సంభాషణలు నిర్దాక్షిణ్యంగా తొలగించేయండి. ఈ విషయంలో మీకు దయాదాక్షిణ్యాలు, పక్షపాతాలు, ప్రేమ, ఆప్యాయతానుగారాలు అస్సలుండకూడదు. ఉదాహరణకి – మీరో సన్నివేశంలో ఒక అద్భుతమైన డైలాగ్ రాశారనుకుందాం. కానీ దానివల్ల మీ కథాగమనానికి అదనంగా ఒరిగిందేమీ లేదని గమనించారు. ఆ సంభాషణ, దానికి ముందూ వెనకా ఉన్న సన్నివేశంతో సహా లేపేసినా కథకి పోయేదేమీ లేకపోతే – మనసు రాయిచేసుని అదంతా తీసేయాల్సిందే. నేనైతే – నా ప్రతి కథని, స్రిప్ట్‌ని కనీసం అరడజను సార్లు తిరగరాస్తాను. మొదటి ప్రతితో పోలిస్తే చివరి ప్రతి నిడివి కనీసం ఇరవై శాతం తగ్గిపోతుంది.

సాధారణంగా – మీ స్క్రిప్ట్ ఎన్ని పేజీలుంటే మీ సినిమా అన్ని నిమిషాలుంటుందనేది ఒక లెక్క. అంటే – పదిహేను పేజీల స్క్రిప్ట్ ఓ నిమిషం అటూ ఇటూగా పదిహేను నిమిషాల సినిమా అవుతుందన్నమాట. ఐతే ఈ ‘నిమిషానికో పేజీ’ అనేది కొన్ని ప్రమాణాలు పాటిస్తూ రాసినప్పుడే సాధ్యపడుతుంది. ఇదేమీ తప్పని సరి కాదు. మీ స్క్రిప్ట్ మీ ఒక్కరికోసమే అయితే ఎలా రాసినా చెల్లిపోతుంది. ఇతరులు కూడా చదవాలంటే – అందరికీ అర్ధమయ్యే కొన్ని ప్రమాణాలు పాటించటం తప్పనిసరి. స్క్రిప్ట్ రచనకి సహకరించే సాఫ్ట్‌వేర్లు చాలా ఉన్నాయి. వాటిలో ఎక్కువ ప్రఖ్యాతమైనది celtx.com వారి ఉచిత ఆన్లైన్ సాఫ్ట్‌వేర్.

“సినిమా దృశ్యమాధ్యమం” అనేదొక అరిగిపోయిన రికార్డు. కానీ అదో నిఖార్సైన నిజం. అది గుర్తెరిగిన రచయిత తన పాత్రలతో అతి తక్కువగా మాట్లాడిస్తాడు (అంటే – ఎక్కువగా మాట్లడటం ఓ పాత్ర సహజ స్వభావమైతే తప్ప). మీ కథని చూపించండి. చెప్పొద్దు. ఉదాహరణకి, మీ పాత్రతో ‘నాకు నిద్రొస్తోంది’ అనిపించేబదులు ఆ పాత్ర ఆవులించినట్లు చూపిస్తే సరిపోతుంది. సంభాషణల్లో పొదుపు సినిమా పొడుగు తగ్గిస్తుంది. ప్రతి చిన్న విషయాన్నీ అతిగా వివరించొద్దు. ప్రేక్షకులు మరీ అంత వెధవాయలు కాదని గుర్తుంచుకోండి. వాళ్లకి అవసరమైనంత సమాచారం ఇచ్చి ఊరుకుంటే చాలు. ఇలా చేయటం వల్ల అనవసమైన సంభాషణలు, సన్నివేశాలు చాలా మట్టుకు తగ్గిపోతాయి. చురుకుగా కదిలే సినిమాలో లోపాలు తక్కువగా కనపడి ఆ మేరకి నాణ్యత పెరిగినట్లనిపిస్తుందని ముందే చెప్పుకున్నాం కదా. నాణ్యమైన లఘుచిత్రం ‘అరె, అప్పుడే అయిపోయిందా’ అనిపిస్తుందే తప్ప ‘ఎప్పుడైపోతుందిరా బాబూ’ అనిపించదు.

అవండీ – చిత్రానువాద సూచనలు. వచ్చే భాగంలో చిత్రీకరణ ఎలా చెయ్యాలో చూద్దాం.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,010

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.