Archive for the 'యాత్ర' Categoryనన్ను దోచుకోని తాజ్ మహల్ – 3/3

అంతమందిలో నేనొక్కడినే దొరికినట్లు, వద్దన్నా వినకుండా ఫొటో ఖీచుతానంటూ వెంటపడటం మొదలెట్టాడు. జంటలుగా వచ్చిన వాళ్లనో, ఫ్యామిలీలనో చూసుకోవయ్యా బాబూ, నన్నొదిలెయ్యి అంటే వినడు. ఈ గొడవలో అనుకోకుండా తాజ్ మహల్ వైపు తలతిప్పి చూసేశాను. మొదటి సారిగా తాజ్ ని చూసినప్పుడు కలిగే అద్భుతమైన అనుభూతి గురించి చాలామంది వర్ణనలు చదివి నేనూ అటువంటి అనుభూతిని పొందాలని కష్టపడి అక్కడికొస్తే, ఈ ఫొటోగ్రాఫరుడి పుణ్యాన ఆ క్షణాన నాకే భావమూ కలగలేదు. మబ్బుల కింద, పొగమంచు తెరల వెనక తాజ్ నాలాగే దిగాలుగా కనిపించింది!

ఎంత చెప్పినా వినేలా లేడు, పట్టించుకోకుండా నాదారిన నేనెళితే వదిలేస్తాడేమో అనుకుని తాజ్ కేసి నడవటం మొదలెట్టాను. అయినా వదలకుండా నేనెటు వెళితే అటు వెంటపడి రాసాగాడు. చాలా ఛండాలంగా అనిపించింది నాకు. రోడ్డుమీద నడిచెళుతున్నప్పుడు ఊర కుక్క తోకాడిస్తూ మన వెంటబడి వస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది నా పరిస్థితి. చివరికి, ఓ ఫొటో తీయించుకుంటే నన్నొదిలేస్తాడేమో అనుకుని ‘సరే కానీ’ అంటూ ఓ పోజిచ్చాను. అనటమే ఆలస్యం, నేను వారించేలోగా టక టకా డజను ఫొటోలదాకా క్లిక్కుమనిపించాడు. నాకు ఒళ్లు మండిపోయింది. ‘ఒకటో రెండో తీస్తావనుకుంటే అడగా పెట్టాకుండా ఇన్ని తీయటమేమిటి’ అని నాదైన హిందీలో కోప్పడ్డా.

‘ఫొటో యాభై రూపాయలే సాబ్. మీకదో మొత్తమా?’ అన్నాడతను నన్నో పీనాసివాడిలా చూస్తూ.

‘ఎంతనేది నాకనవసరం. అసలు నాకు వద్దన్నా కదా. ఇంత లావు కెమెరా ఉంది నాదగ్గర. నీ ఫోటోలెందుకు’ అన్నా మరింత కోపంగా.

‘కెమెరా ఉన్న ప్రతివాడూ ఫొటోగ్రాఫరేనా సాబ్’ అన్నాడతను. పుండుమీద కారం అద్దినట్లనిపించింది. హిందీ అర్ధం కాకపోయినా బాగుండేది – ఆ వెటకారం తెలిసేది కాదు. గట్టిగా జవాబు చెప్పేంత హిందీ పాండిత్యం నాకు లేదు. కోపంతో మాటలు రాని పరిస్థితి.

అటుగా వెళుతున్న ఉత్తరాది జంటొకటి మా గొడవ చూసి ఆగింది. జంటలో ఉన్నతను సంగతి అర్ధం చేసుకుని ఫొటోగ్రాఫర్ మీద ఇంతెత్తున లేచాడు, ‘సౌత్ వాడని మోసం చెయ్యాలని చూస్తున్నావా? నీ లైసెన్స్ రద్దు చేయిస్తా, సాలే’ అంటూ. ఆ దెబ్బకి ఫొటోగ్రాఫర్ తోకముడిచి పారిపోయాడు.

ఎట్టకేలకి స్వతంత్రం! ఆ అపరిచితుడికి ధన్యవాదాలర్పించి తాజ్ దిశగా నడవటం మొదలెట్టాను, మూటలో నుండి కెమెరా తీసి ఫొటోలు తీస్తూ. అప్పటికే చీకట్లు ముసురుకుంటున్నాయి. ఫొటోలు బాగా వస్తాయన్న ఆశ లేదు. అలాంటి ల్యాండ్ స్కేప్ కి ఫ్లాష్ వాడినా ఉపయోగం లేదు – మరింత పాడవటం తప్ప.

అంతలో – నా సరంజామా చూసి నన్నో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ అనుకున్నారేమో – ఓ చైనా కుటుంబం నా ముందు నిలబడి పోజులివ్వటం మొదలెట్టింది. ఫొటోలు తీస్తానంటూ వెంటబడ్డవాడిని వదిలించుకునేసరికి ఫొటోలు తియ్యమంటూ వెంటబడేవాళ్లు తయ్యార్! నేనూ మీలాంటి టూరిస్టునే, ఫొటో స్టూడియోవాడిని కాదని ఎన్ని రకాలుగా చెప్పినా వాళ్లగోల వాళ్లదే. పైగా ‘యూ తేక్ ఫోతొ, ఐ గివ్ యు ఫిఫ్తీ రూపి’ అంటూ ఆఫరొకటి! డిస్నీల్యాండ్ లాంటి చోట్లా ఇలాంటి అనుభవాలెదురయ్యాయి కానీ అప్పుడవి వినోదాన్ని పంచాయి. ఇప్పుడున్న పరిస్థితిలో నన్ను విసిగించిన వాళ్లందరినీ కరిచేసేటట్లున్నాను. దాంతో, వాళ్లని కసురుకుని విసురుగా ముందుకెళ్లిపోయాను.

తాజ్ ప్రధాన కట్టడం లోకి పాదరక్షలతో వెళ్లనీయరు. వాటిని ఉంచటానికి ఒక పక్కగా స్టాల్ లాంటిది ఉంది. అక్కడో టూరిజం శాఖ ఉద్యోగి కాపలాగా ఉంటాడు. ఇది పూర్తిగా ఉచిత సర్వీసు. అక్కడా ఒక లైన్ ఉంది. లైన్లో నిలబడి ఉండగా ఓ విషయం గమనించాను – కాపలాదారు విదేశీ సందర్శకులను మాత్రమే డబ్బులు అడగటం!

నా వంతు వచ్చింది. కాపలా అతను నన్నేమీ అడగలేదు కానీ, నా వెనుకనున్న తెల్లతన్ని డబ్బుల కోసం సైగ చేశాడు. తెల్లతను విసుగ్గా చూస్తూ Why aren’t you asking them? అన్నాడు, పక్కనున్న భారతీయుల్ని చూపిస్తూ. నాకు తలకొట్టేసినట్లనిపించింది. He thinks you’re rich అన్నా నేను నవ్వుతూ (ఏడవలేక). I’m rich because I’m white? అన్నాడతను మరింత విసుగ్గా. పాపమతనికి నాకన్నా ఘోరమైన అనుభవాలెదురయినట్లున్నాయి.

మొత్తానికి తాజ్ లోపలికెళ్లాను. వెలుతురు పూర్తిగా పోవటంతో ఫొటోలు తీసీ ఉపయోగం లేదని ఆ కార్యక్రమానికి స్వస్తి చెప్పాను. అంత చిరాకులోనూ తాజ్ అందం నన్ను ముగ్ధుడిని చేసింది. అయితే, ‘ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో’ బదులు ‘తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు’ గుర్తొచ్చింది అక్కడున్నంతసేపూ. నా మూడ్ మహిమ!

బయటికొచ్చేసరికి బాగా చీకటిపడిపోయింది. కారు దగ్గరికి నడక మొదలు పెట్టబోయాను. అంతలో మళ్లీ ఊడిపడ్డాడు ఇందాకటి ఫొటోగ్రాఫరు. ఫొటోలకి ప్రింట్లు వేయించి సిద్ధంగా ఉన్నాడు. నాకోసం ఇంతసేపూ కాపేసినట్లున్నాడు. పన్నెండు ఫొటోలనీ కొనమని గొడవ మొదలు. ‘నువ్వు చేసిన వెటకారానికి అసలు నేనేమీ తీసుకోనక్కరలేదు. నాకు నచ్చినవి రెండో మూడో మాత్రమే తీసుకుంటాను’ అన్నా నేను. కాసేపు వాదులాడి చివరికి గొణుక్కుంటూ ఒప్పుకున్నాడు. ఆ గొణుగుడుకి అర్ధం ‘నీలాంటి కస్టమర్లు మరో నలుగురుంటే నా చేతికి చిప్పే’. లాగిపెట్టి కొట్టాలనే కోపాన్నాపుకుని అతనికో రెండొందలిచ్చి నాలుగు ఫొటోలు తీసుకుని అక్కడినుండి బయటపడ్డాను. 

తిరుగు ప్రయాణంలో ఇదంతా రాజుకి చెబితే, ‘పోలీసులకి చెప్పుండాల్సింది సాబ్. టూరిస్టుల్ని విసిగిస్తున్నట్లు కంప్లైంట్ చేస్తే వాళ్లు చాలా సీరియస్ గా తీస్కుంటారు’ అన్నాడతను. ‘నాకేం తెలుసు బాస్. పోలీసులూ అలాగే ఉంటారనుకున్నాను’ అని ఊరుకున్నా. ఆగ్రాలో ఓ మంచి ఎంపోరియం దగ్గరాగి నాలుగయిదు పాలరాతి తాజ్ మహల్ గిఫ్టు సెట్లు కొని హైవే ఎక్కాము. ఢిల్లీ చేరేసరికి రాత్రి మూడయ్యింది.

ఉపసంహారం

ఇది జరిగి ఆరు నెలలయింది. ఆ తరువాతి రోజు అక్షర్ ధాం వెళ్లాను. తిరుగు ప్రయాణానికి ఎక్కువ సమయం లేకపోవటంతో గంటకన్నా ఎక్కువ సేపు ఉండలేకపోయానక్కడ. మళ్లీ ఢిల్లీ వెళితే అక్షర్ ధాం లో ఎక్కువ సమయం గడపాలనుకున్నాను.

తాజ్ కి వెళ్లిన రోజు అంత విసుగెత్తిపోయినా తరువాత అనిపించింది – ఆ రోజంత ఘోరంగా ఉండకపోతే ఇంత వివరంగా గుర్తుండేది కాదేమో అని. నాకెదురయిన అనుభవాల వల్ల అప్పటికప్పుడు తాజ్ నన్ను మురిపించలేకపోయినా ఇప్పుడనిపిస్తుంది, వీలయితే మళ్లీ ఓ సారి వెళ్లి తాజ్ మహల్ చూడాలని. ఇప్పుడయితే దారిలో ఎన్ని వింతలెదురవుతాయో నేనూహించగలను కాబట్టి పోయినసారిలా తాజ్ నన్ను దోచుకోకపోయే ప్రసక్తి లేదు.

ఫొటోలు (కనిపించే క్రమంలో)
1. తాజ్ – మంచు తెరల వెనక
2. తాజ్ ప్రధాన మందిరం
3. లోటస్ టెంపుల్ – న్యూ ఢిల్లీ
4. అక్షర్ ధాం – న్యూ ఢిల్లీ (స్టాక్ ఫొటో)
5. అక్షర్ ధాం – న్యూ ఢిల్లీ (స్టాక్ ఫొటో)


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 300,727

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.