Archive for the 'యాత్ర' Category

మాన్యుమెంట్ వ్యాలీ

అసంరా పశ్చిమాన ఉటా, అరిజోనా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న రమణీయమైన లోయ ప్రాంతం మాన్యుమెంట్ వ్యాలీ. హాలీవుడ్ వెస్టర్న్ సినిమాలు (మన పరిభాషలో కౌబోయ్ చిత్రాలు) విరివిగా చూసేవారికి ఈ ప్రాంతం సుపరిచితమే. ఇక్కడ తీయనిది వెస్టర్నే కాదన్నంతగా ఈ లోయకీ, కౌబోయ్ చిత్రాలకీ అనుబంధం పెనవేసుకుపోయింది. వందలాది మైళ్లపాటు విస్తరించి ఉన్న ఎర్రెర్రటి ఇసుకరాయి కొండలు ఈ ప్రాంతపు ప్రత్యేకత. కనుచూపుమేరలో పచ్చటి చెట్టే లేక పోయినా, ఆ ఎర్రదనంలోనే వర్ణించనలవికాని అందం గోచరిస్తుందక్కడ. తొలిసారి ఈ ప్రాంతాన్ని సందర్శించినవారు తామున్నది భూమ్మీదేనా లేక అరుణ గ్రహమ్మీదా అని కొద్దిక్షణాలపాటైనా అయోమయానికి గురికావటం సాధారణం (బహుశా ఆ కారణంతోనే, స్టాన్లీ కుబ్రిక్ ‘2001: A Space Odyssey’ లోని వింత గ్రహానికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణకి ఈ ప్రాంతాన్నే ఎంచుకున్నాడు). అమెరికా పశ్చిమ తీరంలో గ్రాండ్ క్యానియన్స్ తర్వాత చూసితీరవలసిన ప్రదేశం ఇది.

ప్రకృతి చేతిలో లక్షలాది ఏళ్ల పాటు ఓపికగా మలచబడ్డ మహా శిల్పం మాన్యుమెంట్ లోయ. అగ్ని పర్వతాల పేలుళ్లు, గాలి, నీరు వల్ల కోతకు, అరగతీతకు, అనేకానేక ఇతర మార్పులకు గురైన ఇసుకరాయి కొండలు యుగాల పాటు రూపాంతరీకరణ చెంది ఇప్పుడు మనకగుపించే లోయగా ఏర్పడ్డాయి. లోయ అనగానే చుట్టూ కొండలు, మధ్యలో చదునుగా ఉండే లోతైన భాగం అనుకునేరు – ఇది దానికి భిన్నం. వందలాది మైళ్ల విస్తీర్ణంలో విస్తరించిన చదునైన పీఠభూమి, మధ్యలో అక్కడక్కడా ఎవరో తీసుకొచ్చి పెట్టినట్లు దర్జాగా నిలబడున్న మహాశిలలు – అదే ఈ లోయ. కోతకు గురై కొట్టుకు పోయినవి పోగా మొండిగా మిగిలిన కొండ రాళ్లే ఈ మాన్యుమెంట్స్.

పైది, మాన్యుమెంట్ వ్యాలీకి సంబంధించి అతి క్లుప్తమైన వివరణ. కిందవి అక్కడ నేను తీసిన వర్ణ చిత్రాలు. ప్రతి ఫొటోలోనూ ఆయా మాన్యుమెంట్ల పరిమాణాన్ని emphasize చేయటం కోసం మనుషుల్నో, కార్లనో, మరే ఇతర వస్తువునో వాడటం జరిగింది. కొన్ని ఫొటోల్లో జాగ్రత్తగా గమనిస్తే కానీ ఇవి కనిపించవు. మనిషి ఎంత ఎదిగినా, పిరమిడ్ల లాంటి మహానిర్మాణాలెన్ని చేసినా, ప్రకృతి శక్తుల ముందు ఎంత అల్పుడో అన్నదానికి ఇవన్నీ చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే.

ఆరవ ఫొటో ఆర్చెస్ నేషనల్ పార్క్ లోని ‘డెలికేట్ ఆర్చ్’. ఆర్చెస్ నేషనల్ పార్క్ మాన్యుమెంట్ వ్యాలీనుండి ఐదారు గంటల ప్రయాణ దూరంలో ఉంటుంది.

టామ్ హ్యాంక్స్ కి వరసగా రెండవ ఏడాదీ ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టిన ‘ఫారెస్ట్ గంప్’ చూశారా? అదులో ఫారెస్ట్ గంప్ పరుగాపి వెనక్కి తిరిగిన ప్రదేశం నేడు అనధికారికంగా ‘ఫారెస్ట్ గంప్ పాయింట్’ పేరుతో పిలవబడుతుంది. ఐదో ఫొటో అక్కడ తీసిందే. నేను ఫొటో తీసిన చోటి నుండి వెనకనున్న కొండల దాకా ఉన్న దూరం సుమారు పదమూడు మైళ్లు.

 


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.