సంక్రాంతంటే చాలామందికి గుర్తొచ్చేది అరిసెలు, హరిదాసులు, రథం ముగ్గులు, గొబ్బెమ్మలు, గాలి పటాలు. పల్నాడువాసులకి గుర్తొచ్చేది మాత్రం కోళ్ల పందేలు. అలనాటి బ్రహ్మనాయుడి గడ్డ మీద పుట్టి పెరిగినా కోళ్ల పందేలాడిన, కనీసం చూసిన అనుభవం నాకు లేదు. పందెం కోళ్లలా క్రికెట్ పోటీలాడిన అనుభవం మాత్రం చాలా ఉంది. ఆ జ్ఞాపకాల్లో ఒకటి అప్పుడెప్పుడో క్రికెట్ బాంబు పేరుతో పంచుకున్నాను.
నేనీ క్రికెట్ మతం స్వీకరించటం నా ప్రమేయం లేకుండానే జరిగింది – నా హైస్కూలు రోజుల్లో. అప్పట్లో క్రికెట్ ఇంకా సిటీల్లో తప్ప పల్లెటూర్లలోనూ, ఓ మోస్తరు పట్టణాల్లోనూ అంతగా ప్రాచుర్యం పొందని ఆట. మా ఊర్లో అదాడేవాళ్లు పట్టుమని పాతికమంది ఉండేవాళ్లేమో. రిలయన్స్ కప్పొచ్చి ఆ పరిస్థితిని రాత్రికి రాత్రే మార్చిపారేసిందనుకోండి. ఇది అంతకు ముందు మొదలైన కథ. ఓ రోజు మా ఊరి జట్టుకి, పక్కూరి జట్టుకి పోటీ జరుగుతుండగా నేనా దారిన పోతూ ఆగి ఆసక్తిగా గమనించటం మొదలెట్టాను. సమయానికి స్థానిక జట్టులో ఓ తలకాయ తక్కువవటం, నోరు తెరుచుకుని చూస్తున్న నేను వాళ్ల దృష్టిలో పడటం, నన్ను బలవంతాన మైదానంలోకి నెట్టి క్రికెట్ బ్యాట్ పట్టించటం, ఏం చేస్తున్నానో అర్ధమవకుండానే విన్నింగ్ షాట్ కొట్టి స్థానిక జట్టుని గెలిపించటం .. వరసగా జరిగిపోయాయి. ఆనాడు నేను చేసినవి ముచ్చటగా మూడు పరుగులు. ముందు రోజు దాకా పరిచయం లేని కుర్రాళ్లు నన్ను భుజాల మీద మోస్తూ చిందులేస్తూ గ్రౌండ్ బయటికి తీసుకొస్తుంటే – మొట్టమొదటిసారిగా నాకు విజయగర్వం అనేది అనుభవంలోకొచ్చింది. అప్పుడే పడిపోయాను పీకల్లోతు ప్రేమలో (నా బ్లాగులో ఈ మాట దొర్లటం ఇదే మొదటి సారనుకుంటా!) – క్రికెట్టాటతో. ఇరవయ్యేళ్ల తర్వాతా అది చెక్కుచెదరలేదు. నాడెత్తిన బ్యాట్ నేటికీ దించలేదు. ఐతే విశేషమేంటంటే, నాకు క్రికెట్ ఆడటమంటేనే ఇష్టం – చూడటమంటే కాదు. క్రికెట్ పోటీలాట్టానికి కాలేజ్ క్లాసులు ఎగ్గొట్టిన రోజులున్నైగానీ, టీవీలో మ్యాచ్ చూట్టానికి ఆ పని చేసిన రోజుల్లేవు.
ఇంటర్మీడియెట్లోకొచ్చేసరికి క్రికెట్ పిచ్చి ముదిరింది. క్లాసులెగ్గొట్టటమూ ఎక్కువయింది. ఎంత జాగ్రత్త పడ్డా క్లాసులెగ్గొట్టి క్రికెట్ మ్యాచ్‌కెళ్లిన సంగతి ఒక్కోసారి ఇంట్లో తెలిసిపోయేది. ఆటలంటూ ఎక్కడ చదువు పాడు చేసుకుంటానో అని ఇంట్లోవాళ్ల భయం. దాంతో, నా కదలికల మీద కర్ఫ్యూ విధించేశారు. వారాంతాల్లో ఈ నిఘా మరింత పటిష్టంగా ఉండేది. మన మ్యాచ్‌లేమో శనాదివారాల్లోనే ఎక్కువుండేవి. అయినా మనది సైకో & క్రిమినల్ బుర్ర కదా (ఆరోప్రాణం పాఠకులెవరో ఆ బిరుదిచ్చేశారు), ఆ దరిద్రానికి విరుగుడు ఉపాయం వెంటనే తట్టింది. ఆదివారాలు ఎక్స్ట్రా క్లాసులని చెప్పి సినిమాలకో, షికార్లకో చెక్కేయటం ఆ వయసు పిలగాళ్ల సహజగుణం. నాకు మాత్రం క్రికెట్ మ్యాచ్‌ల కోసమే ఎక్స్ట్రా క్లాసులు అక్కరకొచ్చేవి.
అలా ‘ఎగస్ట్రా క్లాసు’ వంకతో వీకెండ్ గేమ్‌ని విజయవంతంగా నెట్టుకొచ్చేవాణ్ని. అయితే అప్పుడప్పుడూ ఈ వ్యూహం బెడిసికొడుతుండేది. కొన్నిసార్లు ఇంట్లోవాళ్లు కాలేజ్మీద మెరుపు దాడి చేసి ఆకస్మిక తనిఖీ జరపటమో, వేగుల ద్వారా సమాచారం సేకరించి ఎక్స్ట్రా క్లాసుల నిగ్గు తేల్చటమో చేస్తుండేవాళ్లు. అప్పటికే క్రికెటర్‌గా పల్నాడు పరగణాల్లో పెరిగిన నా ప్రతిష్ట సైతం కొన్నిసార్లు తిప్పలు తెచ్చి పెడుతుండేది. ఊళ్లోవాళ్లెవరో ‘మొన్న ఫలానా మ్యాచ్‌లో మీ అబ్బాయి విరగదీశాడట కదండీ’ అనే పొగడ్త మా ఇంట్లోవాళ్ల చెవినేసేవాళ్లు. రికార్డుల ప్రకారం మనం ఆ ఫలానా టైములో ఎక్స్ట్రా క్లాసులో ఉన్నామాయె! ఇంకేముంది, ఆ సాయంత్రం ఇంట్లో ప్రైవేటు. అందుకే ఇప్పటికీ నాకు పొగడ్తలన్నా, పొగిడేవాళ్లన్నా భయం.
ఇప్పట్లా అప్పట్లో టెన్నిస్ బాల్ క్రికెట్ అనేదుండేది కాదు. శుభ్రంగా లెదర్ బాల్, లేదా కార్క్ బాల్‌తో కుమ్మేస్తుండేవాళ్లం. అది తగిలితే అదే స్థాయిలో వళ్లు వాచిపోతుండేది. ఆ దెబ్బలు ఇంట్లో తెలీకుండా మేనేజ్ చెయ్యటం ఓ కళ. కాలక్రమేణా అందులో ఆరితేరిపోయాన్నేను. ఇలా .. ఇన్ని సమస్యల మధ్య కూడా ఏ మాత్రం వెరవకుండా క్రికెట్ ఆడుతూనే ఉండేవాడినా, ఒక్క విషయం మాత్రం మాచెడ్డ చిరాకుగా ఉండేది. వేగుల డేగ కళ్లనీ, ఆకస్మిక తనిఖీలనీ, భట్రాజుల లీకేజీల్నీ, బంతి దెబ్బల్నీ నా క్రిమినల్ బుర్రతో దీటుగా ఎదుర్కునేవాణ్ని కానీ మా కపిల్‌దేవ్ గాడి తడాఖా మాత్రం తట్టుకోలేక ఇంట్లో దొరికిపోతుండేవాణ్ని. కపిల్‌దేవ్ గురించి మాట్లాడుకునే ముందు విక్కీ గురించి చెప్పాలి. ‘విక్కీ’ అంటే ‘వికెట్ కీపర్’ అని మీలో గల్లీ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్నోళ్లు ఈజీగానే పట్టేసుంటారు. మిగిలిన అగ్నానుల కోసం మళ్లీ రాస్తున్నా: ‘విక్కీ’ అంటే ‘వికెట్ కీపర్’.
ఆ రోజుల్లో ప్యాడ్లు, గ్లవ్స్ వంటివి మాబోటి పిల్ల క్రికెటర్లకి లగ్జరీ సామాన్లు. జట్టు మొత్తానికీ కలిపి ఒక జత ప్యాడ్స్ ఉంటే మహా గొప్ప. బ్యాటింగ్ చేసేటప్పుడైతే ఇద్దరు బ్యాట్స్‌మెన్ చెరో ప్యాడ్ కట్టుకునేవాళ్లు. ఫీల్డింగ్ చేసేప్పుడు వాటినే వికెట్ కీపర్ ఉరఫ్ విక్కీ ధరించేవాడు. ఇంతమంది కాళ్ల మీద నలిగి అవి నానాజాతిసమితిలా కనిపిస్తుండేవి – స్ట్రాప్స్ ఊడిపోయి, మరకలూ చిరుగులూ పడి. జేబు రుమాళ్లతో ప్యాడ్స్ బిగించి కట్టుకోవటం ఆటగాళ్లందరికీ అలవాటైన కూసువిద్యగా ఉండేది. అయితే ఇది అంతో ఇంతో ‘ధనిక జట్ల’ కథ. నేను క్రికెటర్ అవతారమెత్తేనాటికి మా జట్టు పరిస్థితి ఆ రెండు ప్యాడ్లకి కూడా గతిలేకుండా ఉండేది. ఉత్తి కాళ్లతోనే అలాగే ఎలాగో బ్యాటింగ్ చేసినా, వికెట్ కీపింగ్ దగ్గరికొచ్చేసరికి ఎవరికి వాళ్లు ఏదో వంకతో తప్పుకునేవాళ్లు. ఇంకేముంది, జట్టులో కొత్తవాడిని కావటంతో ఆ బాధ్యత నా నెత్తిన పడేది. కొత్తలో స్థానం కాపాడుకోటానికి ఇచ్చిన పనల్లా చెయ్యాలి కాబట్టి ఇష్టమున్నా లేకున్నా ఉత్తుత్తి కీపింగ్ గ్లవ్స్ (విత్ ఇమాజినరీ ఇన్నర్స్) తొడుక్కుని విక్కీ అవతారమెత్తేవాణ్ని. జట్టు ఆర్ధిక పరిస్థితి కొంత మెరుగు పడి ప్యాడ్లూ గట్రా క్రికెట్ గేర్ సమకూర్చుకోగలిగేనాటికి నేను శాశ్వత విక్కీగా సెటిలైపోయాను. అలా సెటిలయ్యే సమయానికి మా జట్టులో వచ్చి చేరాడు కపిల్‌దేవ్.
కపిల్‌దేవ్ అసలు పేరు రత్నసాగర్ రెడ్డి. మాకన్నా నాలుగైదేళ్లు పెద్దవాడు, మంచి బ్యాట్స్‌మన్. భారత జట్టులో కపిల్‌దేవ్ ప్రభ ధగ ధగా వెలిగిపోతున్న రోజులవి. రత్నసాగర్ రెడ్డికి కపిల్‌దేవ్‌తో కొట్టొచ్చిన పోలికలుండేవి .. రూపు రేఖలు, ఎత్తు, వంకీల జుత్తు, వగైరా. ఇహ చూస్కోండి. మావాడు కపిల్ లాగా నడవటం, నవ్వటం ఇత్యాదివి తెగ ప్రాక్టీస్ చేసేసి మ్యాచ్‌ల సందర్భంగా మైదానంలో తన హావభావాలు, కదలికలతో చింపేస్తుండేవాడు. వాటికి తోడు అచ్చు కపిల్ లాగే మోచేతుల్దాకా స్లీవ్స్ ఉండే చొక్కా ధరించి కుడి చేతికో స్టీల్ కడియం కూడా తొడిగేవాడు. స్థానిక క్రికెట్ మతస్థులందరికీ వీడో లోకల్ డెయిటీ. సిసలు కపిల్‌ని ప్రత్యక్షంగా తిలకించి పులకించే అదృష్టానికి నోచుకోని నిర్భాగ్యాభిమానులు మా ఆట జరిగే ప్రాంతానికి తండోపతండాలుగా తరలొచ్చి ఈ నకిలీ కపిల్ దేవుణ్ని చూసి తరించిపోయేవారు. మొత్తమ్మీద, రత్నసాగర్ రాకతో మా జట్టు ఆడే సమయంలో ప్రేక్షకుల తాకిడి తట్టుకోలేనివిధంగా ఉండేది. ఆ ప్రేక్షకుల జిహ్వచాపల్యం తీర్చటానికి సోడాలూ, బఠానీలూ, ఇతరత్రా చిరుతిళ్ల తోపుడుబళ్లతో విచ్చేసిన వ్యాపారులతో, ఈ హంగామా అంతా చూసి అక్కడేదో జరిగిపోతుందనుకుంటూ ఆగి అర్ధమైనా కాకపోయినా విడ్డూరం చూసే డి.బి.దానయ్యలతో క్రీడాంగణం పరిసరాలు జాతరని తలపిస్తుండేవి. అంతవరకూ బాగానే ఉంది.
బాగా లేనిది, వికెట్ల వెనక నా పరిస్థితి. ముందే చెప్పినట్లు రత్నసాగర్ మంచి బ్యాట్స్‌మన్. అంతకు మించిన అరివీర భయంకర బౌలర్ కూడా. పాతిక గజాల దూరం నుండి పరుగు తీస్తూ వచ్చి మరీ ప్రచండ వేగంతో బంతులు విసురుతూ వికెట్ కీపర్ల గుండెల్లో నిదురపోయేవాడు. వాటిలో ఒక్కటీ లక్ష్యానికి కూతవేటు దూరంలోకి రాదు గనక ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్ మాత్రం ధైర్యంగా, దర్జాగా ఆ బంతులొదిలేస్తూ ‘వెల్ లెఫ్ట్’ పోజులొలకబోస్తుండేవాళ్లు. ఏం చేస్తాం మరి – ప్రాక్టీస్ ఎంత చేసినా, కపిల్ కదలికలు కావలసిన్ని అబ్బాయే తప్ప మావాడికి పెద్దాయన బౌలింగ్‌లో వందోవంతు కూడా వంటబట్టలేదు. కానీ సాక్షాత్తూ కపిల్ అవతారంగా స్థానికుల గుండెల్లో గుడి కట్టుకున్నవాడు, ఎవరి పేరు చెబితే పల్నాడు ప్రేక్షకులు విరగబడతారో, ఎవరి పేరు చెబితే చిరుతిళ్ల వ్యాపారులు పరుగెత్తుకొస్తారో, ఆ రత్నసాగర్ బౌలింగ్‌కి దిగకపోతే ఎలా? ఎలా? ప్రేక్షకులొప్పుకోరు మరి. వాళ్ల కోసమన్నా వీడికి ఒకట్రెండు ఓవర్లు బౌలింగ్ ఇవ్వాల్సొచ్చేది. కపిల్ చేస్తే గీస్తే ఓపెనింగ్ బౌలింగే చెయ్యాలి కాబట్టి వీడి చేతికి కొత్త బంతినిచ్చి మా జట్టు బిక్కు బిక్కుమంటూ ఊపిరిబిగబట్టి బెదురుచూపులు చూస్తుండేది – మొదటి ఓవర్ ఎప్పుడైపోతుందా అని. సాధారణంగా పది లేదా పన్నెండు బంతుల తర్వాత మొదటి ఓవర్‌కి తెరపడేది. మావాడు భీకరమైన ఫామ్‌లో ఉంటే అంతకన్నా ఎక్కువ బంతులూ పట్టేవి. ఈ లోపు వికెట్ల వెనక నా వళ్లు హూనమైపోయేది. ‘అటు దూకు, ఇటు దూకు, [బంతి] ఎటు పడితే అటు ఎగిరెగిరి దూకు’ అని నన్ను నేనే ఉద్రేకపరుచుకుంటూ వికెట్లకి యోజనాల దూరంలో దూసుకుపోతున్న బంతుల్ని ఒడిసి పట్టుకోటానికి కుడిఎడమలకి ఎడా పెడా డైవ్‌ల మీద డైవ్‌లు కొట్టి, ఆ క్రమంలో మట్టికొట్టుకు పోయేవాణ్ని – లిటరల్లీ. ఆ తర్వాత, రత్నసాగర్ వేసిన పటిష్టమైన పునాదిని (మాక్కాదు, ప్రత్యర్ధి జట్టుకి) పెళ్లగించటానికి మిగతా బౌలర్లూ తమవంతు చెమటలు కక్కేవాళ్లు. ఏమాటకామాటే, బౌలింగ్‌తో చేసిపెట్టిన డామేజ్‌ని తన బ్యాటింగ్‌తో చాలావరకూ పూడ్చేవాడులెండి. అయితే ఆ విషయం ప్రస్తుతం అప్రస్తుతం.
అసలు సంగతేంటంటే, ఆ సాయంత్రం ఇంటికొచ్చాక నా ఎక్స్ట్రా క్లాస్ గుట్టు ఇంట్లో ఇట్టే రట్టైపోయేది! అదెలాగో వెలిగిందా?
(పదో ప్రపంచ కప్ సందర్భంగా – గతేడాది సంక్రాంతి నాటి నా ఈ పోస్ట్ యధాతథ పునఃప్రచురణ)
మీ మాట