Archive for the 'ఆట' Category

ఎమ్.ఎమ్.బి.లక్ష్మణ్

అప్పటికీ, ఇప్పటికీ – అతడంటే ప్రపంచ ఛాంపియన్లకి హడల్. ప్రత్యర్ధి ఆటగాళ్ల దృష్టిలో అతను వెరీ వెరీ స్పెషల్. అతని పరిస్థితి మాత్రం ముద్ద ముద్దకీ బిస్మిల్లా. అతనికి ప్రతి టెస్టూ అగ్ని పరీక్షే. సదా మెడపై వేలాడే కత్తి. పేరుకే సీనియర్ – జూనియర్లతో పోటీ పడుతూ ఎడతెగని మనుగడ పోరాటం. పదేళ్లకి పైగా తనేమిటో పదే పదే నిరూపించుకుంటూ వస్తున్నా జట్టులో చోటు కడదాకా డౌటు. స్థానం కోల్పోయిన ప్రతిసారీ పడిలేచిన కెరటంలా తిరిగి రావటం అతనికే సాధ్యం. అలా పడుతూ లేస్తూనే తెలుగుదేశం నుండి తొలిసారి నూరు టెస్టులాడిన ఘనత సాధించిన మౌనయోధుడు వివిఎస్ లక్ష్మణ్. భారత క్రికెటర్లలో ఈ మెట్టెక్కింది మరో ఆరుగురు మాత్రమే. వింతేమిటంటే, క్రికెట్ అంటే చెవి కోసుకునే తెలుగు వారు కూడా వీరూ బాదితేనో, గంగూలీ చొక్కా విప్పితేనో సంతోషంతో చిందులేస్తారే కానీ లక్ష్మణ్ సాధించిన అరుదైన ఈ ఘనతని పట్టించుకున్న పాపాన పోలేదు. ఎస్వీ రంగారావు గురించి గుమ్మడి చెప్పిన మాటలు ఈ విలక్ష్మణుడికీ ఆపాదించొచ్చు: ‘లక్ష్మణ్ తెలుగువాడిగా పుట్టటం మన అదృష్టం, అతని దురదృష్టం’. ఇంత ప్రతిభగల ఆటగాడు ఏ బెంగాలీనో, మరాఠీనో అయ్యుంటే మరిన్ని టెస్టులు, వన్డేలు ఆడటమే కాకుండా భారత జట్టుకి కెప్టెన్ కూడా అయ్యుండేవాడు.

అతనికి – సచిన్‌లా విశ్వవ్యాప్తమైన అభిమానుల్లేరు, గంగూలీకున్నట్లు దాల్మియాల దౌత్యం లేదు. అనేకమంది క్రికెటర్లకున్నట్లు ప్రాంతీయ బోర్డుల, అసోసియేషన్ల అండదండలూ అంతగా లేవు. ఉన్నదల్లా ఆత్మవిశ్వాసం; జట్టులోంచి తీసేసిన ప్రతిసారీ దేశవాళీ పోటీల్లో పరుగుల వర్షం కురిపించి తనని తిరిగి జాతీయ జట్టులోకి ఎంపిక చెయ్యక తప్పని అవసరం కల్పించే నైపుణ్యం. చిన్నా చితకా జట్లపై రెచ్చిపోయి జట్టులో స్థానం సుస్థిరం చేసుకునే వారికి భిన్నం లక్ష్మణ్. అతని అత్యధిక బ్యాటింగ్ సగటు ఆస్ట్రేలియాపై కాగా, అత్యల్ప సగటు బంగ్లాదేశ్ మీద. టెస్టుల్లో నూట ఐదు క్యాచ్‌లందుకున్నా చురుకైన ఫీల్డర్ కాదనే అపవాదు, కీలక సమయాల్లో భారీ భాగస్వామ్యాలు ఎన్ని నిర్మించినా వికెట్ల మధ్య సరిగా పరిగెత్తలేడనే నింద, ఆడిన ఎనభై ఆరు వన్డేల్లోనూ కలిపి గంగూలీ, ద్రవిడ్‌లకు దీటుగా డెబ్భైకి పైగా స్ట్రయిక్ రేట్ కలిగున్నా వన్డేలకి పనికి రాడనే ముద్ర – పొమ్మనలేక పొగబెట్టినట్లుగా లక్ష్మణ్‌ని వన్డేలనుండి సాగనంపటానికి గంగూలీ జమానాలో అమలయిన తంత్రమిది. భారత జట్టుకి భావి నాయకుడు లక్ష్మణే అన్న సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాల వ్యాఖ్యలతో భద్రతా రాహిత్యానికి గురైన బెంగాలీ దాదా చాణక్యం ఇది అన్న గుసగుసలు అప్పట్లోనే వినొచ్చాయి. ఆస్ట్రేలియాని హడలెత్తించే ఈ కీలక ఆటగాడిని మాజీలు ఎందరు మొత్తుకున్నా 2003 ప్రపంచ కప్ పోటీలకి ఎంపిక చేయకపోవటం ఎంత పొరపాటో ఫైనల్ పరాభవం తర్వాత అందరికీ అర్ధమయింది.

సొగసరి బ్యాటింగ్‌కి హైదరాబాదీ ఆటగాళ్లు మొదటినుండీ పెట్టింది పేరు. ఈ కళలో – పాత తరంలో జయసింహ, ఆ తర్వాత అజహరుద్దీన్‌ల వారసత్వాన్ని ఈ తరంలో అనితరసాధ్యంగా కొనసాగిస్తున్నవాడు లక్ష్మణ్. తనదైన రోజున లక్ష్మణ్ ఆటని వర్ణించటానికి క్రికెట్ వ్యాఖ్యాతలకి మాటలు సరిపోవంటే అతిశయోక్తి కాదు. భారీ షాట్లు కొట్టకుండానే బౌండరీలు రాబట్టటం అతని విశిష్టత. సెహ్వాగ్, ధోనీ, టెండూల్కర్‌లా విరుచుకుపడినట్లు కనబడకుండానే స్కోరుబోర్డుని పరుగులెత్తించటం లక్ష్మణ్ స్టైల్. వీరబాడుడు మోజులో కనుమరుగైపోతున్న కళాత్మక బ్యాటింగ్ తీరుకు వర్తమాన క్రికెట్‌లో బహుశా మిగిలున్న ఏకైక చిరునామా లక్ష్మణ్. అతను షాట్ సంధిస్తే బంతి నేలకి రెండంగుళాల ఎత్తులో పిచ్చుకలా దూసుకుపోతుందే కానీ అంతెత్తున లేచి ఒడిసిపట్టుకునే అవకాశం ఫీల్డర్లకివ్వదు. అందుకే వంద టెస్టుల్లోనూ కలిపినా అతని సిక్సర్ల సంఖ్య నాలుగు మించలేదు. ఫ్లిక్ షాట్లలోనూ, మణికట్టు మాయాజాలంతో ఆఫ్‌సైడ్ బంతులను కూడా అలవోకగా ఫైన్‌లెగ్ బౌండరీ దాటించటంలోనూ గురువునే మించిన శిష్యుడు లక్ష్మణ్.

టెస్టుల్లో లక్ష్మణ్ చేసిన ఆరువేల పైచిలుకు పరుగుల్లో రెండు వేలకి పైగా ప్రపంచ ఛాంపియన్లు ఆస్ట్రేలియాపై సాధించినవే. అతని పదమూడు శతకాల్లో ఆరు వారిపై చేసినవే – వాటిలో రెండు ద్విశతకాలు కూడా. జట్టు ఆపదలో ఉన్నప్పుడు లక్ష్మణ్ ఆపద్బాంధవుడి పాత్ర పోషించిన సందర్భాలెన్నో.  అతను బాగా ఆడిన సందర్భాల్లో భారత జట్టు ఓడిపోవటం అరుదు. లక్ష్మణ్ గణాంకాలే అందుకు సాక్ష్యం. సచిన్ సైతం సాధించలేని ఘనత అది. విలువైన భాగస్వామ్యాలు నిర్మించటంలో ఇతన్ని మించినవారు లేరు. కింది వరుస ఆటగాళ్లతో కలిసి కీలక పరుగులు జోడించి జట్టుని గట్టెంకించిన సందర్భాలు కోకొల్లలు.

మ్యాచ్‌ఫిక్సింగ్ వివాదంలో ఇరుక్కుని బహిష్కరణకి గురైన అజహరుద్దీన్ పేరు పలకటమే పాపంగా అనేకమంది క్రికెటర్లు తప్పుకు తిరిగిన రోజుల్లోనూ అజ్జూని ఆటలో తనకి ప్రేరణగా అవకాశమొచ్చిన ప్రతి సందర్భంలోనూ ప్రస్తావించిన మంచితనం లక్ష్మణ్ సొంతం. వర్తమాన భారత క్రికెటర్లలో జెంటిల్మెన్ ఎవరంటే రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే అనేవి వెంటనే వినిపించే పేర్లు. పన్నెండేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఒక్క వివాదం లోనూ ఇరుక్కోని లక్ష్మణుడూ వారి కోవే. ఎన్నిసార్లు జట్టులోనుండి తీసేసినా మౌనమే అతని మంత్రం. ఏ నాడూ పత్రికలకెక్కి రాద్ధాంతం చెయ్యలేదు, తన బాధ బయట పెట్టలేదు. జట్టుకి అవసరమైన ప్రతిసారీ నేనున్నానంటూ లక్ష్మణ్ బ్యాట్ మాట్లాడిందే కానీ విజయాల్లోనూ మౌనమే అతని వాణి, బాణీ. మహామహుల మాటున లక్ష్మణ్ ప్రతిభకి, జట్టు విజయాల్లో అతని పాత్రకి రావలసినంత గుర్తింపు రాకపోవటం దురదృష్టకరం.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.