జీరోబడ్జెట్ సినిమాకైనా, భారీబడ్జెట్ సినిమాకైనా దర్శకుడి చేతిలో లేని విషయాలు చాలా ఉంటాయి. అతని/ఆమె చేతిలో పూర్తిగా ఉండేది ఒకే ఒకటి.
కథ.
ఓ సారి, ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్‌ని ఎవరో ‘మీ సినిమా ఎందాకా వచ్చింది సారూ’, అంటే ఆయన చేతిలో ఉన్న స్క్రిప్ట్ చూపిస్తూ ‘తొంభై శాతం పూర్తైపోయింది. చిత్రీకరణొక్కటే మిగిలుంది బాబూ’, అన్నాడట. ఈ సంభాషణ నిజమో కాదో వదిలేస్తే, దాని వెనకున్న సందేశం గొప్పది. సినిమాకి స్క్రిప్ట్ ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుందది.
ఆ స్క్రిప్ట్ కన్నా ముందు కావలసింది కథ. లఘు చిత్రాలకి ఎలాంటి కథలు ఎంచుకోవాలి? ఎంపిక సమయంలో మన జీరోబడ్జెట్ పరిమితులు ఎంత వరకూ దృష్టిలో పెట్టుకోవాలి? ఇవి – ఈ భాగంలో చూద్దాం.
మీరొక్కసారి యూట్యూబ్‌లో చొరబడి ‘Telugu short films’ అని గాలించి చూడండి. వేలాది ఫలితాలు ప్రత్యక్షమౌతాయి. వాటిలో నూటికి తొంభై ప్రేమ, పెళ్లి, పెటాకులు – వీటి చుట్టూ తిరిగే కథలే! అలాంటి కథలతో లఘు చిత్రాలు తీయకూడదని కాదు. కానీ అన్నీ అవేనా? ఎందుకా అని తరచి చూస్తే నాకనిపించింది – ఇది మన ప్రధాన స్రవంతి సినిమాల ప్రభావమని. సరే. మెయిన్‌స్ట్రీమ్ సినిమా అంటే కోట్లలో వ్యాపారం. అక్కడ అనేక లెక్కలుంటాయి. కుదిరితే రూపాయికి రూపాయి లాభం లాక్కోవాలి; కుదరకపోతే పెట్టిన ఖర్చన్నా రాబట్టుకోవాలి. నలిగిన దారిలో నడవకపోతే ఏ లంపటం చుట్టుకుంటుందోననే భయం. మరి లఘుచిత్రాలకి అలాంటి సంకటాలేవీ ఉండవు కదా. వీటికీ అవే మూస కథలెందుకు? తెలుగు ప్రేక్షకులకి ఇలాంటి కథలే నచ్చుతాయన్న అపోహా? బహుశా – ఈ లఘుచిత్రాలు కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టి తీస్తారు కాబట్టి వీక్షణలు, ప్రకటనల రూపంలో వీలైనంత రాబడి తెచ్చుకునే ప్రయత్నంలో వీళ్లు కూడా నలుగురి దారినే నడుస్తున్నారేమో – అనేది నా ఊహ.
ఈ ఊహలు, అపోహలు అవతల పెడితే – నాణ్యమైన జీరోబడ్జెట్ లఘుచిత్రం తియ్యాలనుకునే మీలాంటి వారికి ఓ గొప్ప వెసులుబాటుంది. ఖర్చు, రాబడి, లాభం లాంటి బాదరబందీలేవీ మీకు లేవు. అలాంటప్పుడు మీరు ఎవరినో అనుకరించాల్సిన అవసరమేంటి? మీ మనసుని అనుసరించండి. మీకు నచ్చే కథతో సినిమా తీయండి; వేరే వాళ్లకి నచ్చుతుందేమోనని మీరనుకునే కథతో కాదు (ఒకవేళ – మూస కథలే మీకు బాగా నచ్చేవీ అయితే – శుభం. అదే కానీయండి)
కొందరు దర్శకులు తమ కథలు కూడా స్వయంగా తామే రాసుకుంటారు. మరికొందరు ఇతరుల కథలని సినిమాలుగా మారుస్తారు. మీరే కోవకి చెందినవారైనా – ఎలాంటి కథ ఎంచుకోవాలో, దాన్నెలా మలచుకోవాలో తేల్చుకోవటానికి ఈ క్రింది సూచనలు పనికొస్తాయి.
మొదటగా – కథ కూడా మీరే రాసుకునేట్లైతే – మీకు బాగా తెలిసిన అంశాలనే కథగా మలచండి. లోతుగా తెలియని విషయాల జోలికెళ్లి చెయ్యి కాల్చుకోవద్దు. అలాగని ఓ కథలో అన్నీ మీకు తెలిసిన సంగతులే ఉండాల్సినవసరం లేదు. తెలీని విషయాలని తెలుసుకుని రాయమని నా ఉద్దేశం.
ఏ కథకైనా ముగింపు ముఖ్యం (నా మట్టుకు నాకు – ముగింపే అసలు కథ. మిగతాదంతా ఆ ముగింపుకి పాఠకుల్ని చేర్చటానికి రచయిత పడే ప్రయాస). మీ లఘుచిత్రం ఆకట్టుకోవాలంటే దాని ముగింపు ప్రేక్షకుల్ని కొద్దిరోజులపాటైనా వెంటాడాలి. కాబట్టి ముందుగా మీ కథ ముగింపు ఎలా ఉండాలో రాసుకోండి. ఆ ముగింపు ద్వారా మీరు ప్రేక్షకుల్ని ఏ రకమైన ఉద్వేగంలో ముంచెత్తాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఆ తర్వాత – కథలో సన్నివేశాలన్నీ సదరు ముగింపుకి దారి తీసేలా, మీరనుకున్న భావావేశాలు రేకెత్తించేలా అల్లుకు రండి. దీనివల్ల మీకో స్పష్టత ఉంటుంది. అనవసరమైన సన్నివేశాలు కథలో చొరబడటానికి అవకాశం తక్కువుంటుంది. ఇలా సన్నివేశాలు ‘పేర్చుకుంటూ’ పోయేటప్పుడే – మీది శూన్యవ్యయ చిత్రం కాబట్టి – బడ్జెట్ పరిమితులూ దృష్టిలో పెట్టుకుని, దానికి తగ్గట్లు రాయండి. మొత్తమ్మీద, కథకుడిగా మీ సృజనలో అధిక భాగం క్లైమాక్స్ ఊహించటానికి ఖర్చుపెడితే, మిగిలినదాంట్లో ఎక్కువ భాగం మీ పరిమితులకి లోబడేటట్లు కథని మలచటమ్మీద ఖర్చుపెట్టాల్సుంటుంది.
పైనెక్కడో ‘పేర్చటం’ అన్నానని – కథ రాయటమంటే ఏమన్నా ఇటుకలు పేర్చి ఇల్లు కట్టటమా అనుకునేవారికి సమాధానం, ‘అవును’. కథ రాయటమైనా, సినిమా తీయటమైనా – సగమే కళ (art). మిగతా సగం కౌశలం (craft). కాబట్టి, ‘కథ మొదలు పెట్టటమే నా పని, ఆ తర్వాత నా చెయ్యి అలా రాసుకుంటూనే పోతుంది. పాత్రలు ఒక సారి సృష్టించి వదిలాక వాటంతటవే ఏదేదో చేసుకుంటూపోతాయి. నా ప్రమేయం ఏమీ ఉండదు’, ఇలాంటి నమ్మకాలేమన్నా ఉంటే అత్యవసరంగా వదిలించేసుకోండి. కథ రచయిత రాసినట్లు సాగాల్సిందే. అందులో పాత్రలు అతను ఆడించినట్లు ఆడాల్సిందే. కథ వెలగాలంటే, దానికి మీ కౌశలం జోడించాలి. కాబట్టి మీ కథని శ్రద్ధగా చెక్కండి.
మీ కథలో ఏ రసం ప్రధానంగా కనపడాలో నిర్ణయించుకోండి (చెరుకురసం, నిమ్మరసం, పాదరసం … ఆ రకం కాదు. భయానకం, భీభత్సం, హాస్యం, శృంగారం … ఈ టైపు రసం). దాన్నిబట్టి మీ చిత్రం సృష్టించాల్సిన mood ఏంటో, మీ పాత్రలు ప్రదర్శించాల్సిన emotions ఏమిటో మీకో అంచనా వస్తుంది. మీ కథని ఏదో ఒక్క రసానికే పరిమితం చెస్తే మంచిది. రకరకాల రసాలు మిక్సీలో కసిదీరా కలిపి మీ లఘుచిత్రం నిండా కళ్లాపి చల్లితే చూసినోళ్లకి నీరసం వస్తుంది. (‘The Boogeyman’ లో రెండు మూడు రసాలున్నాయి. వాటిలో ప్రధానమైనది మాత్రం ‘భయం’. కథ మొత్తం దాని చుట్టూతే తిరుగుతుంది. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ వల్ల కథ తిరగబడి మరో రసం కనిపిస్తుంది. కానీ స్క్రిప్ట్ రాసేప్పుడు, సినిమా తీసేప్పుడు, నా దృష్టి మాత్రం – ఈ చిత్రం తొలిసారి చూస్తున్న ప్రేక్షకుడిని భయానికి గురిచేయటం మీదనే ఉంది)
మీది లఘుచిత్రం. కాబట్టి మీ కథ కూడా చిన్నదిగానే ఉండాలి. జీవిత చరిత్రలు చెప్పే పని పెట్టుకోవద్దు. ఎక్కువ పాత్రలు కూడా కథలో దూరనీయొద్దు. వీలైనన్ని తక్కువ పాత్రలు – రెండో, మూడో, నాలుగో – ఉంటే మంచిది. పాత్రలెక్కువయ్యే కొద్దీ వాటికి పరిచయాలు, వాటి గతాలు … ఈ గోలతో చాలా సమయం తినేస్తాయి. ఒక ప్రధాన పాత్ర, ఒకటో రెండో సహాయ పాత్రలు. ఆ ప్రధాన పాత్ర జీవితంలో ఓ ఆసక్తికరమైన సంఘటన, ఓ గ్రహింపు, ఏదో మార్పు. ఇవి చాలు – మీ లఘుచిత్ర కథకి. ఇంతకన్నా ఎక్కువైతే అనవసరపు గందరగోళం. మీ బడ్జెట్ దాటిపోయే ప్రమాదం.
కథాంశాన్ని వీలైనంత సరళంగా ఉంచుకోండి. నేను భారీ హంగులు, ఆర్భాటాల గురించి మాట్లాడటం లేదు. శూన్యవ్యయ చిత్రంలో అవెటూ సాధ్యపడవు. కథనంలో మరీ సంక్లిష్టత లేకుండా చూసుకోమని నా ఉద్దేశం. లఘుచిత్రానికి ఉన్న కాస్త నిడివిలో లెక్కలేనన్ని మెలికలు, ఉరుకులు, పరుగులు, స్క్రీన్‌ప్లే మెరుపులు చూపిస్తే ప్రేక్షకుడికి తలతిరుగుతుంది. కోకొల్లలుగా పాత్రలు, క్లిష్టమైన కథ, లెక్కకు మిక్కిలి ప్రదేశాలు – ఇవన్నీ ఉంటే మీది లఘుచిత్రానికి పనికొచ్చే కథ కాదు. అది పూర్తి నిడివి సినిమా కథౌతుంది. మీ కథ చిక్కిన చక్కని చుక్కలా ఉండాలి. అలాగని ఎముకలగూడులా ఉండకూడదు. కండపట్టి ఉండాల్సిందే. కానీ కొవ్వుపట్టి ఉండకూడదు. మీ కథని ఒకట్రెండు వాక్యాల్లో క్లుప్తీకరించగలిగితే – మీరు సరైన దారిలో ఉన్నట్లు.
సరళంగా ఉండటమంటే సాధారణంగా ఉండటం అని కాదు. కథనం ఆసక్తికరంగా ఉండాలంటే అందులో అవసరమైనంత ఉత్కంఠ, ఎన్నో కొన్ని మలుపులు, వగైరా ఉండాల్సిందే. ప్రేక్షకుడికి తర్వాతేం జరగబోతోందో తెలీకుండా ఉంచాల్సిందే. జీరో బడ్జెట్ చిత్రాలకి ఇది మరీ ముఖ్యం. కథనం చప్పగా ఉంటే ప్రేక్షకుడికి విసుగొచ్చేసి, మీరు చెప్పే కథమీద కంటే మీ సినిమాలో ఉన్న లోపాల మీదకి దృష్టిపోతుంది. అదే – కథనంతో ప్రేక్షకుడిని కట్టి పడేస్తే, చిత్రంలోని లోపాలు అతని దృష్టికి రావు, మీ చిత్రం ఉన్నదానికన్నా ఎక్కువ నాణ్యంగా అతనికి అగుపిస్తుంది. (నమ్మరా? The Boogeyman అందుకు సాక్ష్యం. అందులో ఎన్ని లోపాలున్నాయో నాకు తెలుసు. వాటిని దాదాపు ఎవరూ పట్టించుకోలేదు)
ఒక సారి కథ సిద్ధమయ్యాక, అందులో పాత్రల స్వభావాలు, గుణగణాలు, లక్షణాలు నిర్మించే పని పెట్టుకోండి. మీ లఘుచిత్రంలో ప్రతి పాత్రనీ తెరమీద పూర్తిస్థాయిలో ఆవిష్కరించేంత సమయం మీకుండదు. అయినప్పటికీ, మీ పాత్రల్ని సంపూర్ణంగా అర్ధం చేసుకోవలసిన అవసరం కథకుడిగా/దర్శకుడిగా మీకుంది. సినిమాలో చూపినా చూపకపోయినా, మీ పాత్రల గతం మీకు లీలామాత్రంగానైనా తెలిసుండాల్సిందే. మీ పాత్రలు ఎలా మాట్లాడతాయి, ఎలా పోట్లాడతాయి, ఎలా నడుస్తాయి, ఎలా ఏడుస్తాయి .. ఇవన్నీ మీకు తెలియాలి. అప్పుడు మాత్రమే – ఏ సన్నివేశంలో ఏ పాత్ర ఎలా ప్రవర్తించాలో, ఏ సంఘటనకి ఎలా ప్రతిస్పందించాలో దర్శకుడిగా మీకో అంచనా ఉంటుంది. అది లేకుండా చిత్రీకరణలోకి దూకితే, మీ నటీనటులనుండి మీరేమాశిస్తున్నారో మీకే తెలీదు. వాళ్లు తమకి తోచినట్లు చేసేస్తారు. మీ సినిమా ‘నాణ్యత’ దానికి తగ్గట్లే ఉంటుంది.
నటీనటుల ప్రస్తావనొచ్చింది కాబట్టి, వాళ్ల గురించి ఓ ముఖ్యమైన విషయం. మీ జీరో బడ్జెట్‌లో గొప్ప నటులు దొరికితే మంచిదే. లేకపోతే మీరు అందుబాటులో ఉన్న కుటుంబసభ్యుల, స్నేహితుల సాయంతో లాగించేయాలుంటుంది. వాళ్లంత గొప్ప నటులు కాకపోయినా, కెమెరాని చూసి నీలుక్కుపోకుండా ఉంటే చాలు, మనకవసరమైన మోతాదులో నటన రాబట్టటం పెద్ద కష్టమేం కాదు (నా లఘుచిత్రాలు రెండిట్లోనూ కలిపి ఆరుగురు నటీనటులు తెరపై కనిపించారు. అందులో ఎవరికీ అంతకు ముందు నటించిన అనుభవం లేదు). వీళ్లు మన కథలో పాత్రలకి కొలిచినట్లు సరిపోయే అవకాశాలు దాదాపు శూన్యం. అలాంటప్పుడు డీలా పడక్కర్లేదు. పాత్రకి నటుడు సరిపోనప్పుడు, పాత్రనే నటుడికి సరిపోయేలా మార్చేయటమే. అందుకోసం కథలో కొన్ని మార్పులూ చేర్పులూ చేయవలసి రావచ్చు కూడా. కొన్ని సార్లు, ఈ క్రమంలో కథ మరింత మెరుగవచ్చు. కాబట్టి – మీ కథ మార్చటం కుదరనే కుదరదంటూ బెట్టుగా కూర్చోకండి. జీరోబడ్జెట్ సినిమాల విషయంలో నటీనటుల అందుబాటు, లొకేషన్స్ లభ్యత, చేతిలో ఉన్న చిత్రీకరణ సామగ్రి – ఇలాంటివన్నీ మీ కథపై చెయ్యి చేసుకుంటాయి. కథ రూపం పూర్తిగా మారిపోకుండా జాగ్రత్త పడుతూ, అవసరమైన మార్పులు చేసే నేర్పు, ఓర్పు మీకుండాలి. అది లేకపోతే మీరు ‘నాణ్యత’ గురించి శుభ్రంగా మర్చిపోవచ్చు.
మీది లఘు చిత్రం కాబట్టి – కథ విషయంలో అన్నిటికన్నా ముందు దృష్టిలో ఉంచుకోవలసింది దాని నిడివి. ఇప్పట్లో ఎవరికీ సావధానంగా సినిమాలు చూసే తీరిక, ఓపిక ఉండటం లేదు కాబట్టి – మీ లఘుచిత్రం నిడివి ఎంత తక్కువైతే అంత మంచిది. కాబట్టి మీ కథ పది నుండి పదిహేను నిమిషాల్లోపు ముగిసిపోయేలా చూసుకోండి.
కానీ – ఫలానా కథ తెరపై ఎంతసేపు కనిపిస్తుందో ముందే కనుక్కోవటం ఎలా? దానికో చిట్కా ఉంది. అదేంటో వచ్చే భాగంలో చూద్దాం.
0 స్పందనలు to “సినిమాయణం – 1: కథకళి”