సినిమాయణం – 0: నాణెశూన్యంనుండి నాణ్యం

“శూన్యవ్యయ చిత్రానికి ఇంతటి నాణ్యత ఎలా అబ్బింది?”

ఇది – “The Boogeyman” వీక్షకుల నుండి నాకెదురైన ప్రశ్న. వీరిలో కొందరైనా లఘు చిత్ర నిర్మాణమ్మీద ఆసక్తి కలిగిన (నాలాంటి) ఔత్సాహికులై ఉండొచ్చు. ఆ మెరుపులు, ఉరుములు, లైటింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, మొత్తంగా సినిమా సృష్తించిన mood … ఇవన్నీ ఖర్చులేకుండా ఎలా సాధ్యమయ్యాయనేది వాళ్ల కుతూహలం. నా ఫేస్‌బుక్ మరియు వాట్సాప్ టపాగారాలు వారం రోజులుగా ఇలాంటి సందేహభరిత సందేశాలతో నిండిపోయాయి.

సరే. విజ్ఞానం పంచటానికి మనమెప్పుడూ సిద్ధమే కాబట్టి – ఆ ‘సినిమాయణం’ ఏదో రాసేస్తే ఓ పనైపోతుందనిపించింది. (ఫ్లాష్‌బ్యాక్: అనగనగా ‘కథాయణం‘ పుస్తకం కూడా ఇలాంటి సదాశయంతోనే పుట్టుకొచ్చింది)

“ఏంటేంటీ … రెండు లఘుచిత్రాలు తీసి అందరికీ పాఠాలు చెప్పేవాడైపోయాడా?”, అంటూ పుల్లవిరుపు, నొసటివిరుపు విద్యలు ప్రదర్శించేవారికి – షరా మామూలుగా – మౌనమే నా సమాధానం. (మళ్లీ ఫ్లాష్‌బాక్: ‘కథాయణం‘ రాసినప్పుడూ ఇదే ఆక్షేపం. అప్పుడూ అదే సమాధానం. ఇలాంటివన్నీ పట్టించుకుంటే ముందుకెళ్లలేం) అదీ కాక – నూరో నూటయాభయ్యో సినిమాలు తీసిన వాళ్లకి నాణ్యమైన నోబడ్జెట్ లఘుచిత్రాలు ఎలా తీయాలో నేర్పే తీరికుండదు. కనుక, పిల్లి మెడలో గంట మనలాంటి మామూలోళ్లే కట్టాలి.

కాబట్టి – ఇకనుండి కొద్దివారాల పాటు నా ఫేస్‌బుక్ గోడ మీదనూ, నా బ్లాగ్‌లోనూ – ‘సినిమాయణం’ పరంపరలో కొన్ని వ్యాసాలు వెలువడతాయి. ఇవి చదివేసి అందరూ హాలీవుడ్ సినిమాలు తీసేయగలుగుతారని కాదు. ఆ స్థాయి పరిజ్ఞానం నాకు లేదు. వీటి పరమార్ధం – ఖర్చులేకుండానే నాణ్యమైన లఘుచిత్రాలు ఎలా తీయొచ్చో నా అనుభవంలోంచి ఉదాహరణపూర్వకంగా చెప్పటం. అంతే.

ఈ వ్యాసాలు లంబోదర లకుమికరా అంటూ సరిగమల్లో అడుగులేయించే పిళ్ళారి గీతాలు కాదు. నడక నేర్పటం నా పని కాదు. వచ్చిన నడకకి వయ్యారాలు అద్దటమెలాగో చెప్పటమే వీటి లక్ష్యం. ఇవి చదివేసి అంతా ఎడాపెడా లఘుచిత్రాలు తీసిపారేయగలుగుతారని నేను హామీ ఇవ్వను. సినిమాకి సంబంధిచిన సాంకేతికాంశాలపై ఎంతోకొంత అవగాహనుండి – నాణ్యమైన శూన్యవ్యయ లఘుచిత్రాలు ఎలా తీయాలో తెలీక తికమక పడే వారికి మాత్రమే ఇవి ఉపకరిస్తాయి. ‘నాణ్యత’ అనేది ఇక్కడ నొక్కివక్కాణించవలసిన పదం.

ఇంతకీ ‘నాణ్యత’ అంటే ఏంటి? అది శుద్ధం కాదు; సాపేక్షం. ఒకరికి నాణ్యంగా కనిపించింది మరొకరికి నాసిరకంగా అనిపించొచ్చు. కాబట్టి నాణ్యత అంటే ఏంటనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే. దానికి నేను నిర్వచనాలీయబోవటం లేదు.

అదొదిలేస్తే – ‘శూన్యవ్యయ’ (అచ్చతెలుగులో జీరో బడ్జెట్టు) అనగానేమి? దీనికి నా నిర్వచనం ఏమిటంటే – నిర్మాణానికి, నటీనటులకి, హంగులకి, ఆర్భాటాలకి, పరిసరాలకి, పరికరాలకి, తదితరాలకి, ఇత్యాదికి, వగైరాకి, మున్నగువాటికి, ఎట్‌సెటరాకి ఎటువంటి ఖర్చు చేయకుండా పని పూర్తిచేసుకోవటం. (కొన్ని one time expenses ఉండొచ్చు. వాటి సంగతి కింద చూద్దాం)

అయితే – ఏమీ ఖర్చుచేయకుండా ఇవన్నీ ఎలా సాధ్యపడతాయి? ఉదాహరణకి – సినిమా తీయాలంటే ఏదున్నా లేకున్నా ఓ కెమెరా ఉండి తీరాలి కదా. అది కొనుక్కోటమో, అధమం అద్దెకి తెచ్చుకోవటమో చెయ్యాలి కదా. అది ఖర్చు కాదా? కాదు. ఎందుకంటే – మీకు నిఝంగా ఓ సినిమా తీయాలనే కోరికుంటే మీరు ఇప్పటికే కనీసం ఒక డిజిటల్ ఎస్సెల్లార్ మీద ఖర్చెట్టుంటారు (లేదంటే మీకు సినిమా తీసే కోరిక మరీ అంత బలంగా లేదని. ఈ వ్యాసాలు మీ కోసం కాదు)

ఇక – జీరోబడ్జెట్ సినిమా తీయాలంటే అవసరమైన పరికరాలు ఏమిటో చూద్దాం.

డిజిటల్ ఎస్సెల్లార్: బ్రాండ్ ఏదైనా ఫర్వాలేదు. ఇంటర్‌ఛేంజబుల్ లెన్సెస్ తరహా ఐతే మంచిది. రకరకాల లెన్సులు మీదగ్గర ఇప్పటికే ఉంటే మరీ మంచిది. లేకపోయినా ఓకే. 50 MM లెన్స్ ఒక్కటుంటే లాగించేయొచ్చు. (కన్స్యూమర్ గ్రేడ్ ఎస్సెల్లార్ కెమెరాలన్నీ అటూఇటూగా 15 – 85 MM రేంజ్ ఉండే జూమ్ లెన్స్‌తో వస్తాయి. అది సరిపోతుంది. మనకసలు జూమ్‌తో కూడా పనిలేదు. ఎందుకో తర్వాత చూద్దాం)

ట్రైపాడ్: ఇప్పటికే ఉంటే మంచిది. లేకపోయినా ఫర్వాలేదు.

మైక్: లఘు చిత్రాలకి సింక్ సౌండ్ (చిత్రీకరణ సమయంలోనే శబ్దగ్రహణం చేయటం) అనవసర ప్రయాస. ఇలాంటి చిత్రాలకి శుభ్రంగా పాత పద్ధతిలో పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో డబ్బింగ్ చెప్పుకోవటం మెరుగు. దాని కోసం ఖర్చు తక్కువలో దొరికే USB మైక్ ఏదైనా సరిపోతుంది. (ఒకవేళ ఖరీదైన మైక్ మీదగ్గర ఇప్పటికే ఉంటే సిగ్గుపడాల్సినవసరం లేదు)

ల్యాప్‌టాప్/డెస్క్‌టాప్: ఈ కాలంలో ఇవి లేని వాళ్లెవరు? కెమెరాలాగే ఇది కూడా తప్పనిసరి.

ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్: నాలుగైదు ఉచిత ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్లు అందుబాటులో ఉన్నాయి. నా దృష్టిలో అన్నిట్లోకీ డావించీ రిజాల్వ్ అత్యుత్తమమైనది. వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి.

లైటింగ్ సామాగ్రి: మనది నో-బడ్జెట్ సినిమా కాబట్టి లైటింగ్ సామాగ్రి కోసం ప్రత్యేకంగా ఏమీ ఖర్చుపెట్టం. మరైతే సినిమాలో దృశ్యానికి సంబంధించిన నాణ్యత చాలావరకూ లైటింగ్ మీదనే ఆధారపడి ఉంటుంది. మనకి అందుబాటులో ఉన్న సహజ వెలుతురు, సాధారణ బల్బులు, మరియు ఇతర వస్తువులతో మన సినిమాకి అవసరమైన ‘మూడ్’ ఎలా సృష్టించాలో – సందర్భం వచ్చినప్పుడు చూద్దాం.

తక్కిన సరంజామా: కొన్ని సందర్భాల్లో డాలీ షాట్స్ తీస్తే సినిమా మరో స్థాయిలో ఉంటుంది. కానీ వాటికోసం డాలీ, ట్రాక్స్ అవసరం. కానీ మనది జీరో బడ్జెట్ సినిమా కాబట్టి, అవసరమైనప్పుడు, కెమెరా చేత్తోనే పట్టుకుని డాలీ షాట్స్ ఎలా తీయాలో చూద్దాం. అలాగే క్రేన్లు, డ్రోన్లు గట్రా మనకి అందుబాటులో ఉండేవి కాదు కాబట్టి అలాంటి షాట్స్ గురించి మర్చిపోవటం మంచిది. కథ ఆకట్టుకునేలా ‘చూపటానికి’ విభిన్న కోణాల్లో తీసే షాట్స్ ఉపయోగపడతాయి కానీ, మనం గుర్తుంచుకోవలసిందేమిటంటే – ప్రతి షాట్‌నీ ఒకటికి మించిన కోణాల్లో చిత్రీకరించొచ్చు. తెలివితేటలు ఉపయోగిస్తే డాలీలు, డ్రోన్లు, క్రేన్లకి సరితూగే effect మామూలు షాట్లతోనే సాధించొచ్చు.

ఒక విషయం. “డిజిటల్ ఎస్సెల్లారే ఎందుకు? కెమెరా ఫోన్‌తో తీయకూడదా సినిమా?”, అనొచ్చు మీరు. తీయొచ్చు. కానీ ఫోన్ కెమెరాలకి పరిమితులెక్కువ – షాలో ఫోకస్ వంటివి కుదరవు. అలాగే షటర్ స్పీడ్, అపర్చర్ వంటివి మన చేతిలో ఉండవు. దానా దీనా, ఫోన్‌తో తీసే సినిమా ‘వీడియో’ లాగా ఉంటుందే తప్ప ‘సినిమా’ లాగా ఉండదు. (ఆ రెండిటికీ తేడా ఏంటో తర్వాత వివరంగా చూద్దాం). కాబట్టి మీ సినిమా ‘సినిమా’లా కనిపించాలంటే కనీసం ఓ డిఎస్ఎల్ఆర్ తప్పనిసరి.

దీంతో ఉపోద్ఘాతానికి స్వస్తి. వచ్చే భాగం నుండి అసలు ‘సినిమాయణం’లోకి దూకుదాం. ఆ పరంపరలో మొట్టమొదటగా రాబోయే వ్యాసం, ‘కథకళి’.

ఈలోపు వీలైతే మరోసారి ‘The Boogeyman‘ చూసేయండి. ఎందుకంటే, నా వ్యాసాల్లో తరచుగా ఈ లఘుచిత్రం నుండి ఉటంకింపులుంటాయి. ఫలానా షాట్ ఎందుకని ఈ ఫలానా విధంగానే తీశాను, ఆ ఫలానా విధంగా ఎందుక్కాదు; ఆ సందర్భంలో నాకెదురైన పరిమితులేంటి, వాటినెలా అధిగమించాను – ఇలాంటివన్న మాట.

0 స్పందనలు to “సినిమాయణం – 0: నాణెశూన్యంనుండి నాణ్యం”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: