ఫిబ్రవరి, 2017ను భద్రపఱచునాకు మెంటల్

 

“నాకు మెంటల్” – తెలుగు సినిమా స్టోరీ

(ఫస్ట్ డ్రాఫ్ట్)

(… on second thoughts, this is also the final draft. It can’t get any better. I mean, come on. How can it?)


హీరో యాజ్ యూజువల్‌గా నలుగురు చిల్లర నేస్తాల్ని వెంటేసుకుని దార్లెమ్మట కూలిన గోడల మీదా, బెంచీల మీదా, చెట్ల కిందా, బైకుల పైనా హఠమేసి సిగరెట్లు ఊదేస్తూ కాలక్షేపం చేస్తూంటాడు. హీరో తండ్రికి – అప్పుడెప్పుడో ఉద్యోగమేదో వెలగబెడుతుండగా ప్రమాదమేదో జరిగి కాళ్లు పోయాయి. ఆ కాళ్లు మళ్లీ ఎప్పుడు ఎలా మొలుచుకొచ్చాయో తెలీదు కానీ ఆయన ఏ పనీ చెయ్యకుండా హాయిగా నడిచేస్తూ, పాటల్లో కొడుకుతో చిందులేస్తూ, అప్పుడప్పుడూ కొడుకు సిగరెట్ పంచుకుని పీల్చేస్తూ, కొడుకుగారికి నచ్చిన అమ్మాయి వెంటపడి వేధించి ఎలాగోలా తనని ‘మామయ్యా’ అని పిలిపించమని దీవించేస్తూ బతికేస్తూంటాడు. హీరో తల్లి – ఉద్యోగమేదో చేస్తూ ఈ తండ్రీ కొడుకులిద్దర్నీ పోషిస్తూ తరించేస్తూంటుంది. ఈ ముగ్గురూ ఓ పాత డొక్కు కొంపలో ఎలాంటి బాదరబందీలు, బాధలు, భయాలు, భవిష్యత్తుపై ఆశలు, కోరికలు, కోపతాపాలు, లక్ష్యాలు, లంపటాలు లేకుండా నిర్లక్ష్యంగా, సంతోషంగా బతికేస్తూంటారు. ఇది మన వీరోగారి వీర హ్యాపీ ఫామిలీ.

కొడుగ్గారు – అదే మన వీరో – మార్చ్, సెప్టెంబర్ మధ్య గిరికీలు కొడుతూ, కాపీలు కొడుతూ, అదీ సరిగా చేతనవక పోతే – హీరో పీడ ఎలాగోలా వదిలించుకుందామనుకున్న ఓ వెర్రి లెక్చరర్ పుణ్యాన పరీక్షల్లో బట్టకట్టి ఇంజనీరింగ్ పట్టభద్రుడౌతాడు. అప్పుడొక పాట.

పాటయ్యాక ఇకపై ఏంచేద్దామని ఆలోచిద్దామా అని తర్జనభర్జన పడబోతూండగా, ఆ అవసరం రానీకుండా ఓ అందమైన అమ్మాయి – అదే మన వీరోయిన్ – ఎదురవటం, మనోడు ఆమెని ప్రేమించేయాలని డిసైడైపోటం వెంటవెంటనే జరిగిపోతాయి. ఈవిడ ఇందాకటి లెక్చరర్‌ పుత్రిక. (నోట్ టు మైసెల్ఫ్: ఇదెంత గొప్ప ట్విస్టంటే – ప్రేక్షకులు ఈ సంగతి ముందస్తుగా పసిగట్టలేరన్న మాట. వాళ్ల మొహాలకి అంత సీను లేదు). ఈ లెక్చరర్ పెద్ద వెర్రిబాగులోడు. కూతుర్ని సంప్రదాయబద్ధంగా పెంచి, విద్యాబుద్ధులూ గట్రా నేర్పించి, ఆ పిల్లని చక్కగా చూసుకునే కుర్రోడినొకడిని చూసి పెళ్లి చేద్దామనుకునేంత పిచ్చోడు. రోజుకో కేస్ బీర్లు తాగటం, గంటకో పెట్టె సిగరెట్లూదటం, పరీక్షలు తప్పటం, బేకారీగా తిరగటం, అమ్మాయిల వెంటపడటమే పరమార్ధంగా జీవించటం – ఇలాంటి ఆధునాతన ఆదర్శాలున్న కుర్రాళ్లని అర్ధం చేసుకోలేని పురాతన భావాల సనాతనవాది ఈ లెక్చరర్.

ఇహబోతే వీరోయిన్. ఈ పిల్లకి తన తండ్రంటే పిచ్చపిచ్చ ప్రేమ. ఎవరన్నా కదిలిస్తే “నాన్నంటే నేను వారానికోమారు పోసుకునే తలంటు” వగైరా ఆణిముత్యాల్లాంటి వాక్యాలతో ఆ ప్రేమ వ్యక్తం చేస్తూంటూంది. ఇంకా, అదేదో కాలేజీలో ఎంబీయే కూడా చదువుతూంటూంది. ఈ కూపీ అంతా లాగాక వీరో ఊరుకుంటాడా? కోడు. తానూ వేంఠనే అదే కాలేజీలో, అదే కలాసులో, ఆమె పక్క సీటే సంపాయించేస్తాడు. (కళా దర్శకుడికి స్పెషల్ నోట్: ఆ కాలేజీలో ఎప్పుడుబడితే అప్పుడు ఎవడుబడితే వాడు ఎక్కడబడితే అక్కడ చేరిపోటం ఎలా కుదుర్తుందనే చచ్చు ప్రశ్న ఎవడికీ రాకుండా కొన్ని సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయనేదానికి సింబాలిక్‌గా క్లాసురూములో అక్కడోటీ ఇక్కడోటీ ఖాళీ కుర్చీలు ఉంచవలెను)

సరే. వీరోకి చదువు గురించిన టెన్షన్ ఎటూ లేదు. పిల్ల మీదనే అటెన్షన్ అంతా. (ఇంకో నోట్ టు మైసెల్ఫ్: హీరోకి శ్రద్ధాసక్తులున్నట్లు ఎస్టాబ్లిష్ చెయ్యటం ముఖ్యం. లేకపోతే ప్రేక్షకుల్లోని కుర్రకారు మీద చెడు ప్రభావం కలిగే ప్రమాదముంది. సినిమా ఎంత వ్యాపారమైనా, దర్శకుడిగా నాకు కాస్తైనా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి). హీరోయిన్ని శ్రద్ధగా వేధిస్తూ, వెంటబడి పాటలు పాడేస్తూ, అప్పుడప్పుడూ పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టంలో కాలేజి మొత్తం వినేలా ఆమెకి ప్రేమలేఖలు చదువుతూ, ఆమెనేదో చిన్న కామెంట్ చేసిన ఆకురౌడీలని చావబాది చెవులు మూసి తన హీరోధాత్తత చూపిస్తూ – అలా రోజులు నెట్టుకొస్తూండగా – కథలో రెండో ట్విస్ట్.

అదేంటంటే – మన వీరోయిన్‌పై ఎప్పుడో మనసు పారేసుకున్న మరో కుర్రాడున్నాడు. వాడొత్తి వెధవ. ఎంత వెధవంటే – ఆ పిల్ల తండ్రిని మెప్పించటానికి నాలుగేళ్ల పాటు ఎటో వెళ్లిపోయి కనాకష్టాలు పడి చదువూ సంధ్యా నేర్చుకుని ఇంకా కనాకష్టాలు పడి సబిన్‌స్పెక్టర్ ఉద్యోగం సంపాదించి ఇంకింకా కనాకష్టాలు పడి అదే ఊర్లో పోస్టింగ్ సంపాదించుకుని వచ్చేంత వెధవ.

ఇంత పెద్ద వెధవకి, మన మంచి వీరోకి పోటీ. ఎవరికి వీరోయిన్ ఓకే చెప్పుద్దోననే టెన్షన్ ప్రేక్షకులకి. (మూడో నోట్ టు మైసెల్ఫ్: అఫ్‌కోర్స్, చివరికి వీరోకే చెప్పుద్ది. అయినా ప్రేక్షకులు ప్రాణాలుగ్గబెట్టుకుని సినిమా చూస్తారు, ఏమీ ఎరగనట్టు. అది గ్యారంటీ) వీరోయిన్ మనసు గెలవటానికి ఎస్సై వెధవ పడే అష్టకష్టాలతో సినిమా రెండో సగం నింపుతాం. మన వీరోకి మాత్రం అలాంటి తిప్పలేం ఉండవ్. (ఒన్ మోర్ నోట్ టు మైసెల్ఫ్: చివర్లో “బతకటానికి ప్రేమ చాలు. డబ్బులెందుకు?” అని ఓ చాంతాడు డవిలాగు లాగిస్తే సరి. మొత్తం లెక్కసరై పోద్ది. ఈ ఒక్క డవిలాగు కోసమే రిపీట్ ప్రేక్షకులొస్తారు)

చివరాకర్లో ముచ్చటగా మూడో ట్విస్టు. (చివరాకరి నోట్ టు మైసెల్ఫ్: మెడకాయ మీద తలకాయున్న ప్రేక్షకుడెవడన్నా ఈ ట్విస్టుని ముందే పసిగట్టేస్తాడు కానీ వాళ్లకి తలకాయలు లేవోచ్)


సీక్రెట్ నోట్స్ టు మైసెల్ఫ్:

  1. ఓవర్సీసు ఆడియెన్స్ మీద ఎక్కువ బిజినెస్ జరుగుద్దనీ, టేబుల్ ప్రాఫిట్స్ వచ్చేస్తాయనీ నమ్మకముంది కానీ ఎందుకైనా మంచిది, హీరోతో ఓవర్సీస్ – ముఖ్యంగా అమెరికాలో – ప్రీమియర్ షోలకి అటెండయ్యేట్టు ముందే ఒప్పందం కుదుర్చుకోవాలి. హీరోలూ హీరోయిన్లతో సెల్ఫీ ఛాన్సుంటే చాలీ ఎన్నారైలు సినిమా ఎట్టాగున్నా చూసేస్తారు
  2. టొబాకో కంపెనీలూ, బ్రూవరీలూ ప్రొడక్షన్ కాస్టులో ఎంత వాటా తీసుకుంటాయో బేరమాడాలి. దాన్నిబట్టి అవసరమైతే హీరోయే కాక హీరోయిను కూడా దమ్ము కొట్టే సీన్లూ, మందు కొట్టే సీన్లూ కలపాలి స్క్రిప్టులో.

ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.