నల్ థింకింగ్

రేషనల్ థింకింగ్ అనేదొకటుంది. ఏం చదివినా, ఎంత చదివినా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, అది అందరికీ ఒంటబట్టదని అర్ధమయ్యే సందర్భాలు అప్పుడప్పుడూ ఎదురవుతుంటాయి. అటువంటిదే ఓ తాజా ఉదంతం.

శాన్ ఫ్రాన్సిస్కో తీరప్రాంత పరిసరాల్లో దేశీ-1170 ఏఎమ్ అనే రేడియో స్టేషన్ ఒహటుంది. ఇందులో ప్రతి సాయంత్రం ఏడు నుండి ఎనిమిది గంటలవరకూ ‘విరిజల్లు’ పేరుతో ఓ తెలుగు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. అందులో సినిమాల కబుర్లు, క్విజ్‌లు, అంత్యాక్షరి పోటీలు గట్రా ప్రసారమవుతుంటాయి సాధారణంగా. ప్రోగ్రామ్ ఏదైనా అన్నిట్లోనూ శ్రోతలు ఫోన్ ద్వారా పాల్గొనే వీలు మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. కార్లో డ్రైవ్ చేస్తూ రేడియో స్టేషన్లు మారుస్తుండగా, ‘విరిజల్లు’లో గత వారం యధాలాపంగా నా చెవినబడ్డ సంభాషణ, ఈ క్రింద యధాతధంగా.

* * * *

వ్యాఖ్యాత: ఈ రోజు కార్యక్రమం ఊహాతీతంగా, నమ్మశక్యం కాని మలుపులు తిరుగుతూ సాగిపోతుంది. ఇందులో మిమ్మల్ని ‘సంగీతం’ నేపధ్యంలో కొన్ని ప్రశ్నలడుగుతాం. సరైన సమాధానం చెప్పిన శ్రోతల్లో ఒకరికి ఫలానా సూపర్‌హిట్ సినిమాకి టికెట్లు ఇస్తాం.

నా స్వగతం: క్విజ్‌లో ఊహాతీత మలుపులేంటో! ఇంతకీ ఆ ఫలానా సినిమా అట్టర్ ఫ్లాప్ కదా. సూపర్ హిట్ అంటాడేంటి చెప్మా?

వ్యాఖ్యాత: మొదటి ప్రశ్న. ప్రపంచంలో అతి పురాతనమైన సంగీత పరికరం ఏది? అదిగో మొదటి ఫోన్ వస్తుంది. హలో. ఎవరండీ? నా ప్రశ్నకి సరైన సమాధానం తెలుసా?

శ్రోత 1: వేణువు.

వ్యాఖ్యాత: ఎలా తెలుసు?

శ్రోత 1: మరేమో, అది శ్రీకృష్ణుడి చేతిలో ఉంటుంది కదా. అందుకని.

వ్యాఖ్యాత: భలే. మరో మూడు కాల్స్ తీసుకున్నాక సమాధానం అనౌన్స్ చేస్తాను. హలో. ఎవరండీ?

శ్రోత 2: ఇందాకటి శ్రోత వేణువు అన్నారు. అది తప్పు. నారదుడు శ్రీకృష్ణుడికన్నా ముందటి వాడు కదా. ఆయన చేతిలో వీణ ఉంటుంది. కాబట్టి అదే ప్రపంచంలో అతి పురాతన వాద్య పరికరం.

వ్యాఖ్యాత: సరేనండీ. మరో రెండు కాల్స్ తీసుకుని చెబుతాను. వింటూ ఉనండి. హలో?

శ్రోత 3: నారదుడి చేతిలో ఉండేది వీణ కాదు. తంబురా. అదే సరైన సమాధానం. అవునా?

వ్యాఖ్యాత: మరొక్క కాల్ తీసుకుని చెబుతాను. హలో, మీరెవరండీ?

శ్రోత 4: నారదుడికన్నా, తక్కిన దేవతలందరికన్నా ముందటివాడు ఆది దేవుడు. అదేనండీ, శివుడు. ఆయన వాయించేది ఢమరుకం. కాబట్టి అదే సరైన సమాధానం. సూపర్ హిట్ సినిమాకి టికెట్స్ ఎప్పుడు పంపిస్తారు?

వ్యాఖ్యాత: సారీ అండీ. సరైన సమాధానం ఢమరుకం కాదు. వేణువు.

శ్రోత 4: అదెలా? శ్రీకృష్ణుడు శివుడికన్నా ముందటివాడు కాదు కదా.

వ్యాఖ్యాత: కావచ్చు. కానీ నా ప్రశ్నకి సమాధానం పురాణ పాత్రల ఆధారంతో చెబితే ఎలా? ఆ మధ్య చైనాలో తవ్వకాల్లో బయటపడ్డ వేణువు రూపంలోని వాద్య పరికరాన్ని క్రీస్తు పూర్వం ముప్పై మూడు వేల సంవత్సరాల కిందటిదిగా ఆర్కియాలజిస్టులు గుర్తించారు. అదే అత్యంత పురాతన సంగీత పరికరం అని వాళ్ల అభిప్రాయం.

* * * *

అదీ సంగతి. మొదటి శ్రోత చెప్పిన సమాధానమే సరైనది కావటం యాధృచ్ఛికం. ఈ సంభాషణ వింటున్నంతసేపూ నా బుర్ర గిర్రున తిరిగింది. సరైన సమాధానం చెప్పారా లేరా అన్నది సమస్య కాదు. ఫోన్ చేసిన నలుగురు శ్రోతల్లో ఒక్కరూ హేతుబద్ధంగా ఆలోచించకుండా పురాణాల మీద ఆధారపడటం వింత. కనీసం మనకున్నట్లే ప్రపంచంలో ప్రతి సంస్కృతికీ తమవైన పురాణాలుంటాయని, వాటిలో కొన్ని మనకన్నా ప్రాచీనమైనవని, వాటిలోనూ సంగీత పరికరాల ప్రస్తావన ఉంటుందని తర్కబద్ధంగానైనా ఆలోచించగలగాలి కదా.

కొసమెరుపు: వ్యాఖ్యాత చెప్పిన ఊహాతీత మలుపు ఆయన సమాధానంలో ఎదురయింది. తవ్వకాల్లో సదరు వేణువు దొరికింది వ్యాఖ్యాత చెప్పినట్లు చైనాలో కాదు. జర్మనీలో!

హతవిధీ.

0 స్పందనలు to “నల్ థింకింగ్”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,132

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: