బిన్ లాడెన్ అంతంపై ఎవరేమన్నారంటే ….
హరీష్ రావు: ఇది ఆంధ్రోళ్ల కుట్ర.
కేసీయార్: నిజాం కన్నా గొప్పోడా లాడెన్? వాడి చచ్చుడి గురించి చర్చేంది? తెలంగాణ ఇస్తరో ఇయ్యరో తేల్చుండ్రి.
కోదండరామ్: పాకిస్తాన్‌కి చెప్పకుండా లాడెన్‌ని చంపటమంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలని అవమానించటమే. దీనికి నిరసనగా ట్యాంక్‌బండ్ మీద రెండువేల మందితో మిలియన్ మార్చ్ నిర్వహిస్తాం.
రాజ్ న్యూస్: ఆదివారం అర్ధరాత్రి ఫలానా సమయంలో ప్రసిద్ధ తీవ్రవాది లాడెన్ చచ్చిండు. ఆ విషయం అమెరికా అధ్యక్షులు శ్రీ ఒబామా గారు వెల్లడించిండ్రు. అది విని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు సంబరాలు జరుపుకుండ్రు.
ఉస్మానియా జాక్: ఇది తెలంగాణ విద్యార్ధుల తొలి విజయం.
జాక్ ఆఫ్ ఆల్ తెలంగాణ జాక్స్: లాడెన్ చచ్చుడయింది. తెలంగాణ ఇచ్చుడే మిగిలింది.
ఆంధ్రా జాక్: ఈ సందర్భంగా ఒబామాని అభినందిస్తూ ఆయనకి బిర్యానీ పొట్లాలు పార్సిల్ చేస్తున్నాం.
బాబు: బిన్ లాడెన్ అంతం రాష్ట్రంలో తెలుగుదేశం బలంగా ఉందనేదానికి సాక్ష్యం. ఉపఎన్నికల్లో గెలుపు మాదే.
జగన్: మా నాన్నే ఉండుంటే లాడెన్ ఎప్పుడో పోయుండేవాడు. ఇది ప్రభుత్వ అసమర్ధతే.
రాహుల్: లాడెన్ హతమవటం నిస్సందేహంగా మా నాయనమ్మ ఘనతే.
మన్మోహన్: సోనియానడిగి చెబుతా.
సోనియా: సీడబ్య్లూసీలో చర్చించాకే చెబుతాం.
శంకర్రావు: మీకెందుకు చెప్పాలి? అధిష్టానానికే లేఖ రాస్తా.
చిదంబరం: ఏం చెప్పాలో తేల్చటానికి జస్టిస్ శ్రీరామ కమిటీ వేశాం.
జస్టిస్ శ్రీరామ: లాడెన్ మద్దతుదారులు, వ్యతిరేకులు అందరూ సంతోషించేలా మా ప్రకటన ఉంటుంది.
లాయర్ సన్యాసిరావు: ప్రభుత్వం వెంటనే ఏదో ఒకటి చెప్పాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిల్ వేస్తున్నా.
సుప్రీం కోర్టు: ‘పిల్లులంటే అంత చులకనయ్యాయా’ అని లాయర్ సన్యాసిరావుకి అక్షింతలు వేస్తున్నాం.
బీజేపీ: ముస్లిముల ఓట్లు పోతాయనే కాంగ్రెస్ ఎటూ చెప్పకుండా నానుస్తుంది. ఈ ప్రభుత్వమ్మీద అవిశ్వాస తీర్మానం పెడతాం.
జేపీ: ఆటగాళ్లు మారితే లాభం లేదు. ఆట నియమాలు మారాలి. వ్యవస్థ మారాలి. మీరు మారాలి. నేను మారాలి. మనందరం మారాలి. మిగతావాళ్లూ మారాలి. అప్పుడు మార్పు దానంతటదే వస్తుంది.
కంనిష్టులు: సోవియెట్లని తిప్పలు పెట్టిన ఒసామా పోయినందుకు సంతోషిస్తూ, అమెరికాని అల్లాడించిన లాడెన్ పోయినందుకు విచారిస్తున్నాం.
ఒబామా: మరే, లాడెన్‌ని లేపేశాగా. వచ్చే ఎన్నికల్లో మీ ఓటు నాకే వెయ్యాలేం?
జర్దారీ: అర్రె. లాడెన్ అమెరికాలో దాక్కున్నాడనుకున్నాం. ఇక్కడున్నాడా!
గిలానీ: అర్రెర్రె. ఇతనా లాడెన్? రోజూ నాతో టీ తాగటానికొస్తాడు. ఇతనే లాడెన్ అంటే నమ్మలేకున్నా!!
పాక్ సైన్యం: అమెరికన్లు మాకీ దాడి సమాచారం ముందే అందించుంటే (లాడెన్‌కి) మరింత సహకరించుండేవాళ్లం.
రామ్ గోపాల్ వర్మ: బిన్ లాడెన్ ఎవరు?
రాజశేఖర్: నానూ, జీవిదా డెమొగ్రడిగ్ పార్టీలో జాయినయ్యే విషయం ఒబామాతో డిస్కస్ సేసేటప్పుడే ఇంద న్యూస్ తెలిసినాది. అపురమా, ఇరువురం ఒబామాకి కంగ్రాట్స్ సెప్పేసి, మరుపడియం కల్సుదామని సెప్పేసి వచ్చి పూడ్సినాం.
చిరంజీవి: అల్ ఖైదా ప్రతీకార దాడులకి దిగుతుందని అమెరికా భయపడనవసరం లేదు. అవసరమైతే నేను మద్దతిచ్చి ఆదుకుంటా.
పోసాని: నేను ప్రధాన పాత్రలో ‘మెంటల్ లాడెన్’ సినిమా తీస్తున్నా.
కల్యాణ్ రామ్: నేను కూడా అదే సినిమా తీస్తున్నా. పేరు ‘కల్యాణ్‌రామ్ మెంటల్ లాడెన్’
ఉపేంద్ర: నేనూ అదే పాత్రలో నటిస్తూ సినిమా తీస్తున్నా. ఇందులో విశేషం ఏంటంటే, ఈ సినిమాలో నేనొక్కడ్నే ఉంటా కానీ నేనెక్కడా కనపడను. ప్రపంచంలో ఇలాంటి ప్రయోగం ఎవరూ చెయ్యలేదు.
బాలకృష్ణ: నాన్సెన్స్. లాడెన్‌ని అమెరికా మట్టుపెట్టటమేంటి? రామకృష్ణ, మోహనకృష్ణ, జయకృష్ణ, హరికృష్ణ, సాయికృష్ణ, శంకరకృష్ణ .. అహ .. ఇలా అరడజనుమంది కృష్ణలు పుట్టీ పుట్టగానే మట్టి తినటం మొదలెట్టితే అది చూసి తట్టుకోలేని మానాన్న ఈ సారి పుట్టేవాడు మట్టి తినిపించేవాడూ, మట్టి కరిపించేవాడూ కావాలే తప్ప మట్టి తినేవాడు కాకూడదని పెట్టాడురా నా పేరు బా….లకృష్ణ అనీ. అహ. మట్టి కరిపించినా మేమే, మట్టుపెట్టినా మేమే. మైండిట్.
మార్తాండ: మొన్న కలిసినప్పుడు రంగనాయకమ్మ పుస్తకాలిచ్చి చదవమన్నాను. చదవలేదు. అందుకే దిక్కులేని చావు చచ్చాడు.
మీ మాట