పుచ్చకాయ – ఓ సచ్చినోడి లవ్ స్టోరీ

(సంవత్సరం క్రితం)

ఉడుత, మృగవీర వంటి హిట్ సినిమాల తర్వాత యువనటుడు జిగాస్టార్ రాజ్ కిరణ్ తేమ్ నటిస్తున్న మూడవ సినిమా ఈ రోజు మిట్టమధ్యాహ్నం అట్టహాసంగా ఆస్ట్రేలియాలో ప్రారంభమయింది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు వెల్లడించటానికి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్మాత యోగేంద్రబాబు మాట్లాడుతూ ‘అన్నయ్యతో చెప్పుకోదగ్గ హిట్ సినిమా తీయలేకపోయిన లోటు ఈ సినిమాతోనైనా తీరుతుందేమో’ అన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పుడే షాట్ గ్యాప్‌లో అటుగా వచ్చిన కిరణ్ తేమ్ పళ్లు పటపటలాడిస్తూ కెమెరాలోకి మొహం పెట్టి కళ్లెర్రజేసి చూస్తూ ‘బాబాయ్ కోరిక కనీసం నేనైనా తీర్చి తీరాలన్న కసితో ఈ సినిమా చేస్తున్నా’ అంటూ, తర్వాతి షాట్‌కి పిలుపు రావటంతో వడివడిగా వెళ్లిపోయారు. ఆ పిదప విలేకరుల ప్రశ్నలకు యోగేంద్రబాబు విపులంగా సమాధానాలిచ్చారు.

తెలుగులో యువదర్శకులెందరో ఉండగా తాజాగా గొరుగు వంటి కళాఖండం తీసి నిర్మాత గుండె రాజుకి నిండు క్షవరం చేసిపెట్టిన తమిళ తంబి తుస్‌కారన్‌ని ఏరికోరి ఈ సినిమాకి దర్శకుడిగా ఎంచుకోవటానికి కారణమేమై ఉంటుందని ఆరాతీసిన పాత్రికేయులకి ఆయన ‘ఒక్క ఫ్లాప్‌తో దర్శకుడి సత్తాకి వెలకట్టలేం. తుస్‌కారన్ గుండె రాజుకి గుండు గొరగక ముందు కునారిల్లుతో బాక్సాఫీసు బూజు దులిపిన విషయం అప్పుడే మర్చిపోతే ఎలా’ అని గుర్తు చేశారు. తానెప్పుడూ దర్శకుల నిర్మాతననీ, అందుకే కేవలం దర్శకుడి మీద ఉన్న నమ్మకంతోనే కథ పేరు మాత్రమే విని ఈ సినిమా నిర్మించటానికి ముందుకొచ్చానని యోగేంద్రబాబు అన్నారు.

ఆ తర్వాత చర్చ తాజా చిత్రం టైటిల్ మీదకి మళ్లింది. ‘అనేక పేర్లు పరిశీలించిన తర్వాత మా దర్శకుడు చెప్పిన కథకి పుచ్చకాయ అనే పేరైతే అన్నివిధాలా సరిపోతుందని ఆ పేరే ఖాయం చేశామని యోగబాబు చెప్పారు. ‘పేరు మాత్రమే విని నిర్మించటానికి ముందుకొచ్చాను’ అన్నవాక్యానికీ, దీనికీ పొంతన కుదరక తికమక పడ్డ ఒకానొక పాత్రికేయుని ప్రశ్నకి ఆయన సమాధానం దాటవేశారు. ఇందులో హీరో పాత్ర పేరు సచిన్ కావటంతోనూ, ఇదో భిన్నమైన ప్రేమ కథ కావటంతోనూ ఈ సినిమాకి ఉప శీర్షికగా ఓ సచ్చినోడి లవ్ స్టోరీ అనేది యాప్ట్‌గా ఉంటుందని అదే నిర్ణయించామన్నారు. ట్యాగ్‌లైన్‌నిబట్టి చూస్తే ఈ సినిమాలో కథానాయకుడు రికామీగా తిరిగే కుర్రాడై ఉంటాడని తెలుస్తుంది. మరి ‘మృగవీర’ ద్వారా కిరణ్ బాబుకి వచ్చిపడ్డ ఇమేజ్‌కి ఈ తరహా పాత్ర సరిపోతుందా అన్న ప్రశ్నకి నిర్మాత స్పందిస్తూ ‘అన్ని రకాల పాత్రలూ తోమితేనే నేనీనాడు ఇంతవాడినయ్యాను అని అన్నయ్య ఎప్పుడూ చెబుతుంటారు. ఆయన చూపిన బాటలోనే చిన్నారి కిరణ్ కూడా నడవాలనుకుంటున్నాడు. అందుకే తుస్‌కారన్ చెప్పిన ఈ ప్రేమకథ వినకుండానే ఒప్పుకున్నాడు’ అని విశదీకరించారు. ఇదే సందర్భంగా ఆయన ‘ఇందులో కిరణ్‌బాబు రికామీయే కాదు, బికారీ కూడా. అదే ఈ సినిమాలో విభిన్నత’ అని వెల్లడించారు. పుచ్చకాయ బడ్జెట్ పాతికకోట్ల పైమాటే అని వస్తున్న వదంతుల్ని ఉటంకిస్తూ ‘పేదవాడి ప్రేమకథకి పాతిక కోట్లా?’ అని ఓ పాత్రికేయుడు అడగ్గా ఆయన ‘మృగవీర వంటి సినిమా తర్వాత వస్తున్న కిరణ్‌బాబు సినిమా మీద మా జిగా ఫేమిలీ అభిమానుల్లో ఉండే అంచనాలే వేరు. అవందుకోవాలంటే ఆ మాత్రం ఖర్చుండాల్సిందే. అందుకే ఎంత ఖర్చైనా వెనుకాడకుండా సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తాం’ అని వివరించారు. ఆస్ట్రేలియాలో మాత్రమే కాకుండా కథానుసారం అంగారక గ్రహమ్మీద కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నామని ఓ అనుబంధ ప్రశ్నకి బదులుగా చెప్పారు. అంతటితో పాత్రికేయ సమావేశం ముగిసింది.

అంబలి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత యోగేంద్రబాబు సమర్పిస్తున్న పుచ్చకాయకి దర్శకత్వం తుస్‌కారన్. రాజ్ కిరణ్ తేమ్ మూడవ సినిమాగా భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయికగా కుమారి తింగరి బుచ్చి నటిస్తుండగా, హాస్యనటుడు పరమానందం ఓ ప్రధాన పాత్ర ధరిస్తున్నారు. ఆస్ట్రేలియాలోనూ, అంగారక గ్రహమ్మీదా ఆఘమేఘాల మీద షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలో మీ ముందుకు రానుంది.

(ప్రస్తుతం)

ఏడాది పైగా నిరవధికంగా షూటింగ్ జరుపుకుని ఎట్టకేలకి ఈ మధ్యనే విడుదలైన పుచ్చకాయ బాక్సాఫీసు వద్ద బుడగలా పగిలిపోయిన నేపధ్యంలో, ఆ సినిమా అందించిన అనుభవాన్ని గూర్చి ప్రశ్నించిన విలేకర్లతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ దర్శకుడు తుస్‌కారన్ మీద తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నిర్మాత యోగబాబు. రామజౌళి రూపొందిస్తున్న ‘దోమ’ ప్రారంభ వేడుకల్లో పాలుపంచుకోవటానికి విచ్చేసిన ఆయన తుస్‌కారన్‌ని కడిగిపారేశారు. కనీసం కథేమిటో చెప్పకుండానే తననీ, తమ హీరో కిరణ్‌తేమ్‌నీ దర్శకుడు ఎలా బురిడీ కొట్టించిందీ ఆయన పూసగుచ్చినట్లు వివరించారు. ఓ పేదవాడి ప్రేమకథని సినిమాగా తీయటానికి పాతిక కోట్లు ఖర్చెందుకవుతుందని దర్శకుడిని నిలదీశారు. కథకి ఏ మాత్రం సంబంధం లేకపోయినా ఆస్ట్రేలియాలోనూ, అంగారకుడి మీదా షూటింగ్ చేయించటాన్ని యోగబాబు తీవ్రంగా అధిక్షేపించారు. దర్శకుల మితిమీరిన ధోరణులే తెలుగు సినిమారంగాన్ని నిలువునా ముంచుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరమానందం వంటి ప్రతిభావంతుడిని జఫ్ఫాశాస్త్రిగా రొడ్డకొట్టుడు పాత్రలో చూపించటం దర్శకుడి చేతగానిదనానికి నిలువెత్తు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. తెరమీదా, తెర వెనుకా కథానాయిక కుమారి తింగరి బుచ్చి ప్రదర్శించిన విన్యాసాలు కూడా సినిమా పరాజయానికి పరోక్షంగా కారణభూతాలయ్యాయని ఆయన చెప్పారు. పిచ్చాపాటీ ముగిస్తూ, సినిమా ఎలా ఉన్నా కిరణ్ తేమ్ నటన మాత్రం ప్రేక్షకుల మతులు పోగొడుతున్న విషయం మరోమారు గుర్తు చేశారు.

 

 

33 స్పందనలు to “పుచ్చకాయ – ఓ సచ్చినోడి లవ్ స్టోరీ”


 1. 1 Giridhar Duggirala 5:22 సా. వద్ద డిసెంబర్ 9, 2010

  Pucchakaaya LOL… Mee allochanaki Johaarlu…
  Chaalaa rojulu ayyindi meeru raasi.
  And as usual chaala baagundi..

 2. 2 a2zdreams 6:48 సా. వద్ద డిసెంబర్ 9, 2010

  అక్షరాలను ఆడుకుంటూ వెటకారం చేస్తూ విమర్శలు చేయడంలో మీ తెలుగుదేశం వాళ్ళని ఎవరూ కొట్టలేరని మరోసారి ఫ్రూవ్ చేశారు. great work sir !

  • 3 పగటికలలవీరుడు 4:06 ఉద. వద్ద డిసెంబర్ 10, 2010

   మీరు చరణ్ మెగా అభిమాని అని తెలుస్తుంది గానీ…
   ఆ సినిమా మీకు కొత్తగా అనిపించి ఉండవచ్చు గానీ.. మాలాంటి వాళ్ళకు మాత్రం చెత్తగా అనిపించింది..
   ఎంతసేపూ మెగా ఫ్యామిలీని మోయడం తప్ప వేరే పనిలేదు కాబట్టి పోయి అలాగే ఊరేగండి…

 3. 5 Anuradha 8:55 సా. వద్ద డిసెంబర్ 9, 2010

  చాలా బాగుంది.నటన మాత్రమేనా,అవతారం కూడా…ఉడుత నుంచి మతులు పోగొడుతూనే ఉంది.

 4. 6 Praveen Sarma 9:46 సా. వద్ద డిసెంబర్ 9, 2010

  కోడి గుడ్డు మీద వెంట్రుకలు ఏరడం ఎందుకు? అసలు విషయానికి రండి. ఆ సినిమా నిర్మాత టీ కాచుకోవడానికి గంధపు చెక్కలు కాల్చినట్టు స్టోరీని ఆస్ట్రేలియాలో తీసి బడ్జెట్ పెంచుకున్నాడు. ఖలేజా సినిమాలాగ రాజస్థాన్‌లో తీసినా అంత ఖర్చు అయ్యేది కాదేమో. పల్లెటూరిలో తీస్తే రొటీన్ స్టోరీలా ఉంటుందనుకుంటారు. నిజమే కానీ ఈ స్టోరీకి ఆస్ట్రేలియా వరకు వెళ్లడం ఎందుకు? సినిమా బాగానే ఉంది కానీ నిర్మాతా, దర్శకులు కథ మీద కంటే హంగుల మీద శ్రద్ధ పెట్టారు. అందుకే నిర్మాతకి అప్పులు మిగిలాయి.

 5. 7 సుజాత 9:51 సా. వద్ద డిసెంబర్ 9, 2010

  మీ ఇష్టైల్లో ఒచ్చేసినారా, రాండ్రాండి!

 6. 8 sreyobhilaashi 10:17 సా. వద్ద డిసెంబర్ 9, 2010

  పిచ్చెక్కించారు గా….!!! సూపర్….

 7. 9 మేధ 10:44 సా. వద్ద డిసెంబర్ 9, 2010

  తెలుగోడు అని కూడల్లో కనిపించగానే మీరేనా లేక వేరే ఎవరైనా అని సందేహంతో ఓపెన్ చేశా..
  అదరగొట్టేశారు 🙂 🙂

 8. 10 సుజాత 10:51 సా. వద్ద డిసెంబర్ 9, 2010

  అదిగో, ప్రవీణ్ కూడా వచ్చేసారు! ఇక మీకు పండగే

 9. 11 తేజస్వి 11:16 సా. వద్ద డిసెంబర్ 9, 2010

  గుడ్ పేరడీ. btw, చరణ్ మీద అంత కసికి కారణం తెలుసుకోవచ్చా?

 10. 12 Damodar 1:53 ఉద. వద్ద డిసెంబర్ 10, 2010

  ఇంకా ఈ సినిమా ని కొన్ని అనివార్య కారణాల వల్ల చూడ లేక పోయినందుకు చింతిస్తూ, ఈ వారాంతం లో చూసి తరిస్తామని సభా ముఖంగా మనవి చేసుకుంటున్నా.!! Welcome back to the track. Keep writing, you have a unique style in writing parodies. God bless you and good luck.

 11. 13 రమణ 1:58 ఉద. వద్ద డిసెంబర్ 10, 2010

  సూపర్. 😀 :D. యోగేంద్ర బాబు ఆవేదనని తెలిపింది ‘రవికూజా’ ములక్కాయ్ ఆడియో ఆవిష్కరణ లో అనుకుంటా.

 12. 14 లలిత 3:41 ఉద. వద్ద డిసెంబర్ 10, 2010

  మీ పేరడీ పాడుగాను !( దురుద్దేసంతో కాదండోయ్ ..ఒట్టు)
  నవ్వలేక చచ్చానండీబాబూ ….తింగరబుచ్చి, గుండెరాజు,మృగవీర భలే…భలే !

 13. 15 krishna 4:15 ఉద. వద్ద డిసెంబర్ 10, 2010

  ఉతికి ఆరేశారు. చిరు కంపెనీ ని విమర్శించాలంటే, a2Z గారి అనుమతి తీసుకోవాలి అని మరచిపోతే ఏలా :((

 14. 16 వేణు 5:22 ఉద. వద్ద డిసెంబర్ 10, 2010

  భలే భలే! ‘ఉడుత’, ‘మృగవీర’… ముఖ్యంగా- ‘‘… కునారిల్లుతో బాక్సాఫీసు బూజు దులిపిన..’’:)

 15. 17 Kannagadu 8:20 ఉద. వద్ద డిసెంబర్ 10, 2010

  WOW! you are back… waiting for a long time for this kind of post.

 16. 18 indu 9:07 ఉద. వద్ద డిసెంబర్ 10, 2010

  భలే ఫన్నిగా వ్రాసారండీ..వాళ్ళకి పెట్టిన పేర్లు కూడా భలే ఉన్నాయి…ముఖ్యాంగా జెనీలియాకి కుమారి తింగరి బుచ్చి…సూపరండీ.. 🙂 🙂

 17. 19 వేణూశ్రీకాంత్ 12:05 సా. వద్ద డిసెంబర్ 10, 2010

  హ హ బాగుంది అదరగొట్టేశారు. పేర్లు పెట్టడంలో మీతర్వాతేనండి బాబు.
  ఇన్నిరోజులు చాలా మిస్ అయ్యాను. నా బ్లాగ్ లిస్ట్ లో మీకొత్తటపా పేరుచూడగానే అనుకున్నా ఆరెంజ్ కి ఏదో టెండర్ పెట్టారు అని 🙂

 18. 20 జేబి 10:27 సా. వద్ద డిసెంబర్ 10, 2010

  నాకు సినిమా పర్లేదు, బానే వుందనిపించింది; మీరు రాసిన ఈ పుచ్చకాయ కథ బాగా నచ్చింది. 🙂

 19. 22 lekhari 4:36 ఉద. వద్ద డిసెంబర్ 13, 2010

  బాగుందండీ మీ పుచ్చకాయ సచ్చినోడి లవ్ స్టోరీ! క్యాప్షన్ మాత్రం అదిరిపోయింది! 🙂

  పిచ్చి పుచ్చకాయ-గుడ్డి గచ్చకాయ అని ఇంకో లవ్ స్టోరీ తొందర్లో తీసేస్తారు! జనాలు చూసినా చూడకపోయినా బలవంతంగా ట్రైలర్స్ వేసైనా సరే సినిమా హాల్లో చూడలేని జనాలకి టీవీలో సీన్ సీన్ డైలాగుతో సహా వేసి మరీ చూపిస్తారు.జిగాస్టార్ రాజ్ కిరణ్ తేమ్ ప్రతిభ అలాంటిది మరి!

 20. 23 kranthi 5:56 ఉద. వద్ద డిసెంబర్ 13, 2010

  పిచ్చాపాటీ ముగిస్తూ, సినిమా ఎలా ఉన్నా కిరణ్ తేమ్ నటన మాత్రం ప్రేక్షకుల మతులు పోగొడుతున్న విషయం మరోమారు గుర్తు చేశారు.
  conclusion adirindi!

 21. 24 balaji 7:53 ఉద. వద్ద డిసెంబర్ 13, 2010

  Sir,please send these nice stories to my gmail adress .I ma more intrested in these stories.

 22. 25 రవి 10:41 ఉద. వద్ద డిసెంబర్ 13, 2010

  తేటగీతి టపా యేమో అని తెరిచి చూస్తే మీరు. అవునూ వెంకటేష్ తో కాఘవేంద్ర రావు అదేదో భక్తి సినిమా తీయబోతున్నట్టు వార్త. మరోసారి మీ కలానికి విందుభోజనం దొరికేటట్టు ఉంది.

 23. 27 sri 4:08 సా. వద్ద డిసెంబర్ 15, 2010

  One good message that this movie conveys is that, when in love, there should be no place for any kind of ego. That is called true love. Whenever ego shows up, then true and unconditional love has no scope.

  But, giving this message in a costlier way is something that is really strange. May be, its the stardom that made the movie costlier.

  Any way, your writing style is very funny. Hahaha.

 24. 30 R 11:48 సా. వద్ద జనవరి 12, 2011

  ఉడుతా!!!! ఇలా అనేసారేంటండి.. అమ్మాయిల హృదయాలు, మనోభావాలు తీవ్రాతి తీవ్రంగా గాయపడ్డాయి.

  సూపర్ కేక! పోలి కేక!! కత్తి!! చాకు!!! బ్లేడు!!! భీభత్సం!!

  నవ్వలేక చచ్చిపోయా!
  మీరు కాస్త రెగ్యులర్ గా రాయక పోతే మేమొప్పుకోమంతే!!!
  ఆ కెమెరా ని కాస్తపక్కనపెట్టి పెన్ను పుచ్చుకోవాలని ఈ సందర్భం గా డిమాండ్చ్చేస్తున్నాం

  ఇట్లు,
  మీ అభిమాన సంఘ నాయకురాలు

 25. 33 sanjeev 12:16 ఉద. వద్ద ఫిబ్రవరి 9, 2011

  office lo thala noppiga unte mee blog loki vachi sachinodi love story chadivaanu…ayya baaboy nenu navvu thunte office lo vaallu andaroo naaku pichi ekkindemo ani (naaku thala noppi undi ani valla tho anthaku munde cheppadam valla nijanga thala pani cheyyadam ledemo ani) bhaya paddaru…..anthala navvanu


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: