జూలై, 2010ను భద్రపఱచులీడరుడి మాయ

ఈ మధ్య నే చూసిన రెండు తెలుగు సినీ కళాఖండాల ఖండన మండనల కోసం ఈ టపా. రెండ్రోజుల వ్యవధిలో ఒకదాని వెంట ఒకటి చూసి, వాటి ధాటికి దెబ్బ మీద దెబ్బ పడి కుదేలైపోయి నెలన్నర పాటు జీవితమంటే విరక్తిలో మునిగి ఇప్పుడిప్పుడే తేలుతూ – ఆ వేదనా, ఆవేదనా మరో నలుగురితో పంచుకునే ప్రయత్నమిది. ఇదెవరినీ కాపాడే యత్నం కాదు – మీలో ఎందరో (దాదాపు అందరూ) ఆయా చిత్రరాజాలు ఆల్రెడీ చూసి తరించే ఉంటారు కావున.

అసలు వ్యధలోకెళ్లబోయేముందో చిన్న పిడకల వేట (చిన్నది వేట; పిడకలు కావు). పోయిన వారం నా స్నేహితుడు రాహుతో (కొక్కొరోకో, దోశ నాజీ ఫేమ్) పిచ్చాపాటీ మాట్లాడుతుండగా విషయం సహజంగానే సినిమాల మీదకి మళ్లింది. ‘ఝుమ్మంది నాదం’ చూసి బలైపోయానని రాహు వేదాంతసహిత వేదానాభరితుడవగా అతన్నోదార్చటం నా బాధ్యతయింది. ‘కె.రాఘవేంద్రరావు సినిమాలు అలాగే ఉంటాయని తెలిసీ జూఁడనేల, జూఁచినా ఆశాభంగమొందనేల’ అన్నది ఆ క్రమంలో నే పొడిచిన ప్రశ్న. కొబ్బరి చిప్పలూ ద్రాక్ష గుత్తులూ లేని రాఘవేంద్రుని సినిమాలెన్ని? కె.విశ్వనాధ్ ‘సయ్యంది పాదం’ తీసి అందులో ఇలాంటి పైత్యాలు ప్రదర్శిస్తే అధిక్షేపించినా అర్ధముంది – విశ్వనాధుని సినిమాలపై ఉండే అంచనాలకి అది భిన్నం కనుక. రాఘవేంద్రరావు తన బాణీలోనే తీశాడు కాబట్టి ఆయన్ని తప్పుపట్టటంలో అర్ధం లేదు – అని నా నిశ్చిత గాఢాభిప్రాయం.

చెప్పొచ్చేదేమంటే, నేను సినిమాల్ని ముందే ఏర్పరచుకున్న కొన్ని నిర్దిష్ట అంచనాలతో చూస్తాను. అధిక శాతం తెలుగు సినీ దర్శకుల/కథానాయకుల చిత్రాల్ని ఏ అంచనాలూ లేకుండానే చూస్తాను కాబట్టి నేను ఆశాభంగానికి గురయ్యే సందర్భాలు బహు తక్కువ. గురయ్యే కాసిని సందర్భాలూ తప్పుడు అంచనాలతో ఏదేదో ఊహించుకుని సినిమాలు చూసి మోసపోయేవే. ఆ తప్పుడు అంచనాలకి కారణం మీడియా వారిచ్చే హైప్ అనండి, సదరు దర్శకుడు గత చిత్రాలద్వారా రేకెత్తించిన ఆశలు కానీండి, మరోటి కానీండి. ఈ మధ్య నేనలా మోసపోయినవాటిలో మొదటిది ‘యోమేయ చోసేవ’ (ఒరియా సినిమా కాదు. అచ్చ తెలుగుదే. వాళ్లా సినిమా టైటిల్ని వినూత్నంగా ఖూనీ చేసిన విధానం చూసి ముచ్చటపడి నేనూ ఇలా కొత్తరకంగా ప్రయత్నించా. అదీ సంగతి)

ఈ సినిమా దర్శకుడిదో అయోమయపు బుర్ర. ఎంతంటే, ఇన్నేళ్లొచ్చినా ఏ పేరుతో పిలిపించుకోవాలో తెలీనంత. అందుకే ఓ సినిమాకి ‘గౌతం మీనన్’ అనీ, మరో సినిమాకి ‘గౌతం’ అనీ, ఇంకో సినిమాకి ‘గౌతం వాసుదేవ మీనన్’ అనీ …. ఇలా రకరకాలుగా పేరు వేయించుకోటంలో చూపించే గందరగోళమే ‘యోమేయ చోసేవ’ కథ చెప్పటంలో కూడా చూపించాడు. తలాతోకాలేని కథ; నటశూన్యులైన కథానాయకుడు మరియు నాయిక; సందర్భరహితంగా వచ్చిపోయేస్తుండే పాటలు (అది తెలుగు సినిమాలకి సహజమే అనుకోండి. కానీ ఈ సినిమా ఓ క్లాసిక్ అని ఎవరో వాకృచ్చితే ఆవేశపడిపోయి చూసేశా కాబట్టి అదీ ఓ లోపంలానే అనిపిస్తుందిపుడు); పావుగంటకో సారి కథానాయకుడి నోటీవెంట ‘ఈ ప్రపంచంలో ఇంతమంది ..’ అంటూ మొదలై జాలువారే వీరబోరు వాక్యం; హావభావాలు, టైమింగ్ వగైరా మాటలకి అర్ధం తెలీని సైడ్‌కిక్ పాత్రధారి శ్వేతపత్రంలాంటి ముఖంతో పండించబోయిన హాస్యం …. అబ్బో ఒకటా రెండా. చిర్రెత్తించే విషయాలు ఈ సినిమాలో లెక్కలేనన్ని. ఎ.ఆర్.రెహ్మాన్ వంటి ప్రతిభావంతుడితో సైతం నేపధ్యసంగీతం సరిగా చేయించుకోలేని ప్రతిభ దర్శకుడిది. ‘యోమేయ చోసేవ’లో చెప్పుకోదగ్గ విషయాలేమన్నా ఉన్నాయంటే అవి రెండు పాటలు, మరియు కళ్లని ఇబ్బందిపెట్టని ఛాయాగ్రహణం. అంతే. ఆ రెంటికోసం రెండున్నర గంటల బాదుడు భరించాలా అంటే – రించక్కర్లేదనే అంటాను. ఈ సినిమాని ఆహా ఓహో అదరహో అంటూ ఊదరగొట్టినవాళ్లని చావగొట్టాలన్నంత ఆవేశం వచ్చినా, తమ బాధ మరో నలుగురికి పంచితే తగ్గుతుందన్న ఆశతో వాళ్లా పని చేసుంటారన్న గ్రహింపు నన్నాపింది.

ఇక రెండో బాదుడు దగ్గరికొద్దాం. పై సినిమాలో చెప్పుకోదగ్గవి రెండైనా ఉన్నాయి, ఇందులో అవీ నాస్తి. ఈ దర్శకుడు చిత్రనిర్మాణమ్మీద అమెరికాలో డిప్లొమానో, డిగ్రీనో ఏదో చేసొచ్చానని అప్పుడప్పుడూ ఇంటర్వ్యూల్లో చెబుతుంటాడు. ‘Zooming screams amateur’ అనేది సినిమాటోగ్రఫర్లు, దర్శకులు నేర్చుకునే తొట్టతొలి చిత్రీకరణ సూత్రం. క్రియేటివ్ జీనియస్‌గా కీర్తించబడుతున్న ఈ దర్శకుడికి ఇంత చిన్న విషయం ఆ డిప్లొమా/డిగ్రీ కోర్సులో ఎవరూ నేర్పకపోవటం విచిత్రం! అనవసరమైన జూమ్ షాట్లు లేకుండా సినిమా తీయలేని ఇతని పేరు శేఖర్ కమ్ముల. ‘ఆనంద్’, ‘గోదావరి’ చూసినప్పుడు లో బడ్జెట్‌లో ఈ మాత్రం తీయటం గొప్పే అనుకున్నా, ‘హ్యాపీ డేస్’ చూశాక అతని గురించి మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నానేమో అన్న శంక మొదలయింది. ఐనా అది ‘లీడర్’ చూడటానికి అడ్డుకాలేదు. ఏవీఎమ్ ప్రొడక్షన్స్ వారి సినిమా, రామానాయుడి మనవడి తెరంగేట్రం .. వెరసి భారీ పెట్టుబడులు పెట్టగలిగిన వారి దన్నుతో శేఖర్‌లోని సిసలు దర్శకుడు జూలు విదిల్చి బయటికొస్తాడని ఏ మూలో చిన్న ఆశ. ‘లీడర్’ చూశాక అది ఆవిరైపోయింది. కథ, స్క్రీన్-ప్లే, మాటలు, దర్శకత్వం – ఇంత పొడుగు క్రెడిట్ కార్డ్ వేసుకున్న ఇతనికి ఏ ఒక్క విభాగమ్మీదా పట్టు కాదు కదా, అవగాహన సైతం లేదని తెలిసిపోయింది. నాలుగు రోజుల పాటు గుర్తుంచుకోగలిగేది ఒక్కటంటే ఒక్క డైలాగ్ఉందా ఈ సినిమాలో? సుహాసిని పాత్ర పరిచయం చూసి తీరాలి. ‘ఎంత చక్కగా ఉందో’ అని ఆమె గురించెవరో కామెంట్! కథకి ఏ రకంగానైనా ఉపయోగపడే వాక్యమా అది? గందరగోళంగా నడిచే స్క్రీన్-ప్లే. నేపధ్యంలో వందేమాతరం వగైరా కేకల హోరు. వీటికి తోడు మా తెలుగు తల్లి పాటకి ఆంగ్లంలో ఏవో అరుపులు జోడించి రీమిక్స్ చేసి వదిలారు. అవినీతి మీద తీసిన సినిమాలో ఇలాంటి దేశభక్తి, భాషాభక్తి తాలింపులెందుకు? నేపధ్య సంగీతం మరియు పాటల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గ్రీన్‌స్క్రీన్లూ, బ్లూస్క్రీన్లూ తెరనేలుతున్న ఈ రోజుల్లో ఇంకా రియర్ ప్రొజెక్షన్ వంటి భూతకాలపు పాత టెక్నిక్‌నే నమ్ముకుని చుట్టేసిన క్లైమాక్స్ సన్నివేశాలు సాంకేతికంగా దర్శకుడి వెనకబాటుదనానికి మచ్చుతునకలు. (‘సినిమాకి కథ ముఖ్యం, సాంకేతికత కాదు’ అనే పాతకాపులారా: ఆ వాక్యంతో నేనేకీభవించను. అసలు సినిమా అనేదే వివిధ సాంకేతిక ప్రక్రియల మేలుకలయిక. కాబట్టి సినిమాకి సాంకేతికత అద్దే హంగులూ అవసరమే – అవి హద్దులో ఉన్నంతవరకూ)

మొత్తమ్మీద, ఈ రెండు సినిమాల దెబ్బతో నేను నేర్చుకున్న పాఠం ఒకటుంది: ‘పరుల మాటలు నమ్మి తెలుగు సినిమాలు చూడరాదు’. ‘Dasvidaniya’, ‘A Wednesday’ వంటివి ఇదే పాఠం హిందీ సినిమాల గురించి నేర్పాయి. ఇతర భారతీయ భాషా చిత్రాలు దాదాపు చూడను కాబట్టి నేనేర్చుకోవాల్సిన పాఠాలిక లేవేమో. హమ్మయ్య.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,194

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.