లీడరుడి మాయ

ఈ మధ్య నే చూసిన రెండు తెలుగు సినీ కళాఖండాల ఖండన మండనల కోసం ఈ టపా. రెండ్రోజుల వ్యవధిలో ఒకదాని వెంట ఒకటి చూసి, వాటి ధాటికి దెబ్బ మీద దెబ్బ పడి కుదేలైపోయి నెలన్నర పాటు జీవితమంటే విరక్తిలో మునిగి ఇప్పుడిప్పుడే తేలుతూ – ఆ వేదనా, ఆవేదనా మరో నలుగురితో పంచుకునే ప్రయత్నమిది. ఇదెవరినీ కాపాడే యత్నం కాదు – మీలో ఎందరో (దాదాపు అందరూ) ఆయా చిత్రరాజాలు ఆల్రెడీ చూసి తరించే ఉంటారు కావున.

అసలు వ్యధలోకెళ్లబోయేముందో చిన్న పిడకల వేట (చిన్నది వేట; పిడకలు కావు). పోయిన వారం నా స్నేహితుడు రాహుతో (కొక్కొరోకో, దోశ నాజీ ఫేమ్) పిచ్చాపాటీ మాట్లాడుతుండగా విషయం సహజంగానే సినిమాల మీదకి మళ్లింది. ‘ఝుమ్మంది నాదం’ చూసి బలైపోయానని రాహు వేదాంతసహిత వేదానాభరితుడవగా అతన్నోదార్చటం నా బాధ్యతయింది. ‘కె.రాఘవేంద్రరావు సినిమాలు అలాగే ఉంటాయని తెలిసీ జూఁడనేల, జూఁచినా ఆశాభంగమొందనేల’ అన్నది ఆ క్రమంలో నే పొడిచిన ప్రశ్న. కొబ్బరి చిప్పలూ ద్రాక్ష గుత్తులూ లేని రాఘవేంద్రుని సినిమాలెన్ని? కె.విశ్వనాధ్ ‘సయ్యంది పాదం’ తీసి అందులో ఇలాంటి పైత్యాలు ప్రదర్శిస్తే అధిక్షేపించినా అర్ధముంది – విశ్వనాధుని సినిమాలపై ఉండే అంచనాలకి అది భిన్నం కనుక. రాఘవేంద్రరావు తన బాణీలోనే తీశాడు కాబట్టి ఆయన్ని తప్పుపట్టటంలో అర్ధం లేదు – అని నా నిశ్చిత గాఢాభిప్రాయం.

చెప్పొచ్చేదేమంటే, నేను సినిమాల్ని ముందే ఏర్పరచుకున్న కొన్ని నిర్దిష్ట అంచనాలతో చూస్తాను. అధిక శాతం తెలుగు సినీ దర్శకుల/కథానాయకుల చిత్రాల్ని ఏ అంచనాలూ లేకుండానే చూస్తాను కాబట్టి నేను ఆశాభంగానికి గురయ్యే సందర్భాలు బహు తక్కువ. గురయ్యే కాసిని సందర్భాలూ తప్పుడు అంచనాలతో ఏదేదో ఊహించుకుని సినిమాలు చూసి మోసపోయేవే. ఆ తప్పుడు అంచనాలకి కారణం మీడియా వారిచ్చే హైప్ అనండి, సదరు దర్శకుడు గత చిత్రాలద్వారా రేకెత్తించిన ఆశలు కానీండి, మరోటి కానీండి. ఈ మధ్య నేనలా మోసపోయినవాటిలో మొదటిది ‘యోమేయ చోసేవ’ (ఒరియా సినిమా కాదు. అచ్చ తెలుగుదే. వాళ్లా సినిమా టైటిల్ని వినూత్నంగా ఖూనీ చేసిన విధానం చూసి ముచ్చటపడి నేనూ ఇలా కొత్తరకంగా ప్రయత్నించా. అదీ సంగతి)

ఈ సినిమా దర్శకుడిదో అయోమయపు బుర్ర. ఎంతంటే, ఇన్నేళ్లొచ్చినా ఏ పేరుతో పిలిపించుకోవాలో తెలీనంత. అందుకే ఓ సినిమాకి ‘గౌతం మీనన్’ అనీ, మరో సినిమాకి ‘గౌతం’ అనీ, ఇంకో సినిమాకి ‘గౌతం వాసుదేవ మీనన్’ అనీ …. ఇలా రకరకాలుగా పేరు వేయించుకోటంలో చూపించే గందరగోళమే ‘యోమేయ చోసేవ’ కథ చెప్పటంలో కూడా చూపించాడు. తలాతోకాలేని కథ; నటశూన్యులైన కథానాయకుడు మరియు నాయిక; సందర్భరహితంగా వచ్చిపోయేస్తుండే పాటలు (అది తెలుగు సినిమాలకి సహజమే అనుకోండి. కానీ ఈ సినిమా ఓ క్లాసిక్ అని ఎవరో వాకృచ్చితే ఆవేశపడిపోయి చూసేశా కాబట్టి అదీ ఓ లోపంలానే అనిపిస్తుందిపుడు); పావుగంటకో సారి కథానాయకుడి నోటీవెంట ‘ఈ ప్రపంచంలో ఇంతమంది ..’ అంటూ మొదలై జాలువారే వీరబోరు వాక్యం; హావభావాలు, టైమింగ్ వగైరా మాటలకి అర్ధం తెలీని సైడ్‌కిక్ పాత్రధారి శ్వేతపత్రంలాంటి ముఖంతో పండించబోయిన హాస్యం …. అబ్బో ఒకటా రెండా. చిర్రెత్తించే విషయాలు ఈ సినిమాలో లెక్కలేనన్ని. ఎ.ఆర్.రెహ్మాన్ వంటి ప్రతిభావంతుడితో సైతం నేపధ్యసంగీతం సరిగా చేయించుకోలేని ప్రతిభ దర్శకుడిది. ‘యోమేయ చోసేవ’లో చెప్పుకోదగ్గ విషయాలేమన్నా ఉన్నాయంటే అవి రెండు పాటలు, మరియు కళ్లని ఇబ్బందిపెట్టని ఛాయాగ్రహణం. అంతే. ఆ రెంటికోసం రెండున్నర గంటల బాదుడు భరించాలా అంటే – రించక్కర్లేదనే అంటాను. ఈ సినిమాని ఆహా ఓహో అదరహో అంటూ ఊదరగొట్టినవాళ్లని చావగొట్టాలన్నంత ఆవేశం వచ్చినా, తమ బాధ మరో నలుగురికి పంచితే తగ్గుతుందన్న ఆశతో వాళ్లా పని చేసుంటారన్న గ్రహింపు నన్నాపింది.

ఇక రెండో బాదుడు దగ్గరికొద్దాం. పై సినిమాలో చెప్పుకోదగ్గవి రెండైనా ఉన్నాయి, ఇందులో అవీ నాస్తి. ఈ దర్శకుడు చిత్రనిర్మాణమ్మీద అమెరికాలో డిప్లొమానో, డిగ్రీనో ఏదో చేసొచ్చానని అప్పుడప్పుడూ ఇంటర్వ్యూల్లో చెబుతుంటాడు. ‘Zooming screams amateur’ అనేది సినిమాటోగ్రఫర్లు, దర్శకులు నేర్చుకునే తొట్టతొలి చిత్రీకరణ సూత్రం. క్రియేటివ్ జీనియస్‌గా కీర్తించబడుతున్న ఈ దర్శకుడికి ఇంత చిన్న విషయం ఆ డిప్లొమా/డిగ్రీ కోర్సులో ఎవరూ నేర్పకపోవటం విచిత్రం! అనవసరమైన జూమ్ షాట్లు లేకుండా సినిమా తీయలేని ఇతని పేరు శేఖర్ కమ్ముల. ‘ఆనంద్’, ‘గోదావరి’ చూసినప్పుడు లో బడ్జెట్‌లో ఈ మాత్రం తీయటం గొప్పే అనుకున్నా, ‘హ్యాపీ డేస్’ చూశాక అతని గురించి మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నానేమో అన్న శంక మొదలయింది. ఐనా అది ‘లీడర్’ చూడటానికి అడ్డుకాలేదు. ఏవీఎమ్ ప్రొడక్షన్స్ వారి సినిమా, రామానాయుడి మనవడి తెరంగేట్రం .. వెరసి భారీ పెట్టుబడులు పెట్టగలిగిన వారి దన్నుతో శేఖర్‌లోని సిసలు దర్శకుడు జూలు విదిల్చి బయటికొస్తాడని ఏ మూలో చిన్న ఆశ. ‘లీడర్’ చూశాక అది ఆవిరైపోయింది. కథ, స్క్రీన్-ప్లే, మాటలు, దర్శకత్వం – ఇంత పొడుగు క్రెడిట్ కార్డ్ వేసుకున్న ఇతనికి ఏ ఒక్క విభాగమ్మీదా పట్టు కాదు కదా, అవగాహన సైతం లేదని తెలిసిపోయింది. నాలుగు రోజుల పాటు గుర్తుంచుకోగలిగేది ఒక్కటంటే ఒక్క డైలాగ్ఉందా ఈ సినిమాలో? సుహాసిని పాత్ర పరిచయం చూసి తీరాలి. ‘ఎంత చక్కగా ఉందో’ అని ఆమె గురించెవరో కామెంట్! కథకి ఏ రకంగానైనా ఉపయోగపడే వాక్యమా అది? గందరగోళంగా నడిచే స్క్రీన్-ప్లే. నేపధ్యంలో వందేమాతరం వగైరా కేకల హోరు. వీటికి తోడు మా తెలుగు తల్లి పాటకి ఆంగ్లంలో ఏవో అరుపులు జోడించి రీమిక్స్ చేసి వదిలారు. అవినీతి మీద తీసిన సినిమాలో ఇలాంటి దేశభక్తి, భాషాభక్తి తాలింపులెందుకు? నేపధ్య సంగీతం మరియు పాటల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గ్రీన్‌స్క్రీన్లూ, బ్లూస్క్రీన్లూ తెరనేలుతున్న ఈ రోజుల్లో ఇంకా రియర్ ప్రొజెక్షన్ వంటి భూతకాలపు పాత టెక్నిక్‌నే నమ్ముకుని చుట్టేసిన క్లైమాక్స్ సన్నివేశాలు సాంకేతికంగా దర్శకుడి వెనకబాటుదనానికి మచ్చుతునకలు. (‘సినిమాకి కథ ముఖ్యం, సాంకేతికత కాదు’ అనే పాతకాపులారా: ఆ వాక్యంతో నేనేకీభవించను. అసలు సినిమా అనేదే వివిధ సాంకేతిక ప్రక్రియల మేలుకలయిక. కాబట్టి సినిమాకి సాంకేతికత అద్దే హంగులూ అవసరమే – అవి హద్దులో ఉన్నంతవరకూ)

మొత్తమ్మీద, ఈ రెండు సినిమాల దెబ్బతో నేను నేర్చుకున్న పాఠం ఒకటుంది: ‘పరుల మాటలు నమ్మి తెలుగు సినిమాలు చూడరాదు’. ‘Dasvidaniya’, ‘A Wednesday’ వంటివి ఇదే పాఠం హిందీ సినిమాల గురించి నేర్పాయి. ఇతర భారతీయ భాషా చిత్రాలు దాదాపు చూడను కాబట్టి నేనేర్చుకోవాల్సిన పాఠాలిక లేవేమో. హమ్మయ్య.

41 స్పందనలు to “లీడరుడి మాయ”


 1. 1 krishna 1:17 ఉద. వద్ద జూలై 13, 2010

  మీరు చెప్పిన రెండు సినిమాల విషయంలో ఏకీభవించినా , దస్‌విదానియాని మీకు నచ్చకపోవడానికి మరీ ఎక్కువ అంచనాలు తో మీరు ఆ సినిమా చూసారేమొ అని నాకు అనిపిస్తుంది. మీకు నా ప్రగాడ సానుభూతి 🙂

 2. 2 ఆ.సౌమ్య 1:57 ఉద. వద్ద జూలై 13, 2010

  హ హ బావుంది. మీరు పేర్లు మాత్రం భలే పెడతారండీ
  హమ్మయ్య ఏం మయ చేసావే సినిమాని తిట్టుకోవడానికి నాకో తోడు దొరికరు…ఇప్పుడు హాయి గా తిట్టేసుకోవచ్చు:P ఇది ఒక పరమ బోరు సుత్తి సినిమా…ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురుచూసాను. అర్థం పర్థం లేని ప్రేమ, ఎవరు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియని తికమక మకతిక. ఓ జడ్డి క్లైమాక్సు….వెరసి యోమేయ చోసేవ. మీరు చెప్పిన అన్ని పాయింట్లకీ నేను నూటికి రెండొందల శాతం అంగీకరిస్తున్నాను. ఇక లీడర్ విషయంలో కొంత అంగీకరించినా మరికొంత అంగీకరించలేకపోతున్నాను.

 3. 4 రవి చంద్ర 2:40 ఉద. వద్ద జూలై 13, 2010

  హమ్మయ్య చాలాకాలం తర్వాత మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. మా లాంటి అభిమానుల కోసం అప్పుడప్పుడూ రాస్తూ ఉండండి…

 4. 5 lekhari 3:25 ఉద. వద్ద జూలై 13, 2010

  అయ్యో అనిల్ గారూ,యో మాయ చోసావె మూవీ లోంచి మీరు ఇంకో రెండు పాపులర్ డైలాగులు మర్చిపోయారండీ..

  ఆర్ యూ క్రేజీ? (హీరో ట్రైస్ టూ షో సమ్ ఎక్స్ క్లమేషన్..బట్ నో యూజ్!!)

  థాంక్ యూ..(విత్ నో ఎక్స్ ప్రెషన్)

  సినిమా మొత్తం ఈ రెండు డైలాగులతోనే కథ నడిపించేసాడు కదండీ గురుడు వాసుదేవ మీనన్ గారు.థియేటర్లో ఈ సినిమా చూడనందుకు బ్రతికి బయట పడ్డాను,CD ని మాత్రం “ఆర్ యూ క్రేజీ??” అని అరిచి పది ముక్కలు చేసాను ఈ సినిమా చూసిన బాధ తట్టుకోలేక!

 5. 6 కన్నగాడు 3:40 ఉద. వద్ద జూలై 13, 2010

  చాలా రోజుల తరువాత పదినైన విమర్శనాస్ర్తాలతో వచ్చారు, లీడర్ సినిమాలో క్లైమాక్సు అలా తీయడానికి కారణాలున్నాయి, క్లైమాక్సు షూటింగు సమయానికి తెలంగాణాలో సినిమా షూటింగులు జరగకుండా అడ్డుకున్నారు. రామగుండంలో ఓపెన్ కాస్ట్ గనుల వద్ద షూటింగు కోసం వెళితే సి.కా.స. వాళ్లనుకుంటా అడ్డుపడ్డారు. దాంతో తెలంగాణలో తీద్దామనుకున్న షాట్లను అలా లాగించారు. లీడరు సినిమాలో బలమైన విభాగం సంభాషణలే(అన్ని కాదు కొన్ని సంధర్భాలల్లో, మారుతీరావుతో, చివర్లో ముసలాయనతో, ‘నిజాయితీగ పని చేయడమంటే త్యాగం చేయడమే సార్’ ఇంకొన్ని) కదా!
  ఇక సుహాసిని నటన విషయానికొస్తే, ఈ మధ్య సినిమాల్లో ముఖ్యమైన కారెక్టర్లలో నటీనటులు ఎలా చేసినా బాగుందని అనేస్తున్నారు, ‘వేదం’ రాములు కూడా భావం లేని ముఖంతో ఏదో పని కానిచ్చేసాడు కాని అందరు అద్బుతంగా నటించాడన్నారు.
  ఇక యోమేయ చోసేవ, చైతన్య ఒక నటుడికి కావాల్సిన లక్షణాల్లో ఒక్క లక్షణం లేదు. ఏం చేస్తాం మన రాత ఇలాంటి వాళ్ళ సినిమాలే తెగ ఆడేస్తున్నాయి.

  ఇంతకీ మీకు నచ్చిన నటుడి సినిమా చూసారా లేదా ‘ప్రస్థానం’ ఆ సినిమాలో సంభాషణలు అదుర్స్.

  • 7 అబ్రకదబ్ర 10:17 ఉద. వద్ద జూలై 13, 2010

   నిజమే. గొల్లపూడి సన్నివేశంలో సంభాషణలు బాగున్నాయి (కానీ మిగతా సినిమా వాటిని మర్చిపోయేలా చేసింది). ఆ సీన్ వరకూ సంభాషణలు బహుశా గొల్లపూడే రాశాడేమో, లేకపోతే ఇంకెవరన్నా రాశారేమో. ఇది ఆ సన్నివేశం చూస్తున్నప్పుడు నాకనిపించిన మాట.

   క్లైమాక్స్ అలా రావటానికి కారణాలెన్నైనా ఉండొచ్చు. అవేవీ excuses కాలేవు కదా.

   ప్రస్థానం చూడలేదింకా. చూస్తా. అందరి బంధువయా కూడా. అభిమాన నటుడిని వదలను 🙂

   • 8 కన్నగాడు 4:23 సా. వద్ద జూలై 13, 2010

    అందరి బంధువయా కూడా బానే ఉంది, ‘ఆ నలుగురు’ సినిమా తర్వాత చంద్రసిద్దార్థ్ సినిమాలు చూసి ‘ఆ నలుగురు’ కృషి మదన్(ఆ నలుగురు కథా రచయిత, పెళ్ళైన కొత్తలో చిత్ర దర్శకుడు) కాని అందరి బంధువయాతో మళ్ళీ తన పంథాలోకొచ్చాడు. ఇంతకుముందే రాద్దామనుకొని మర్చిపోయా, ‘వాకృచ్చికం’ బాగుంది.

    ఛస్ ఇక్కడందరూ ‘లీడర్’ సినిమా విమర్శకులే ఉన్నారు, నేను వాకౌట్ చేస్తున్నాను. 🙂

    • 9 maarushi 10:39 సా. వద్ద డిసెంబర్ 18, 2010

     అన్నా …….అబ్రక దబ్రా
     నువ్వు నీ అభిప్రాయాలు బానే రాసావ్ కాని ఇక్కడ ఆంధ్రా లో లీడర్ సినిమా ఒక ప్రభంజనం ,etc ..etc …
     నువ్వు మరీ అంట పదునుగా విమర్శించడం తగదు అన్నా
     @కన్నగాడు :భయ్యా నేను లీడర్ సినిమా ‘టీం’ మొత్తానికి ఫ్యాన్ అన్నా …
     సినిమా కేకలు ..

 6. 10 nestam 4:39 ఉద. వద్ద జూలై 13, 2010

  ఏంటా సారు ఈ మధ్య కనబడటం లేదు అనుకుంటున్నా ఇదా సంగతి :)అయ్యబాబోయ్ మీరు జూం షాట్లు గట్రాలు అన్నీ గమనిస్తారా సినిమాలో 🙂 .. ఏం మాయ చేసావే తెలుగులో నెట్ లో కనబడపోయే సరికి తమిళ్ లో చూసాను.. త్రిష,శింబు..సినిమా చూసినపుడు అందులో నాకు నచ్చినవి ఆమె చీరకట్టు..వెనుకాతల ఆహ్లాద పరిచే పరిసరాలు.. దాన్నే పొటోగ్రఫీ అంటారేమో ?? ఎమో ,ఏమో నాకు తెలియదు.. కానీ కధ మాత్రం ఒక్క ముక్క అర్ధం కాలేదు.. అసలు ఏమి తీద్దామనుకున్నాడో ఏంటో ..దర్శకుడు కంఫ్యూజ్ అయ్యాడో..లేక పరాయి భాషలో చూడ్డం వల్ల నాకు అర్ధం కాలేదో అంతా అయోమయం అనిపించింది.. సినిమా చూసాకా స్టోరీ ఏంటీ అంటే చెప్పలేని పరిస్థితి ..ఇక కమ్ముల లీడర్ బాలేదా?? నాకు గోదావరి,ఆనంద్ సినిమాలు బాగా నచ్చాయి.. లీడర్ చూడలేదు ఇంకా 🙂

 7. 11 ఆ.సౌమ్య 4:49 ఉద. వద్ద జూలై 13, 2010

  ఏంటండీ నా వ్యాఖ్య అంగీకరించలేదు. సందేహం వద్దు నేను మాయాశశిరేఖనే.

 8. 12 వాసు.S 8:32 ఉద. వద్ద జూలై 13, 2010

  ‘యోమేయ చోసేవ’ మొదట తమిళ్ లో చూసి, మళ్ళీ తెలుగులో చూడటం జరిగింది.(అంత ఓపికా అంటే.. ఏదో అలాజరిగిపోయింది). తమిళ్ లో చూసినప్పుడు పర్లేదనే అనిపించింది. కానీ తెలుగులో చూసినప్పుడు బాబోయ్…Total miscasting.

 9. 13 bobby 10:40 ఉద. వద్ద జూలై 13, 2010

  గౌతం మీనన్ తన పేరు ను అల మాటి మాటికి ఎందుకు మార్చాల్సి వచ్చిందో ఇంటర్వ్యూ లో చెప్పాడు పాపం. అతను సినిమాలు తీసే మొదట్లో menon అనే పదాన్ని distributors వద్దు అని చెప్పారంట.(some caste ఇష్యూ there ) మీనన్ అని వుంటే కొన్ని ప్లేస్ లలో మూవీ ఆడదు అని ప్రోడుసుర్స్ కత్తిరించారు . సో మనోడు కొంచెం పొపులర్ అయ్యాక గౌతం మీనన్ అని పెట్టుకున్నాడు. పోయిన సంవత్సరం వాళ్ళ నాన్న చనిపోతే వాసుదేవన్ అని జత చేసుకున్నాడు. మీకు విషయం తెలీక అనవసరంగా ఆది పోసుకున్నారు.

  ఏ మాయ చేసావే టైటిల్ గురించి కూడా చాల discussion జరిగింది తెలుగు పండితుల మద్య. అది తప్పుగా అనిపిస్తుంది కానీ పూర్తిగా రైట్ అని తేల్చేసారు. అది ఒక భాష ప్రయోగం. అంతే కానీ అది ఖూని కాదు అని నా అభిప్రాయం కూడా.

  ఆ చిత్రం లో నాకు నచ్చని ఒకే విషయం హీరో. సిద్ వుంటే చిన్చేసేవాడు అని అనిపించింది. మిగితా నిజంగా అది ఒక క్లాసిక్ ఏ .. యు ట్యూబ్ లో ఆ పాటలు విన్న కౌంట్ చూడండి. వాటికింద రాసిన కామెంట్స్ చదవండి. సోమనీ పీపుల్ గొట్ అద్దిక్టేడ్ టూ థెం. నా కార్ లో ఇప్పటకి అవి రోజు మోగుతు ఉండాల్సిందే. నేను మీతో విరోదించాల్సి వస్తింది సారి.

  లీడర్ గురించి ఐ అగ్రీ విత్ యు.

  అన్ని సినిమాలు అందరికి నచ్హవు. కాబటి మీరు idlebrain .కం లాంటి సైట్ లో యూసర్ అభిప్రాయాల్ని చూసి మీరు ఒక అభిప్రాయానికి వచ్చి సినిమా చూడండి అంతే గాని ఇలా మమల్ని torture పెట్టొద్దు .. lol

  • 14 అబ్రకదబ్ర 10:49 ఉద. వద్ద జూలై 13, 2010

   నా గోల సినిమా గురించే, పాటల గురించి కాదు (నాకు రెండు పాటలే నచ్చాయి. అవీ రెహ్మాన్ స్థాయిలో ఉన్నట్లనిపించలేదు). పాటలొదిలేసి సినిమా గురించి చెప్పండి.

   విభేదిస్తే తప్పేం కాదు లెండి. ఎవరి అభిప్రాయాలు వారివి.

   గౌతం మీనన్ పేరు వెనక అన్ని కథలున్నాయా? ఆయన సినిమా కథల కన్నా ఇవే బాగున్నట్లున్నాయి 🙂

   ఖాళీబుర్ర.కామ్ లో యూజర్ అభిప్రాయాలుంటాయా? ఆ సైట్‌తో అంతగా పరిచయం లేదు. అక్కడ రాసే రివ్యూలు నచ్చక దాని జోలికెళ్లటం మానేశాను.

 10. 15 Rishi 10:58 ఉద. వద్ద జూలై 13, 2010

  ఎన్నాళ్ళకండీ బాబూ,నేను 2 సినిమాలూ చూడలేదోచ్.ఏం మాయ చేసావే మాత్రం యూత్ సినిమా ట.మనము ఇంకా యూత్ కాదు కదండీ,అందుకే నచ్చదనుకుంటా 🙂

  మీ రచనా శైలి మాత్రం యధావిధి గా బావుంది.మన సినిమాలు చూడటం మానెస్తున్నారు కాబట్టి రెగ్యులర్ గా టపాలు ఎక్సెపెక్ట్ చెయ్యచ్చా?

 11. 17 కొత్తపాళీ 2:02 సా. వద్ద జూలై 13, 2010

  పైనెవరో చెప్పినట్టు యేమాయ చేశావే తమిళంలో (వినైతాండి వరువాయా) బాగుంది. త్రిషని చూడంగానే డోక్కునే నేనే పర్లేదే, ఈ అమ్మాయికి నటించడం వొచ్చు అనుకున్నాను. తమిళంలో మీరు పైన చెప్పిన రెండు కారణాలతోపాటు సింబు, త్రిష, హీరో స్నేహితుడిగా వేసినాయన, వీళ్ళు ముగ్గిరి నటన సినిమాని నిలబెట్టాయి. సినిమా కాన్సెప్టు కొంచెం గజిబిజిగా ఉన్నా, కొత్తగా బానే ఉందనిపించింది నాకైతే.

  లీడర్ గురించి .. మీరన్నదాంతో మూడొందల శాతం ఏకీభవిస్తా.

 12. 20 కామేశ్వర రావు 5:15 సా. వద్ద జూలై 13, 2010

  విచిత్రం ఏంటంటే, నేను “లీడర్” సినిమాకని హాలుకి వెళ్ళి అది మారిపోయి “ఏ మాయ చేసావే” ఆడుతుంటే తిరిగి వెళ్ళడమెందుకులే అని ఆ సినిమాకి బలయిపోయాను! మీకు కనీసం రెండు పాటలైనా నచ్చాయి, నాకదీ లేదు 😦
  ఆ తర్వాత లీడర్ సినిమా కూడా చూసి తరించాననుకోండి. ఆ సినిమా నచ్చిందీ నచ్చలేదు అని చెప్పలేను కాని మరీ “ఏ మాయ చేసావె” గాటన కట్టడానికి నా మనసొప్పటం లేదు.
  ప్రస్థానం మాత్రం నచ్చింది.

 13. 21 అబ్రకదబ్ర 5:21 సా. వద్ద జూలై 13, 2010

  @కృష్ణ, ఆ సౌమ్య, రవిచంద్ర, లేఖరి, నేస్తం, వాసు, రిషి, కామేశ్వర్రావు:

  ధన్యవాదాలు.

  మొత్తానికి, ఈఈ చిత్రాల బాధిత సంఘం పెద్దగానే ఉందన్నమాట. పదండి ముందుకు. ఓ జేయేసీ పెట్టేద్దాం.

 14. 22 రవి 9:06 సా. వద్ద జూలై 13, 2010

  ఏ మాయ చేశావే లో ఏదైనా ఉంది అంటే అది హీరోవిను ముఖారవిందం మాత్రమే. నేనా సినిమా చూసి ఇంటికెలా వచ్చానో తెలీదు.

  లీడరు గురించి.

  >>నాలుగు రోజుల పాటు గుర్తుంచుకోగలిగేది ఒక్కటంటే ఒక్క డైలాగ్ఉందా ఈ సినిమాలో?

  – సినిమా క్వాలిటీని ఇలా కూడా నిర్ణయిస్తారా? 🙂

  కథను సాంకేతికత డామినేట్ చేసిందని అరుంధతి వేస్టంటారు. (అవతార్ కు మాత్రం ఆ విషయంలో waive off!) సరే, కథ చూడండి అంటే, సాంకేతికత లేనేలేదు, amateur, మాకు కథ అనవసరం అని అంటారు. అసలు సినిమాలో మీరు ఏం ఎదురుచూస్తున్నారో క్లారిటీ లేకపోతే ఎలా? 🙂

  లాభం లేదు. రాఘవేంద్రుడే మీకు తగిన వాడు. 🙂

  • 23 అబ్రకదబ్ర 10:46 సా. వద్ద జూలై 13, 2010

   మీరు స్మైలీలెన్ని పెట్టినా నేను సీరియస్‌గానే సమాధానాలిస్తున్నా 😉

   సంభాషణలు ఏ సినిమాకైనా ముఖ్యమే. పొలిటికల్ సినిమాలకి పదునైన సంభాషణలు మరింత అవసరం.

   ‘లీడర్’లో చెప్పుకోదగ్గ కథ ఎటూ లేదు. దాని గురించి మాట్లాడుకోటం అనవసరం. సాంకేతికత అంటే గ్రాఫిక్స్ మాయాజాలం అనే అర్ధం కాదు కదా. ‘సినిమాటోగ్రఫీ’కి, ‘సినిమా’కి విడదీయలేని బంధం ఉన్నప్పుడు, చిత్రీకరణ కనీస స్థాయిలో ఉండాలని ఆశించటం తప్పు కాదు. నేను మిగతా విభాగాల గురించి మాట్లాడలేదు కూడా.

 15. 24 krishna 9:12 సా. వద్ద జూలై 13, 2010

  @ వాసు గారికి
  డబుల్ ప్రగాఢ సానుభూతి 😉

  @ రిషి గారు, నేను యూతే! నాకు కూడా ఆ సినిమా మరి నచ్చలే ! నాలో ఏమన్నా లోపం వుంది అంటారా ?

  ఈ రెండు సినిమాలు చూసి నచ్చలేదు అని చెబుతుంటే జనాలు కొట్టాలా , తన్నాలా అన్న్నట్టూ చూసారు అండి బాబు! బహుశా వాళ్ల ” బాబుల ” అభిమానులు అయ్యుండొచ్చు:) పోనిలెండి , ఇక్కడ ఇంత మందిని చూసి ఆనందంగా వుంది 🙂

 16. 25 కత్తి మహేష్ కుమార్ 10:04 సా. వద్ద జూలై 13, 2010

  ఈ సంవత్సరంలో వచ్చిన most dishonest film లీడర్.అంతకు మించి విశ్లేషణకుకూడా అర్హం కాదు.

 17. 29 సుజాత 10:09 సా. వద్ద జూలై 13, 2010

  యోమేయ చోసేవ…ఒరియా సినిమా కాదా! ఏమో నాకూ అలాగే అనిపించింది.ఎందుకంటే ఒరియా సినిమా కి సబ్ టైటిల్స్ ఉంటే కూస్త ఆర్థమయ్యేది. ఇది డవిరెక్ట్ తెలుగైనా నాకేం బోధ పళ్ళా! హీరో అందం మాటిమాటికీ కల్లోకి వచ్చి దడపుట్టించింది. హీరోయిన్ చందేరీ కాటన్ చీరెలు తప్ప ఈ సిన్మాలో ఏమీ అర్థం కాలా. చైతన్య అంటే బాగా ఖసి ఉన్నావాళ్లెవరో “నువ్వు నవ్వితే బావుంటావు” అని చెప్పినట్లున్నారు. అబ్బాయి అది నిజమే అనుకుంటున్నట్టున్నాడు. ఖర్మ!

  స్నేహితులు గుంపు టికెట్లు తీసుకోడంతో దీనికి బలైపోయా!

 18. 30 రవి చంద్ర 10:35 సా. వద్ద జూలై 13, 2010

  ఇక్కడ రోజూ మా ఆఫీసులో సాంబారు గుంపు ‘ఏం మాయ చేశావే’ సినిమా గురించి డబ్బా కొడుతుంటే ఇది ఖచ్చితంగా చూడకూడదని డిసైడయ్యి చూడలేదు. హీరో అందం మాట అటుంచితే ఆ మొహంలో భావం ఉండి చస్తేగా…

 19. 31 ఆ.సౌమ్య 10:43 సా. వద్ద జూలై 13, 2010

  ఏ మాటకామాటే చెప్పుకోవాలి. తమిళలో సింబు, త్రిష చాలా బాగా చేసారు. ముఖ్యంగా సింబు…చాలా matured గా చేసాదు. సింబు స్నేహితుడి నటన కూడా నవ్వు తెప్పించింది.

 20. 32 శ్రీవాసుకి 11:08 సా. వద్ద జూలై 13, 2010

  చాలా రోజులయింది మీరు ఇలా కలిసి. మీ విశ్లేషణలు బాగుంటాయి. నవ్వు పుట్టిస్తాయి. మీకు అభ్యంతరం లేకపోతే మీ శైలిలో “సాధారణ అమెరికా ప్రజల” జీవన విధానాన్ని, అక్కడి “భారతీయ జీవన” విధానాన్ని విపులంగా ఒక టపా వ్రాయగలరని ఆశిస్తున్నాను. ఎప్పటి నుంచో తెలుసుకోవాలని కోరిక. సినిమాల ద్వారా తెలుసుకొన్నది అంత నిజమని అనిపించటలేదు. చాలా కాలంగా మీరు అక్కడ ఉంటున్నారు కాబట్టి మంచి విశ్లేషణ చేయగలరని ఆశిస్తున్నాను. నా కోరిక మన్నిస్తారని ఆశిస్తూ…సెలవు.

  • 33 కొత్తపాళీ 5:52 ఉద. వద్ద జూలై 14, 2010

   I second, third and fourth this request (Nay, Demand!!!)
   Please do write about life in America.

   • 34 అబ్రకదబ్ర 11:18 ఉద. వద్ద జూలై 14, 2010

    @శ్రీవాసుకి,కొత్తపాళీ:

    ఈ ఆలోచనేదో బానే ఉంది. కాపోతే ఇలాంటి వాటిలో ఎంతొద్దన్నా అంతో ఇంతో మెలోడ్రామా చొరబడుతుంది. మరి నాకూ డ్రామాకీ చుక్కెదురాయె. ఐనా చూద్దాం. రాద్దాం. ఉద్యోగ విజయాలకి సీక్వెల్స్ రాయటమో, సరికొత్తగా వేరేదైనా టాపిక్కెత్తుకు రాయటమో తేల్చుకోవాలి ముందు.

    • 35 శ్రీవాసుకి 10:55 సా. వద్ద జూలై 14, 2010

     @అబ్రకదబ్ర గారు

     మీ అంగీకారానికి ధన్యవాదాలు. ఇందులో మెలోడ్రామా ఉన్నా లేకపోయినా ఫర్వాలేదు. మాలాగా స్వదేశంలో ఉన్నవారికి అక్కడి విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది. అసలు అమెరికా అంటే ఏమిటి అక్కడి సాధారణ ప్రజలు ఎలా జీవిస్తారు. ఉద్యోగంలో ఒడిదుడుకులు, కుటుంబ సమస్యలు, జీవన శైలి ఇలా ఏదైనా ఫర్వాలేదు. అలాగే అక్కడి భారతీయులు గురించి కూడా. మంచి టైటిల్ పెట్టి దీనిని మీరు సీక్వెల్స్ గా కూడా వ్రాయవచ్చు. మంచి టాపిక్.

 21. 37 bonagiri 11:49 సా. వద్ద జూలై 13, 2010

  నేను లాస్ట్ వీకెండ్ లీడర్ చూసాను.
  మీరు చెప్పిన ఇంకో సినిమా (పేరు ఎలా వ్రాయాలో తెలియడంలేదు) చూడలేదు.
  లీడర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అమెచ్యూర్ ఫాంటసీ అనిపించింది.
  ఇంకా చాలా చెప్పాలని ఉంది కాని ఇంత లేటుగా టపా వ్రాయడం బాగోదేమో?

 22. 38 Dhanaraj Manmadha 10:15 ఉద. వద్ద జూలై 18, 2010

  Both are the dumBEST and over hyped movies. మా తెలుగు తల్లికి చూసి దేవుడా అనిపించింది. మొత్తానికీ తెలుగు బ్లాగర్స్ లో ఇంకా సెన్స్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు.

 23. 39 3g 11:20 సా. వద్ద జూలై 18, 2010

  మీ టపాకి కామెంట్ రాద్దామనే మొన్న లీడర్ సినిమా చూసాను, ముందు నుంచీ ఈ సినిమాపై నాకు అంచనాల్లేవు దానిక్కారణం గోదావరి సినిమా. దాంట్లో పాటలు కొన్ని సన్నివేశాలు హాయిగా ఉంటాయికాని ఏదో రాజకీయ పార్టీలో చేరటానికి హీరో ఫైల్స్ పట్టుకొని ఇంటర్వ్యూ కి వెళ్ళడం, అదే లక్ష్యం అన్నట్టు కనిపించినోళ్ళందరికీ చెప్పడం చూడ్డానికి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. యువకులు రాజకీయాల్లోకిరావాలని జనాలు చెప్పే మాటల్ని శేకర్ ఇలా అర్ధం చేసుకున్నాడా అని నవ్వొచ్చింది. అలాంటి ఆలోచనలతోటే లీడర్ తీసుంటే ఇలానే ఉంటుందనిపించింది. మహేష్ గారు చెప్పినట్టు అంతకుమించి విశ్లేషించడం కూడా అనవసరం.

  ఇక పోతే మీరు రాయబోయే “మీ శైలిలో “సాధారణ అమెరికా ప్రజల” జీవన విధానాన్ని” చదవటానికి నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

 24. 40 zulu 12:27 ఉద. వద్ద జూలై 20, 2010

  లీడర్ లో నాకు గుర్తు ఉన్న ఒకే ఒక డైలాగ్, ఒక అమ్మాయి జీవితాన్నే కాపాడలేని వాడు, రాష్ట్రాన్ని ఏమి కాపాడగలడు. ఒక ఎం ఎల్ ఏ కొడుకు ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే, ఒక ముసలాయన అంటాడు రానా తో. (ఇంచుమించు ఇలాంటి దే)

 25. 41 Wanderer 11:21 ఉద. వద్ద సెప్టెంబర్ 12, 2012

  శేఖర్ కమ్ములని అంతవాడు ఇంతవాడు అని అందరూ మోసేస్తుంటే, “ఏమోలే, నాలోనే ఏదో లోపం ఉండుంటుంది” అని ఇప్పటివరకు నోరుమూసుక్కూర్చున్నా. ఇప్పుడు చెప్తా. ఆ ఆనంద్ సినిమా ఏంటండీ అసలు? ఆ రూప అనే పాత్రకి multiple personality disorder ఏమన్నా ఉందా? ఒక్కోసారి యద్దనపూడి నవలల్లో హీరోయిన్లాగ so-called self esteem చూపెడుతూ ఉంటుంది. ఒక్కోసారి immature గా తలతిక్కగా ప్రవర్తిస్తుంది. ఒక్కోసారి damsel in distress.. ఇంతటి బేల అబల కనపడదు అన్నట్టుంటుంది. ఇదే ముక్క ఒక శేఖర్ కమ్ముల ఫాన్ తో అంటే, “తల్లీతండ్రీ లేకుండా పెరిగిన అనాథ అమ్మాయి పర్సనాలిటీ అలా confused గా ఉండాలని కావాలనే అలా సృష్టించాడు డైరక్టర్ ఆ పాత్రని” అని వెనకేసుకొచ్చాడు. ఈ ఘోరం చూసారా?

  ఆ అమ్మాయి పెళ్ళో, నిశ్చితార్థమో ఏదో చెడగొట్టుకునే సీన్ చూసి నాకు మతోయింది. అంతకంటే strong reasons create చెయ్యలేకపోయాడా డైరక్టరు ఆ అమ్మాయి పెళ్ళి చెడగొట్టి హీరోని ప్రవేశపెట్టడానికి? ఆ అరుగు మీద ఆ సంగీతం క్లాసులేంటో.. ఆ క్లాసులో కూర్చుని సంగీతం నేర్పాల్సిన టీచరు గాలన్లకొద్దీ కాఫీలు పట్టించడం ఏమిటో.. పాడే స్వరాలకీ లిప్ మూమెంట్ కీ పొంతన ఉండదెక్కడాను. ఒక అర్థం పర్థం లేని గందరగోళం సినిమా.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: