అరాచకం

అతనో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన పార్లమెంటు సభ్యుడు. (నేతి బీరకాయలో నెయ్యి గురించీ, మన వ్యవస్థలో ప్రజాస్వామ్యం గురించీ చర్చించుకునే సందర్భం ఇది కాదు. వదిలేద్దాం) ఓదార్పు యాత్ర పేరుతో పైకి ఒప్పుకోకున్నా ప్రజల్లో పరపతీ, పలుకుబడీ పెంచుకునే పర్యటనొకటి తలపెట్టాడు. ఆ యాత్ర పరమార్ధం ఏమిటో, అతని అంతిమ లక్ష్యం ఏమిటో బహిరంగ రహస్యం. అతనీ యాత్ర తలపెట్టటాన్ని విమర్శించేవాళ్లున్నారు, దానికతను ఎంచుకున్న సమయాన్ని తప్పుపట్టేవాళ్లున్నారు. ఎవరి అభిప్రాయాలు వారివి. భిన్నాభిప్రాయాలు కలిగుండటం తప్పుకాదు. వాటిని వ్యక్తం చెయ్యటంలో తప్పు లేదు. అదే ప్రజాస్వామ్యంలో గొప్పదనం. వ్యతిరేకులకి ఎలాగైతే వాళ్ల అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కుందో, అతనికీ అలాగే ప్రజల్ని కలుసుకునే హక్కుంది – అది రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా. ఆ మాటకొస్తే దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు అతనికుంది. దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు.

తెలంగాణలో జగన్ పర్యటిస్తే గొడవలవుతాయని ముందునుండే దుందుడుకు హెచ్చరికలు జారీ చేస్తూ జనాన్ని రెచ్చగొడుతున్న వర్గాలున్నాయి. అది జగన్ హక్కుల్ని కాలరాయటమే. ఆ వర్గాలు గీత దాటకుండా నిరోధించే దమ్ములేని ప్రభుత్వానికి జగన్‌ని అరెస్ట్ చేసే నైతిక హక్కులేదు. ఒక పార్లమెంటు సభ్యుడికే తాను వెళ్లదలచుకున్న చోటికి నిరాటంకంగా వెళ్లగలిగే అవకాశం కల్పించలేని ప్రభుత్వాలు ప్రజలనేం ఉద్దరిస్తాయి? జగన్ పర్యటనపై లేనిపోని రచ్చచేసి పొలిటికల్ మైలేజ్ పొందాలనుకుంటున్నవారెవరో, మహబూబాబాద్లో జగన్‌ని అడ్డుకున్నదెవరో, గొడవలు మొదలెట్టిందెవరో తెలుసుకోటానికి తెలివితేటలక్కర్లేదు. వాళ్లని అరెస్టు చేసే తెగువ ప్రభుత్వానికెందుకు లేకపోయింది? వేర్పాటువాదుల బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు ఇంకెంతకాలం తలొగ్గటం?

జగన్ పర్యటన కారణంగా తలెత్తిన ఉద్రిక్తతలు చల్లార్చటానికీ, పరిస్థితి చెయ్యిదాటిపోకుండా చూడటానికీ అతన్ని నిర్బంధంలోకి తీసుకున్నామని ప్రభుత్వ ఉవాచ. తెలంగాణేతరులపై నిత్యం విచ్చలవిడిగా నోరు పారేసుకునే కేసీఆర్ దొరవారు విజయవాడలో బహిరంగ సభకి హాజరవబోతుంటే కోస్తా, సీమల్లో ప్రజలు ప్రశాంతంగానే ఉన్నప్పుడు, జగన్ వరంగల్‌లో పర్యటిస్తే తెలంగాణలో సెగలెందుకు రేగుతాయి? అతనెప్పుడూ తెలంగాణ ప్రజల్ని తూలనాడలేదే! మహా ఐతే, జగన్ రాక నచ్చని వారు అతని సభలకి దూరంగా ఉంటారు, అతని పర్యటనని తుస్సుమనిపిస్తారు. అయినా – జగన్ ఖమ్మంలో పర్యటించినప్పుడు కాని గొడవలు వరంగల్‌లో ఎందుకవుతాయి? ఖమ్మం తెలంగాణలో భాగం కాదా?

ఈ యాత్ర వెనక జగన్‌కి స్వార్ధ ప్రయోజనాలు ఉంటే ఉండొచ్చు. ‘వరదల్లోనో, వడగాల్పుల్లోనో మృతి చెందినవారి కోసం జగన్ ఓదార్పు యాత్ర చేపట్టటం లేదెందుకూ’, ‘తండ్రి కోసం ప్రాణాలొదిన వందమందినో రెండొందల మందినో పరామర్శించాలంటే వాళ్లనే తన దగ్గరికి పిలిపించుకోవచ్చుగా’, ‘వైఎస్ కోసం ప్రాణాలొదిన వాళ్లలో అతని బంధువులెవరూ లేరేంటో’ .. ఇలాంటి ప్రశ్నలు కోకొల్లగా వినిపిస్తున్నాయి. అవి సమంజసమైనవే. అయితే అవేవీ జగన్‌ తెలంగాణ పర్యటనని వ్యతిరేకించేవారికి సమర్ధింపులు కాలేవు. మన దేశంలో నడుస్తుంది నియంతృత్వపాలన కాదు. ప్రాంతీయవాదాలు నెత్తినేసుకుని రాష్ట్రాలు చీల్చాలని గొడవచేసే హక్కు ప్రసాదించిన రాజ్యాంగమే దేశంలో ఎవరైనా ఏ మూలకైనా ప్రయాణించే హక్కూ కల్పించింది. దానికి భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. రేపెప్పుడో రాహుల్ గాంధీ కాశ్మీర్‌లో అడుగుపెడితే రక్తం ఏరులై పారుతుందని పాకిస్తాన్ ప్రాయోజిత మిలిటెంట్ ముఠా ఏదో హెచ్చరిక జారీ చేస్తే సోనియా పుత్రరత్నాన్నీ ఇలాగే అడ్డుకుంటుందా కేంద్ర ప్రభుత్వం? జగన్ పర్యటనవల్ల గొడవలవుతాయన్న అనుమానముంటే అవి జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చెయ్యటం ప్రభుత్వ కర్తవ్యం. రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజల్ని ప్రయాణాలు మానుకోమంటే ఎలా ఉంటుంది? జగన్ విషయంలో ప్రభుత్వ స్పందన అలాగే ఉంది. గొడవలకి ప్రేరేపించేవాళ్లని అడ్డుకోవలసిందిపోయి ఓ వ్యక్తి ప్రాధమిక హక్కుని పరిహరించటం నిఖార్సైన బేవార్సుతనం. దీని వెనక ఎవరి రాజకీయాలు వారికుండొచ్చు. అంతిమంగా జరిగింది మాత్రం ప్రజాస్వామ్య ఖననం.

‘నక్సలైట్లు కూడా ఈ దేశ పౌరులే, వారి మీదకి సైన్యాన్ని ప్రయోగించం’ అన్నది ఈ మధ్యనే కేంద్ర పోలీసుమంత్రి వారి వ్యాఖ్య. దేశంలో మూడో వంతు జిల్లాల్లో సమాంతర ప్రభుత్వం నడుపుతూ అంతరంగిక భద్రతకి పెను సవాలు విసురుతున్న మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం చూపిన ఔదార్యం అది. అవన్నీ మెరమెచ్చు మాటలే కావచ్చు, తెర వెనక నక్సలైట్ల ఏరివేతకి ప్రభుత్వం అప్రజాస్వామ్యిక విధానాల్లో ప్రయత్నిస్తుండుండొచ్చు – కానీ దేశ సమగ్రతకి పెనుముప్పుగా పరిణమించి, భద్రతా బలగాలని పెద్ద ఎత్తున మట్టుపెడుతున్న మావోయిస్టుల హక్కుల విషయంలో పైపై మాటగానైనా చూపిన ఉదారత్వం రమారమి లక్ష ఓట్ల మెజారిటీతో అత్యున్నత చట్టసభకి ఎంపికైన ఓ రాజకీయవేత్త విషయంలో చూపలేని ప్రభుత్వాల చేవలేని నిర్వాకాలు ఇలాగే కొనసాగితే దేశంలో అరాచకం ప్రబలటం ఖాయం. ఆ రానున్న గడ్డుకాలానికి ఆంధ్రప్రదేశ్ ఓ నమూనా కానుందా?

లేక …. ఆల్రెడీ ఐపోయిందా?

32 స్పందనలు to “అరాచకం”


 1. 1 శ్రీనివాస్ 1:54 సా. వద్ద మే 28, 2010

  జగన్ రావడం నచ్చకపోతే, అతని యాత్ర జరిగే చోటికి దూరంగా వుండొచ్చుగా? అతనొచ్చి తెలంగాణా ఎందుకు, సమైక్యమే ముద్దు అదీ, ఇదీ అని మాట్లాడితే, అది నచ్చకపొతే ఏమన్నా ఆందోళాణ చేసినా అర్ధం వుంది. యిదేంటి? తెలంగాణా దేశానికి రావాలంటే నిజంగానే visa తీసుకోవాలా? రెండు వందలమందిని కాకపోతే, కేవలం యిద్దరినే పలకరించడానికి వెళ్తాడు? ఐతే ఏమిటంట? తెలంగాణా కోసం ప్రాణాలు తీసుకున్న వాళ్ళని మీరూ పరామర్శించండి. ఒక్కో కుటుంబానికి ఒక్కో కోటి (అచ్చు తప్పు కాదు.. అక్షరాలా కోటి) యివ్వండి. వద్దన్నదెవరు?

 2. 2 Sravya Vattikuti 2:56 సా. వద్ద మే 28, 2010

  ఆల్రెడీ ఐపోయిందా? >> మీకు ఇంకా సందేహమా ?

 3. 3 raagam 3:41 సా. వద్ద మే 28, 2010

  This is such a biased post and written in such a rush only looking to blame somebody.
  As the title indicates this is so “Arachakam” that people are living with so much hatred. I don’t see what they are going to pass to next generations.
  I think with your articles inspiration somebody can write “oka Yatra veyyi abbadaalu”
  Before reacting think with open mind and heart. Then you will is where is arachakam and who are arachakulu.

 4. 4 a2zdreams 4:44 సా. వద్ద మే 28, 2010

  తెలంగాణను రాష్ట్రంగా విడగొట్టడమే పరిష్కారానికి వున్న ఏకైక మార్గం.

  whatever the case అమాయకులను బలిపెడుతూ నాయకులు కొట్టుకు చావడం ఖాయం అనిపిస్తుంది.

  “మేము తెలంగాణలో ధైర్యంగా తిరిగాం” “సమైక్య వాదులను మేము తెలంగాణలో తిరగనివ్వలేదు” అని చెప్పుకోవడమే నాయకుల లక్ష్యంగా(తద్వారా రాజకీయ లబ్ది) కనిపిస్తుంది తప్ప, ప్రజలకు మేలు కలిగే భవిష్యత్తు మాత్రం కాదు.

  ఎవరినీ విమర్శించలేని సమర్దించలేని అసమర్దతతో నోరు మూసుకొని కూర్చోవలసిన సమయంలా వుంది.

  like it or not, accept it or not ప్రస్తుతం కె.సి.ఆర్ రియల్ నెం 1 రాజకీయ నాయకుడు.

  • 5 అబ్రకదబ్ర 4:54 సా. వద్ద మే 28, 2010

   ఇక్కడ ప్రశ్న తెలంగాణ ఇవ్వటమా కాదా అన్నది కాదు. అంతకు మించినది. ఓ ప్రాంతంలో పక్కప్రాంతం వ్యక్తి తిరగాలంటే ఎవరి అనుమతో తీసుకోవాలా? ఎక్కడికెళుతున్నాం మనం? సమైక్య రాష్ట్రంలో విభజన స్వరం వినిపించే హక్కు ఉన్నప్పుడు, దానికి వ్యతిరేక వాదం వినిపించే హక్కెందుకు ఉండదు? విజయవాడలో అడుగుపెట్టటానికి కేసీయార్‌కెంత హక్కుందో, తెలంగాణలో తిరగటానికి జగన్‌కీ అంతే హక్కుంది. కాదనటానికి కేసీయారెవరు, అతని వందిమాగధులెవరు? సమైక్యవాదుల్ని తెలంగాణలో తిరగనీయం, అంతర్యుద్ధం సృష్టిస్తాం, అల్లకల్లోలం చేస్తాం, నాలుకలు చీరేస్తాం, నరికేస్తాం, పండగలకి ఇళ్లకెళ్లినవాళ్లని తిరిగి రానీయం …. ఇలాంటి కారుకూతలతో ప్రజల్ని రెచ్చగొట్టినవారి విషయంలో చేతులు ముడుచుక్కూర్చున్న ప్రభుత్వం జగన్‌ని అరెస్టు చెయ్యటం విచిత్రం.

 5. 6 a2zdreams 4:59 సా. వద్ద మే 28, 2010

  రాజకీయ కోణంలో

  ప్రస్తుత రాజకీయలకు, ప్రజలను ఆకట్టుకోవడానికి ఆ మాటలు అవసరం. అసలు తప్పు లేదు. ఆ మాటలను పట్టించు కోవలసిన పని లేదు.

 6. 8 కొసమెరుపు 7:37 సా. వద్ద మే 28, 2010

  జగన్ పర్యటనను విజయవంతం చెయ్యడానికి శకుని మామ లాంటి రోశయ్య ప్రభుత్వం చివరిదాకా ప్రయత్నించింది. అధిష్టానం పర్యటనకు విరుద్ధంగా స్పష్టమైన విధానం ప్రకటించి నప్పటికీ, గొడవలు జరుగుతాయని ఇంటలిజెన్స్ నివేదికలు ఉన్నప్పటికీ చివరి వరకు జగన్ ను ఆపడానికి ప్రయత్నించ లేదు.

  తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు ఏ ప్రభుత్వమూ ఏమీ చేయలేదన్న చిన్న విషయం మీకు తెలియదు అనుకోలేం. టీయారెస్ ఖమ్మం పర్యటనను కూడా వ్యతిరేకించింది. కాని అక్కడ పర్యటన విజయవంతం కావడానికి కారణం అంతగా ప్రజా వ్యతిరేకత లేక పోవడమే.

  ప్రజాస్వామ్య దేశంలో ఎంపీకి సామాన్య పురుదికన్నా ఎక్కువ హక్కులేమీ లేవు. ఎలాంటి ప్రజా వ్యతిరేకత లేక పోయినా సాంబశివుడి పర్యటనకు ఎందుకు సమ్మతించ లేదు? కేసీయార్ నిరాహార దీక్షకు కూచోకుండానే అరెస్టు చేశారే? కొన్ని సందర్భాలలో శాంతి భద్రతల సమస్య ఎదురైనప్పుడు అరెస్టు చేసే విచక్షణ ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుంది.

  ఇక కేసీయారు విజయవాడ యాత్ర అంటారా. జరగనీయండి చూద్దాం. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంటే అదీ జరగదు. లేక పోతే జరుగుతుంది.

  • 9 satya 12:25 ఉద. వద్ద మే 29, 2010

   మీరు చెప్పినంత ప్రజావ్యతిరేకత అక్కడేమి లేదు. ప్రజావ్యతిరేకత ఉంటే మహబూబాబాద్ కి 2000 మంది JAC విద్యార్ధులను(?) తరలిస్తాం అని ప్రకటనలెందుకు? హరీష్ రావ్, ఈటెల రాజేందర్ అక్కడకి వెళ్ళనవసరం లేదు కూడా. ఒకరకం గా ఈ గొడవ వల్ల ఒక విషయం స్పష్టమయ్యింది. తెలంగాణ సెంటిమెంట్ సామాన్య ప్రజల్లో అంత బలంగా లేదు. ఇది కేవలం TRS, JAC ల vested interests తో జరుగుతున్న ఉద్యమం.

 7. 10 రహంతుల్లా 8:57 సా. వద్ద మే 28, 2010

  అవతలి వ్యక్తి సహించడు అని తెలిసినప్పుడు మరో సామరస్య మార్గం వెతుక్కోవటం మంచిది.”తెలుగు జాతిమనది” అనే పాట లేకుండానే “తల్లా పెళ్ళామా? సినిమా తెలంగాణాలో రిలీజ్ చేయించాడట ఎన్.టి.ఆర్.ఇలాంటి పరిస్థితిలో దగ్గరకుపోయి ఓదార్చే బదులు మృతుల కుటుంబాలకు తలా ఒక లక్ష డి.డి.ద్వారా పంపొచ్చు.ఇక జైఆంధ్ర జైతెలంగాణాలకు విరుగుడుగా ఆరు సూత్రాల ప్రకారం రాష్ట్రంలో ఆరుజోనులు ఏర్పడ్డాయి.కానీ రెవిన్యూ డిపార్ట్ మెంట్ లాంటి కీలక శాఖలకు పోలీసు శాఖలోలాగా జోనల్ ఆఫీసులు ఏర్పడనందున ప్రతి చిన్నపనికీ హైదరాబాదు వెళ్ళాల్సి వస్తోంది.వాస్తవానికి కోస్తా రాయలసీమలవారే దూరాభారాలతో ప్రయాణ ఖర్చు(అనుత్పాదక ఖర్చు) ఎక్కువగా మోస్తున్నారు.హైకోర్టు గుంటూరునుండి తరలిపోయింది .కనీసం యాభై ఏళ్ళకాలంలో బెంచి కూడా ఏర్పాటు చేయలేదు.విజయవాడ,రాజమండ్రి,,తిరుపతి,నంద్యాల,మంచిర్యాల,భద్రాచలం లాంటి కొత్తజిల్లాలు కూడా ఏర్పడలేదు.తెలంగాణ సీమాంధ్ర సరిహద్దుల్లో కొత్తజిల్లాల ఏర్పాటు కొంతన్నా సమైక్యతను నిలబెట్టవచ్చు.రాజధాని నగరానికి తరలించి ఒకేచోట పోగుపెట్టిన అభివృద్ధి కేంద్రాలను ఇప్పటికైనా రాష్ట్రంలోని ఆరు జోన్లకూ తరలించాలి.యానాం ను మనరాష్ట్రం లో కలపాలని కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ చాలా కాలం క్రితమే తీర్మానించింది. అక్కడి ప్రముఖులు మల్లాడి,వాసిరెడ్డి,మాజేస్టి,మొదలైనవారంతా ఒక భాష మాట్లాడే వాళ్ళంతా ఒక రాష్ట్రంగా ఉండటం,లేదా భౌగోళీకంగా సమీప ప్రాంతాలు ఒక రాష్ట్రంగా ఉండటం అనే ఏదో ఒక ప్రాతిపధికను అంగీకరించాలి.

 8. 11 సుజాత 2:29 ఉద. వద్ద మే 29, 2010

  జగన్ హక్కుల గురించి మాట్లాడేటపుడు రాష్ట్రంలో వాస్తవికంగా నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్ని మనం పరిగణనలోకి తీసుకోవలసిన పని లేదా? శ్రీకృష్ణ కమిటీ ప్రవేశం వల్ల తాత్కాలికంగా చప్ప బడిన తెలంగాణా ఉద్యమం అవకాశం కోసం చూస్తోందని జగన్ గ్రహించనక్కర్లేదా?రెండు రోజుల క్రితం మహబూబా బాద్ లో బాము దొరికి, “జగన్ వస్తే పేల్చేస్తాం” అంటూ లేఖలు దొరికినా పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందో అంచనా వేయలేనంత పసి బాలుడా ఆయన గారు?

  ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో జగన్ చేయాల్సిన పనేమిటి? తనను అధిష్టానం పట్టించుకోవడం లేదన్న అక్కసుతోనో, ఉక్రోషంతోనో ఎంతటి ఉద్రిక్త పరిస్తితిని సృష్టించడానికైనా సిద్ధం అవడం బుద్ధి ఉన్న మనిషి చేసే పనేనా? ఒక ఎం.పీగా, మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా, ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తిగా పాటించవలసిన పద్ధతి ఇదేనా? తను వి ఐ పీ కాబట్టి తన ప్రాణానికేం ప్రమాదం ఉండదని తెలుసు. జనం ప్రాణాలు, ప్రభుత్వ ఆస్థులు మాత్రం ఎంత నాశనమైనా పర్లేదు.

  తన యాత్ర ఉద్రిక్తతల్ని రెచ్చగొడుతుందన్న విషయం గ్రహించీ అందుకు సిద్ధపడ్డవాడు ఇక ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ గోతిలోకి పోతుందో జనం ఊహించుకోవలసిందే!సంయమనం అన్న మాటకే అర్థం తెలీకుండా బలగాన్ని వేసుకుని బయలుదేరింది కాక “హింస వద్దు”అని చిలకపలుకులు పలుకుతున్నాడు.

  ఈ గొడవల్లో గాయపడ్డవాళ్ళకి ఏదీ ఓదార్పు? తగలబడిన పద్మావతీ ఎక్స్ ప్రెస్ కి,ధ్వంసం అయిన సిగ్నలింగ్ వ్యవస్థకు ఎవరు ఇస్థారు పరిహారం?

  ఈ రోజు తెలంగాణా బంద్ వల్ల ఎంత నష్టం? రోజువారీ పన్లతో బతికేవాళ్ళకు ఎంత వ్యధ?వీళ్ళందరినీ ఓదార్చడానికి ఏదీ దారి!

  పరిస్థితిని గ్రహించి అటునుంచి నరుక్కురావడం,లౌక్యంగా పరిస్థితిని చక్కదిద్దుకోవడం తెలీని వాడు ఎప్పటికి అవుతాడు ముఖ్యమంత్రి?

  ఎవరికీ ప్రజా సంక్షేమం అక్కర్లేదు. అవును మరి, రాజకీయ నాయకుల అసలు స్వరూపాలు తెలిసీ వారి వెంట గొర్రెల్లా పైగెత్తే వాళ్ళంటే చులకనే మరి!

  • 12 satya 4:25 ఉద. వద్ద మే 29, 2010

   “అసలీ “ఆంద్రోళ్ళ” కాన్సెప్ట్ ఏమిటి? ఆంధ్రులెవరు? ఈ రాష్ట్ర ప్రజలు కాదా? వారికి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇష్టమైతే అక్కడ, ఎక్కడ అనుకూల పరిస్థితులుంటే అక్కడ నివసించే హక్కు ఉందా లేదా? తీవ్రవాదులకు కూడా యధేచ్చగా హైదరాబాదులో సంచరించే స్వేచ్ఛ ఉందే! వీరికెందుకు లేదు? ”

   — ఇది ఎక్కడో చదివినట్లు వుంది. కొంచెం చెప్తారా?

   • 13 సుజాత 5:08 ఉద. వద్ద మే 29, 2010

    నా బ్లాగులోనే చదివారు పాపం! ఇప్పటికీ అదే అంటాను.దానర్థం జగన్ని సమర్థిస్తానని కాదు. ఇప్పుడు జగన్ కావాలని చేసిన ఈ పనిని వ్యతిరేకిస్తే నేను తెలంగాణా వాదినీ అయిపోను.ఎప్పుడైనా ప్రజా జీవితానికి భంగం కల్గించే ఏ పనినీ ఎవరూ సమర్థించరు. వాళ్లలో నేనూనూ! అది మీరు గ్రహించాలి.

   • 14 సుజాత 5:32 ఉద. వద్ద మే 29, 2010

    ఇంకో మాట! నిన్న అక్కడ గొడవ జరిగిందో లేదో వెంటనే తెలంగాణా బంద్. ఇవాళ డబ్బు కావలసి వస్తే బాంకు మూసేసి ఉంది. ATMలో డబ్బులైపోయాయి. ఏం చేయాలో చెప్పండి? ఎవరు ఎవర్ని ఓదారుస్తారో గానీ మామూలు జనాలకెందుకీ శిక్ష?

   • 15 satya 6:03 ఉద. వద్ద మే 29, 2010

    ఓ! బ్యాంక్ మూసేసి ఉండటం మీ ఆగ్రహానికి కారణం అని అర్ధమయింది.

    ఇక్కడ జగన్ కావాలని ఏం చేసాడో నాకైతే అర్ధం కాలేదు. నిజానికి మహబూబబాద్ లో జగన్ పర్యటన పట్ల ఎలాంటి వ్యతిరేకత లేదు. అందుకే కావాలని బయటనించి OU JAC లో ఖాళీగా పడున్న వాళ్ళని అక్కడికి పంపించి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారు. మీరు కేవలం జగన్ కి మాత్రమే ఆదర్శాలు వల్లేస్తే సరిపోదు. It is very clear that TRS created artificial tension in that area తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆ మాత్రం ఆలోచించకుండా చేస్తాడు అనుకుంటే మీరు పొరబడినట్లే. Atleast in this instant i didnt feel anything wrong with him.

   • 16 satya 6:07 ఉద. వద్ద మే 29, 2010

    ఇక్కడ ప్రజా జీవితానికి భంగం కలిగించింది జగన్ కాదు. తనేమి బంద్ కి పిలుపివ్వలేదు. గొడవ అయిపొయింది. తన వరకు తను వాయిందా వేస్తున్నట్లు ప్రకటించాడు. ఇంక బంద్ అవసరం ఏం వచ్చింది? ప్రజా జీవనానికి భంగం కలిగింది బంద్ వల్ల కానీ జగన్ పర్యటన వల్ల కాదు.

   • 17 సుజాత 4:57 ఉద. వద్ద మే 30, 2010

    బాంక్ మూసేసి ఉంటే నా స్థాయికి అదొక సమస్య కాదు కాబట్టి నేను డబ్బు సర్దుబాటు చేసుకోగలిగాను. మరి సర్దుబాటు చేసుకోలేకపోతేనో?

    “గొడవ అయిపొయింది. తన వరకు తను వాయిందా వేస్తున్నట్లు ప్రకటించాడు”!…చక్కగా చెప్తున్నారు. గొడవ అయిపోయిందని. అంటే గొడవ జరగాలి, రభస కావాలనే ఉద్దేశంతోనే ఈ యాత్ర మొదలుపెట్టారా?

    సమైక్య వాదులం కదా అని జగన్ లాంటి వాళ్ళు ఏం చేసినా సమర్థించాలనుకునే వాళ్ళ వాదాలకు సమాధానాలుండవు.

    ప్రతి చిన్న సంఘటనకీ బంద్ లకు పిలుపివ్వాలని ఉవ్విళ్ళూరాలనుకునే వాళ్ళకి ఈ మాత్రం “గొడవ” చాలదా?

    ప్రజా జీవితం భగ్నమవుతుందనో,ప్రభుత్వ ఆస్థులు నాశనమవుతాయనో ఆలోచిస్తే ఈ యాత్రకు పూనుకుంటాడా? యాత్రే జరగకపోతే ,”గొడవే” కాకపోతే బందే ఉండదుగా!

    సమైక్యవాదం ఈ స్థాయిలో ఉండబట్టే వేర్పాటు వాదుల ఆటలు అంత బాగా సాగుతున్నాయి.

    TRSవాళ్ళకి కొత్త బలం KCR కాదు, జగనే ఎక్కించాడు ఈ యాత్రతో!

 9. 18 అబ్రకదబ్ర 2:56 ఉద. వద్ద మే 29, 2010

  జగన్ లక్ష్యాలేంటో తెలిసినవే. ఓదార్పు యాత్ర పరమార్ధమూ తెలిసిందే. అతనెంత నీతిపరుడన్నది ఇక్కడ అసందర్భం. అతని ఉద్దేశాలని ప్రశ్నించే జోరులో అంతకన్నా ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నారు మీరు. ఇది జగన్ ఒక్కడి హక్కుల సమస్య కాదు. ఇది ఏ వాదం ఒప్పన్న చర్చా కాదు. There are bigger issues at stake. రేపు కేసీయార్‌ని విజయవాడ రానీయమని ఎవడన్నా హుంకరించినా ఇదే ప్రశ్నొస్తుంది నానుండి. అతనెలాంటివాడైనా, ప్రతి భారతీయుడికీ దేశంలో ఎక్కడికైనా వెళ్లగలిగే హక్కు ఉందా లేదా అన్నది ప్రశ్న. అటువంటి వాతావరణం కల్పించలేనప్పుడు ఇక ప్రభుత్వాలెందుకు, ఏడవనా? That’s the crux of my post.

  ‘గొడవలవుతాయని తెలిసీ వెళ్లాలనుకోవటం అతని తప్పు’ అన్నది సరైన ఆలోచనా విధానం కాదు. అసలు ఒక వ్యక్తి ఒక ప్రాంతానికి వెళితే గొడవలు ఎందుకవాలి? ఆ ప్రాంతంలో ప్రజలందరూ జగడాలమారులనా దానర్ధం? ప్రజాభీష్టం, ప్రజావ్యతిరేకత లాంటి పడికట్టుపదాలు లేని ప్రజాసక్తిని ప్రతిబింబించలేవు. అసలా గొడవల వెనకుందెవరో బహిరంగ రహస్యమే. ఇలాంటివి అడ్డుకోవటం మావల్ల కాదని ప్రభుత్వాన్ని చేతులెత్తేయమనండి .. ఆ చేతగానితనంలో నిజాయితీ అన్నా మిగులుతుంది.

  • 19 సుజాత 5:16 ఉద. వద్ద మే 29, 2010

   జగన్ ఉద్దేశాలని ప్రశ్నించే ఉద్దేశం నాకెంత మాత్రమూ లేదు. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో సంయమనం పాటించకుండా ఈ యాత్రను సాగించి హింసాయుత పరిస్థితుల్ని మరింత రెచ్చగొట్టడం న్యాయమా అని మాత్రమే నా ప్రశ్న!

   అటువంటి వాతావరణం కల్పించలేనప్పుడు ఇక ప్రభుత్వాలెందుకు, ఏడవనా?….అసలు ఇక్కడున్న వాస్తవ పరిస్థితిలో ఎలాంటి వ్యతిరేక పరిస్థితినీ ఎదుర్కొనే పరిస్థితిలో లేదండీ ప్రభుత్వం!నిజంగానే చేతులెత్తేసింది. ఈ సంగతి జనమంతటికీ తెల్సు. జగన్ కి తెలీదా అనే అడగటం!

   “అసలు ఒక వ్యక్తి ఒక ప్రాంతానికి వెళితే గొడవలు ఎందుకవాలి? “…ఈ ప్రశ్నకు రాజకీయ నాయకులు చెప్పాలి.ప్రాంతీయ వాదాలను రెచ్చగొట్టేవాళ్ళు చెప్పాలి.

   ఇప్పుడు TRS దీన్ని తెలంగాణా ఆత్మగౌరవం మీద తగిలిన దెబ్బగా ప్రచారం చేస్తోంది.దానివల్ల ఇప్పుడిప్పుడే చల్లబడుతున్న నగర వాతావారణం ఒక్కసారిగా వేడెక్కి దెబ్బకి 46 డిగ్రీల ఎండని మరిపింప జేస్తోంది.

   • 20 అబ్రకదబ్ర 10:45 ఉద. వద్ద మే 29, 2010

    ఆ ప్రశ్నలు మీకు కాదులెండి 🙂

    జగన్ కోసం వచ్చిన వేలాదిమందిని చెదరగొట్టగలిగిన పోలీసులు వందలసంఖ్యలో ఉన్న కిరాయి మూకల్ని చెదరగొట్టలేక పోవటం ఏంటి?

    టీఆర్ఎస్ ప్రాయోజిత సైన్యం (ఆ సైన్యానికిచ్చిన తర్ఫీదు, వాళ్లని యూనివర్శిటీల్లో విద్యార్ధులుగా ప్రవేశపెట్టిన వైనం …. ఇవన్నీ మీకు తెలిసే ఉండాలి) పనికాక ఎవరి పని ఇది?

    అరాచకం చాలా చిన్నమాట.

   • 21 kvsv 2:56 సా. వద్ద మే 29, 2010

    TRS దీన్ని తెలంగాణా ఆత్మగౌరవం మీద తగిలిన దెబ్బగా ప్రచారం చేస్తోంది..
    వీళ్ళ పద్దతి ఎలా వుందంటే వెనకటికెవడో తనకాళ్ళకి తానే దణ్ణం పెట్టుకుని దీర్గాయుష్మాన్ భవా…అని దీవించుకున్నాడట..పనికిమాలిన యాత్ర దాన్ని తరమదానికి పని లేని వెదవల గుంపు మరోటీ…..

 10. 22 Sarath 'Kaalam' 4:24 ఉద. వద్ద మే 29, 2010

  మీ భావంతో ఏకీభవిస్తున్నాను. చిరంజీవిలాంటి ఇతర చాలామంది నాయకులు చూపించలేని దమ్ము జగన్ చూపినాడు. ఈ విషయంలో జగనును అభినందించలేకుండా వుండలేకపోతున్నాను.

 11. 23 అబ్రకదబ్ర 3:38 సా. వద్ద మే 29, 2010

  >> “పనికిమాలిన యాత్ర దాన్ని తరమదానికి పని లేని వెదవల గుంపు మరోటీ”

  Bull’s eye! You’ve boiled the whole circus down to one line 🙂

 12. 24 jaja 10:23 సా. వద్ద మే 29, 2010

  “రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజల్ని ప్రయాణాలు మానుకోమంటే ఎలా ఉంటుంది?
  It is like .. the announcement beofre the begin of a telugu sinema – smoking is injurious to health. and the hero lights a new cigarette from the butt of the old one.

 13. 25 Satyanveshi 2:11 ఉద. వద్ద మే 30, 2010

  ఒక వ్యక్తిగా జగన్‌కు రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళే హక్కు ఉంది. కాని ఒక రెండువెల మందీ మార్బలంతో, అంగరక్షకులూ, ఆయుధాలతో ఊరేగింపుగా వెళ్ళాలంటే దానికి ముందస్తు అనుమతి తీసుకోవాలి. మరి ఈ పెద్ద మనిషి ఎవరివద్ద అనుమతి తీసుకున్నాడు?

  తామెక్కడికైనా వెల్లే హక్కు ఉందని చెప్పే జగన్, కొండా సురేఖ తమ నియోజక వర్గాలలో ఆటవిక పాలనను సాగిస్తూ ఇతర పార్టీ వారినెవ్వరినీ ప్రచారానికి అనుమతించరెందుకు?

  ఇక మీరు వ్రాసిన టపా, విద్యార్థులే గూండాలుగా వ్యవహరించనట్లు అర్ధం వచ్చేట్లుగ రాయడం పూర్తిగా ఏకపక్షం, పక్షపాత ధోరణి. మెజారిటీ న్యూస్పేపర్లూ, టీవీ చానెల్స్ విజుయల్స్ కధనం ప్రకారం నిరసనకారులను రెచ్చగొట్టిందీ, మొదట రాళ్ళు వేసిందీ జగన్ వర్గీయులే. కాల్పులు జరిపింది గన్‌మెన్లతోపాటు నాయకులని కూడా తేలిపోయింది.

  కేసీయార్‌కి శాంతియుతంగా నిరాహారదీక్ష చేసే హక్కు కూడా ఇవ్వకుండా ముందస్తు అరెస్టు చేసిన ప్రభుత్వం జగన్‌కి మాత్రం పూర్తిగా దాసోహం ఎందుకయ్యింది?

  • 26 అబ్రకదబ్ర 12:13 సా. వద్ద మే 30, 2010

   ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడి యాత్ర మందీమార్బల రహితంగా జరిగిందో, జరుగుతుందో చెబుతారా? అద్వానీ రధయాత్ర నుండి, వైఎస్ పాదయాత్ర దాకా ఉదాహరణలెన్నో. వాటికి ఆనాటి ప్రభుత్వాలు సహరించాయే తప్ప అడ్డుకోలేదు. గొడవలవుతాయనుకుంటే బందోబస్తు కల్పించారే తప్ప వాళ్లని తిరగనీకుండా ఆపలేదు (రధయాత్ర బీహార్లో ప్రవేశించాక లల్లూ యాదవ్ అత్యుత్సాహానికిపోయి అద్వానీని అరెస్టు చేయించాడనుకోండి – దానికి కారణాలు వేరే. ఆ ఘనత ఎక్కడ ములాయం యాదవ్‌కి పోతుందో అన్న శంకతో యదుకుల రంజకుడిగా అవతారమెత్తే వెధవ రాజకీయంతో వేసిన ఎత్తది)

   నేను విద్యార్ధుల ప్రస్తావన నా టపాలో తేలేదు. నేను రాయని విషయాలు అంటగట్టవద్దు. వ్యాఖ్యల్లో ఒకసారి మాత్రం సందర్భానుసారం కిరాయి మూకల గురించి ప్రస్తావించాను. అందులో నిజమెంతో మీకు తెలిసీ తెలీనట్లు నటిస్తే నేను చేసేదేమీ లేదు.

   సందర్భం ఓదార్పు యాత్ర కావచ్చు. సమస్య మాత్రం జగన్, కేసీయార్, తెలంగాణ .. వీటన్నిటికన్నా పెద్దది. మనకి విరుద్ధమైన అభిప్రాయం కలిగున్న కారణంతో ఓ వ్యక్తిని మన ప్రాంతంలో తిరగనీయమనే స్థాయికి రాజకీయుల సహనమూ, అతనికి సహకారం అందించలేని స్థాయికి ప్రభుత్వాల ప్రమాణాలూ పడిపోయిన దేశంలో …. వెయ్యి తెలంగాణలొచ్చినా ప్రజల బతులు బండలే. ఆ విషయం గురించి నేనిక్కడ గొంతు చించుకుంటుంటే మీరు దాన్నొదిలేసి ఎవరు ముందు రాళ్లేశారు, ఎవరు కాల్పులు జరిపారు వంటి చిన్న విషయాల గురించి మాట్లాడుతున్నారు.

   కేసీయార్ని ప్రభుత్వం ఎందుకు అడ్డుకుందని నన్నడిగితే నేనేమి చెబుతాను – నా అభిప్రాయం తప్ప? వింటానంటే ఇదిగో వినండి: “అనవసరంగా అడ్డుకుని చచ్చిన పాములా పడున్నోడిని తెచ్చి హీరోని చేసేశారు, ఇక్కడిదాకా తీసుకొచ్చారు”

 14. 27 Sreeni 5:54 సా. వద్ద మే 30, 2010

  All of you Andhrites are just one sided thinkers… Yes – one day in near future, Telangana region will be a separate country if your minds continue to ignore the story and keep festering cheap rogues like Jagan and Lagadapati.

 15. 28 Andhrite 9:50 ఉద. వద్ద మే 31, 2010

  అన్నా, మేం 1 సైడెడో 1/2 సైడెడో అసలంటూ ఆలోచిస్తాం. మీరు అదీ చెయ్యరుగా. ఎంతకీ ఆ ముక్కోడు చెప్పింది గొర్రెల్లా వింటమే. వాడికన్నా రోగ్ ఎవడు

 16. 29 satya 11:34 సా. వద్ద జూన్ 1, 2010

  గొడవ జరగాలి, రభస కావాలనే ఉద్దేశంతోనే ఈ యాత్ర మొదలుపెట్టారా?

  అసలు గొడవ జరగాలని కోరుకున్నది ఎవరు? అయిన తర్వాత బంద్ ప్రకటనలు ఇచ్చిందెవరో తెలీనట్లు మాట్లాడుతున్నారు. రభస కావాలని యాత్ర మొదలుపెట్టాడా, రభస చెయ్యటం కోసం వేర్పాటు వాదులు యాత్ర ను వాడుకున్నారా?

  సమైక్య వాదులం కదా అని జగన్ లాంటి వాళ్ళు ఏం చేసినా సమర్థించాలనుకునే వాళ్ళ వాదాలకు సమాధానాలుండవు.

  I dont know how you came to this conclusion? కాంగ్రెస్/వైయస్సార్ వ్యతిరేకులం కదా అని జగన్ ని వ్యతిరేకించాటానికి వేర్పాటు వాదులకి పల్లవి పాడేవాళ్ళకి సమాధానలుండవ్.

  యాత్రే జరగకపోతే ,”గొడవే” కాకపోతే బందే ఉండదుగా!

  అసలు వైయస్ యే చనిపోకపోతే.. కేసీఆర్ పుట్టకపోతే… అని లాజిక్ వెతుక్కుంటే ఏం ప్రయోజనం?

 17. 30 Ramesh 3:47 ఉద. వద్ద జూన్ 2, 2010

  Here one thing we have to notice, who ever it is, telangana supporters or not, we as INDIANS has the right to visit and leave in any part of this country. So do Jagan and KCR. If Jagan wants to visit Warangal or KCR wants to visit Vijayawada, they should be allowed.

  It is complete cheap politics if some one says Jagan should not visit Warangal. They should be arrested first.

  I am not supporter of Jagan, I completely oppose if some one says he should be given CM post, just because his late father was CM.

  We are leaving in democratic country, if people don’t support someone’s views, you have right to express the same, but you can not throw stones at some one.

  Please oppose this kind of cheap politics

 18. 31 కొత్తపాళీ 10:09 ఉద. వద్ద జూన్ 25, 2010

  I don’t have sympathy for any of the characters involved in that stupid drama, but you raise an interesting perspective – true, it is the government’s primary due to protect it’s citizens’ fundamental rights.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: