ఆరేళ్ల తర్వాత

వివిధ సంక్షేమ పధకాలకు చెల్లుచీటీ రాసే విషయం రాష్ట్రప్రభుత్వం తీక్షణంగా, తీవ్రాతితీవ్రంగా పరిశీలిస్తున్నట్లు కొన్నాళ్లుగా సమాచార సాధనాలు ఇల్లిల్లూ ఎక్కి కోళ్లై కూస్తున్నాయి. నాలుగైదు రోజులుగా ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల వ్యాఖ్యలు దాన్ని ధృవపరుస్తున్నాయి. ఇలాంటి పధకాల వల్ల కొందరు పేదలకి తాత్కాలికంగా ఒరిగేదేమన్నా ఉంటే ఉండెచ్చేమో కానీ, దీర్ఘకాలంలో అవి వాళ్లని బిచ్చగాళ్లుగా మార్చటం తప్ప నిజంగా ఉద్ధరించేదేమీ ఉండదని గ్రహించటానికి మేధావులై ఉండనవసరం లేదు. ఉచిత పధకాల ముసుగులో అస్మదీయులకు అడ్డూఅదుపూ లేకుండా దోచిపెట్టి అవసరం తీరిపోయాక ఆర్ధిక భారం పేరుతో వాటికి పాతరేస్తారన్న అంచనాలు ముందునుండీ ఉన్నవే కాబట్టి సర్కారువారి తాజా కప్పగంతుకి ఆశ్చర్యం తన్నుకురాలేదు, ఆవేశం పెల్లుబుకనూ లేదు. అంతో ఇంతో ఆనందమే వేసింది – కనకపు సింహాసనాన ఎవర్నిబడితే వారిని కూర్చోబెడితే ఏం మూడుతుందో హస్తం గుర్తుకి ముద్ర గుద్దిన ఓటరుదేవుళ్లకి ఇప్పటికన్నా అర్ధమౌతుందేమోనన్న ఆశతో. ఐతే ఆ ఆశా, ఆనందమూ వెంటనే ఆవిరైపోయాయి – ‘ఫలానా ఆయన పదవిలో ఉండబట్టే వర్షాలు విస్తారంగా కురిశాయి’ అనుకుంటూ ఈవీఎమ్ మీటనొక్కే ఓటరు మారాజులున్నంతకాలం అలాంటి ఫలానాల పంటలు పండుతూనే ఉంటాయన్న సత్యం గుర్తొచ్చి.

ఖజానాని కరువుదీరా కొల్లగొట్టి, అయినవారికి అందినమేరా దోచిపెట్టి, రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసి తీరా పప్పులుడికే సమయానికి తప్పుకుపోయాడో అదృష్టవంతుడు. ఆర్ధికమంత్రిగా ఆ అపర భగీరధుడి విచ్చలవిడితనాన్ని విధిలేకో, నిలదీసే దమ్ములేకో వెనకేసుకొచ్చిన రోశయ్యామాత్యులకి ముఖ్యమంత్రి పీఠమెక్కాక ముద్ద తిరిగి గొంతులోకి రావటానికీ, తత్వం తలకెక్కటానికీ ఎన్నాళ్లో పట్టలేదు. కానీ ఏం చేద్దామన్నా కాలూ చెయ్యీ ఆడని పరిస్థితి ఆయనది. ముందు నుయ్యి, వెనకా నుయ్యే ఆయనకి. ‘మా నాన్న వరాలు రద్దు చేస్తే తాట తీస్తా’ అంటూ కుర్చీ కోసం గోతికాడ నక్కలా పొంచుక్కూర్చున్న యువరాజావారి హుంకరింపులో పక్క, ఖాళీ చిప్పలా వెక్కిరిస్తున్న ఖజానా మరో పక్క – వెరసి రోశయ్య తిప్పలు వర్ణనాతీతం. ఈ వయసులో ఆయనకు రావాల్సిన కష్టాలు కావవి.

‘అర్హత లేనివాళ్లే లబ్దిదారుల్లో అధికులు’, ‘అవసరానికి మించిన రేషన్ కార్డుల జారీ జరిగిన మాట నిజం’, ‘సంక్షేమ పధకాల్లో అవకతవకలు సత్యం’, ‘మరో నలభయ్యేళ్లైనా జలయజ్ఞం పూర్తి కాదు’ .. ఇవన్నీ ప్రతిపక్షాలు రువ్వుతున్న విమర్శలు కావు. సాక్షాత్తూ ప్రభుత్వ పెద్దలూ, అధికార పక్ష నాయకులూ వెల్లడిస్తున్న వాస్తవాలు. ఎన్నికల్లో విజయాలే ఏకైక లక్ష్యంగా కాంగిరేసు కామందులు ఐదేళ్లుగా ప్రజల నెత్తిన పద్ధతిగా పెట్టిన కుచ్చు టోపీల  బొచ్చు ఊడగొడుతున్న ఊసులివి. సంక్షేమ పధకాలు అటకెక్కితే సంక్షోభంలో పడిపోతామన్న భయంతో కొందరు కేతిగాళ్లు మరో అడుగు ముందుకేసి ‘మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పధకాల్లో కోతలు పార్టీకి నష్టం’ అంటూ రోశయ్యామాత్యులు తమ కొంపలు ముంచేలోపే వారించే ఆత్రంలో ముందూవెనకా చూసుకోకుండా కుండ బద్దలు కొట్టేశారు. అనుకోకుండానైనా అసలు రహస్యం బట్టబయలు చేసినందుకు వీళ్లని అభినందిద్దాం.

చిన్నా చితకా నాయకుల నోళ్లనుండి రాలిపడుతున్న ఆణిముత్యాలో ఎత్తు, రోశయ్యగారు రాల్చిన రత్నం ఒకటీ ఒకెత్తు: ‘పధకాల అమలు పునఃసమీక్షించాలన్న నిర్ణయం వైఎస్‌దే’. రెండోసారి అధికారంలోకొచ్చిన కొన్నాళ్లకే వైఎస్‌కి ఆ మాదిరి జ్ఞానోదయమయిందంటే ఏమిటి దానర్ధం?  ఓట్లు దండుకోటానికి ఎడాపెడా రేషన్ కార్డుల మంజూరీకి జెండా ఊపిందెవరు? అర్హత ఊసులేకుండా ఉచితానుచితాలు మరిచి వరాలు గుప్పించిందెవరు? ఉచిత విద్యుత్తంటూ విద్యుత్ రంగాన్ని ఛిన్నాభిన్నం చేసిందెవరు? అడిగినవారినీ అడగనివారినీ అడ్డదారుల్లో లబ్దిదారుల్లో చేర్చిందెవరు, చేర్చమందెవరు? ఎన్నికలవ్వగానే ఓటు మల్లన్నలు బోడి మల్లన్నలైపోయారా? అంతకు ముందు అగుపించని అవకతవకలు అయ్యవారికి అర్జెంటుగా కనిపించేశాయా?

పావలా రుణాలు, ఇందిరమ్మ పధకాలు, ఆరోగ్యశ్రీలు, సెజ్‌ల పంపిణీలు, ప్రభుత్వ భూముల విక్రయాలు .. వైఎస్ విరచిత వర ప్రసాదాల్లో లొసుగులూ, లోగుట్లూ లేనిది ఒక్కటన్నా ఉందా? ప్రభుత్వ పధకాల అమల్లో కుంభకోణాలు చోటుచేసుకోవటం పాత విషయం. కుంభకోణాల అమలు కోసమే పధకాలు రూపొందించటం వైఎస్ నేర్పి పోయిన ఉపాయం. ఆరేళ్ల కాంగిరేసు జమానాలో రాష్ట్రానికి కొత్తగా వచ్చి పడ్డ పరిశ్రమల్లేవు – ఉన్నవీ పీక్కుపోవటం తప్ప. ఉచిత విద్యుత్ అంటూ విద్యుత్ రంగం ఉసురు తీసేశారు. ఇప్పుడు డబ్బు కడతామన్నా కరెంట్ ఇవ్వలేని దౌర్భాగ్యం. జల యజ్ఞం పేరుతో వేలకోట్లు ఎగిరిపోయాయి, ప్రాజెక్టులు మాత్రం మొదట్లోనే ఉన్నాయి! రైతుల ఆత్మహత్యలు పెరిగాయే తప్ప తగ్గలేదు. కర్నూలు లాంటి కరువు ప్రాంతాల్లో వరదలొచ్చే విచిత్ర పరిస్థితి! ఇవి చాలనట్లు అదనంగా అంతులేని అవినీతి, ప్రభుత్వాధికారుల్లో అలవిమాలిన అలసత్వం. ఐదేళ్ల వైఎస్ జమానా చేసిపోయిన చేటది. కూలీ నాలీ జనాలకి పూటుగా మందు తాపీ, ప్రజల భూముల్ని వచ్చినకాడికి తెగనమ్మీ సంపాదించే సొమ్మే ప్రభుత్వ బొక్కసానికి కొండంత ఆసరా అంటే అదెంత దిక్కుమాలిన ప్రభుత్వమో అర్ధమైపోతుంది. రాష్ట్రంలో ఈ ఆరేళ్లలో ప్రభుత్వం విదిల్చే ముష్టి మెతుకుల కోసం ఎదురు చూసే ఓట్ బ్యాంకొకటి పుట్టుకు రావటమే కానీ వేరే నిర్మాణాత్మక మార్పేదీ రాలేదు – ఆరేళ్ల కిందట అడ్రస్ లేని యువకుడొకడు అమాంతం అంబానీలని తలదన్నే స్థాయి పారిశ్రామికవేత్తగా అవతరించటం తప్ప.

సరే. ఎప్పుడూ ప్రతిపక్షాల మీద చిర్రుబుర్రులాడుతూ నిష్టూరపడిపోయే రోశయ్యగారు ఎట్టకేలకో నిష్టూరమైన నిజం ఒప్పుకున్నారు: ఆంధ్రప్రదేశ్ నిండా అప్పుల్లో ఉందనీ, ఏ పధకం అమలు చెయ్యటానికీ సొమ్ముల్లేవనీ. ప్రభుత్వోద్యోగుల జీతాలు చెల్లించటానికన్నా ఉన్నాయో లేవో మరి. మొత్తానికి నిజం బయటికొచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు కింకర్తవ్యం? రోశయ్యగారి నాయకత్వమ్మీద ఆయనకే నమ్మకమున్న దాఖలాల్లేవు. రాజధానిలో మతకలహాలు, రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు, ఉత్తుత్తి దీక్షకి ఉలికి పడి అతిగా స్పందించి రాష్ట్రాన్ని చీలిక అంచులదాకా తీసుకుపోయిన నిర్వాకాలు .. ఒకటా రెండా ఆయన వైఫల్యాలు? అయినదానికీ కానిదానికీ అధిష్టానాధిదేవత అనుగ్రహం కోసం చేతులు నులుముకుంటూ నిరీక్షించటం తప్ప మరేమీ చెయ్యలేని అముఖ్యమంత్రిగా ఆయనకి ఆల్రెడీ పేరొచ్చేసింది. మరి అలవాటుగా ఇప్పుడూ ‘నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి సారూ, నాకేం తెలీదు’ అంటూ ఈ సమస్యలు సైతం ఢిల్లీ దేవత ఒడిలోకి నెట్టి గమ్మున కూర్చుంటారా, ఇప్పటికన్నా జూలు విదిల్చి (తెలుసు – వారిది తళతళలాడే నున్నటి గుండే) పదిహేనేళ్ల పైగా ఆంధ్రప్రదేశ్‌కి ఆర్ధికమంత్రిత్వం వెలగబెట్టిన అనుభవంతో రాష్ట్రాన్ని ఒడ్డుకి చేరుస్తారా? రాజకీయ జీవిత చరమాంకంలో అనుకోని అదృష్టం తలుపుతడితే అందలమెక్కిన అలనాటి మరో తెలుగు పెద్దాయన దివాలా అంచులనుండి దేశాన్ని బయటికిలాక్కొచ్చిన వైనం నిన్నా మొన్నటిదే. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో అగ్రసింహాసనమెక్కిన రోశయ్యామాత్యులు పీవీ స్ఫూర్తితో చిరకాలం చరిత్రలో నిలిచిపోయే పనులేవన్నా చేస్తారా? ఆ సత్తా ఆయనకుందా?

చేతులు కట్టుకు చోద్యం చూద్దాం. అంతకన్నా మనం చెయ్యగలిగేదేముంది గనక.

15 Responses to “ఆరేళ్ల తర్వాత”


 1. 1 karthik 1:21 ఉద. వద్ద మే 26, 2010

  చేతులు కట్టుకు చోద్యం చూద్దాం. అంతకన్నా మనం చెయ్యగలిగేదేముంది గనక

  ade mana daurbhagyam.. 😦

 2. 2 కత్తి మహేష్ కుమార్ 2:01 ఉద. వద్ద మే 26, 2010

  తెలిసిన కథే…మళ్ళీ పునరావృతం అయ్యింది. అంతే…

 3. 3 సుజాత 2:26 ఉద. వద్ద మే 26, 2010

  చిరునవ్వుతో రాజశేఖర్ రెడ్డి గారు వీక్షిస్తుండగా,”ఏమయ్యా, నువ్వెంత, నీ అనుభవమెంత?” అని ఎంతటివారినైనా నిలదీయడానికీ, ముఖ్యమంత్రి జవాబిచ్చేపని లేకుండా అందరిమీద ఎగిరిపడటానికీ స్వయంగా రంగంలోకి దిగి ఇరుక్కోడానికీ తేడా ఇప్పటికైనా తెలుస్తుందేమో అయ్యోరికి!

 4. 4 కన్నగాడు 2:41 ఉద. వద్ద మే 26, 2010

  “చరిత్రలో నిలిచిపోయే పనులేవన్నా చేస్తారా? ఆ సత్తా ఆయనకుందా?” ఇలాంటివి ఏవైనా చేయాలంటే అయన పెద్ద తెలివిమంతుడు అవకపోయినా, ఇద్దరు ముగ్గురు మాంచి అధికారుల మాట విన్నా సరిపోతుంది.
  ఈయన గారికి అమ్మగారి మాటలు తప్ప ఇకేం వినబడవాయే! ప్చ్.

 5. 5 niharika 8:16 ఉద. వద్ద మే 26, 2010

  “కర్నూలు లాంటి కరువు ప్రాంతాల్లో వరదలొచ్చే విచిత్ర పరిస్థితి!”
  దీనికి కూడా ప్రభుత్వానిదే బాధ్యతంటారా?

  అందరూ అయిపోయిన పెళ్ళికి బాజాలూదటమే కానీ ప్రస్తుత కర్తవ్యమేమిటో చెప్పిన పాపాన పోవటం లేదు.పత్రికల్లో వచ్చిన కధనాలే మీరు చెప్పటం దేనికి?

  ఎవరైనా ఉద్ధరించే నాయకుడి కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాం,చేతులు, నోరు కట్టుకుని!!!

  • 6 అబ్రకదబ్ర 11:30 ఉద. వద్ద మే 26, 2010

   >> “దీనికి కూడా ప్రభుత్వానిదే బాధ్యతంటారా?”

   కచ్చితంగా. పారిశ్రామిక వ్యర్ధాలు నదుల్లోకొదిలే ఇండస్ట్రియలిస్టులదీ, పంట కాల్వల్లో చెత్తా చెదారం పారబోసే జనాలదీ, నదుల్ని సైతం కబ్జా చేసే పెద్దలదీ .. అందరిదీ బాధ్యత. వీళ్లందర్నీ కట్టడి చెయ్యాల్సిన ప్రభుత్వానిది అందరికన్నా పెద్ద బాధ్యత. కర్నూల్లోనే కాదు, కోస్తాలో వరదలకైనా ఇదే వర్తిస్తుంది. ఏడు విడిచి ఏడు వరదల్లో కోస్తా కొట్టుకు పోతున్నా ఇప్పటికీ నివారణోపాయాలు కనుక్కోలేకపోతే తప్పెవరిది? కోస్తా కొట్టుకుపోయిందంటే ఏదోలా సరిపెట్టికోవచ్చు. కరువు ప్రాంతాల్లో వరదలేంటి? కర్నూలు మునగటానికి కారణమేంటో, ఎవరో మీకు తెలీదా? అధికారుల్నీ, ఇంజనీర్లనీ ఎవరి పని వారు చేసుకోనిస్తే అక్కడిదాకా వచ్చుండేదా? పెద్దల ప్రయోజనాల కోసం చేసుకున్న ప్రత్యేక ఏర్పాట్లకి తోడు, ఐదేళ్లుగా అధికారవర్గాలకి అలవాటు చేసిన అలసత్వం కారణం కాదా దీనికి?

   కర్తవ్యం చెప్పాలంటారా? ఉచిత వరాలంటూ ఓటు విద్యలు ప్రదర్శించటం మానేస్తే సగం దరిద్రం వదులుతుంది. అప్పులడుక్కొచ్చి మరీ బిచ్చగాళ్లని తయారు చెయ్యటం మానేసి ఆ సొమ్ము పనికొచ్చే పనులకి ఖర్చుపెట్టమనండి. ఆప్పుడా డబ్బు పిల్లల్ని పెడుతుంది, ఖజానా కళకళలాడుతుంది.

   ఇప్పుడు ‘పనికొచ్చే పని’ అంటే ఏంటని మళ్లీ మీరడగొచ్చు. బియ్యం రేటు తగ్గించి ఇచ్చే బదులు మార్కెట్ ధరకే బియ్యాన్ని కొనుక్కునే స్థాయికి పేదవారి సంపాదన పెరిగేలా చెయ్యొచ్చు. మనసుంటే మార్గమూ ఉంటుంది. మెరికెల్లాంటి ఐఏఎస్ ఆఫీసర్లున్నారు మనకి. వాళ్ల దగ్గర కావలసినన్ని ‘పనికొచ్చే పనులకి’ సంబంధించిన చిట్టాలుంటాయి. వాళ్ల పని వాళ్లు చేసుకునే వెసులుబాటు కలిగిస్తే అద్భుతాలు చేసి చూపిస్తారు.

  • 7 Satyanveshi 2:17 ఉద. వద్ద మే 31, 2010

   కర్నూలు వరదలకి కారణం ఇంజినీర్లు తీసుకోవాల్సిన జలాశయాల్లో నీటిమట్టాల నిర్ణయాలను తమ ప్రాంతానికి దోచిచ్చేందుకు రాజకీయ అవసరాలకోసం ముఖ్యమంత్రులే తీసుకుని శ్రీశైలం జలాశయం ఎత్తు పెంచడం.

 6. 8 విశ్వనాథ్ 8:33 ఉద. వద్ద మే 26, 2010

  ఈయన ఏ విషయం అయినా నాకు తెలియదు,నన్ను అడకకండి,నాకు చెప్పలేదు అని పెద్ద గుమస్తాలా మాట్లాడం తప్ప,ఏనాడైనా ముఖ్యమంత్రిలా వ్యవహరించారా?కన్నాడు గారు చెప్పింది నిజం.

  పి.వి గారితో ఈయనకు పోలిక ఏమిటి?

 7. 9 manasvi 9:32 ఉద. వద్ద మే 26, 2010

  నా కసంతా తీరిపోయింది మీ టపా చదివాక.

  “ఇలాంటి పధకాల వల్ల కొందరు పేదలకి తాత్కాలికంగా ఒరిగేదేమన్నా ఉంటే ఉండెచ్చేమో కానీ, దీర్ఘకాలంలో అవి వాళ్లని బిచ్చగాళ్లుగా మార్చటం తప్ప నిజంగా ఉద్ధరించేదేమీ ఉండదని గ్రహించటానికి మేధావులై ఉండనవసరం లేదు”

  “ఆరేళ్ల కిందట అడ్రస్ లేని యువకుడొకడు అమాంతం అంబానీలని తలదన్నే స్థాయి పారిశ్రామికవేత్తగా అవతరించటం తప్ప”

  “ప్రభుత్వ పధకాల అమల్లో కుంభకోణాలు చోటుచేసుకోవటం పాత విషయం. కుంభకోణాల అమలు కోసమే పధకాలు రూపొందించటం వైఎస్ నేర్పి పోయిన ఉపాయం.”

  అక్షరసత్యాలివి. పైగా వీళ్ళకి అభిమానులు. ఖర్మ.

 8. 10 saamaanyudu 8:43 సా. వద్ద మే 26, 2010

  రాష్ట్ర పరిస్థితిపై మీ విహంగ వీక్షణం బాగుంది. తప్పంతా పాలకవర్గాలదే కాదు. వారు విదిలించే ఎంగిలి మెతుకులకు ఆశపడి భవిష్యత్ పై సరైన దృష్టికోణం లేని ప్రజలది. మాటాడే ధైర్యం లేని ప్రజలున్నంత కాలం యిలాంటి నిర్వాకాలు సాగుతూనే వుంటాయి. ఎవడో వచ్చి ఏదో పొడిచేస్తాడనుకోవడం భ్రమ. ఈ వ్యవస్థలో ఇది షరామామూలే. ఎవరికి వారు బాధ్యతల నుండి తప్పుకుంటే ఈ గతి తప్పదు.

 9. 11 niharika 11:28 సా. వద్ద మే 26, 2010

  ఉచితం వద్దు అని అప్పట్లో ప్రధాని మొత్తుకున్నా వైస్ వినలేదు.మేం చూసుకుంటాం కదా అని చెప్పారు.ఉచితాన్ని కోరుకున్న మనరాష్ట ప్రజలదా తప్పు,కేంద్ర ప్రభుత్వానిదా?

  అర్హత లేని వాళ్ళుకూడా తెల్లకార్డులు పొందడం వెనుక బాధ్యత ప్రజలదా? ప్రభుత్వాలదా?
  ఒక్క రూపాయి ప్రభుత్వం ఖర్చుపెడితే అందులో 10పైసలు పేదలకి చేరుతోంది.దీనికి బాధ్యత ప్రజలదా? ప్రభుత్వాలదా?
  దీనిని నివారించాలనే యునిక్ ఐ డి ప్రవేశపెట్టబడింది.దీనివల్లనైనా ప్రభుత్వం ఖర్చుపెట్టె ప్రతి పైసా ప్రజలకు చేరుతుందని,దళారుల ప్రమేయం తగ్గుతుందని ఆశిద్దాం.మార్పు ఒక్కరోజులో సాద్యం కాదు.

  “బియ్యం రేటు తగ్గించి ఇచ్చే బదులు మార్కెట్ ధరకే బియ్యాన్ని కొనుక్కునే స్థాయికి పేదవారి సంపాదన పెరిగేలా చెయ్యొచ్చు.”…..మీరు గమనించలేదేమో గానీ మన రాష్ట్ర ప్రజలు రెండోసారి కాంగ్రెస్ కి పట్టం కట్టింది ఎందుకో తెలుసా పేదవారి కూలీరేట్లు అమాంతంగా రెట్టింపు అయ్యాయి. వారి సంపాదన పెరగడానికి కారణం ప్రభుత్వమే అని భావించడం వల్ల వారు మళ్ళీ అధికారమిచ్చారు.

  “మెరికెల్లాంటి ఐఏఎస్ ఆఫీసర్లున్నారు మనకి. వాళ్ల దగ్గర కావలసినన్ని ‘పనికొచ్చే పనులకి’ సంబంధించిన చిట్టాలుంటాయి.”
  ఈ మెరికల్లాంటి ఆఫీసర్లు ఏదో ఉద్ధరించేస్తాం అని NRI ల చుట్టూ తిరుగుతున్నారెందుకు?
  పేదవాడి దగ్గరకి వెళ్ళి జరుగుతున్న అన్యాయాల్ని చెప్పలేకపోతున్నారే? NRI ల చుట్టూ తిరిగితే డబ్బు వస్తుంది,పేదవాడి దగ్గర కెళితే ఏం వస్తుంది?
  అందరూ చెప్పేవాళ్ళే,చేసేవాళ్ళు ఒకరు కూడా కనపడరు.

 10. 14 Dhanaraj Manmadha 9:19 సా. వద్ద జూలై 6, 2010

  ’మా నాన్న వరాలు రద్దు చేస్తే తాట తీస్తా’ అంటూ కుర్చీ కోసం గోతికాడ నక్కలా పొంచుక్కూర్చున్న యువరాజావారి హుంకరింపులో పక్క, ఖాళీ చిప్పలా వెక్కిరిస్తున్న ఖజానా మరో పక్క – వెరసి రోశయ్య తిప్పలు వర్ణనాతీతం. ఈ వయసులో ఆయనకు రావాల్సిన కష్టాలు కావవి.

  Because he suppored the prev cm 😀

 11. 15 Dhanaraj Manmadha 9:22 సా. వద్ద జూలై 6, 2010

  @ Sujatha garu,

  >>>చిరునవ్వుతో రాజశేఖర్ రెడ్డి గారు వీక్షిస్తుండగా,”ఏమయ్యా, నువ్వెంత, నీ అనుభవమెంత?” అని ఎంతటివారినైనా నిలదీయడానికీ, ముఖ్యమంత్రి జవాబిచ్చేపని లేకుండా అందరిమీద ఎగిరిపడటానికీ స్వయంగా రంగంలోకి దిగి ఇరుక్కోడానికీ తేడా ఇప్పటికైనా తెలుస్తుందేమో అయ్యోరికి!

  kEka


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 276,621

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: